Homeఆంధ్ర ప్రదేశ్వై.సి.పి అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరం…

వై.సి.పి అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరం…

ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగటంతో ఆ జిల్లాలో వై.సి.పి అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మూడు జిల్లాల నుంచి ఒకరిని ఎంపిక చెయ్యాల్సినరావటంతో పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. సామాజిక సమీకరణాల ప్రకారం ఇప్పటికే ఆశావాహులు జాబితా చాంతాడులా ఉందట. మరి ఎవరికి దక్కనుందన్నదే హాట్ టాపిక్ గా మారింది.

త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల జరగనుంది. 2017లో ఎన్నికలు ఈ స్థానాన్ని అప్పట్లో టి.డి.పి దక్కించుకుంది. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత చిక్కాల రామచంద్రరావుకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. మే నెలతో ఆయన పదవీకాలం ముగియనుంది. జిల్లాలో స్థానిక సంస్థల నుంచి మరో ఎమ్మెల్సీగా అనంత ఉదయ్ భాస్కర్ ప్రస్తుతం సిట్టింగ్ గా కొనసాగుతున్నారు.

తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఈనెల 23వ తేదీ లోపు నామినేషన్లు దాఖలు చెయ్యాల్సి ఉంటుంది. పదిరోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో వై.సి.పి నుంచి పోటీ చేసేది ఎవరు అనేది చర్చగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఒక వెయ్యి 418 మంది సభ్యులు ఉన్నారు. 59 మండలాలకు చెందిన జెడ్.పి.టి.సి.లు…ఎం.పి.టి.సి.లు సహా ఏడు మున్సిపాలిటీలు… మూడు నగర పంచాయతీలకు చెందిన వార్డు సభ్యులు ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సి ఉంది. జిల్లా స్థానిక సంస్థల సభ్యుల్లో వై.సి.పి.కి చెందిన వారే మెజారిటీ కావటంతో ఎమ్మెల్సీ గెలుపు సునాయాసం కానుంది. అసలు ఎన్నిక ఏకగ్రీవం కూడా అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వై.సి.పి. అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేయటమే ఆలస్యం ఆ పార్టీ ఖాతాలోకే ఉమ్మడి తూర్పుగోదావరి ఎమ్మెల్సీ స్థానం వెళ్లనుందని తెలుస్తోంది.

అయితే అభ్యర్థి ఎవరు, ఏ ప్రాతిపదికన ఖరారు చేస్తారనే దానిపై ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సామాజిక సమీకారణాల ప్రకారమేఎమ్మెల్సీ ఎంపిక ఉంటే ఏ వర్గానికి సి.ఎం జగన్ అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఈసారి బి.సి వర్గాలకు సి.ఎం జగన్ ఛాన్స్ ఇస్తారని పార్టీ శ్రేణులు ఎక్కువగా అంచనా వేస్తున్నాయి. దీంతో జిల్లా బి.సి. వర్గాల్లోని శెట్టిబలిజల నుంచి ఆశావాహులు అనేకమంది తెరపైకి వచ్చారు.

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఏడుగురు పైగా శెట్టిబలిజల నుంచి ఎమ్మెల్సీ ఆశావాహులుగా ఎమ్మెల్సీ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథన్ రెడ్డి ద్వారా తమ అర్హతలను పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లారు. కోనసీమ ప్రాంతం నుంచి శెట్టిబలిజ ఆశావాహుల్లో ఒకరికి మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణు ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇదెంతమేరకు ప్లస్ అవుతుందన్నదే హాట్ టాపిక్ గా మారింది.

మరికొందరు ఆశావాహుల్లో ఆర్థిక బలం సైతం ఉన్నవారు కూడా ఉన్నారు. కాకినాడ, రాజమండ్రి నగరాల నుంచి ఇద్దరు ప్రముఖ వైద్యులు సైతం ప్రయత్నాల్లో ఉన్నారు. శెట్టిబలిజ సంఘం ముఖ్యనేత ఉభయ తెలుగు రాష్ట్ర్రాల్లోనూ గుర్తింపు ఉన్న అమలాపురంకు చెందిన సీనియర్ నేత కుడుపూడి సూర్యనారాయణ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే… ఇప్పటికే మంత్రి వర్గంలో ఉన్న చెల్లుబోయిన వేణు… రాజ్యసభ ఎం.పిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇరువురూ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో అదే సామాజికవర్గం నుంచి మరొకరికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తారా అనేది పార్టీ శ్రేణుల్లో చర్చగా సాగుతోంది. దీంతో బి.సి.లకు కాకుంటే జిల్లా నుంచి మాదిగ సామాజిక వర్గీయులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సామాజిక సమీకరణం పాటిస్తే బొమ్మి ఇజ్రాయిల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వై.సి.పి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్సీలు అయ్యారు.

