రేవంత్ యాత్రకు ధీటుగా బైక్ యాత్ర చేస్తానని ఎందుకు అంటున్నారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది. మితిమీరిన స్వాతంత్రం ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు కాంగ్రెస్ పార్టీ పరువును బజారున పెడుతోంది. ఇప్పటికే తెలంగాణలో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు, మనుగడ కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ పార్టీకి నేతలు తీరే పెద్ద తలనొప్పిగా మారింది. ప్రత్యర్థి పార్టీలను సమర్ధవంతంగా ఎదుర్కోవలసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారిలో వారు విమర్శలు చేసుకోవడం.. ఒకరిని ఒకరు ముందుకు వెళ్లకుండా లాగాలని ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది.
తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కాంగ్రెస్ పార్టీలో లుకలుకలను మళ్లీ బయటపెడుతోంది. ఒకరిని మించి ఒకరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేయడం పార్టీ కార్యకర్తల్లో ఆందోళనకు కారణంగా మారింది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభంలోనే ప్రగతి భవన్ ను బాంబులతో మావోయిస్టులు పేల్చేయాలని పిలుపునివ్వడం రాజకీయంగా రగడగా మారింది.
![](https://inewslive.net/wp-content/uploads/2023/02/reva-684x1024.jpg)
అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ కూడా నిప్పులు చెరిగారు. టిపిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పని కాంగ్రెస్ పార్టీ నేతలలోను అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక ఏకంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి నక్సలైట్లు ప్రగతి భవన్ ను పేల్చేయాలని చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ రెడ్డి అలా అనకుండా ఉండాల్సిందని పేర్కొన్న ఆయన ప్రగతి భవన్ ను ప్రజా దర్బార్ గా వినియోగించాలనో, ఆసుపత్రిగా వాడుకోవాలనో రేవంత్ అంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు అని అర్థం వచ్చేలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డిని తీవ్రంగా బాహాటంగా వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటే, వారి విమర్శలకు మరింత బలం చేకూర్చేలా మారాయి.
ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాల్సిన చోట.. ఏదేదో మాట్లాడటం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నేతలు ఎవరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించటం లేదన్న చర్చ జరుగుతుంది. ఇక ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదు.
సీనియర్ నాయకులు ఎవరూ సమన్వయంతో పనిచేయకపోవడం, పార్టీ కోసం ఒక మాటగా నిలబడకపోవడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో పార్టీ పట్ల నైరాశ్యాన్ని పెంచుతుంది. కాంగ్రెస్ నాయకులు ప్రత్యర్థి పార్టీల మీద దాడి చేయకుండా సొంత పార్టీ నేతల మాటలను ఎవరికి వారు కౌంటర్ చేస్తూ ఉండడం పార్టీ పరువును బజారుకీడుస్తుంది.
ఇప్పటికే రేవంత్ రెడ్డి పాదయాత్రలో సీనియర్లు కనపడకపోవడంతో పార్టీ నేతల తీరుపై బయట చర్చ జరుగుతున్న వేళ, ఇక సొంత పార్టీ నేతల వ్యాఖ్యల పైన అభిప్రాయాలు చెబుతూ కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న రచ్చ హస్తం పార్టీకి భస్మాసుర హస్తంగా మారుతోందన్న టాక్ వెల్లువెత్తుతోంది. రేవంత్ చేపట్టిన పాదయాత్రపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున.. ఈ నెల 13 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొనున్నట్టు స్పష్టం చేశారు.
పాదయాత్ర చేయటం వల్ల అన్ని గ్రామాలను టచ్ చేయలేమన్న కోమటిరెడ్డి.. త్వరలోనే బైక్ యాత్ర చేస్తానని వెల్లడించారు. నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి.. నాలుగు జిల్లాలను కలుపుకుని బైక్ యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మేడారం వేదికగా రేవంత్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, స్థానిక నేతలు తరలివచ్చినప్పటికీ… సీనియర్ నేతలు మాత్రం రాలేదు. ఒక్కరిద్దరూ కనిపించినప్పటికీ… మిగతా నేతలు రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. కనీసం ప్రారంభం రోజైనా రాకపోవటం ఏంటన్న చర్చ జోరుగానే జరుగుతోంది.
