పవన్ కల్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన వ్యవహారం ఏపీ రాజకీయవర్గాల్లో పెను సంచలనం అయింది. తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ నేతల విమర్శలు, ప్రతి విమర్శల సంగతి పక్కన పెడితే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ స్పందనేమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి భారతీయ జనతా పార్టీపై పడింది.చంద్రబాబు, పవన్ ల కలయికతో బీజేపీ పాత్ర ఏమిటన్న చర్చ ప్రారంభమైంది. అసలు బీజేపీ ఆలోచన ఏమిటి? ఎటు అడుగులు వేయనుందన్నది ఇప్పుడు తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది.
ఏపీతో పోల్చుకుంటే సీట్లు, ఓట్లు పరంగా తెలంగాణలో బీజేపీ మంచి జోరు మీద ఉంది. ఆ స్థాయిలో ఏపీలో రాజకీయాలు చేయలేకపోవడం ఆ పార్టీకి లోటే. అయినా సరే బీజేపీ కోసం అటు వైసీపీ, ఇటు టీడీపీ తెగ ఆరాటపడుతున్నాయి. బీజేపీ మాత్రం జనసేన స్నేహాన్నే కోరుకుంటోంది. అయితే బలం లేకున్నా బీజేపీకి అంత ప్రాధాన్యం ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉండడమే. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొందేందుకు జగన్ ఎంతటి విధ్వంసానికైనా దిగుతారని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్లపై విపక్ష నేతలు తిరగకుండా జగన్ కట్టడి చేస్తున్నారు.ప్రజలను కలుసుకోనివ్వకుండా నియంత్రిస్తున్నారు.
ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి పోలీస్ జీవోను తెచ్చి మరీ భయపెడుతున్నారు. మున్ముందు తన చర్యలు ఎలా ఉండనున్నాయో గట్టి సంకేతాలే ఇచ్చారు. ఎన్నికల్లో వ్యవస్థల సాయంతో విపక్షాలను ఎంతలా చెడుగుడు ఆడుకోవాలా అంతలా ఆడుకుంటున్నారు. అందుకే బీజేపీ సాయం లేనిదే జగన్ చర్యలను కట్టడి చేయలేమని పవన్, చంద్రబాబులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో బీజేపీ స్టాండ్ అన్నది ఏమిటో తెలియడం లేదు. బీజేపీ మాత్రం జనసేనతో మాత్రమే నడుస్తామని చెబుతోంది.
అదే జరిగితే అది అల్టిమేట్ గా వైసీపీకే వర్కవుట్ అవుతుందని పవన్ అంచనా వేస్తున్నారు. అటు తనకు రాజకీయంగా కూడా దెబ్బ తప్పదని భావిస్తున్నారు. అందుకే బీజేపీకి కొంచెం దూరమై.. టీడీపీకి దగ్గరయ్యారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి టీడీపీ..రెండోది వైసీపీ. టీడీపీ అయితే డైరెక్ట్ పొత్తు పెట్టుకునే చాన్స్ ఉంది. గతంలో కూడా ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. కలిసి పోటీచేశాయి. అధికారాన్ని పంచుకున్నాయి కూడా. ఆ రెండుపార్టీల మధ్య దశాబ్దాల మైత్రి ఉంది.
అటు చంద్రబాబు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ బీజేపీ నేతలే దగ్గరకు చేర్చుకోవడం లేదు. అయితే వైసీపీతో బీజేపీకి డైరెక్ట్ రిలేషన్ లేదు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు విభేదించారు కాబట్టి.. ఆయనకు వైసీపీ ప్రత్యర్థి కాబట్టి.. కాస్తా ఇండైరెక్ట్ సాయమందించారు. దానికి అడ్వాంటేజ్ గా తీసుకొని వైసీపీ పొలిటికల్ గా బాగానే గెయిన్ అయ్యింది. అయితే నష్టపోయింది మాత్రం ఏపీ బీజేపీనే. అటు ఓట్లు పెంచుకోలేకపోయింది. సీట్లు సాధించలేకపోయింది. కానీ డైరెక్ట్ గా బీజేపీతో రిలేషన్ కొనసాగించడానికి ఇష్టపడడం లేదు.
చంద్రబాబు అయితే రిలేషన్ కు సిద్ధంగా ఉన్నారు. కానీ బీజేపీ హైకమాండ్ మనసులో ఏముందన్న దానిపై క్లారిటీ లేదు. తాజాగా పవన్ దూరమయ్యేసరికిబీజేపీ ఒంటరైంది. టీడీపీయా..వైసీపీయా అన్న ఆప్షన్ ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే తనను కోరుకుంటున్న టీడీపీ ఒక వైపు.. తన ద్వారా రాజకీయ సహకారం పొందుతున్న వైసీపీ మరోవైపు ఉన్నాయి. అయితే ఇప్పుడు బీజేపీకి అసలు సిసలు అగ్నిపరీక్ష ఎదురుకానుంది. జనసేన సాయంతో ఓటు షేర్ ప్రయత్నం వర్కవుట్ అయ్యేలా లేదు. అలాగని పాత అనుభవాలను మరిచిపోయి టీడీపీతో కలిసేందుకు ఇష్టపడడం లేదు. అలాగని వైసీపీతో డైరెక్ట్ రిలేషన్ మెయింటెన్ చేయలేని పరిస్థితి బీజేపీది.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ వల్ల ఎవరి మైలేజీ పెరిగిందో, ఎవరి మైలేజీ తగ్గిందో ఇప్పుడే చెప్పలేం కానీ, మధ్యలో బీజేపీకి మాత్రం ఇది మింగుడు పడనివ్యవహారంలా మారింది.మేమింకా కలిసే ఉన్నాం అని బీజేపీ చెప్పుకుంటున్నా.. పవన్ కల్యాణ్ ఇలా చంద్రబాబుని కలవడం కమలదళానికి షాకింగ్ న్యూసే. దీనిపై స్పందించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కుప్పంలో చంద్రబాబుని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నానని, ఆయనకు సంఘీభావం తెలిపేందుకే వచ్చానని పవన్ అన్నారు.
