Homeఅంతర్జాతీయంఅమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కు.. భారత స్టార్టప్ లకు సంబంధం ఏమిటి..?

అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కు.. భారత స్టార్టప్ లకు సంబంధం ఏమిటి..?

ఈ బ్యాంకు దివాలా తీస్తే, భారతీయ కంపెనీలకు మరీ ముఖ్యంగా అంకుర సంస్థలకు నష్టం వాటిల్లనుందా..? అసలే ఆర్థిక మందగమనంతో అల్లాడుతుంటే, ఈ బ్యాంకు సంక్షోభం .. మరో సమస్యకు కారణమవుతోందా..? ఇంతకీ ఈ బ్యాంక్ .. దివాలా వల్ల టెక్కం పెనీలకు ఏమేరకు కష్టాలు రానున్నాయి..? పెట్టుబడులే లక్ష్యంగా .. దేశీ స్టార్టప్ కంపెనీలు .. అమెరికాలోని ఎస్వీబీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచాయి.. దీనికి తగ్గట్లు .. స్టార్టప్ లకు సంజీవనిలా వ్యవహరించిన ఈ బ్యాంకు ఒక్కసారిగా కూప్పకూలింది. దీంతో పెట్టుబడుల కోసం అమెరికా బాట పట్టిన కంపెనీలకు చిక్కులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం .. మద్ధతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతపడింది. ఎక్కువగా టెక్ స్టార్టప్‌లకు రుణాలిచ్చే ఈ బ్యాంకు దివాలా తీసే పరిస్థితి రావడంతో అమెరికాలోని నియంత్రణ సంస్థలు దీన్ని మూసివేశాయి. బ్యాంకు ఖాతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత అమెరికాలో దివాలా తీసిన అతిపెద్ద బ్యాంకు ఇదే. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఉంది. అమెరికావ్యాప్తంగా 17 శాఖలు, ఇతర దేశాలలో కూడా కొన్ని శాఖలు ఉన్నాయి. 2022 డిసెంబర్ 31నాటికి, ఈ బ్యాంకు మొత్తం ఆస్తుల విలువ 209 బిలియన్ డాలర్లు. దీని ఖాతాల్లో 1743.4 బిలియన్ డాలర్లు జమ అయ్యాయి. ఒక నివేదిక ప్రకారం, ఈ బ్యాంక్ 2,500 కంటే ఎక్కువ వెంచర్ క్యాపిటల్ సంస్థలకు బ్యాంకింగ్ సేవలను అందించింది.

బ్యాంకు వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం, వాతావరణ సాంకేతికత, సుస్థిరత రంగాల్లో 1,550 కంటే ఎక్కువ కీలక ఖాతదారులు ఉన్నారు. అయితే ఇప్పుడీ బ్యాంకు మూతపడటం టెక్ ఇండస్ట్రీలో కలకలాన్ని రేపింది. బ్యాంకు దివాలా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారిలో భారతీయ స్టార్టప్ కంపెనీలు కూడా ఉన్నాయి. కంపెనీ ఖర్చులు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం మీద అవి ఆందోళన చెందుతున్నాయి. ఎస్వీబీ మూతపడడం ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లకు చిక్కే. స్టార్టప్‌లు భారత ఆర్థికవ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. ఈవారం భారతీయ స్టార్టప్‌లను కలిసి సమస్య ఎంత పెద్దదో తెలుసుకుని, కేంద్ర ప్రభుత్వం వారికి ఎలా సహాయం అందించగలదో పరిశీలిస్తామని కేంద్రం ప్రకటించింది. ఇతర బ్యాంకుల మాదిరిగానే ఎస్వీబీ కూడా యూఎస్ ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టింది. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నంతకాలం లాభాలు వచ్చాయి. కానీ, ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు పెరగడంతో కష్టాల్లో పడింది.