వీరిలో తోట త్రిమూర్తులు, అనంతబాబు కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎం.పి పండుల రవీంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో మరొకరికి ఎమెల్సీ ఇవ్వాల్సిన నేపథ్యంలో వై.సి.పి అధిష్టానం ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. మొత్తం 14 నియోజకవర్గాలకు మార్చిలో పోలింగ్ జరగనుంది. వీటిలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు కాగా.. మూడు మాత్రం పట్టభద్రుల నియోజకవర్గాలు.. మిగిలిన 9 స్థానిక సంస్థల కోటా అయితే వీటిలో స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎవరికి అవకాశం ఇవ్వనుందనే చర్చ జరుగుతోంది.

జిల్లాల వారీగా ఆశావహులు కూడా చాలామంది ఉన్నారు. దీంతో వైసీపీ 9మంది అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థల్లో దాదాపు అన్ని స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ స్థానాల్లో అభ్యర్థులపై భారీ అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరికి అవకాశం లభిస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. 8 స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం నుండి పెద్దగా పోటీ ఉండన్నప్పటికీ ఆస్థానాలకు బలమైన అభ్యర్ధులను ఎంపిక చేయాలని సీఎం జగన్‌ యోచిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా పార్టీకి విధేయతగా పనిచేసిన వారికి మొదటి ప్రాథాన్యతను ఇవ్వాలని ఇప్పటికే సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సామాజికసమీకరణాల ప్రకారం చూస్తే, కాపులు, ఎస్సీ, బి.సి వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడం ఎప్పటి నుంచో సంప్రదాయంగా కొనసాగుతోంది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో మూడు ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేయగా వాటిలో రెండు కాపులకు, మరొకటి బీసీల్లోని శెట్టిబలిజ సామాజిక వర్గానికి చంద్రబాబు ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చాక ముగ్గురు ఎమ్మెల్సీలు అయ్యారు. వారిలో రెండేమో కాపులకు, ఒకటి ఎస్సీలకు ఇచ్చారు. దీంతో ఈసారి అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి తదుపరి బీసీలకు ఇస్తారనే అంచనా ఉంది. అయితే సీఎం జగన్ తూర్పు ఎమ్మెల్సీ విషయంలో ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు బీసీలకు ఇవ్వాల్సిన పరిస్థితి, మరోవైపు ఎస్సీల్లోని మాదిగలకు వైసీపీ నుంచి అవకాశం ఇస్తే పార్టీకి మరింత ప్లస్ అవుతుందని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

దీనికితోడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మంత్రులు సైతం ఎన్నికపై దృష్టి పెడుతుండడంతో, రసవత్తరంగా మారాయి. ఇక ఈ స్థానాలకు ఎవరిని జగన్ ఎంపిక చేస్తారన్నదే కేడర్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో రాష్ట్ర్రవ్యాప్తంగా కన్నా ఈ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు .. రాజకీయ హీట్ ను రగుల్చుతున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగాక ఈ దఫా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో విపక్షాలు ముఖ్యంగా జనసేన దూకుడు పెరిగిన వేళ .. ఎవరికి కేటాయిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.

దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపుపైనా ఈ పదవుల కేటాయింపుల ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తోన్న వేళ .. ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారిపోయిందని కేడర్ సైతం చెబుతున్నారు. అయితే సామాజిక వర్గాల ప్రాధాన్యత ఉన్నా, జగన్ మదిలో ఉన్నదెవరన్నదే .. ఇప్పుడు కీలకమని అటు పార్టీ వర్గాలు, ఇటు విశ్లేషకులు అనడం .. మరింత హీట్ ను రాజేస్తోంది. దీంతో స్థానంలో అభ్యర్థిని ఖరారు చేయడం .. జగన్ కు కత్తి మీద సామేనని విశ్లేషకులు, సీనియర్లు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎవరికి దక్కనుందన్న వాదనలు మాత్రం సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

Must Read

spot_img