Homeఅంతర్జాతీయంమోస్ట్ వాంటెడ్ లిస్టులో అతిక్ భార్య..?

మోస్ట్ వాంటెడ్ లిస్టులో అతిక్ భార్య..?

గ్యాంగ్‌స్టర్ అతీక్, అతని సోదరుడు అష్రఫ్‌ల హత్య ఘటన యూపీలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతీక్ భార్య షాయిస్తా పర్వీన్ పరారీలో ఉంది. పర్వీన్ కోసం యూపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే యూపీ సీఎం యోగికి పర్వీన్ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది..

రాజకీయ ముసుగులో నేరసామ్రాజ్యాన్ని నడపటంలో షాయిస్తా పర్వీన్ కీలకంగా పనిచేసిందా…? ఇంతకూ ఎవరీ పర్వీన్..? భర్త అతీక్ హత్య అనంతరం ఆమె ఎక్కడ ఉంది..? మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్ పర్వీన్ పోలీసులకు పట్టుబడిందా..?

పోలీసు కస్టడీలో ఉండగా దుండగుల చేతిలో హత్యకు గురైన గ్యాంగ్‌ స్టర్‌, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్ కోసం ఉత్తర ప్రదేశ్‌లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే పర్వీన్‌ను పట్టిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని యూపీ పోలీస్​ శాఖ ప్రకటించింది. అయితే అతిక్‌, అష్రఫ్‌ అంత్యక్రియల సమయంలో పర్వీన్‌ లొంగిపోతారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆమె హాజరుకాలేదు. అతిక్‌ హత్య నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో పోలీసులు ఆమె కోసం జల్లెడ పడుతున్నారు.

కేవలం రెండు రోజుల వ్యవధిలోనే షైస్తా తన కొడుకు అసద్, భర్త అతిక్‌ ఇద్దరిని కోల్పోయింది. అసద్ పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన రెండు రోజుల తర్వాత, అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను ప్రయాగ్‌రాజ్‌లో మీడియా ముసుగులో వచ్చిన ముగ్గురు వక్తులు కాల్చి హతమార్చారు. ఈ నేరానికి పాల్పడ్డ లవ్లేష్ తివారి, అరుణ్ మౌర్య, మోహిత్ అలియాస్ సన్నీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గ్యాంగ్‌స్టర్స్ హత్యలపై దర్యాప్తునకు యూపీ సీఎం యోగి ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్‌ కమిటీని, సిట్‌ను నియమించారు. భర్తను హత్య చేశారని తెలియగానే షాయిస్తా పర్వీన్‌ వెక్కివెక్కి ఏడ్చారని, అనంతరం ఆమె కళ్లు తిరిగి పడిపోయారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రయాగ్‌రాజ్‌లోని దాముపూర్ గ్రామానికి చెందిన షైస్తా పర్వీన్, నలుగురు సోదరీమణులు, ఇద్దరు సోదరులలో పెద్దది. ఆమె తండ్రి మహమ్మద్ హరూన్ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి రిటైర్‌ అయ్యారు. షైస్తా ఇద్దరు సోదరులలో ఒకరు మదర్సా ప్రిన్సిపాల్. ఆమె కుటుంబ నేపథ్యం దృష్ట్యా, షైస్టా వివాదాల్లో చిక్కుకోకుండా
లైమ్‌లైట్‌కు దూరంగా జీవితాన్ని గడపాలని భావించారు.

మొదట్లో, ఇంటి పనులకే పరిమితమై, ఆమె తన తండ్రితో కలిసి ప్రభుత్వ పోలీసు క్వార్టర్‌లో నివసించింది. షైస్తా పర్వీన్ ప్రయాగ్‌రాజ్‌లోని హిమ్మత్‌గంజ్‌లోని కిద్వాయ్ బాలికల ఇంటర్ కాలేజీలో చదువుకుంది. ఆమె గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. 1996లో ఆమెకు ఐదుగురు పిల్లలు ఉన్న అతిక్‌తో వివాహం జరిగినప్పుడు తన జీవితం పూర్తిగా మలుపు తిరుగుతుందని ఆమె ఆశ్చర్యపోలేదు. అంతకుముందు షైస్తా తనకు పాతాళానికి సంబంధం వస్తుందని ఊహించలేదు. 1996లో అతిక్‌ని పెళ్లి చేసుకునే ముందు షాయిస్తా ప్రపంచం కూడా
పూర్తిగా భిన్నంగా ఉండేది. అంతకుముందు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం లేదు.

