Homeఅంతర్జాతీయంఆధిప‌త్య పోరుతో అశాంతి…

ఆధిప‌త్య పోరుతో అశాంతి…

ఆధిప‌త్య పోరుతో అశాంతి చోటు చేసుకుంటే ఆ దేశం ముందుకు వెళ్లకుండా తిరోగమన బాట పడుతుంది. సాధించిన అభివృద్ది నేలపాలవుతుంది. జీవించడమే కష్టంగా మారుతుంది. ప్రస్తుతం ఆఫ్రికాలోని సుడాన్ పరిస్థితి అలాగే మారింది. నిజానికి ఆఫ్రికా సహజ వనరులకు ప్రసిద్ధమైన ఖండం..పలు దేశాలు ఎంతో అభివృద్ది సాధించినవిగా ఉన్నాయి. అయితే సూడాన్‌‌లో మాత్రం వేరుగా ఉంటోంది. మాజీ మిలటరీ అధికారి ఒమర్‌ అల్‌ బషీర్‌ ప్రభుత్వం మూడు దశాబ్దాల పాటు పాలన సాగించింది.

అయితే సహజసిధ్దంగా వచ్చే అసమ్మతి, అధికారుల అరాచకత్వంపై ప్రజా వ్యతిరేకత కారణంగా నాలుగేళ్ళ క్రితం అధికారాన్ని కోల్పోయారు. ఆయన గద్దె దిగిన రెండు సంవత్సరాలకే సైనికులు ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నారు. కానీ అందులోని ఆర్మీ జనరల్‌కూ, పారామిలటరీ జనరల్‌కూ మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు ప్రస్తుతం సూడాన్‌లో ఘర్షణలకు కారణమైంది. ఈ ఘర్షణల్లో వందల కొద్దీ జనం ప్రాణాలు విడుస్తున్నారు. వీరిలో సామాన్యులైన పౌరులు ఎక్కువ మంది ఉన్నారు. ఏ పాపం తెలియని ప్రజలలో 5 వేల మందికి పైగా బులెట్లు బాంబు పేళుల్లలో గాయపడ్డారు. ఫిరంగులు,కాల్పుల మోతలతో దేశంలోని ప్రధాన నగరాలు,పట్టణాలు దద్దరిల్లుతున్నాయి. సూడాన్‌లో విదేశీయులు చిక్కుకుపోయారు.

భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం సంప్రదింపులు జరుపు తోంది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు 24 గంటల కాల్పుల విరమణను అక్కడి రెండు వర్గాలు ప్రకటించాయి. అదాల ఉంచితే ఇద్దరు వ్యక్తుల ఆధిపత్యం పోరాటానికి వేలాదిమంది గాయపడుతున్నారు. దేశంలో సహజవనరులు అపారంగా ఉన్నా,ప్రజలకు నిత్యావసరాలను అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. అసలు దేశంలో ప్రభుత్వం అన్నది ఉందా లేదా అన్నది అర్థం కావడం లేదు. దేశ రాజధాని ఖర్టూమ్‌ లోనూ, ఇతర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

ఈ ఘర్షణల్లో ఒక భారతీయుడు కూడా మరణించాడు.అతడు కేరళకి చెందిన అహ్మద్‌గా చెబుతున్నారు. సూడాన్ రాపిడ్‌ సపోర్టు ఫోర్స్‌ చాలా శక్తివంతమైంది.ఆర్మీతో ఈ దళాలే ఘర్షణ పడుతున్నాయి. ఈ ఫోర్సుకు లెఫ్టినెంట్‌ జనరల్‌ హమ్‌దాన్‌ దగాలోనేతృత్వం వహిస్తున్నాడు. అతడికి రష్యాలోని వాగ్నర్‌ ప్రైవేటు మిలటరీతో సంబంధాలున్నాయి. సౌదీఅరేబియాతో కూడా సంబంధాలు ఉన్నాయి.

అధ్యక్ష భవనాన్ని తన అధీనంలోకి తీసుకుని అతడు జనరల్‌ బుర్హాన్‌ని తిరిగి అధికారంలోకి తీసుకుని వస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అయితే, సైనికులు ఈ ప్రకటనలను తోసిపుచ్చారు. ఆర్‌ఎస్‌ఎఫ్‌ స్థావరాలపై వైమానిక దాడులు జరపనున్నట్టు ప్రకటించారు. ఈ దాడుల్లో ఖర్తూన్‌లోనూ, వివిధ నగరాల్లోనూ ఆస్పత్రులు కూడా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని మరో చోటుకి తరలించే ఏర్పాటు చేశారు. సూడాన్‌లో ఈ మాదిరి ఘర్షణలు ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రజల్లో అశాంతి నెలకొనడంతో సూడాన్‌లో పరిస్థితి గందరగోళంగా తయారైంది. స్వదేశాలకు వెళ్ళేందుకు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులు ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.

రెండేళ్ళ క్రితం పౌర ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఈ ఇద్దరు జనరల్స్‌ చేతులు కలిపారు. ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరణ జరిగేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామంటూ ప్రగల్భాలు పలికారు,అయితే, వీరి ప్రకటనలు అమలు జరగకపోగా, దేశంలో అంతర్యుద్ధానికి దారి తీశాయి. అబ్దుల్‌ ఫతే బుర్హాన్‌, పారాదళాల అధిపతి హందన్‌ డగ్లోల మధ్య ఆధిపత్య పోరాటమే ఈ ఘర్షణలకు కారణమని అంటున్నారు విశ్లేషకులు. ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించారు. సూడాన్‌లో ఘర్షణలు దేశఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయనీ, పౌరుల ప్రాణ,ఆస్తి నష్టాలకు కారణం అవుతున్నాయని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది.ఘర్షణలను విరమించాలని సమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్‌ చేసిన విజ్ఞప్తిని ఇరువర్గాలూ పట్టించుకోలేదు.

