Homeఅంతర్జాతీయంనిద్ర పోకపోతే మెదడుకు ఏం జరుగుతుందో తెలుసా?

నిద్ర పోకపోతే మెదడుకు ఏం జరుగుతుందో తెలుసా?

ఈ సకల చరాచర సృష్టిలో జీవంతో ఉన్న ప్రతీ ప్రాణికీ నిద్ర అనే విశ్రాంత స్థితి తప్పనిసరి. నిద్ర శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని, నిద్ర పౌరుల ప్రాథమిక హక్కని, ఆరోగ్య జీవనానికి చాలా అవసరమైనదని దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అవసరానుగుణంగా నిద్ర, నిశ్శబ్దం, విశ్రాంతి ఆరోగ్య రీత్యా మానవులకు తప్పనిసరి అవసరమని, నిశ్శబ్దం బంగారం లాంటిదని కోర్టు వ్యాఖ్యానించింది. 2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల ఫలితంగా మనిషికి 8 గంటల కంటే తక్కువ నిద్ర కారణంగా వారిలో శరీర సామర్థ్యం తగ్గినట్లుగా గుర్తించారు. అయితే ఇప్పటికీ నిద్ర ప్రాముఖ్యత గురించి ప్రపంచానికి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. ఈ అద్భుతమైన విశ్రాంత స్థితిపై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. మీరు బాగా నిద్రపోగలరా..కడుపు నిండా తిని హాయిగా చెట్ల నీడలో వేసిన మంచాలపై, ఏ డిస్టర్బెన్స్ లేని నిశ్శబ్దంలో ఎంత తొందరగా నిద్రపోగలరు..? ఎంత ఎక్కువ సేపు నిద్రపోగలరు..? అనే కాన్సెప్ట్ తో పోటీలు నిర్వహిస్తుంటారు. మాంటెనెగ్రే దేశంలో నిక్సిక్ అనే విలేజ్ లో గత 12 ఏళ్లుగా మనం చెప్పుకున్న ‘లైయింగ్ డౌన్’ పోటీలు జరుగుతున్నాయి.

ఎవరు ఎక్కువ సేపు నిద్రపోతే వాళ్లు విజేతలుగా ప్రకటిస్తారు. భారీగా డబ్బు గెలుచుకుంటారు. ఈ పోటీల ముఖ్య ఉద్దేశ్యం నిద్ర గురించి జనానికి అవేర్ నెస్ కలిగించడం కోసమే.. శరీరంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మనం డాక్టరు దగ్గరకు వెళతాం..అక్కడ మనం ఎదుర్కోబోయే ప్రశ్నలు నిద్ర గురించే ఉంటాయి. నిన్న రాత్రి బాగా నిద్రపోయారా..? రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు..? ఏయే సమయాలలో నిద్రపోతున్నారు..? ఇవీ లేటెస్టుగా డాక్టర్లు అడుగుతున్న ప్రశ్నలు. ఎందుకంటే.. ప్రస్తుతం కరోనా కష్టకాలం తరువాత మనిషిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులు శరీరాన్ని అయోమయంలో పడేసాయి. నిద్రా సమయాలు మారాయి.

ప్రస్తుతం ఓటీటీలు స్మార్ట్ ఫోన్ ల కాలం నడుస్తోంది. ఏ మాత్రం కాస్త సమయం చిక్కినా జనం యూట్యూబ్‌లో తల దూర్చేస్తున్నారు. విధిగా సోషల్ మీడియా ప్రపంచంలో విహరిస్తున్నారు. దాంతో నిద్ర అనే వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఆడా మగా చిన్న పెద్దా వయసుల తేడాల్లేకుండా మెజారిటీ జనం మొబైల్ ఫోన్లకు అడిక్టయిపోయారు. దాంతో శరీరంలో చాలా రకాలుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనిషి శరీరం దేన్నైనా తట్టుకుంటుంది. ప్రతీ అసౌకర్యాన్ని తనకు అలవాటయ్యేలా చేసుకుంటుంది. దానిని అధిగమించేందుకు ప్రయత్నిస్తుంది.

