- మైలవరంలో వైసీపీ రచ్చ .. చర్చనీయాంశంగా మారిందా..?
- ఓవైపు జోగి రమేష్ తో విబేధాలు,
- మరోవైపు తండ్రి వ్యవహార శైలితో టెన్షన్ పడుతోన్న వసంత .. తాజా వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయని టాక్ వినిపిస్తోంది.
వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహరం చర్చనీయాశంగా మారింది. మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్‌తో వసంతకు ఉన్న విభేదాలు బహిర్గతంకావటంతో వివాదం తెర మీదకు వచ్చింది. ఈ వివాదంపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా శ్రద్ద చూపింది. వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్‌తో విడివిడిగా ప్రభుత్వ పరిశీలకుడు సజ్జల సమావేశం అయ్యారు. ఇరువురు నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.
అయినా ఈ వివాదం కొలిక్కిరాలేదు. ఇదిలా కొనసాగుతుండగానే, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మరో చిచ్చు రేపారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ మరింత ఇరకాటంలోకి వెళ్ళారు. కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలు తన తండ్రి వ్యక్తిగతమని, అందులో తనకు ఎటువంటి సంబంధం లేదని వసంత క్లారిటీ ఇచ్చారు.
అయినా కూడా వసంతను టార్గెట్‌గా చేసి పార్టీలో వివాదం చెలరేగింది. కమ్మ సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదని తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ ఎమ్మెల్యే వసంత మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహరంలో కూడా మంత్రి జోగి రమేష్ లేనిపోని విషయాలు ప్రచారం చేశారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా జోగి రమేష్ వర్గం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని చెబుతున్నారు.
వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతున్నారని, ఎన్నికల నాటికి టీడీపీలో చేరతారని కూడా ప్రచారం చేసిందని టాక్. అందుకే వసంత కృష్ణ ప్రసాద్‌కు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారనే ప్రచారం కూడా జరిగింది. మైలవరం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను స్థానిక గ్రూపు రాజకీయాలను క్లియర్ చేసి, అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర స్థాయి పరిశీలకులు, మర్రి రాజశేఖర్ వంటి నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా వసంత కృష్ణ ప్రసాద్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత… జోగి రమేష్ తన నియోజకవర్గంలో చేతులు పెట్టి గందరగోళ పరచడమేంటని నిలదీశారు. జోగి వైఖరి వలన నియోజకవర్గంలో పార్టీలో విభేదాలు వచ్చాయన్నారు. ఎమ్మెల్యేను కాదని మరో వ్యక్తి రాజకీయాలు చేయటంపై పార్టీ పెద్దలు కూడా సరైన రీతిలో స్పందించలేనే అభిప్రాయాన్ని వసంత వ్యక్తం చేశారు. పార్టీ నేతలు వసంత కృష్ణ ప్రసాద్‌ను సముదాయించేందుకు విషయాలను పార్టీ అగ్రనాయకత్వం వద్దకు తీసుకువెళ్ళి అవసరమైతే మరోసారి జగన్‌తో భేటీకి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
- టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు భేటీ..
టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు భేటీ అంశం ఓ పక్క రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉండగానే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తాజాగా నేటి రాజకీయాలపై చేసిన కీలక వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే పది మంది పోరంబోకులు వెంట ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన నియోజకవర్గ పరిధిలోని చంద్రాల సొసైటి శంకుస్థాపన సభలో పాల్గొన్నారు. పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక, పాత తరం నాయకుడిలా మిగిలిపోయానంటూ కేపి వ్యాఖ్యానించారు. 55 సంవత్సరాలుగా తమ తమ కుటుంబం రాజకీయాల్లో ఉందనీ, అప్పటి రాజకీయాలతో పోలిస్తే ఇప్పటి రాజకీయాలు గణనీయంగా మార్పు చెందాయని అన్నారు కేపి.
