చైనాలో గత కొన్నేళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతోంది.. ముఖ్యంగా వర్క్ ఫోర్స్ గణనీయంగా పడిపోతోంది.. కోట్లాది మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు.. ఉద్యోగాలలో చేరే వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటోంది. చైనాలో ఉద్యోగుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది..? ఉద్యోగుల విషయంలో చైనా ఏం చేయనుంది..?
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ స్తబ్దుగానే ఉంది. ఎకానమీ చాలా మెల్లగా ముందుకెళ్తోంది. లక్షలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. కొవిడ్ పుట్టినిల్లైన చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మూడేళ్లలో 4.1 కోట్ల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఇందుకు ప్రధాన కారణం కరోనా… మరో కారణమూ ఉంది. వయసైపోయిన వాళ్లు ఎక్కువ మంది ఉండడం. బ్లూమ్ బర్గ్ ప్రకారం.. 2022లో చైనాలో 73 కోట్ల మందిని రిక్రూట్ చేసుకున్నారు. 2019లో ఈ సంఖ్య 77 కోట్లకు పైగానే ఉంది. ఈ లెక్కలు చూస్తుంటేనే అర్థమవుతోంది. ఏటా రిక్రూట్‌మెంట్ తగ్గుతోందని. కోట్లాది మంది రిటైర్ అవుతున్నారు. వాళ్లను రీప్లేస్ చేయడం కష్టమవుతోంది. రిటైర్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలూ ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది.
ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌ను పెంచితే కానీ.. ఈ సమస్యకు పరిష్కారం దొరకదని చెబుతున్నారు కొందరు నిపుణులు. కరోనా సంక్షోభం తరవాత ఎకానమీ డల్ అవ్వడం, యువతకు పెద్దగా ఉద్యోగాలు దొరక్కపోవడం వల్ల ఉన్న వాళ్లు రిటైర్ అవుతున్నారే తప్ప… కొత్త వాళ్లు పనుల్లో చేరడం లేదు. పని చేసే వాళ్ల సంఖ్య తగ్గడం వల్ల మొత్తంగా ప్రొడక్టివిటీ తగ్గిపోతోంది. ఆర్థిక వ్యవస్థనూ దెబ్బ తీస్తోంది. 2012 నుంచి లెక్కలు చూస్తే.. 16-59 ఏళ్ల వయసున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది. గత మూడేళ్లలోనే వీరి సంఖ్య 3కోట్లకు పైగా తగ్గిపోయింది. గతేడాది ఎంప్లాయ్‌మెంట్ కూడా భారీగా తగ్గిపోయింది. ఈ మధ్యే కరోనా ఆంక్షల్ని తగ్గించింది చైనా. ఫలితంగా ఈ ఏడాది ముగిసే నాటికి కొంత మేర ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు.
చైనాలో రిటైర్‌మెంట్ ఏజ్‌ని పురుషులకు 60 ఏళ్లుగా, మహిళలకు 55 ఏళ్లుగా నిర్ణయించారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఇదే రూల్ ఫాలో అవుతున్నారు.అయితే…ఆయుర్దాయం పెరుగుతున్నందున ఈ రిటైర్‌మెంట్ వయసుని పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఈ మార్పు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. మరో నెల రోజుల్లోగా ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేయనుంది.ప్రపంచంలో అత్యధిక జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే…చైనా అని అందరం ఠక్కున సమాధానం చెప్పేస్తాం. ఆ తరవాత భారత్ లోనూ అదే స్థాయిలో జనాభా ఉంది. పాపులేషన్‌కి అంత పాపులారిటీ సంపాదించిన చైనా…ఇప్పుడు ఉద్యోగుల విషయంలో వెనకబడుతోంది. గత ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా గతేడాది జనాభా తగ్గిపోయింది.
చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే…సుమారు 142 కోట్లుగా ఉన్న జనాభాలో 8 లక్షల 50 వేల మేర తగ్గింది. 1961 తరవాత ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి. ఈ కారణంగా… భారత్ ఖాతాలో ఓ రికార్డు చేరనుంది. ఇప్పటి వరకూ జనాభా విషయంలో చైనా ముందంజలో ఉండగా…ఇప్పుడా స్థానాన్ని భారత్ భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయి. ఐక్యరాజ్య సమితి నిపుణులు 2022లోనే ఇండియా జనాభాను అంచనా వేశారు. 141కోట్ల జనాభా ఉన్నట్టు తెలిపారు. అయితే..చైనాను దాటేసి మరీ భారత్ ముందు వరసలో నిలబడుతుందని వాళ్లు ఊహించలేదు. ఇప్పుడు చైనా జనాభా తగ్గడం వల్ల త్వరలోనే భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా రికార్డు సృష్టించే అవకాశముంది..
చైనాలో ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం జనాభానే.. చైనాలో పుట్టుక కంటే మరణాలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల అక్కడ జనసాంద్రత తగ్గిపోతుంది. దాని కోసం చైనా లోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త ఆదేశాలు తీసుకొస్తున్నారు.. మొన్నటి వరకు మీరు పెళ్లి చేసుకోండి, పిల్లలని ఆలస్యంగా కనండి, అది కూడా ఒక్కర్నే కనండి, ఒకరి కన్నా ఎక్కువ మందిని కంటే మీకు రాయితీలు ఉండవు, ఇంకా చట్టపరమైన శిక్షలు కూడా ఉంటాయని బెదిరించేవారు. కుటుంబ విషయాల్లోకి చట్టబద్ధంగా ప్రవేశించి రెండో బిడ్డను కన్న వాళ్ళకు ఉద్యోగాలు తీసేసి జైళ్ళలో పెట్టి బాధ పెట్టారు, అసలు హాస్పటల్లో కనడానికే వీలు లేదని నిషేధాన్ని కూడా ప్రకటించారు. ఆ దెబ్బకి అక్కడ కొత్త జనాభా తగ్గిపోయి వృద్ధులు పెరిగిపోతున్నారు.
