ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ఏడాదికి పైగా కొనసాగుతోంది.. బాంబుల మోతలు, క్షిపణుల దాడులతో ఉక్రెయిన్ లోని నగరాలు శిథిలాలుగా మారుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో భారత వైద్య విద్యార్థులు తమ చదువు కోసం ఉక్రెయిన్ కు వెళుతుండటం ఆందోళనకరంగా మారింది.ఉద్రిక్త పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న యుక్రెయిన్ కి భారతీయ విద్యార్థులు వెళ్లడం ప్రమాదం కాదా..? చదువును కొనసాగించేందుకు విద్యార్థులు ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదా..? యుద్దభూమికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు భారతీయులకు ఎందుకు వచ్చాయి..?
ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్దం తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది.. ఈ యుద్దం ఎంతో మందికి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది.. ఇంకా నష్టం జరుగుతూనే ఉంది. అయితే.. భారత్ నుంచి ఉక్రెయిన్ కు వెళ్లి చదువుకుంటున్న భారత వైద్య విద్యార్థుల బాధ వర్ణాతీతం అని చెప్పాలి.. యుద్దం జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న భారత వైద్య విద్యార్థులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు భవనం నేల మాళిగలోకి పరుగెత్తి తలదాచుకునే వారంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఈ మధ్య కాలంలో దాడుల తీవ్రత మరింతగా పెరిగింది.. కొన్నిసార్లు రోజుకు నాలుగు సార్లు క్షిపణులు దూసుకొస్తున్నాయి అనే హెచ్చరికల అలారమ్ లు మోగుతాయి.. కొన్నిసార్లు విద్యార్థులు బయటకు వెళ్లిన సమయంలో వారి తల మీదుగా ఎన్నో విమానాలు, హెలిక్యాప్టర్లు వెళ్లడంతో వారి ఆందోళన వర్ణాతీతం..
ఉక్రెయిన్ లోని విద్యుత్ కేంద్రాలపై రష్యా క్షిపణుల దాడుల తర్వాత అక్కడ కరెంట్ సమస్యలు తీవ్రంగా బాధించాయి.. దీంతో ఉక్రెయిన్ ప్రజలతో పాటు అక్కడ చదివే భారతీయ విద్యార్థులు అంధకారంలో మగ్గిపోయారు. కరెంట్ ఉన్న ప్రాంతాలకు వెళితే.. అక్కడ గది అద్దె ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వచ్చేది.. గతంలో చెల్లించిన అద్దెతో పోలిస్తే.. సుమారు మూడు నాలుగు రెట్లు అధికంగా ఖర్చు అయ్యేదని భారత వైద్య విద్యార్థులు చెబుతున్నారు.. గతేడాది ఉక్రెయిన్, రష్యాల యుద్దం మొదలైన తర్వాత అక్కడ చదివే విద్యార్థులు తిరిగి భారత్ కు వచ్చారు..
అలా వచ్చిన వారిలో ఇటీవల కాలంలో తిరిగి సుమారు 1000 మందికి పైగా ఉక్రెయిన్ కు వెళ్లిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.. ఉక్రెయిన్ లో యుద్దం మొదలయ్యాక భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ పేరుతో 23 వేల మంది భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారత్ కు తీసుకొచ్చింది.. ఉక్రెయిన్ లో భీకర యుద్దం జరుగుతున్నందున అక్కడ ఉన్న భారతీయులందరూ తక్షణమే ఉక్రెయిన్ ను విడిచి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. అయితే.. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ.. తమ చదువును పూర్తి చేయడానికి చాలా మంది విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్ కు వెళ్లిపోయారు.. ఇంకా చాలా మంది వైద్య విద్యార్థులు ఉక్రెయిన్ వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంతకుముందు యుక్రెయిన్‌కు వెళ్లి చదువుకున్న చాలా మంది భారతీయ విద్యార్థులు… ఇప్పుడు ఇతర దేశాల విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ తీసుకున్నారు. కానీ, చాలా మందికి వివిధ కారణాల వల్ల ఇది సాధ్యపడలేదు. అలాంటి విద్యార్థులే ఇప్పుడు తిరిగి యుక్రెయిన్ వెళ్తున్నారు. ఉక్రెయిన్ యుద్దం మొదలైన సమయంలో వైద్య విద్య మధ్యలో ఉన్న విద్యార్థులు అదే యూనివర్సిటీలో చదువును పూర్తి చేయాలనుకోవడం కూడా అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.. కారణం 2021 నవంబర్ లో భారత జాతీయ మెడికల్ కమీషన్ చదువు మధ్యలో విశ్వవిద్యాలయాన్ని మార్చకూడదని ప్రకటించింది.. అంటే.. విద్యార్థులు చదువుతున్న విద్యకు గుర్తింపు రావాలంటే.. అదే యూనివర్సిటీలో చదువు మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ లోని యూనివర్సిటీల్లో కొంత వరకు చదివిన విద్యార్థులు.. తిరిగి ఇతర యూనివర్సిటీలలో చదివేందుకు వెళితే.. అక్కడ మొదటి నుంచి చదవాల్సి ఉంటుందని భావించిన భారత విద్యార్థులు .. తిరిగి ఉక్రెయిన్ కు వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు..