నిజానికి పాదయాత్ర విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ లోవిభిన్న వాదనలు వినిపించాయి భద్రాచలం నుంచి ప్రారంభం కావాల్సిన రేవంత్ రెడ్డి యాత్ర… ములుగుకి షిఫ్ట్ అవటం వెనక కూడా పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్నుంచి రేవంత్ పాదయాత్రకు సీనియర్ల మద్దతు ఉంటుందా..? లేదా..? అన్న చర్చ కూడా జరిగింది. అయితే ఠాక్రే నియామకం తర్వాత… సీన్ మారినట్లు కనిపించింది. కానీ అనూహ్యంగా పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి సీనియర్లు రాకపోవటంతో… మరోసారి విబేధాల అంశంపై తెరపైకి వచ్చినట్లు అయింది.
అయితే ఇదిలా ఉండగానే.. సొంత పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బైక్ యాత్ర ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. రేవంత్ యాత్రలో పాల్గొంటానని చెప్పినప్పటికీ, మరోవైపు బైక్ యాత్ర చేస్తానని చెప్పటం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పూర్తిగా చతికిల పడి వెంటిలేటర్‌పై ఉన్న పార్టీకి ఊపిరి పోసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు సీనియర్లెవరూ కలిసి రాకపోగా, అప్పుడే ఆయన కాళ్ల మధ్య కట్టెపెట్టే ప్రయత్నం మొదలు పెట్టారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పు తీసుకురావాలని, నేతలందరూ సమన్వయంతో పనిచేసేలా చూడాలని అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా నాయకులతో ఐక్యంగా పని చేయించడం ఎవరివల్లా కావడం లేదు. రేవంత్ వర్గానికే కొమ్ము కాస్తున్నారని మాణిక్యం ఠాగూర్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఆయనను తప్పించిన సీనియర్లు.. కొత్త ఇన్‌చార్జి వచ్చాక కూడా తమ తీరు మార్చుకోవడం లేదు. మేమింతే.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఠాక్రే పార్టీని గాడిలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా సీనియర్లు సహకరించడం లేదు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి పనిచేయాలని ఇన్‌చార్జి ఠాక్రే సీనియర్లకు సూచించినా.. బతిమాలి బామాలి చెప్పినా ఫలితం లేకుండా పోతుంది. కలిసి పనిచేసేవారమైతే తాము కాంగ్రెస్ లీడర్లం ఎందుకవుతాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అసలు టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. రేవంత్ రెడ్డి పాదయాత్ర సాక్షిగా మరోమారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. యాత్రకు సీనియర్ల నుంచి సహకారం ఉన్నట్టుగా కనిపించడం లేదు.
ఇప్పటివరకు మల్లు రవి మినహా వేరే సీనియర్ నాయకులు ఎవరు రేవంత్ పాదయాత్రలో పాల్గొనలేదు. రేవంత్ పాదయాత్ర ముగిసేలోపు సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా జాయిన్ అవుతారని పార్టీవర్గాలు చెబుతున్నా రేవంత్ పాదయాత్రలో పాల్గొనడానికి ఎవరూ సుముఖంగా లేరని సమాచారం. పాదయాత్రలో పాల్గొనేందుకు కొంతమంది సీనియర్లు సాకులు చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాలను సాకుగా చూపి ఎంపీలు దూరంగా ఉండగా, ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను సాకుగా చూపుతున్నారట.
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిగానీ, సీఎల్పీ నేత భట్టిగానీ ఇప్పటి వరకు పాదయాత్రలో భాగం కాలేదు. ఇక రేవంత్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొనేది లేదని తాను స్వయంగా పాదయాత్ర చేస్తానంటూ భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. జగ్గారెడ్డి కూడా రేవంత్‌రెడ్డి సంగారెడ్డిలో పాదయాత్ర చేసిన తాను పాల్గొననని స్పష్టం చేశారు. మరోవైపు సీనియర్లకు రేవంత్‌రెడ్డికి మధ్య సమన్వయం కుదరచడానికి పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావడం లేదు. సీనియర్లు మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేమని చెబుతున్నారు. మొత్తంగా రేవంత్‌రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు ఉన్నా ముఖ్య నాయకులు కలిసిరాకపోవడం లోటుగా అనిపిస్తోంది. రేవంత్ పాదయాత్ర చూస్తున్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో అంతే, ఎవరు మారినా.. ఏమి మారినా.. వాళ్లు మారరు అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు.
తాజా పరిస్థితులపై కాంగ్రెస్ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి..