Homeఅంతర్జాతీయంసీబీఐ ఏదైనా కేసు విషయంలో పీఎం, సీఎంలను నేరుగా అరెస్టు చేయగలదా?

సీబీఐ ఏదైనా కేసు విషయంలో పీఎం, సీఎంలను నేరుగా అరెస్టు చేయగలదా?

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దేశాన్ని కుదిపేస్తోంది.. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను సైతం సీబీఐ అధికారులు విచారించారు. ఇప్పటికే ఆప్ నేత మనీశ్ సిసోడియా సహా పలువురిని అరెస్ట్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీబీఐ, ఈడీలకు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను సైతం అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా..? అనే చర్చ మొదలైంది.

దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులను విచారించడం, అరెస్ట్ చేసే అధికారులు సీబీఐ, ఈడీలకు ఉన్నాయా..? విచారణ సంస్థలకు ఉన్న అధికారాలేంటి..? సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందా..?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశాన్ని కుదిపేస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ కేసు ప్రభావం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసు విషయం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. తొమ్మిది గంటల పాటు 56 ప్రశ్నలు కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు సంధించారు. సీబీఐ కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్‌ను విచారిస్తున్న సమయంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. అయితే, సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు రావడంతో ఆప్ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమయింది. కానీ, తొమ్మిది గంటల విచారణ అనంతరం కేజ్రీవాల్ బయటకు వచ్చారు. కేజ్రీవాల్‌‌పై సీబీఐ అధికారులు 161 సీఆర్‌పీసీ కింద ప్రశ్నల వర్షం కురిపించారు. సాక్షిగానే ఆయన్ను ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సాక్షులు, నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నించారు. మౌఖికంగా కేజ్రీవాల్ నుంచి సమాధానాలు తీసుకున్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు వ్యవహారంలో సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు విచారించారు. అతన్ని అరెస్టు చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో.. ఒకవేళ అవసరమైతే, సీబీఐ అధికారులు పీఎం, సీఎం స్థాయి వారిని… ఉన్నతస్థాయి అధికారులను నేరుగా అరెస్టు చేయొచ్చా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 135 ప్రకారం.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ముఖ్యమంత్రి, శాసనసభ, శాసన మండలి సభ్యులకు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ మినహాయింపు అన్ని కేసుల్లో కాదు, సివిల్ కేసుల్లో మాత్రమే.

క్రిమినల్ కేసుల్లో ఈ సెక్షన్ వర్తించదు. సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 135 ప్రకారం.. పార్లమెంట్, శాసనసభ, శాసన మండలి సభ్యుడిని అరెస్టు చేయాలంటే, ఒకవేళ నిర్బంధించాలంటే స్పీకర్, సభ‌చైర్మన్ నుండి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాక.. పార్లమెంటు ఆవరణం, శాసనసభ, శాసన మండలి ఆవరణాల్లో నుంచి ఏ సభ్యుడిని కూడా అరెస్టు చేయటం, నిర్బంధించడం చేయొద్దనేది ఈ సెక్షన్ ద్వారా వర్తిస్తుంది.క్రిమినల్ కేసుల్లో పార్లమెంట్, శాసనసభ, శాసన మండలి సభ్యుడిని అరెస్టు చేయొచ్చు. అయితే, ఆ సమాచారాన్ని స్పీకర్ లేదా చైర్మన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. పీఎం, సీఎంలు సైతం పార్లమెంట్, శాసన‌సభ‌ సభ్యులే కాబట్టి వారికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. అదే విధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం.. రాష్ట్రపతి, గవర్నర్ విషయంలో పదవిలో ఉండగా నిర్భంధించడం, అరెస్టు చేయడం సాధ్యం కాదు. వారికి వ్యతిరేకంగా ఏ కోర్టు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయదు. సివిల్, క్రిమినల్ కేసులలోనూ మినహాయింపు ఉంది. పదవిని వదిలిన తరువాత అతన్ని అరెస్టు చేయడం, నిర్బంధించడం చేయొచ్చు.