2009 నుంచి షాయిస్తా పేరు మీద ప్రయాగ్‌రాజ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు చీటింగ్‌ కేసులు కాగా… ఒకటి హత్య కేసు. మొదటి మూడు కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో నమోదవ్వగా.. నాలుగోది ఉమేష్ పాల్ హత్య కేసు. ఫిబ్రవరి 24న హత్యకు గురైన ఉమేష్ కేసులో ప్రధాన నిందితుల్లో షాయిస్తా ఒకరు. ఈమెతో పాటు భర్త అతిక్ అహ్మద్, ఇద్దరు కుమారులు, సోదరుడు అష్రఫ్ కూడా ఈ కేసులో నిందితుగా ఉన్నారు.

షైస్తా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె 2021లో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన AIMIMలో చేరారు. అయితే, ఈ ఏడాది జనవరిలో, ప్రయాగ్‌రాజ్ మేయర్ ఎన్నికలకు టిక్కెట్టు ఆశించి, BSP సభ్యురాలు అయ్యారు. కానీ ఉమేష్ పాల్ హత్య కేసులో అతని భార్య జయ పాల్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆమె నిందితురాలిగా పేర్కొనబడిన తరువాత, షైస్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె పార్టీ వివాదానికి దూరంగా ఉంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆ తర్వాత మేయర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు షైస్టాకు టికెట్ రాదని ప్రకటించారు.

ఉమేష్ పాల్ హత్యకు ప్రణాళిక రచించడం, దాన్ని అమలు చేయడంతో షాయిస్తా కీలకంగా వ్యహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉండగా అతీక్‌ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో పర్వీన్‌ కీలకంగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టారని తేలింది.

అతిక్ అహ్మద్ 100కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉండగా, షైస్తా పర్వీన్ అతని కుటుంబం నుండి ఏదైనా నేరంలో నిందితురాలిగా పేర్కొనబడిన మొదటి మహిళ. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ హత్యకేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఆమె ప్రస్తావన ఉంది. అప్పటి నుంచి ఆమె పోలీసులను తప్పించుకుంటూ వస్తోంది. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో ఉమేష్ పాల్, అతని ఇద్దరు పోలీసు గార్డులను కాల్చి చంపిన కేసులో షైస్టా ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు.

ఉమేష్ పాల్ హత్య తర్వాత ప్రయాగ్‌రాజ్ నుండి పారిపోవాలని ఆమె తన కొడుకు అసద్, షూటర్ గులామ్‌లకు చెప్పినట్లు తెలిసింది. శాయిస్తాపై ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు షాయిస్తా పర్వీన్ రాసిన లేఖ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్, అష్రఫ్‌లను తప్పుగా ఇరికిస్తున్నారని లేఖలో ఆమె పేర్కొంది. ఉమేష్ పాల్ హత్యకు మంత్రి నంద్ గోపాల్ గుప్తా కీలక సూత్రధారి అని ఆరోపించారు. అయితే పర్వీన్‌ ఫిబ్రవరి 27న లేఖ రాయగా.. అతిక్ మరణానంతరం వెలుగులోకి వచ్చింది. సీఎం ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోకపోతే నా భర్త, బావమరిది, కొడుకులను చంపేస్తారని లేఖలో పేర్కొంది.

మీడియా ప్రతినిధుల ముసుగులో వచ్చి… మాఫియా డాన్​ అతీక్​ అహ్మద్​, అష్రఫ్​లపై ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా యూపీ రాజధాని లఖ్​నవూ, కాళిదాస్​ మార్గ్​లతో పాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను పెంచారు అధికారులు. కాళిదాస్​ మార్గ్​లో సీఎం, డిప్యూటీ సీఎం సహా ఇతర ముఖ్యమైన మంత్రుల నివాసాలు కూడా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. పైగా లఖ్​నవూ, కాళిదాస్​ మార్గ్​లలో మీడియా ప్రవేశంపై కూడా ఆంక్షలు విధించారు.ప్రయాగ్‌రాజ్​ కాల్పుల ఘటన నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ కమిటీని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరవింద్ కుమార్ త్రిపాఠి నేతృత్వంలో మరో రిటైర్డ్ జడ్జి బ్రిజేష్ కుమార్ సోనీ, మాజీ డీజీపీ సుబేష్ కుమార్ సింగ్ ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు.

యూపీలో గ్యాంగ్‌స్టర్ అతీక్ భార్య ప్రస్తుతం పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉంది.. ఆమెను పట్టుకోవడం కోసం యూపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే.. ఆమె పోలీసులకు లొంగిపోతుందనే వార్తలు వచ్చినప్పటికీ.. అది నిజం కాలేదు.. మరి.. పర్వీన్ పోలీసులకు లొంగిపోతుందా..? లేక పరారీలోనే ఉంటుందా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్..

Must Read

spot_img