కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో కేంద్రం .. కీలక సూచనలు చేసిందా..? కేంద్ర లేఖాస్త్రంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోందా..?
భారత జోడో యాత్ర పట్ల కేంద్ర బీజేపీ టెన్షన్ పడుతోందా..? అందుకే జోడో యాత్రను ఆపేందుకు కుట్ర చేస్తోందా..? దీనికి కరోనా అస్త్రంగా
మారిందా..? దీనిపై కేంద్రం ఏమంటోంది..? కాంగ్రెస్ ఏం చెబుతోంది..?
దేశంలో బీజేపీ చేస్తున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా సాగిపోతోంది.
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర.. ఇప్పుడు రాజస్తాన్ లో సాగుతోంది. అయితే దేశంలోకి మరోసారి కరోనా వైరస్
ప్రవేశించిందన్న హెచ్చరికలు రాహుల్ భారత్ జోడో యాత్రను కలవరపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రం రాహుల్ కు ముందస్తు హెచ్చరికలు
పంపింది. భారత్ జోడో యాత్రలో భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు తటస్ధ వర్గాల ప్రజలు కూడా తరలివచ్చి సంఘీభావం
ప్రకటిస్తున్నారు. రాహుల్ ను చూసేందుకు, కలిసేందుకు, మాట్లాడేందుకు, ఫొటోలు దిగేందుకు వచ్చేవారితో జోడో యాత్ర ఎప్పుడూ సందడిగా
కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో భారీ ఎత్తున హాజరవుతున్న వారిలో ఎవరో ఒకరు కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని కేంద్రం భావిస్తోంది. దీంతో రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ తాజాగా లేఖ రాశారు. దీనిలో .. భారత్ జోడో యాత్రలో కోవిడ్ప్రో టోకాల్ ను తప్పనిసరిగా పాటించాలని కోరారు. దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, జోడో యాత్రకు భారీగా హాజరవుతున్న జనాన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనల్ని పక్కాగా పాటించాలని మాండవీయ కోరారు. అంతే కాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారినే ఈ యాత్రలో అనుమతించాలని కూడా సూచించారు. భారత్ జోడో యాత్రలో కచ్ఛితంగా కోవిడ్ నిబంధనలు పాటించడం లేదా పాదయాత్రను వాయిదా వేసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మనుసుఖ్ మాండవీయా విజ్ఞప్తి చేశారు. దీంతో రాహుల్ గాంధీ దీనిపై స్పందించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
పొరుగు దేశం చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి లేఖ రాశారు. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం వంటి కరోనా నిబంధనలను తప్పసరిగా పాటించాలని, కేవలం టీకా తీసుకున్నవారినే యాత్రలో పాల్గొనేలా చూడాలని మన్‌సుఖ్ మాండవీయ కోరారు. ఒకవేళ, వీటిని అనుసరించడం సాధ్యం కాకపోతే జోడోయాత్రను వాయిదా వేసుకోవాలని అభ్యర్థించారు. కాగా, కేంద్ర మంత్రి లేఖపై కాంగ్రెస్ స్పందించింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ ప్రోటోకాల్పాటించారా?
అని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మన్‌సుఖ్ మాండవీయకు నచ్చకపోవచ్చు.. కానీ ప్రజలకు నచ్చి పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.. ప్రజల దృష్టిని మరల్చడానికే మాండవీయ ఈ లేఖను రాసినట్టు కనిపిస్తోందని విమర్శించారు. మరో ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. యాత్రపై అకస్మాత్తుగా ఉన్న శ్రద్ధ ఏంటని, ఇది బీజేపీకి ఇబ్బందికరంగా ఉందా? అని నిలదీశారు. కాగా, తమిళనాడులోని కన్యాకుమారిలో సెప్టెంబరు 7న రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రం ఇటీవలే 100 రోజులు పూర్తిచేసుకుంది. డిసెంబరు 24 ఢిల్లీలోకి ప్రవేశించనుంది. డిసెంబరు 25 నుంచి జనవరి 2 వరకూ వారం రోజుల పాటు యాత్రకు విరామం ఇవ్వనున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి గత కొన్ని రోజులుగా మన దేశంలో అదుపులోనే ఉంది. ఇదే సమయంలో చైనా తదితర దేశాల్లో మరోసారి విజృంభిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా పడగవిప్పే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా మరోసారి కొవిడ్ పంజా విసురుతుందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
ఈ తరుణంలో భారత్ జోడో యాత్ర కారణంగా తమ రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు డిసెంబర్ 20వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. ఇటీవల యాత్రలో పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ కరోనా బారిన పడినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యాత్రలో కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని, మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని, వ్యాక్సిన్ వేసుకున్నవారినే యాత్రకు అనుమతించాలని కోరారు. ఈ లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి..
