Homeఆంధ్ర ప్రదేశ్బీసీ గర్జన నిర్వహించే హక్కు వైసీపీకీ లేదు

బీసీ గర్జన నిర్వహించే హక్కు వైసీపీకీ లేదు

బీసీలు ఇప్పుడు ఎవరి పక్షం.. ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. ప్రభుత్వం జయహో బీసీ గర్జనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజల్లో కొత్త సంశయం ఏర్పడుతోంది. ముఖ్యంగా తమకు తాము బీసీలము అని మరిచిపోయిన వర్గాలు సైతం ఆరా తీస్తుండడం విశేషం.

“రాష్ట్రంలోని బీసీ వర్గాలంతా టీడీపీ గూటికి చేరారు.”

పేరుకే వెనుకబడిన వర్గాలు కానీ.. వారి కోసం ప్రత్యేక రాయితీలు లేవు.. స్వయం ఉపాధి పథకాలు లేవు.. రుణాలు లేవు.అటువంటప్పుడు ఈ బీసీ అన్న
అడ్డుగీత ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఇప్పుడు జగన్ సర్కారుకు బీసీలు గుర్తుకు రావడానికి కారణం… గత ఎన్నికల్లో తమను ఆదరించిన వర్గాలుగా ఉన్న వీరు ఇప్పుడు ఎక్కడ దూరమవుతారన్న వ్యథ వారిని వెంటాడుతోంది. . అందుకే ‘జయహో’ అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. . ఏపీలో ఉన్న పార్టీలకు సామాజికవర్గాల తోకను ఎప్పుడో తగిలించేశారు.

కమ్మ అయితే టీడీపీ, రెడ్డి అయితే వైసీపీ, కాపు అంటే జనసేన అని విభజించారు. ఇక సందర్భానుసారం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గం ఏదో పార్టీకి కొమ్ము కాయవలసిన పరిస్థితి.

తొలుత కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వైసీపీకి ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు మళ్లింది.ఇప్పుడు మిగిలినది బీసీ వర్గాలు మాత్రమే. ఏపీ సమాజంలో జనాభాలో సగానిపైగా ఉన్న ఈ వెనుకబడిన వర్గాల మద్దుత కోసమే ఇప్పుడు ఈ సరికొత్త బీసీ గర్జన. అయితే ఇటువంటి గర్జనలు చాలా చూశాం. గత ఎన్నికలకు ముందు బీసీలకు మద్దతుగా చంద్రబాబు ఇదే మాదిరిగా గర్జించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది.

వెనుకబడిన వర్గాల వారి టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. దీనికి కారణం టీడీపీ బీసీ వర్గాల నాయకులను ప్రోత్సహించడమే.1983కు ముందు కాంగ్రెస్ పార్టీ అణగారిని వర్గాల వారిని ఓటు బ్యాంకుగా మలుచుకుంది. నాయకత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం పెద్ద సామాజికవర్గాల వారిని ప్రోత్సహించింది.

ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలను తమ స్టాండర్డ్ ఓటు బ్యాంక్ గా మలుచుకుంది. కానీ ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ ఆవిర్భావించాక.. ఉమ్మడి ఏపీలో 275 నియోజకవర్గాల్లో సగానికి పైగా బీసీ నేతలకు టిక్కెట్లు ఇచ్చింది. వారిని గెలిపించుకుంది.

వారికి రాజకీయ జీవితం కల్పించింది. అయితే ఇది యాదృశ్చికంగా జరిగిందో.. లేక ప్రీ ప్లాన్ గా జరిగిందో తెలియదు కానీ.. రాష్ట్రంలోని బీసీ వర్గాలంతా టీడీపీ గూటికి చేరారు. ఆ పార్టీని ఓన్ చేసుకున్నారు.కానీ 2004 తరువాత పరిస్థితి మారిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ తారక మంత్రం బీసీలపై బాగానే వర్కవుట్ అయ్యింది. దీంతో వారు యూటర్న్ తీసుకోవడం ప్రారంభించారు. వైఎస్ నిర్ణయాలు ఆయన కుమారుడు జగన్ కు లభ్ధి చేకూర్చాయి. అటు చంద్రబాబు నిర్లక్ష్యం చేయడం, జగన్ బీసీ జపం ఆలపించడంతో బీసీల్లో కొన్ని వర్గాలు జగన్ వైపు మళ్లాయి.

2014 ఎన్నికల్లో కొంతవరకూ…2019 ఎన్నికల్లో పూర్తిగా టర్న్ కావడంతో సంపూర్ణ విజయం దక్కించుకుంది. జగన్ వస్తే తమ బతుకులు బాగుపడతాయన్న ఆశతో ఓటువేసిన బీసీలకు గత మూడున్నరేళ్లుగా ఎటువంటి ప్రయోజనాలు లేవు. అన్నీ నవరత్నాల్లోనే లబ్ధి చూపించి మీకు ఇంత ఇచ్చాము అన్న గణాంకాలే తప్ప ప్రత్యేక పథకమూ లేదు.. రాయితీలు లేవు.. చివరకు బ్యాంకు రుణాలు అందడం లేదు.

“జయహో బీసీ సదస్సులో బీసీల మొగ్గు ఎటువైపో తేలిపోతుందా..? అవుననే అంటున్నారు అధికార వైసీపీ నేతలు.”

వందకు పైగా కార్పొరేషన్లు ఏర్పాటుచేసినా.. వాటికి విధులూ కానీ.. నిధులు కానీ కేటాయించలేదు. కేవలం అవి ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోగా.. వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు కొలువులుగా మారాయి. ఆయా వర్గాల్లో నిరుద్యోగులకు పైసా విదిల్చని ప్రభుత్వం .. కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పాలకవర్గాలకు మాత్రం ఠంచనుగా జీతాలు చెల్లిస్తోంది.