కొంత కాలానికి ప్రతీ పరిస్థితికి అనుగుణంగా మారేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ ప్రయత్నంలో అనుకూల పరిస్థితుల్లో మనిషి శరీరం తనకు తానే బాగుపడుతుంది. అనేక అసౌకర్యాలు, రోగాలు నయమవుతాయి. మీకు తెలుసా..మనిషి శరీరం ఎదుర్కునే అనేక రుగ్మతలకు కారణం సరైన నిద్ర లేకపోవడమేనని తేల్చారు పరిశోధకులు. ప్రస్తుతం అడపా దడపా కొత్త వేరియంట్లతో కరోనా ముంచుకు వచ్చినా ప్రమాదస్థాయి తక్కువేనని చెప్పుకోవాలి. కరోనా ప్రభావం చూపిన మూడేళ్ల తరువాత దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. అయితే కరోనా కారణంగా మనకు తెలియకుండానే ఓ సమస్యను ఎదుర్కుంటున్నాం.. ఆ సమస్య పేరే నిద్రలేమి. ప్రతీ అయిదుగురిలో ముగ్గురు సరైన నిద్ర లేని కారణంగా అనారోగ్యాలకు గురవుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే శారీరికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నాం. వాటిని ఎదుర్కునేందుకు కావలసిన రోగ నిరోదక శక్తి కూడా నిద్రలేమి కారణంగా తక్కువవుతోందని చెబుతున్నారు పరిశోధకులు.

అయితే ఈ ప్రత్యేక కాలంలో సరైన పరిమాణంలో నిద్రించకపోవడం వలన ఏం జరుగుతుంది.. అన్నింటి కన్నా ముందు తెలుసుకోవాల్సింది మనకు రోజుకు కనీసం ఏడున్నర గంటల పాటు నిద్ర అవసరం..అది కూడా రాత్రి పది నుంచి ఉదయం అయిదున్నర గంటల సమయంలోనే నిద్రపోవడం అన్నది జరగాలి. ఎందుకంటే ఆ సమయంలోనే మాములు నిద్ర నుంచి ఘాడమైన నిద్రపోవడానికి వీలవుతుంది.

ఆ సమయంలో శరీరం పూర్తి స్థాయి విశ్రాంతి పొందేందుకు కావలసిన నిశ్శబ్దం ఉంటుంది..మెదడును డిస్టర్బ్ చేసే శబ్దాలు వినిపించవు. ఆ సమయంలో నిద్రపోతే మెదడు ఆరోజు జరిగిన పనులను నెమరు వేసుకుంటుంది. వాటిలో అనవసరమైన వాటిని తొలగించుకుంటుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటుంది. శరీరంలో ఏర్పడిన మార్పులను రిపెయిర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సరైన సమయంలో ఘాడంగా నిద్రపోనప్పుడు.. మెదడుకు విశ్రాంతి లభించే వాతావరణాన్ని మనం కల్పించనప్పుడు మెదడు సమ్మె చేస్తుంది. మెదడు సమ్మె చేస్తే ఏమవుతుంది..?

శరీరంలో హైలెవెల్ స్ట్రెస్ ఏర్పడుతుంది. ఈ రోజుల్లో ఏవేవో కారణాలతో సహజంగానే శరీరం జబ్బు పడుతోంది. దీనిని నివారించేందుకు శరీరానికి కావలసినంత నిద్ర అవసరం. నిద్ర శరీరానికి విశ్రాంతినిస్తుంది. అది గుర్తించడం చాలా అవసరం. ముఖ్యంగా ఓ అయిదు రకాల ప్రయోజనాలు చక్కటి నిద్ర ద్వారా చేకూరుతాయి. అందులో మొదటిది మీ మెదడు పనితనం మెరుగై మెమొరీ పవర్ కూడా అద్భుతంగా పెరుగుతుంది. మీరు గమనించే ఉంటారు..ఎక్కువగా స్ట్రెస్ ఫీలయినప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం కష్టంగా ఎందుకవుతుందంటే.. మీరు సరిగా నిద్రపోవడం లేదని మీ మెదడు మీకు సూచిస్తుంది అని అర్థం చేసుకోవాలి. బాగా విశ్రాంతి తీసుకున్నప్పుడు శరీరం రిలాక్స్ అవుతుంది.