జీవో నెంబర్-1 రద్దుకోసం ప్రతిపక్షాలంతా కలసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీతో కూడా మాట్లాడతానన్నారు. జీవోకి తాము కూడా వ్యతిరేకం అంటున్న బీజేపీ.. కందుకూరు, గుంటూరు ఘటనలకు మాత్రం చంద్రబాబే కారణం అంటోంది. ఆయన వల్లే తొక్కిసలాట, మరణాలు జరిగాయని విమర్శించింది. కానీ పవన్ మాత్రం ఆ దుర్ఘటనలపై మాట్లాడలేదు, చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించారు. ఇక్కడే బీజేపీ, జనసేన మధ్య చిన్న లాజిక్ మిస్ అవుతోంది. అందరం కలిసే పోరాటం చేస్తామంటారు పవన్. చంద్రబాబు లేకుండా రావాలంటోంది బీజేపీ.
బాబుతో వెళ్తే పవన్ సీఎం కాలేరు.. చంద్రబాబుతో వెళ్తే పవన్ కల్యాణ్ సీఎం కాలేరని టీవీ చర్చల్లో సెలవిచ్చారు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి. పోనీ పవన్ కల్యాణ్ బీజేపీతో వస్తే అయినా ఆయన సీఎం కాగలరా అంటే దానికి గ్యారెంటీ ఏముంది, అసలు జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఎవరికుంది..? అయితే పవన్, చంద్రబాబుని కలవడం మాత్రం బీజేపీకి ఇష్టంలేదు. అలాగని వారు అడ్డుకోనూ లేరు. ఆమధ్య పవన్ కల్యాణ్ కి విశాఖలో మోదీ హితబోధ చేశారని అనుకున్నా, దాని ప్రభావం ఇదేనా అనే అనుమానం రాకమానదు. అంటే పవన్ చంద్రబాబుతో కలసి వెళ్లాలనుకుంటే మాత్రం బీజేపీని పూర్తిగా లైట్ తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు, ఇక జ్ఞానోదయం కావాల్సింది బీజేపీకి నేతలకు మాత్రమేనని విశ్లేషకులు సైతం అంటున్నారు. బీజేపీ.. ప్రస్తుతానికి జనసేనతో పొత్తును కొనసాగిస్తున్నా..
టీడీపీతోకలిసి వచ్చే ఎన్నికల్లో అడుగులు వేసే విషయాన్ని ఇంకా తేల్చి చెప్పలేదు. దీంతో బీజేపీని పక్కన పెట్టి.. వీరు ముందుకు సాగుతారా? లేక.. బీజేపీని ఏదో ఒక రకంగా తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తారా? అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇరు పార్టీల మధ్యా సయోధ్య, అవగాహన తదితర అంశాలను పరిశీలించిన అనంతరం బీజేపీ స్టాండ్ ఏమిటన్నది తాము తేలుస్తామని ఆర్ఎస్ఎస్ పవన్ కల్యాణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే మొదట్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తాను అని చెప్పిన పవన్ కల్యాణ్ ఆ తరువాత స్టాండ్ మార్చుకున్నట్లు కనిపించినా ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో వెనక్కు తగ్గి ఓటు చీలనివ్వనన్న స్టాండ్ ను పునరుద్ఘాటించారని చెబుతున్నారు.
అందుకే చంద్రబాబుతో చర్చలలో ఇరు పార్టీల ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని అంటున్నారు. జగన్ పాలనకు చరమగీతం అన్న ఏకైక అజెండాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటి దాకా వేటికవే వేర్వేరుగా ప్రజాక్షేత్రంలో పోరాడుతూ వచ్చినా ఇక ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలన్న నిర్ణయానికి రావడం వెనుక.. జీవో నంబర్ 1 తో పాటుగా బీజేపీ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు. పవన్ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే .. ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా.. కాపు వర్గం నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆయన అందుకునే అవకాశం ఉందంటున్నారు. బీజేపీతోనే ఉండటం మంచిదని పవన్ ను ఇవాళ కాకపోతే రేపైనా తెపలుస్తుందని బీజేపీ వర్గాలు గట్టి ఆశాభావంతో ఉన్నాయి.
మరి బీజేపీ స్టాండ్ ఏమిటన్నది మాత్రం వెయిట్ అండ్ సీ తరహాలో సాగుతోందట.