మరోవైపు.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆప్‌ నేత మనీశ్ సిసోడియాకు కష్టాల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ ఫిభ్రవరి 26న సిసోడియాను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఎవెన్యూ కోర్ట్ పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 27 వరకూ, ఈడీ కేసులో ఈ నెల 29 వరకూ జుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఆదేశాలు జారీ చేశారు. అరుణ్ పిళ్లై కస్టడీని కూడా
న్యాయస్థానం వచ్చే నెల ఒకటో తేదీ దాకా పొడిగించింది. లిక్కర్‌ స్కామ్‌లో సిసోడియాను సీబీఐ అధికారులు, ఈడీ అధికారులు వేరుగా ప్రశ్నించారు. ఈ కేసులో త్వరలో ఈడీ మరో ఛార్జిషీట్‌ దాఖలు చేయనుంది. సిసోడియా, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, అమన్‌దీప్‌పై అదనపు ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఇప్పటికే ఒక ప్రధాన, 2 అదనపు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. మూడో అదనపు ఛార్జిషీట్లో సిసోడియా, రామచంద్రన్ పిళ్ళై, అమన్‌దీప్‌పై అభియోగాలు నమోదు చేయనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఇప్పుడు దేశంలో హట్ టాపిక్. రెండేళ్ల క్రితం మొదలైన ఈ ముచ్చట ఇప్పుడు దేశం మొత్తాన్నిఊపు ఊపేస్తోంది. చిన్న ఆరోపణతో మొదలైన ఈ విషయం… చినికి చినికి గాలి వానగా మారినట్టు.. దేశంలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో సీబీఐ, ఈడీ రంగ ప్రవేశం చేసి.. ఏకంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిపి 11 మందిని అరెస్టు చేసిందంటే.. ఎంత రచ్చగా మారిందో అర్థమవుతోంది. కాగా.. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితది కీలక పాత్ర ఉందంటూ ఈడీ ప్రస్తావించటం మరింత ఉత్కంఠకు దారితీసింది. అటు ఢిల్లీలో మొదలై.. ఇటు తెలంగాణను ఓ ఊపు ఊపేస్తుంది ఈ కేసు. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పాత్ర ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం.. ఈడీ విచారించడం.. తీవ్ర ఉత్కంఠను రెకెత్తించింది.. అసలు ఈ ఢిల్లీ స్కాం బయటకు రావటానికి ఆద్యుడు ఎవరు.. ఎలా ఈ కుంభకోణం బయటపడింది.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దేశ రాజధాని అయిన ఢిల్లీలో మద్యం దుకాణాలు మొదట ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. వాటిని ప్రైవేటుకు అప్పగిస్తూ.. 2020 సెప్టెంబర్‌లో ఆప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరోజు ఆప్ తీసుకున్న ఈ నిర్ణయమే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే.. ఆప్ సర్కార్ నిర్ణయం మేరకు.. 2021 జనవరి 5న లిక్కర్‌ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంలో ఓ కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాశ్ గెహ్లాట్‌ ఈ బృందంలో ఉన్నారు. అయితే.. వాళ్లంతా కలిసి.. రెండు నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు. ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్.. మే 21, 2021న ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదించింది. అక్కడే అసలు రచ్చ మొదలైంది. ఈ కొత్త లిక్కర్ పాలసీలో.. విదేశీ మద్యం ధరలపై ఆప్ సర్కార్‌ నిర్ణయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా వ్యతిరేకించారు. కానీ.. అవేవి పట్టించుకోకుండా ప్రభుత్వం దాన్ని ఆమోదించటంపై ఆయన పలు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలే.. ఇప్పుడు ఇంత రచ్చకు కారణమయ్యాయి.

కేజ్రివాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీలో అన్ని అవకతవకలు ఉన్నట్లు 2021 జులై 20న కేంద్ర హోంశాఖకు వినయ్ కుమార్ సక్సేనా లేఖ రాశారు. ఆయన లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు.. దీనిపై దృష్టి సారించి… సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో.. రంగంలోకి దిగిన సీబీఐ.. ఆగస్టు 19న 15 మంది పేర్లతో ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారంలో భాగంగా.. పలుచోట్ల సోదాలు కూడా చేసింది. ఇదిలా ఉండగానే.. భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు కూడా అందుకోవటంతో.. మూడు రోజుల తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇందులో పెద్ద స్కాం జరిగిందని అనుమానిస్తూ.. అసలు ఏం జరిగిందన్నది రూట్ లెవల్ నుంచి విచారణ చేయటం మొదలు పెట్టింది. ఇందులో భాగంగనే.. పలువురు రాజకీయ, పారిశ్రామిక వేత్తలపై దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నట్టు సీబీఐ, ఈడీ వెల్లడించింది. పలుమార్లు దాడులు చేసి విచారణ జరిపిన అనతరం.. మనీశ్ సిసోడియా వరకు మొత్తం 11 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అయితే.. హైదరాబాద్‌ కేంద్రంగానే లిక్కర్ స్కాం జరిగినట్లు నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో పలుమార్లు పేర్కొనటం పెద్ద దుమారమే లేపింది. మరోవైపు.. ఈ కేసులో కవితకు కూడా భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలతో ఆమెను విచారించింది ఈడీ.. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల ముడుపులు చేతులు మారినట్టు ఈడీ ఆరోపించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1 ముద్దాయిగా ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని సమీర్ మహేంద్రును సెప్టెంబర్ 28న ఈడీ అరెస్ట్ చేసింది. సెక్షన్ 45, ప్రివెన్ష ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద సెప్టెంబర్ 30న అతనిపై ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. అరబిందో గ్రూప్ – ఫార్మా డైరెక్టర్ పెనక శరత్ చంద్రా రెడ్డిని నవంబర్ 11న ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాంలో బినోయ్ బాబుతో కలిసి శరత్ చంద్రా రెడ్డి రిటైల్ లైసెన్స్ లు ఇప్పించినట్లు ఈడీ గుర్తించింది. లిక్కర్ లైసెన్సుల రేట్లు ఫిక్స్ చేయడంలో శరత్‌‌‌‌ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది. స్కామ్‌‌‌‌లో శరత్‌‌‌‌ చంద్రారెడ్డిని కింగ్‌‌‌‌పిన్‌‌‌‌గా పేర్కొంది.
పెర్నోడ్ రిచర్డ్ ఇంటర్నేషనల్ లిక్కర్ బ్రాండ్ కంపెనీ జనరల్ మేనేజర్ బినోయ్ బాబును ఈడీ.. నవంబర్ 11న శరత్ చంద్రా రెడ్డితో పాటు అరెస్ట్ చేసింది. ఈ స్కామ్‌‌లో పేర్కొన్న 31 లైసెన్సుల్లో బినోయ్‌‌ బాబు 29 లైసెన్సులను రిటైల్‌‌ వ్యాపారులకు ఇప్పించినట్లు ఆధారాలు సేకరించిందని సమాచారంలో వెల్లడైంది. ఇందులో అక్రమ లావాదేవీలను సైతం ఈడీ గుర్తించింది.