పైగా దర్పం చెలాయించేందుకు కారు, ఇతర అలవెన్స్ లు కల్పిస్తుండడంతో రాజబోగం అనుభవిస్తున్నారు. కానీ లక్ష్యాన్ని నీరుగార్చుతున్నారు. అయితే ఈ పరిణామ క్రమంలో బీసీ వర్గాల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. ఇది కాస్తాపెరిగి పెద్దదయితే తమకు లాస్ తప్పదని భావించిన జగన్ సర్కారు జయహో బీసీ గర్జనకు పిలుపునిచ్చింది. అయితే బీసీలు అన్న మాట ఒక గుర్తింపు కోసమే అన్న విషయం గుర్తించుకోవాలి.

బీసీల్లో వంద వరకూ కులాలు ఉన్నాయి. కానీ అందులో కూడా ఆధిపత్యం కొన్ని కులాలదే. అవి కూడా వేలు పెట్టి లెక్కించవచ్చు. రాష్ట్రంలో ఒక్క నాయీ బ్రాహ్మణుడు కానీ.. విశ్వబ్రాహ్మణుడు కానీ.. రజకుడు కానీ ఎమ్మెల్యే అయ్యారంటే చెప్పలేని పొజిషన్ మనది. అటువంటప్పుడు ఈ గర్జనలెందుకు? పొలికేకలు
ఎందుకు? అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది.

కానీ రాజకీయ పార్టీలు అన్నాక సమీకరణలు మార్చుకోవడానికి ఏవేవో చేస్తుంటాయి. ఎంతగానో ప్రయత్నిస్తుంటాయి. ఈక్రమంలోనే వైసీపీ సర్కారు బీసీ గర్జనకు పిలుపునిచ్చి ఉండవచ్చు. కానీ గత అనుభవాల దృష్ట్యా ఇది ఏమంత వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు

జయహో బీసీ సదస్సులో బీసీల మొగ్గు ఎటువైపో తేలిపోతుందా..? అవుననే అంటున్నారు అధికార వైసీపీ నేతలు. నిజానికి బీసీలంతా తమవైపే ఉన్నారని వైసీపీ నేతలంటున్నారు. కానీ అదిపూర్తిగా వాస్తవంకాదు. బీసీల్లో మెజారిటీ సెక్షన్లు మాత్రమే అధికార పార్టీతో ఉన్నాయి. ఇంకా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న బీసీ సామాజికవర్గాలున్నాయి.

వాటిని కూడా తమవైపు లాక్కోవాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఇందులో భాగంగానే జయహో బీసీ సదస్సు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో తాను అధికారంలోకి వస్తే బీసీలకు ఏమి చేయబోతున్నారనే విషయంలో జగన్ కొన్ని హామీలిచ్చారు. దాంతో జగన్ మాటలను నమ్మిన బీసీలు తర్వాత జరిగిన ఎన్నికల్లో మద్దతిచ్చారు.

దానికి తగ్గట్లే బీసీలకు అన్నింటిలోను జగన్ పెద్దపీట‌ వేస్తున్నారు. మంత్రి పదవులు, ఎంఎల్సీ, ఎంఎల్ఏ, ఎంపీలు పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి
అన్నింటిలోనూ న్యాయబద్ధంగా దక్కాల్సిన దానికన్నా జగన్ ఎక్కువే ఇస్తున్నారు. దీంతో బీసీలంతా తమవైపే ఉన్నారని, ఉంటారని వైసీపీ ధీమా
వ్యక్తంచేస్తోంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు జయహో బీసీ సదస్సు నిర్వహిస్తోంది. పంచాయతీ నుంచి మంత్రి పదవుల వరకు పదవులు పొందిన బీసీ
ప్రతినిధులు సుమారు 82 వేలమందితో సదస్సు నిర్వహిస్తున్నారు. అచ్చంగా బీసీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించటం గతంలో ఎప్పుడూ
జరగలేదేమో.

ఈ సదస్సు సందర్భంగా జగన్ ఇవ్వబోయే హామీలతో ఇతర పార్టీలకు మద్దతిస్తున్న బీసీలను కూడా ఆకర్షించాలన్నది జగన్ టార్గెట్.
ఈ సదస్సు తర్వాత జగన్ ఆలోచన కార్యరూపంలోకి వస్తుందని పార్టీనేతలు నమ్ముతున్నారు. దీంతోనే బీసీల మొగ్గు ఎటువైపు, వచ్చే ఎన్నికల్లో
బీసీల మద్దతు ఏ పార్టీకి అనేది తేలిపోతుందనే అనుకుంటున్నారు. నిజంగానే జగన్ ఆలోచిస్తున్నట్లుగా బీసీలంతా వైసీపీకే మద్దతుగా నిలబడితే
ప్రత్యర్ధి పార్టీలు విడివిడిగా పోటీచేసినా పొత్తులు పెట్టుకున్నా ఎలాంటి లాభం ఉండదనే అనుకుంటున్నారు.

ఎందుకంటే మొత్తం ఓట్లలో బీసీలే 50 శాతంకుపైగా ఉన్నారు కాబట్టి. ఇదిలా ఉంటే, వైసీపీ జయహో బీసీ బహిరంగసభపై విపక్ష నేతలు మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ పాలన సాగించారని.. ఇప్పటికీ అదే పని చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు గత మూడున్నర సంవత్సరాలుగా ఏం చేసిందీ వైసీపీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. బిసిలకు గుర్తింపు తెచ్చి, వారిలో నాయకత్వ లక్షణాలు నేర్పింది ఎన్టీయార్ అని వివరించారు

మరి బీసీల దారెటు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img