2.25 బిలియన్ డాలర్ల నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తెలిపింది. యూఎస్ ప్రభుత్వ బాండ్స్ విక్రయం వల్ల వచ్చిన నష్టాలను పూడ్చడానికి షేర్ల అమ్మకం మొదలెట్టామని అది వెల్లడించింది. ఆ వార్తతో ఖాతాదారులు, పెట్టుబడిదారులు భయపడ్డారు. ఫలితంగా బ్యాంకు షేర్లు 60 శాతానికి పైగా పడిపోయాయి. దాంతో ట్రేడింగ్ ఆపేశారు. మరోవైపు, వడ్డీ రేట్లు బాగా పెరగడంతో, స్టార్టప్‌లకు ప్రైవేటు రంగం నుంచి నిధులు పోగుచేసుకోవడం కష్టమైంది. చాలామంది ఖాతాదారులు బ్యాంకు నుంచి డబ్బు వాపస్ తీసుకోవడం మొదలెట్టారు. దాంతో, బ్యాంకు మరిన్ని చిక్కుల్లో పడింది. తగినంతగా ఆదాయం లేకపోవడం, అప్పులు తీర్చే సామర్థ్యం తగ్గిపోవడం కారణంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను నియంత్రణలోకి తీసుకున్నట్లు కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ తెలిపింది.

షేర్ల అమ్మకంలో 1.8 బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు బ్యాంకు తెలిపింది. మార్చి 9 ముందు వరకు బ్యాంకు పరిస్థితి స్థిరంగానే ఉన్నట్టు ప్రభుత్వ దస్తావేజులు తెలుపుతున్నాయి. అయితే, బ్యాంకుకు నష్టాలు వస్తున్నాయన్న వార్త గుప్పుమనడంతో పెట్టుబడిదారులు, ఖాతాదారులు బ్యాంకు నుంచి డబ్బు వెనక్కి తీసుకునేందుకు బారులు తీరారు. ఇది ఎస్వీబీని ఇక్కట్ల పాలుచేసింది. మార్చి 9 సాయంత్రానికి బ్యాంకు నగదు నిల్వ సుమారు 958 మిలియన్ డాలర్లు నెగటివ్‌గా ఉందని ప్రభుత్వ పత్రాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి బ్యాంకు ప్రయత్నించింది, కానీ విజయవంతం కాలేదు. అమెరికాలోని కొంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు భయాందోళనలకు గురికావడం వల్లే బ్యాంకుకు ఈ పరిస్థితి వచ్చిందని, చివరికి మూతబడిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఇదిలా ఉంటే, ఎస్వీబీ సేవలను వినియోగించుకుంటున్న భారతీయ స్టార్టప్‌ల సంఖ్య 20-25 కంటే ఎక్కువ ఉండదని ‘హార్వెస్టింగ్ ఫార్మర్ నెట్‌వర్క్’ చెబుతోంది. అసలు ప్రశ్న ఏంటంటే.. భారతీయ స్టార్టప్‌లు అమెరికన్ బ్యాంక్‌లో ఎందుకు ఖాతాలు తెరవాలి? వాస్తవానికి, భారతదేశంలోని చాలా స్టార్టప్‌లకు దేశం వెలుపల జపాన్, సింగపూర్, అమెరికా వంటి దేశాల నుంచి ఫండింగ్ వస్తుంది. పెట్టుబడిదారు ఖాతా ఎస్వీబీలో ఉంటే స్టార్టప్ ఖాతా కూడా అదే బ్యాంకులో ఉండడం వలన పని సులువు అవుతుందని స్టార్టప్అ ధినేతలు చెబుతున్నారు. పెద్ద పెద్ద స్టార్టప్‌లు, అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో 50-60 శాతం ఖాతాలు ఈ బ్యాంకులోనే ఉన్నాయి. ఇది కాకుండా, మీ మార్కెట్ అమెరికాలో ఉంటే, అక్కడ లైసెన్స్ తీసుకోవాలి. అక్కడ బ్యాంక్ ఖాతా తెరవాలి. ఎస్వీబీ ఒక బ్యాంకుగానే కాకుండా వెల్త్ మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, నెట్‌వర్కర్‌గా కూడా సేవలు అందించిందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ సేవలతో పాటు ఎస్వీబీ.. స్టార్టప్‌లలో పెట్టుబడి పెడుతుంది. వాటికి రుణాలు ఇస్తుంది.