లిక్కర్​ స్కామ్‌లో రాష్ట్రం నుంచి అరెస్టయిన తొలి వ్యక్తి అభిషేక్ రావు. ఈడీ.. అభిషేక్ ని నవంబర్ 13న అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంది. మొదటి నుంచి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావుకు రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌లో రూ.3.85 కోట్లు అభిషేక్ రావు అకౌంట్ల నుంచి ఇండోస్పిరిట్ ఎండీ సమీర్‌‌‌‌ మహేంద్రుకు వచ్చినట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. ముందుగా సౌత్‌‌ లాబీ పేరుతో ఆ మొత్తం 3 అకౌంట్ల నుంచి అభిషేక్ ఖాతాల్లో జమ అయినట్లు పేర్కొంది. ఆప్ కమ్యూనికేషన్ ఇన్​చార్జ్ విజయ్ నాయర్​ను ఈడీ నవంబర్ 13న అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీపై అక్రమ లావాదేవీలు సరిపాడని ఈడీ విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీపై ఏదైనా విచారణ జరిగితే అసలు నిందితులు దొరకకూడదనే ఉద్దేశంతో విజయ్ వ్యవహరించాడు. లిక్కర్ పాలసీ–2021లో మార్పులు చేసేలా ప్రైవేటు లిక్కర్ హోల్ సేలర్ల నుంచి డబ్బులు సమీకరించాడు. బడ్డీ రిటెయిల్ సంస్థ డైరక్టర్ అమిత్ అరోరాను ఈడీ నవంబర్ 29న అరెస్ట్ చేసింది. ఈయన ఢిల్లీ మద్యం వ్యాపారాలు జరుపుతుంటారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుల్లో అమిత్ ఒకరు.

ఫిబ్రవరి 8న ఢిల్లీ లిక్కర్ స్కాంలో గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీకి వ్యతిరేఖంగా స్కాం జరిపినట్లు ఈడీ వెల్లడించింది. గౌతమ్.. అక్రమ లావాదేవీలు జరిపినట్లు గుర్తిచింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ.. ఫిబ్రవరి 9న చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రాజేష్ జోషిని అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూపునకు రూ.31 కోట్ల నగదును బదిలీ చేయడంలో రాజేష్ జోషి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీ ఈ డబ్బును ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి నగదును ఢిల్లీకి తరలించారని గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్‌ పాలసీని రూపొందించడంలో సిసోడియా కీలక పాత్ర పోషించారు. పలు లావాదేవీలపై అనుమానాలతో పాటు, లిక్క స్కాంకు రూపకల్పన వహించాడనే ఆరోపనలు ఎదుర్కొంటున్నాడు. ఒంగోలు వైసీపీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి కొడుకు మాగుంట రాఘవను ఈడీ అధికారులు ఫిబ్రవరి 11న అరెస్ట్ చేశారు. రాఘవ బాలాజీ గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. సౌత్ గ్రూప్లో రాఘవ కీ రోల్ పోషించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ వ్యాపారవేత్త అమన్ దీప్ దీప్ సింగ్ ను మార్చి 2న ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సౌత్ గ్రూపుతో అమన్ దీప్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని, ఆప్ ఫంక్షనరీ విజయ్ నాయర్, మనోజ్ రాయ్ లతో పాటు అమన్దీప్ సింగ్ కూడా కీలకపాత్ర పోషించారని సీబీఐ ఎఫ్ఐఆర్ లో తెలిపింది. కవిత బినామీగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ మార్చి 6న అరెస్ట్ చేసింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని.. హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారని.. ఈ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది ఈడీ.

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఇప్పుడు దేశంలో హట్ టాపిక్. రెండేళ్ల క్రితం మొదలైన ఈ ముచ్చట ఇప్పుడు దేశం మొత్తాన్నిఊపు ఊపేస్తోంది. చిన్న ఆరోపణతో మొదలైన ఈ విషయం… చినికి చినికి గాలి వానగా మారినట్టు.. దేశంలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది.

Must Read

spot_img