అయితే ఎక్కడైన మృత కలేబరం ఉంటే రాబందులు ఎలాగైతే వచ్చి వాలతాయో అలాగే ఇప్పుడు సూడాన్‌లో చెలరేగిన ఘర్షణను ఎగదోసేందుకు అగ్రరాజ్యాలు రంగంలోకి దిగాయి. డగ్లో నేతృత్వాన్ని రష్యా సమర్థిస్తుండగా, ఆవలి వర్గాన్ని రష్యా వ్యతిరేకులు..అంటే అమెరికా మిత్రదేశాలు సమర్థిస్తున్నాయి. సూడాన్ దేశంలో ఉన్న సహజ సంపదపై అగ్రరాజ్యాల కన్నుపడటం వల్లనే బాహ్యశక్తులు సూడాన్‌లో అంతర్యుద్ధాన్ని రెచ్చగొడుతున్నాయి. అంతేకాక, సూడాన్‌లో అనేక విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టి వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తున్నాయి.

ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావం ఉన్నప్పటికీ, బాహ్య శక్తుల ప్రమేయం వల్ల చిన్న చిన్న విషయాలకే ఘర్షణలు జరుగుతున్నాయి. సూడాన్‌లో సంపదపైన బాహ్య శక్తుల కన్నుపడటం వల్లనే ఘర్షణలను అవి ప్రేరేపిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా, రష్యాలు తమ సహజ ధోరణిలో చెరో వర్గాన్నీ సమర్థిస్తూ దేశంలో ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. దేశంలో లభించే ప్రకృతి సహజసిద్ధమైన సంపదను దోచుకుని పోవాలన్న ధ్యాస తప్ప ప్రజల గోడు పట్టిం చుకోవడం లేదు. ఈ ఘర్షణల వల్ల సూడాన్‌లోని అనేక ప్రాంతాల్లో భవనాలు నేలమట్టమై మరుభూములను తలపిస్తున్నాయి. దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, పేదరికం, అంతర్యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సూడాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

వీధుల్లో సైనికుల గొడవలు, కాల్పుల మోతలు, గాల్లో వాయుదాడుల మధ్య సుడాన్​ ప్రజలు పవిత్ర రంజాన్​ మాసం చూస్తుండగానే రక్తపాతం మధ్యే జరిగిపోయింది. సామాన్యులు ఇళ్లలోంచి బయటకు అడుగుపెట్టాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల సరఫరా లేకపోవడంతో జనం ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అయితే సుడాన్​లో రక్తపాతం మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సైన్యాధికారులు చర్చలకు సిద్ధంగా లేరని సమాచారం. ఇదే జరిగితే ఇరువైపులా భారీగా ప్రాణ నష్టం ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.

సుడాన్​ ఘర్షణల్లో ఇప్పటివరకు 500 మంది ప్రాణాలు కోల్పోయారని సుడాన్​లోని యూఎన్​ మిషన్​ హెడ్​ వోల్కర్​ పెర్తెస్​ తెలిపారు. సుడాన్​లో హింసను నిలిపివేయాలని పిలుపునిచ్చారు యూఎన్​ సెక్రటరీ ఆంటోనియో గుటేర్రస్​. ఈ పరిస్థితులు దేశానికి, ఆ ప్రాంతానికి మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. గుటేర్రస్​తో పాటు ప్రపంచ దేశాలు కూడా ఈ పరిస్థితులకు స్వస్తి పలకాలని పిలుపునిస్తున్నాయి. కానీ ఇవేవీ ఫలితాల్ని ఇవ్వడం లేదు. అటుఖార్టూమ్​లోని యూరప్ రాయబారి నివాసంపైనా దాడి జరిగింది.

ఈ ఘటన నుంచి ఆయన​ సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మృతుల్లో.. యూఎన్​ వరల్డ్​ ఫుడ్​ ప్రోగ్రామ్​కు చెందిన ముగ్గురు సిబ్బంది కూడా ఉన్నారు. దర్ఫర్​లో ఔషదాలు, ఆహారం సరఫరా చేస్తున్న క్రమంలో ఘర్షణల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజా వార్తల నేపథ్యంలో సూడాన్‌లో సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్‌.. మూడు రోజుల పాటు కాల్పుల విమరణపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. 48 గంటల పాటు జరిగిన తీవ్ర చర్చల తర్వాత.. సుడానీస్ సాయుధ దళాలు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కాల్పుల విరమణకు ముందుకు వచ్చాయని బ్లింకెన్‌ వెల్లడించారు. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా 72 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరించాయని తెలుస్తోంది.

దీంతో భారీ ఎత్తున్న విదేశీయులు తమ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. సంధి అమలు కావడానికి రెండు గంటల ముందే బ్లింకెన్‌ ప్రకటన వెలువడడం విశేషం. ఈ మూడు రోజుల్లో పౌరుల తరలింపు ప్రక్రియ వేగవంతం కానుంది. శనివారం నుంచి విదేశీయుల తరలింపు ప్రారంభం కాగా, ఇప్పటిదాకా సుమారు నాలుగు వేల మందికి పైగా స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే లక్షల మంది సూడాన్‌ పౌరులు మాత్రం అక్కడి దీనపరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం, మందులు, ఇంధన వనరుల కొరత, విద్యుత్‌ కోత కొనసాగుతోంది. అలాగే ఇంటర్నెట్‌ వినియోగంపై ఆంక్షలు విధించారు.

ఈ తరుణంలో ఎటు పోవాలో పాలుపోని అక్కడి ప్రజల పరిస్థితి మాత్రం దీనంగా దయనీయంగా మారింది.

Must Read

spot_img