Homeజాతీయంవైసీపీలో జగన్ వార్నింగులు ఏమేరకు పని చేస్తాయి..?

వైసీపీలో జగన్ వార్నింగులు ఏమేరకు పని చేస్తాయి..?

ఏపీ సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు మరో అవకాశమిచ్చారు. మారండి.. పనితీరు మెరుగుపరచుకోండి అని ఆదేశించారు. లేకపోతే మార్చేస్తానని కూడా హెచ్చరించారు. గత ఉగాది నుంచి వరుసగా వర్క్ షాపులు నిర్వహించిన జగన్ రిసెంట్ గా ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష చేశారు. 32 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని తేల్చేశారు. వారు ప్రజలతో మమేకం కావడం లేదని.. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో కష్టమని ముఖానే చెప్పేశారు. ఈ జాబితాలో మంత్రుల పేర్లు ఉండడం విశేషం. అందరి పేర్లు చదివి వినిపించిన జగన్ వారి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మూడుసార్లు చెప్పిచూశానని.. అయినా మారలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మారండి.. లేకుంటే మార్చేస్తానని సుతిమెత్తగా హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యేలు,మంత్రుల్లో టెన్షన్ నెలకొంది. ఇక్కడ నుంచి 100 రోజులు పార్టీకి కీలకమని చెప్పిన జగన్… ఈ మూడు నెలల పాటు గడపగడపకూ మన ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.
ఏప్రిల్ లో మరోసారి వర్క్ షాపు నిర్వహిస్తామన్నారు. ఈలోగా పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. అప్పటికీ మారకుంటే ఇక మీ ఇష్టమని తేల్చేశారు. సర్వే రిపోర్టు ఫలితాల్లో పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. సరిగ్గా ఫలితాలు రాకుంటే మార్చేందుకు వెనుకాడనని స్పష్టం చేశారు. ఏప్రిల్ లో సర్వే రిపోర్టుల ప్రకారం అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తానన్నారు. అయితే అధినేత ఒక్కసారిగా కఠువుగా మాట్లాడేసరికి ఎమ్మెల్యేలు, మంత్రులు ఓకింత షాక్ కు గురయ్యారు.

పరిస్థితి తీవ్రంగా ఉందని.. లేకుంటే సీఎం జగన్ ఇంతలా మాట్లాడరని చాలా మంది అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే.. ఆపై మంత్రి బాధ్యతలు నిర్వర్తించినప్పుడు క్షణం తీరిక లేకుండా గడుపుతామని.. అది అర్ధం చేసుకోకుండా గడపగడపకూ వెళ్లడం లేదని సీఎం జగన్ అనడం ఎంతవరకూ సమంజసమని మంత్రులు నొచ్చుకొంటున్నారు. పైగా ఎమ్మెల్యేలు,పార్టీ నాయకుల ముందు పేర్లు చదవడం ఏమిటని బాధిత మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా నాయకుల వద్ద తమను చులకన చేయడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే మంత్రులం కానీ ఒక విధులు లేవు.. నిధులు లేవని.. పైగా పార్టీ బాధ్యతలు, లేనిపోని తలనొప్పులు తమకు అప్పగిస్తున్నారని వాపోయారు. దీంతో జగన్ సమీక్షా సమావేశాలు .. అటు మంత్రుల్లో .. ఇటు ఎమ్మెల్యేల్లో అసంతృప్తులను పెంచుతోంది.

అటు పేర్లు చదివిన ఎమ్మెల్యేలు సైతం సీఎంతో పాటు హైకమాండ్ పై ఆగ్రహంతో ఉన్నారు. అన్ని మీరు చేసి ఇప్పుడు ప్రజల గడపకు మమ్మల్ని వెళ్లమంటున్నారని.. ఆ నిలదీతలు, ప్రశ్నలు మేము తట్టుకోలేమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే ఇవ్వండి.. లేకపోయినా పర్వాలేదని చాలా మంది లైట్ తీసుకుంటున్నారు.

151 మంది ఎమ్మెల్యేలుంటే.. వారిని కాదని పీకే టీమ్ లోని 100 మంది సభ్యులకు జగన్ ప్రాధాన్యమిస్తున్నారు. వారి మాటకే జీ హుజూర్ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వారే గెలిపిస్తారని నమ్ముతున్నారు. పార్టీకైనా, ప్రభుత్వానికైనా వారిచ్చిన నివేదిక అల్టిమేట్ గా మారింది. దీనిపై వైసీపీలో భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో వ్యూహకర్త వ్యూహాలు పనిచేశాయని.. ఈసారి వర్కవుట్ అయ్యే చాన్సే లేదని పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం ఐ ప్యాక్ టీమ్ కే ప్రాధాన్యమిచ్చి.. వారు ఏది చెబితే అదే చేస్తున్నారు.