చైనా భావి తరాలను నష్టపోతుందని గ్రహించిన తర్వాత… ఇప్పుడు పిల్లలను కనాలని.. కేవలం ఒక్కరినీ కాదు.. ఇద్దర్ని కనండి, ముగ్గురిని కనండి అని సూచిస్తోంది.. అయినప్పటకీ.. ఎవరూ పట్టించుకొనే వాళ్ళు లేరు. ఎందుకంటే కొంతకాలంగా ఎక్కువగా చైనాలో పురుషుల జనాభా పెరుగుతోంది.. దాంతో అమ్మాయిలకు డిమాండ్ పెరిగి అబ్బాయిల డిమాండ్ తగ్గింది. అమ్మాయిలు 30-35 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు.. అందుకు కారణంగా తమని పోషించడానికి మగాళ్ళ దగ్గర డబ్బు ఉండడం లేదని చెబుతున్నారు.. దీంతో.. చైనా తమ చాలా రాష్ట్రాల్లో ప్రోత్సాహకాలను ప్రకటించింది.
తాజాగా చూస్తే హేమమ్ ప్రావిన్స్ లో 2022 నుండి పిల్లల్ని కనమని ప్రోత్సాహిస్తూ ఉంటే కనడానికి మాకు ఉద్యోగాల పరంగా ఖాళీ ఉండడం లేదని చెబుతున్నారు.. దీంతో.. అక్కడ కొత్తగా పెళ్లయిన వాళ్లకి 30 రోజులు పెయిడ్ హాలిడేస్ గా ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ముగ్గురు పిల్లల్ని కంటే, ఆ బిడ్డకు 3వ సంవత్సరం వచ్చే వరకూ 500 యువాన్స్ అంటే మన కరెన్సీ రేట్ల ప్రకారం లక్షన్నర వరకు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఈ పారితోషికాలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి.
అంతేకాదు.. గర్భిణీ స్త్రీలు, పిండంలోని బిడ్డలు సురక్షితంగా ఉండేందుకు కంపెనీ నిర్వాహకులకు సబ్సిడీ ఇస్తున్నారని వరల్డ్ మీడియా పేర్కొంది. నూతన జనాభా, కుటుంబ నియంత్రణ చట్టం ఆమోదించబడినప్పటి నుంచి చైనాలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాలు, ప్రాంతాలు ప్రసవానికి సంబంధించిన నియమాలను సవరించాయి . చైనా అధికారిక వార్తా వెబ్‌సైట్ జిన్హువా ప్రకారం.. బీజింగ్, సిచువాన్, జియాంగ్జితో సహా అనేక ప్రాంతాలు ఈ విషయంలో అనేక సహాయక చర్యలను ప్రకటించాయి. వీటిలో పితృత్వ సెలవు, ప్రసూతి సెలవుల పొడిగింపు, వివాహానికి సెలవు, పితృత్వ సెలవుల పొడిగింపు వంటి నిర్ణయాలుఉన్నాయి.
చైనా జనాభా వరుసగా ఐదో సంవత్సరం కూడా తగ్గింది. 2021 సంవత్సరం చివరి నాటికి చైనా జనాభా 1.4126 బిలియన్లు, ఇది అర మిలియన్ కంటే తక్కువ పెరిగింది. జననాల రేటు వరుసగా ఐదవ సంవత్సరం కూడా జనాభా క్షీణతను నమోదుచేసింది. ఈ గణాంకాలు ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన చైనాకు పొంచి ఉన్న జనాభా పరమైన ముప్పు, అది విసిరే ఆర్థిక ముప్పుగా విశ్లేషిస్తున్నారు నిపుణులు. చైనాలో వృద్ధుల జనాభా క్రమంగాపెరుగుతోంది. అదే సమయంలో యువత సంఖ్య బాగా తగ్గిపోతోంది.. వృద్ధ జనాభా పెరగడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపడమే అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది దేశం యొక్క ఆర్థిక పురోగతిని కూడా నిరోధిస్తుంది.
ఒక దేశం వృద్ధి చెందాలంటే.. పనిచేసే మానవ వనరులు చాలా కీలకం. ఇలాంటి సమయంలోయువత కంటే, వృద్ధుల సంఖ్య పెరగడం అంటే ఆ దేశం ఆర్థికంగా నష్టపోవడం ఖాయం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి పింఛన్లు, ఆరోగ్య సదుపాయాలు వంటి అన్ని అలవెన్సులు తీసుకుంటున్న వృద్ధుల జనాభా పెరుగడం వల్ల ప్రభుత్వంపై భారమే పడుతుంది తప్ప.. ప్రయోజనం శూన్యం అవుతుంది. సరళంగా చెప్పాలంటే, చైనా జనాభా వృద్ధాప్యం అవుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ లేదా దేశ అభివృద్ధికి పని చేయదు.అందుకే యువత పెళ్లి చేసుకోవాలని, ఎక్కువ పిల్లలను కనాలని చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.