రాహుల్ గాంధీకి లేఖ రాశారు.
జోడో యాత్రలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా యాత్రను కొంతకాలం పాటు వాయిదా వేసుకోవాలని కోరారు. రాజస్థాన్ ఎంపీలు పీపీ చౌదరి, నిహాల్ చంద్, దేవ్ జీ పటేల్ తనకు లెటర్ రాశారు. జోడో యాత్రలో కరోనా రూల్స్ పాటించేలా ఆదేశాలివ్వాలని కోరారు. లేదంటే యాత్రను ఆపాలని విజ్ఞప్తి చేశారు. యాత్రలో పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్ విందర్ సింగ్ కరోనా బారినపడిన విషయాన్ని నా దృష్టికి తెచ్చారని మాండవీయ లెటర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంట్ యథావిధిగా కొనసాగుతోంది. రాజస్థాన్, కర్నాటకలో బీజేపీ యాత్రలు కొనసాగుతున్నాయి.
మరి ఒక్క భారత్ జోడో యాత్రనే ఆపాల్సిన అవసరం ఏంటి?
అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ప్రశ్నించారు. రాహుల్ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, అందుకే దాన్ని ఆపాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాహుల్ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి బీజేపీ భయపడుతోంది. అందుకే యాత్రను అడ్డుకుంటోందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు.
భారత్ జోడో యాత్రలో వేలాది మంది పాల్గొంటూ ఉండడం, అందరూ గుంపులుగా, మధ్య ఎడం లేకుండా నడుస్తున్న క్రమంలో కేంద్రం ఈ సూచన
చేయడం గమనార్హం. రాహుల్ భారత్ జోడో యాత్రకు విశేష జనస్పందన లభిస్తుండటం.. ఒకరి తరువాత ఒకరుగా సెలబ్రిటీలు ఆయనతో అడుగులు
కలపడంతో కేంద్ర ప్రభుత్వం రాహుల్ యాత్ర విషయంలో అప్రమత్తమైంది. ప్రధాని మోడీయే స్వయంగా కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయవద్దని
పార్టీ శ్రేణులను హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో కరోనా వ్యాప్తి సాకుగా తీసుకుని కేంద్రం రాహుల్ యాత్రపై ఆంక్షలు విధిస్తోందని
విమర్శించింది. ఇతర పబ్లిక్ ప్లేసుల్లో, సమావేశాల్లో ఏ ప్రొటోకాల్ రూల్స్ అమలవుతున్నాయని ప్రశ్నించింది. ఉన్నట్లుండి కాంగ్రెస్ చేపట్టిన భారత్
జోడో యాత్ర విషయంలోనే ప్రొటోకాల్ రూల్స్ గుర్తొచ్చాయా అని నిలదీసింది. .
గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ చేపట్టిన ర్యాలీలు, సభల్లో కోవిడ్ ప్రొటోకాల్ ఫాలో అయ్యారా? రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూడలేకే కేంద్ర మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రత పెరిగే అవకాశాలు తక్కువే అని ధైర్యం చెప్పిన కేంద్రం .. సక్సెస్ఫు ల్ గా జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విషయంలో మాత్రం విస్పష్ట ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. క్రిస్మస్ వేళ రెండు రోజుల బ్రేక్ నేపథ్యంలో రాహుల్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది.
కరోనా విషయంలో అప్రమత్తత అవసరమే అయినా.. జోడో యాత్ర పై కేంద్ర బీజేపీ లేఖాస్త్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదీ ఇవాల్టి ఫోకస్..
రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..