ఎస్వీబీ.. స్టార్టప్, బిజినెస్ ఫ్రెండ్లీ బ్యాంకు అని చెబుతున్నారు. భారత్‌లోనే ఉంటూ కేవలం పాస్‌పోర్ట్ ఆధారంగా అక్కడ ఖాతా తెరవచ్చు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఇక్కడి స్టార్టప్‌లు నమ్మకం ఉంచాలనే విషయాన్ని ఈ సంక్షోభం తెలియజేస్తోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. అయితే, ఇది అంత సులభం కాదని స్టార్టప్‌ వ్యవస్థాపకులు అంటున్నారు. ముఖ్యంగా స్టార్టప్ ఫండింగ్ చేస్తున్న వెంచర్ క్యాపిటల్ కంపెనీలు దేశానికి వెలుపల ఉంటే ఇది మరింత కష్టమవుతుందని అంటున్నారు. భారతీయ కంపెనీలు ఒకటి కంటే ఎక్కువ ఖాతాల్లో డబ్బును ఉంచడం చాలా ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డిపాజిటర్లకు డబ్బు పూర్తిగా వాపసు వస్తుందని ప్రకటించారు కాబట్టి ప్రస్తుతానికి ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చినట్టేనని కూడా నిపుణులు భావిస్తున్నారు. అయితే సిలికాన్వ్యా లీ బ్యాంక్ పతనం తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యేలా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షమందికిపైగా రోడ్డున పడే అవకాశం ఉన్నట్టు అంచనాలు వినిపిస్తున్నాయి. ఇండియాలో 200 స్టార్టప్‌లతోపాటు ప్రపంచవ్యాప్తంగా వేలకొద్దీ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ.. మూతపడడం .. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్ కేంద్రాలకు హబ్‌గా ఉన్న సిలికాన్ వ్యాలీలో టెక్ సంస్థలు, స్టార్టప్‌లు.. వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లకు రుణాలిస్తూ.. ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు ఎస్‌వీబీ చేసిన చిన్నచిన్న పొరపాట్లకు టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లు, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు వంటి కారణాలతో ఎస్‌వీబీ క్రమంగా దివాలా అంచులకు చేరుకుని, కనుమరుగు అయిపోయింది. దీంతో 2008 నాటి మాంద్యం పరిస్థితులు పునరావృతం అవుతాయేమోనని టెక్ సంస్థలు కంగారు పడుతున్నాయి.

అయితే ఆ బ్యాంకుతో లావాదేవీలు జరుపుతున్న భారతీయ స్టార్టప్ లు తమ నిధులను మరో బ్యాంకుకు తరలించే అవకాశం ఉంది. ఇన్వెస్టర్ల సూచన మేరకు మరిన్ని కంపెనీలు సైతం ఇదే బాటలో నడవనున్నట్లు తెలియ వచ్చింది. 2 లక్షల 50 వేల డాలర్లు కంటే తక్కువ నిధులు కలిగిన స్టార్టప్ ఎకౌంట్లకు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా బీమా ఉంది. అంతకంటే ఎక్కువ నిధులు కలిగిన సంస్థల విషయంపై ఇప్పటికీ సందిగ్దత నెలకొంది. అంతేగాక. SVB వ్యవహారం మోసం కాదు, ఇటీవల జరిగిన FTX క్రిప్టో ఎక్సైజ్ వంటి పతనమూ కాదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా నిపుణులు చెబుతుండడం విశేషం.

అయితే ఎస్వీబీ బ్యాంకు .. ఖాతాలకు బీమా సౌకర్యం ఉండడంతో, పెను ముప్పు తప్పిందన్న అంచనాలు .. టెక్ కంపెనీలకు మరీ ముఖ్యంగా స్టార్టప్ లకు ఊరట ఇస్తున్నాయి. ఖాతాలు తరలింపుకు అనుమతి లభించడంతో.. స్టార్టప్ లకు నష్టం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Must Read

spot_img