పోరంబోకులను వెంటేసుకుని తిరిగితేనే ముందుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఒక్కో సారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేపి. ఎమ్మెల్యేగా ఉండి కూడా సగటు వ్యక్తులకు సహాయం కూడా చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత రాజకీయాల పట్ల అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలను కేపి చేసినట్లుగా ఉందని భావిస్తున్నారు. రీసెంట్ గా గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, కార్యక్రమ నిర్వహకుడు, ఎన్ఆర్ఐని అరెస్టు చేసిన సందర్భంలోనూ కేపి స్పందించారు.
సేవా కార్యక్రమాలు చేసే వారిని విమర్శించడం సరికాదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకునే ఎన్ఆర్ఐలను ఆపడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహకుడు, ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి స్నేహితుడని, చాలా మంచి వ్యక్తి అని కేపి మాట్లాడారు. నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ వర్గంతో విభేదాల నేపథ్యంలో కేపి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీ కేశినేని నానితో కేపి తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు భేటీ కావడం, కేపి సంచలన కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఏపిలో రాజకీయాల్లో రోజుకో కొత్త అంశంతో హాట్ టాపిక్ గా చర్చనీయాంశం అవుతున్నాయి. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయానికి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వెళ్లి సమావేశం కావడం టీడీపీ, వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మైలవరం నియోజకవర్గ వైసీపీలో మంత్రి జోగి రమేష్ వర్గం..ఎమ్మెల్యే వసంత వర్గాల మద్య విభేదాలు ఉన్నాయి.
మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత మధ్య ఉన్న విభేదాల అంశం చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి కూడా వెళ్లింది. ఇలా విభేదాల రాజకీయం కొనసాగుతున్న వేళ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు నేరుగా టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయానికి వెళ్లడం, ఆయనతో సమావేశం కావడం ఉమ్మడి కృష్ణాజిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. వసంత నాగేశ్వరరావు ఎన్టీఆర్ హయాంలో వ్యవసాయ, హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
తర్వాత కాంగ్రెస్, మళ్లీ టీడీపీలో కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. సీనియర్ నేత అయిన వసంత నాగేశ్వరరావుకు వివిధ రాజకీయ పార్టీలలో ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పలువురు టీడీపీ నేతలతో బంధుత్వాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కేశినేనితో వసంత భేటీ కావడంలో రాజకీయ ప్రాధాన్యత ఏమైనా ఉందా లేదా వ్యక్తిగతమా అనేది తెలియాల్సి ఉంది.
కేశినేనితో వసంత కుటుంబానికి గతం నుండే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరో పక్క కేశినేని నాని కూడా టీడీపీ అధిష్టాన వైఖరిపై కొంత అసంతృప్తిగా ఉన్నారంటూ కూడా వార్తలు వినబడుతున్నాయి. నాని సోదరుడు కేశినేని చిన్ని రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ తరపున పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. పార్టీ కూడా ఆయనకు సహకారం అందిస్తొందన్న భావన నానిలో ఉంది.
ప్రభుత్వంపై అసంతృప్తి గళం విప్పిన వసంత నాగేశ్వరరావు..టీడీపీలో అసంతృప్తితో ఉన్నట్లుగా భావిస్తున్న కేశినేని నానితో భేటీ కావడంపై రకరకాల ఊహానాగాలు సెర్క్యులేట్ అయ్యే అవకాశం ఏర్పడుతోంది. మరోవైపు జగన్ ప్రభుత్వం రాజకీయకక్షతో అక్రమ కేసులు బనాయిస్తోందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ మాటలు నిజమేనన్నట్లు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు ఉన్నాయి.
ఈ మూడున్నరేళ్లల్లో ఏనాడు అనవసరంగా ఏ విపక్ష నేతపై రాజకీయకక్ష సాధింపుగా కేసులు పెట్టలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక వ్యాఖ్యలతో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కుతూ జగన్ కి తలనొప్పిగా మారారు. అయితే వైసీపీని వీడి టిడిపిలో చేరేందుకే వసంత ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్న వార్తలపై కూడా మొన్నా మధ్య జగన్‌తో భేటీ అనంతరం క్లారిటీ ఇచ్చారు.
రాజకీయాల్లో ఉన్నంతవరకు వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. జగన్ తో భేటీ అనంతరం కూడా వసంతలో ఏ మార్పు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
మరి ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాల్సిందే…