Homeఅంతర్జాతీయంహిడెన్ బర్గ్ నివేదికతో..ఆదానీ మోసాలు..

హిడెన్ బర్గ్ నివేదికతో..ఆదానీ మోసాలు..

ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఓ కొత్త పదం..సందడి చేస్తోంది. హిండెన్ బర్గ్ నివేదికతో..ఆదానీ మోసాలు..బట్టబయలయ్యాయి. అయితే ఈ మోసాల వెనుక మోడీ హస్తం ఉందని విపక్షాలు గొంతెత్తి మరీ నినదిస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రం..ఈ అంశంపై మౌనాన్ని ఆశ్రయిస్తోంది. ఈ తరుణంలో ఆదానీ, మోడీ దోస్తీపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇదే..మోదానీగా వినిపిస్తుండడం చర్చనీయాంశమవుతోంది.

మోదానీ..ఆదానీ, మోదీ కలిపితే, మోదానీ..అన్నది రాజకీయ వర్గాల వివరణ..అయితే ఈ పదం..వెనుక పెద్ద కథే ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం
వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అసలేమిటీ పదం..కొత్తగా కనిపెట్టిన ఈ పదం వెనుక ఏముందన్నదే సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే దీన్ని అర్థం చేసుకోవాలంటే మాత్రం..దేశ గత, వర్తమాన, భవిష్యత్ పరిస్థితులను అవగాహన చేసుకోవాలని సైతం నిపుణులు సూచించడం గమనార్హం.

భారతదేశ రాజకీయ నిఘంటువులోకి ఒక కొత్త పదం ప్రవేశించింది. మోదానీ..రాహుల్ గాంధీ తాజా ట్వీట్ ఈ మాటను ఉపయోగించుకుంది. నిజానికి ఆ కొత్త పదం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల ప్రచారోద్యమం‘హమ్ అదానీ కే హై కౌన్’లోనూ, అదానీ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌లోనూ బాగా వాడుకలోకి వచ్చింది. హిండెన్‌బర్గ్ నివేదిక బహిర్గతమైన తరువాత సామాజిక మాధ్యమాలలో వీడియో పోస్టులు, ఆర్టికల్స్ ద్వారా మోదానీ పదం..సర్వవ్యాపితమైంది.

ఇదిలా ఉంటే, మోదానీ ఒక నినాదం, ఒక తెలివైన శబ్ద చిత్రం, ఒక రాజకీయ ఆయుధం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రతిపక్షాల వైయక్తిక, ప్రభావరహిత దాడిని, కార్పొరేట్ కుబేరులతో ఆయన కుమ్మక్కును చీల్చి చెండాడుతున్న ఒక పదునైన విమర్శగా మార్చివేసిన నినాదమది. మోదీ, అదానీ నామధేయాలను ఒకే పదంగా జత పరచడమనేది ప్రతిభావవంతమైన వాక్చాతుర్యమనడంలో సందేహం లేదు. మహా శక్తిమంతుడైన రాజకీయవేత్త, అపరకుబేరుడు
అయిన వ్యాపారవేత్త మధ్య సాన్నిహిత్యాన్ని చాలా చక్కగా నిరూపించిన మాట అది.

ఆ ఉక్తి వైచిత్రి ఆ ఇరువురికి సైతం ఆహ్లాదాన్నిస్తుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఇటువంటి ఆరోపణ మన రాజకీయ సంస్కృతికి కొత్త విషయమేమీ కాదు. గతంలో ప్రభుత్వాలపై సూట్ –బూట్‌కి సర్కార్, టాటా బిర్లా కి సర్కార్ అనే ఆరోపణలు బలంగా వినపడేవి. ప్రస్తుత సందర్భంలో మోదానీ అనే నినాదం వర్తమాన రాజకీయ సంస్కృతికి ఒక పెనుఘాతమే. మోదానీ కేవలం ఒక నిందా వాచకం కాదు. అదొక భావన. దేనినైతే విమర్శిస్తుందో దానిని వివరించే, విశ్లేషించే శక్తిమంతమైన భావన అది.

భారతదేశ రాజకీయార్థిక వ్యవస్థలో తాజా దశకు దర్పణమది. ఆర్థిక శక్తులు, రాజకీయ అధినేతల మధ్య విలక్షణ ప్రగాఢ సంబంధాలు ప్రస్తుత ప్రభుత్వ స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. మోదీ, అదానీల అనంతరం కూడా ఆ ఆర్థిక, రాజకీయ సంబంధాలు కొనసాగే అవకాశం ఎంతైనా ఉంది. ఈ కొత్త భావన సుదీర్ఘకాలం మనుగడలో ఉండగలదని అంచనాలు వినిపిస్తున్నాయి. వ్యాపార, రాజకీయ రంగాల మధ్య సంబంధాల గురించి కొత్తగా చెప్పుకునేదేముంది? భారత ప్రజాస్వామ్యం ఆరంభం నుంచీ ఆ రెండు శక్తిమంతమైన, ప్రభావదాయక రంగాల మధ్య సంబంధాలు పెనవేసుకుని వున్నాయి.