ఉక్రెయిన్ లో యుద్దం జరుగుతున్నప్పటికీ.. గత్యంతరం లేక అక్కడికి వెళ్లి చదువుకోవాలని భావించిన విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వెంటాడుతుండగా.. మరోవైపు.. ఈ కోర్సును అసలు పూర్తి చేయగలమా..? అనే ప్రశ్నల మధ్య వారి చదువుకు ఆటంకం కలుగుతుంది.. ఉక్రెయిన్ లో విద్యుత్ వ్యవస్థలపై దాడి కారణంగా కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రతిరోజు స్థానిక అధికారులు విద్యుత్ కోతల షెడ్యూల్ ప్రకటించి.. దాని అనుగుణంగా మాత్రమే కరెంట్ సప్లై చేస్తారు.. ఒక రోజులో రెండు, మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తే.. మరో రెండు , మూడు గంటల పాటు కరెంట్ ఉండదు.. ప్రభుత్వం వద్దని చెప్పినప్పటికీ.. చదువును పూర్తి చేయాలని ఆకాంక్షతో ఉక్రెయిన్ కు వెల్లిన విద్యార్థులు.. వారు పడే బాధకు ఎవరినీ నిందించలేరు కూడా.. 2023 ఫిబ్రవరి 23న పార్లమెంట్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖని విద్యార్థులు తమ చదువులు పూర్తి చెయ్యటానికి యుక్రెయిన్ తిరిగి వెళ్ళటానికి అనుమతి ఉందా అని అడిగారు. విద్యార్థులు యుక్రెయిన్ తిరిగి వెళ్ళొచ్చు. అయితే యుక్రెయిన్‌లో భద్రతా పరిస్థితుల దృష్ట్యా యుక్రెయిన్‌ను విడిచిపెట్టమని భారత దేశ పౌరులకి సలహా ఇవ్వటం జరిగింది” అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జవాబు ఇచ్చింది..
2022 మార్చ్ 14న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర మాట్లాడుతూ “వారిని వైద్యులుగా చెయ్యటానికి భారత ప్రభుత్వం చెయ్యాల్సిందంతా చేస్తుంది” అని అన్నారు.అలా వచ్చిన విద్యార్థులను దేశంలోని మెడికల్ కాలేజీలలో చేర్చుకోవాలని, తద్వారా వారు వైద్య విద్యను పూర్తి చెయ్యలగరని తెలుపుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్రభుత్వానికి సూచించింది. విద్యార్థులు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే.. యుద్దం నుంచి తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రభుత్వం తమ చదువు విషయంలో సహకరించకపోతుందా అని భావించిన విద్యార్థులకు కొన్ని నెలల వరకు నిరాశే ఎదురైంది.. దీంతో మధ్యలో ఆపేసిన.. చదువును తిరిగి పూర్తి చేసేందుకు ఉక్రెయిన్ కు వెళ్లాలని నిశ్చయించుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.. సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగానే… 2023
ఫిబ్రవరి 10న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించింది. “మొత్తం 3,964 మంది భారత దేశ వైద్య విద్యార్థులు, యుక్రెయిన్‌లోనే వేరే వైద్య కళాశాలకి శాశ్వత ప్రాతిపదికన బదిలీ అవ్వటానికి అనుమతి కోరారు. అలాగే ఇంకొక 170 మంది వేరే దేశాలలో ఇతర కళాశాలలకి తాత్కాలిక ప్రాతిపదికన బదిలీ అయ్యారు” అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
యుక్రెయిన్ నుంచి వేరే దేశపు కళాశాలకి బదిలీ అవ్వటం కుదరని విద్యార్థుల గురించి, వేరే కళాశాలలకి బదిలీ అవ్వటానికి ఆర్థిక వనరులు లేని విద్యార్థుల పరిస్థితి గురించి కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి సరైన స్పందన లేదనేది విద్యార్థుల వాదన.. అయితే.. ప్రభుత్వ హెచ్చరికలను కాదని.. కేవలం వైద్య విద్యను పూర్తి చేయాలని ఉక్రెయిన్ బాటపడుతున్నారు మరికొందరు.. ఉన్నత విద్యను అభ్యసించాలంటే సమస్యలు ఎదుర్కోవాల్సిందే. అయితే.. యుద్దం జరుగుతోన్న ఉక్రెయిన్ వంటి దేశాల్లో చదువు కొనసాగించడం ఏ మాత్రం క్షేమం కాదనేది విశ్లేషకుల అభిప్రాయం.. ఇప్పటికే ఆపేసిన చదువును కొనసాగించేందుకు… యుక్రెయిన్ కి తిరిగి వెళ్ళిన 1,100 మంది విద్యార్థులకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.
ఓ వైపు భీకర యుద్దం జరుగుతుంటే.. మరోవైపు.. తమ చదువును ఎలాగైనా పూర్తి చేయాలని.. ఉక్రెయిన్ కు తిరిగి పయనమవుతున్నారు భారత వైద్య విద్యార్థులు.. ఉక్రెయిన్ లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చదువును పూర్తి చేయడం అంటే అంత సులువైన విషయం కాదు..