ఇప్పుడు కొంతమంది పేర్లు ప్రకటించడం, అందులో మంత్రులు ఉండడం.. వారందరికీ చివరి చాన్స్ అని జగన్ హెచ్చరించడంతో పార్టీలో ఓ రకమైన అసంతృప్తి రాగాలు పెల్లుబికుతున్నాయి. ఏప్రిల్ నాటికి ఇవి మరింత రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల్లో అతి తక్కువగా తిరిగిన 32 మంది ఎమ్మెల్యేల జాబితాలో మంత్రులు కూడా ఉండటం గమనార్హం. మంత్రులు విడదల రజినీ, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ పేర్లు ఇందులో ఉన్నాయి.

దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి తదితరుల పేర్లు.. పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నాయి. నివేదికలో పేర్లున్న ఎమ్మెల్యేలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి.. నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరిగితే మళ్లీ రేటింగ్ పెరుగుతుందని సమీక్ష అనంతరం… ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. టార్గెట్ 175 ని సాధించడం కోసమే ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమం అమలుని సీరియస్ గా తీసుకున్నారని.. అందులో భాగంగానే ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు వెళ్లమంటున్నారని అన్నారు.

రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడమే కాకుండా మొత్తం స్థానాలు గెలవాలన్న సంకల్పంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 11న ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నియోజకవర్గ సమన్వయకర్తలు నియోజకవర్గాల్లో తిరుగుతూ సంక్షేమ పథకాల అమలు తీరుని పరిశీలించాలని….
వాటిని ప్రజలకు వివరించాలని సీఎం జగన్ ఆదేశించారు. అంద‌రూ పాత‌వారికే టికెట్లు ఇస్తాం. అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయండి.. పార్టీని గెలిపించండి. మీరు ప‌ట్టుద‌ల‌గా గెల‌వండి! అని పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. తీరా చూస్తే.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మ‌రో కోణం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం వైసీపీకి జ‌గ‌న్ మిన‌హా..
150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా చేసిన ప్ర‌క‌ట‌న మేర‌కు 32 మందిపై తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఈ సంఖ్య మ‌రింత ఎక్కువ‌గానే ఉంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో చాలా మంది వైసీపీ నేత‌ల‌కు చుక్కెదురు అవుతుంద‌ని అంటున్నారు. కాకినాడ సిటీ, రూర‌ల్‌, కొవ్వూరు, ఆచంట.. ఇలా అనేక నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఇవ‌న్నీ ప‌ట్టుబ‌ట్టినా గ‌ట్టెక్క‌డం క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. ఇలా.. చూసుకుంటే.. మ‌రో ఐదారు టికెట్లు పెరిగే అవ‌కాశం ఉంటుంది.

అంటే..ఇప్పుడు ఉన్న 150 మంది ఎమ్మెల్యేల్లో క‌నీసం 40 మందిని మార్చ‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇక‌, దీంతో పాటు.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన నియోజ‌క‌వ‌ర్గాలు 23. వీటిలోనూ నాయకులను ఎంచాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక్క‌ట టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారిని మిన‌హా.. మిగిలిన చోట్ల ఖ‌చ్చితంగా కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పించాలి. అంటే.. ఇత‌మిత్థంగా.. వైసీపీ అధినేత జ‌గ‌న్..ఎంత గీసిగీసి కొత్త‌వారిని తీసుకుందామ‌ని అనుకున్నా.. క‌నీసంలో క‌నీసం 50 సీట్లు ఖాళీగా క‌నిపిస్తున్నాయి.

వీరంతా కొత్త ముఖాలే అవుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికిప్పుడు వార‌సుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని వైసీపీ అధినేత చెబుతున్నా.. కొంద‌రు
మాత్రం ప్ర‌య‌త్నాలు మాన‌డం లేదు. దీంతో ఇలాంటి వారికి 5 సీట్ల వ‌ర‌కు అవ‌కాశం ఉన్నా.. మిగిలిన సీట్లు మాత్రం కొత్తవారికే ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. దీనికితోడు పార్టీలో అసంతృప్తి విపరీతంగా వినిపిస్తోన్నందున .. టిక్కెట్లు ఎవరెవరికి అన్నది ఆసక్తికరంగా మారింది.

మ‌రి జగన్ ఏం చేస్తారో, నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Must Read

spot_img