శరీరం రిలాక్స్ అవుతుంది కానీ మెదడు మాత్రం జ్ఞాపకాలను సరైన విధంగా సర్దుబాటు చేయడంలో బిజీగా ఉంటుంది. పని పూర్తి చేసుకున్న మెదడు కూడా రిలాక్స్ అయినప్పుడు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీలవుతారు. అది ఎవరికి వారు స్వయంగా అనుభవించినప్పుడే తెలుస్తుంది. ఇకపోతే నిద్ర వల్ల కలిగే మరో ప్రయోజనం..బ్లడ్ ప్రెషర్ సాధారణ స్థితికి చేరిపోవడం. అవును సరైన నిద్ర లభించినప్పుడు శరీరంలో రక్తప్రసరణ నార్మల్ అవుతుంది. హై బ్లడ్ ప్రెషర్ చాలా సమస్యలకు కారణమౌతుంది. హార్ట్ అటాక్ వచ్చేందుకు కారణమౌతుంది. కానీ చక్కటి నిద్ర లభించినప్పుడు రక్త ప్రసరణ నార్మల్ గా ఉంటుంది.

అందరికీ వర్తించే మరో ముఖ్యమైన విషయం గురించి కూడా పరిశోధకులు చెబుతున్నారు. మీరు ఓవర్ వెయిట్ కాకుండా ఉండేందుకు కూడా సరైన నిద్ర అవసరం. నిద్రకూ ఓబెసిటీకి సంబంధమేంటని అనుకుంటున్నారు కదూ..నిద్ర సరిగా లేనప్పుడు హర్మొన్ల విడుదలపై ప్రభావం పడుతుంది. ఆ కారణంగా శరీరం హై కాలరీ ఆహారాన్ని కోరుకుంటుంది. దాంతో మీరు అలాంటి ఆహారాలు తినేందుకు ఇష్టపడతారు. ఆ కారణంగా శరీరం కూడా లావెక్కిపోతుంది. ఇది సహజసిద్ధంగా మనకు తెలియకుండానే జరిగిపోతుంది.

మనం నివసించే ఈ 21వ శతాబ్దపు అలవాట్లతో మనిషి ఎంత చక్కటి నిద్రపోతున్నాడు దాని వల్ల ఏం జరుగుతోందో తెలుసుకునే పరిశోధనలు నిరంతరం జరుగుతున్నాయి. మనిషి తగు మోతాదులో నిద్రపోయినప్పుడు ఉత్పాదకత పెరుగుతుంది. ఇది పలు పరిశ్రమల్లో వెలుగు చూసిన నిజం. చేసే జాబ్ కూడా విజయవంతంగా నిర్వహించే విషయంలో సరైన నిద్ర అత్యంత ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమితో బాధపడే ఉద్యోగులు తరచూ తప్పులు చేస్తూంటారని తేలింది. తమ ఉద్యోగాలను నిర్వర్తించడంలో ఉత్సాహం బదులు చీకాకు ప్రవేశిస్తే ఏమౌతుంది. దాని వల్ల తనకు తాను నష్టపోవడంతో పాటు తోటి వాళ్లను కూడా నష్టపోయేలా చేస్తుంటారు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు అన్నది పాత సామెత..

నేటి కాలంలో కనీసం ఏడున్నర గంటలపాటైనా హాయిగా నిద్రపోవడం అన్నది తప్పనిసరి..చక్కటి నిద్ర అంత కష్టమైన పనేం కాదు. అందుకు కావలసిన పరిస్థితులను స్రుష్టించుకోవాలి. ‘ఎర్లీ టు బెడ్ ఎర్లీ ఫ్రం బెడ్’ అన్నది మన దేశంలో వేలాది సంవత్సరాల సంస్క్రుతిలో భాగంగా ఉంది. కరోనాతో అన్నిరకాలుగా నష్టపోయిన మనకు శక్తివంతమైన ఇమ్యూన్ సిస్టం అవసరం.. అది నిద్ర ద్వారానే వస్తూందన్నది మనం గుర్తుంచుకోవాలి. శరీరానికి నిద్రద్వారానే సహజసిద్ధమైన రోగ నిరోదక శక్తి వస్తుందన్న విషయాన్ని మరవకూడదు. మంచి నిద్రకు ముందు అసలు చేయకూడని పనుల్లో ఆల్కహాల్, అవసరానికి మించి నీళ్ళు తాగడం లాంటివి ఉన్నాయి..

ఇవి నిద్రను డిస్టర్బ్ చేస్తాయి. పడుకునే ముందు ఒక కప్పు పాలలో ఒక స్పూన్ తేనె కలిపి తాగితే చక్కటి నిద్ర పడుతుంది. సో హాపీ స్లీపింగ్..

Must Read

spot_img