ఆ మాటకొస్తే అంతకు ముందు స్వాతంత్ర్యోద్యమ కాలంలో కూడా ఆ సంబంధాలను మనం స్పష్టంగా చూడవచ్చు. మన ప్రజాస్వామ్య రాజకీయాల తొలి దశాబ్దంలోనే అనేక రాజకీయ అవినీతి బాగోతాలు బహిర్గతమయ్యాయి. రాజకీయవేత్తలు, వ్యాపార దిగ్గజాల మధ్య అపవిత్ర సంబంధాలకు అవి అద్దం పట్టాయి. ప్రతాప్ సింగ్ కైరాన్ పతనం, నగర్వాలా, బోఫోర్స్, 2జి, రాఫెల్ కుంభకోణాలు దేశ రాజకీయాలను కుదిపివేశాయి. గత ఏడు దశాబ్దాల్లో వ్యాపార, రాజకీయ వర్గాల మధ్య సంబంధాలు ఎలా మారుతూ వచ్చాయో ఇటీవల వెలువడిన ‘బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా’అనే గ్రంథం వెల్లడించింది.

1990 వరకు తమ వ్యాపార ప్రయోజనాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే రాజకీయ నిర్ణయాల్లో ఎంపిక చేసుకున్న వాటిని వాణిజ్యవేత్తలు త్రోసిపుచ్చేవారు. ఈ కాలాన్ని ‘సెలెక్టివ్ వీటో’దశగా ఆ సంపాదకులు పరిగణించారు. ఆర్థిక సంస్కరణల ఆరంభంతో రెండో దశ ప్రారంభమయిందని వారు వివరించారు. ఈ దశలో దేశ విధానాల రూపకల్పనకు ‘సాధారణ ఎజెండా’ను నిర్దేశించే స్థాయికి వ్యాపార వర్గాల ప్రభావం విస్తృతమయిందని పరిశీలకులు సైతం పేర్కొన్నారు.

  • దేశ రాజకీయాల్లో..మోదానీ..అనే పదం..ప్రకంపనలు

2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపార, రాజకీయ వర్గాల మధ్య సంబంధాలు మరింత ప్రగాఢమయ్యాయన్న అభిప్రాయంతో ఆ పుస్తకంలోని వ్యాసకర్తలు అందరూ ఏకీభవించారు. ప్రభుత్వ విధానాలు, పార్టీ రాజకీయాలపై వ్యాపార వర్గాలు ‘పాక్షిక ఆధిపత్యం’చెలాయిస్తున్న దశగా ఈ సరికొత్త దశను వారు అభివర్ణించారు. ఈ తాజా దశను అభివర్ణించేందుకు మోదానీ అనే పదం సరిగ్గా సరిపోతుంది. ప్రప్రథమంగా ఇది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మధ్య బహిరంగ, ప్రత్యక్ష సంబంధానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది, సామ్యవాద రాజ్య వ్యవస్థకు, ద్వంద్వ నీతికి పూర్తిగా భిన్నమైనది.

అప్పట్లో వ్యాపారవేత్తలతో తమ సంబంధాలను రాజకీయవేత్తలు రహస్యంగా ఉంచేవారు. ఇప్పుడు వ్యాపార ప్రయోజనాలు ఆర్థిక విధానాలనే కాదు, ఆరోగ్య, వ్యవసాయ విధానాలను కూడా బహిరంగంగా ప్రభావితం చేస్తున్నాయి. అదానీ విమానంలో నరేంద్ర మోదీ ప్రయాణించడం, ప్రధానమంత్రి విమానంలో గౌతమ్ అదానీ ఉండడమనేది మన రాజకీయ సంస్కృతిలో చోటుచేసుకున్న పెను మార్పును స్పష్టంగా సూచిస్తున్నాయి. మార్కెట్ అనుకూల విధానాల నుంచి ఎంపిక చేసుకున్న వ్యాపారవేత్తల అనుకూల రాజకీయాలకు జరిగిన మార్పుకు మోదానీ నమూనా ప్రాతినిధ్యం వహిస్తుంది.

మీరు దీన్ని ఆశ్రిత లేదా కొద్ది మంది వ్యాపార దిగ్గజాల పెట్టుబడిదారీ విధానంగా పిలవవచ్చు. ఇది స్వేచ్ఛా విపణి పోటీ స్ఫూర్తికి వ్యతిరేకమైనది. గత ఏడాది అదానీ బాగోతం బహిర్గతం కాక ముందు ‘ది న్యూ ఇండియా: ఎ పొలిటికల్ –ఎకానామిక్ డయాగ్నోసిస్’అనే వ్యాసంలో మోదీ ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న మార్పులను పరిగణనలోకి తీసుకుని మన రాజకీయార్థిక వ్యవస్థపై తన సరికొత్త అవగాహన వెల్లడైంది.

అంతర్జాతీయ విపణిలో సర్వ సమగ్రంగా పోటీపడగల నిజమైన గ్లోబల్ ఛాంపియన్ ఒక్కరూ ఈ దశలో ప్రభవించలేదనేది గమనార్హం. ఈ కొద్ది మంది పెట్టుబడిదారుల్లో అనేక మంది కార్యకలాపాలు చాల వరకు వ్యాపారేతర సరుకుల రంగాలకే పరిమితమైనవి ఆత్మ నిర్బర్ భారత్ పేరిట. రాజకీయ వర్గాల అండదండలు బాహ్య శక్తుల నుంచి నుంచి పోటీ లేకుండా వారికి రక్షణ కల్పిస్తున్నాయి.

దేశీయ వ్యాపార వర్గాల నుంచి కూడా వారికి ఎదురయ్యే పోటీని సైతం నిర్దాక్షిణ్యంగా నిర్మూలిస్తున్నారు. తమకు ఇష్టులైన వ్యాపారవేత్తలకు ఎంపిక చేసిన అంశాల్లో అనుకూల నిర్ణయాలు తీసుకునే పాత కాలం పద్ధతికి ఇది పూర్తిగా భిన్నమైనది. అసమానతలలో కొత్త తరహా పెరుగుదల మోదానీ మూడో లక్షణం. సమానత్వమనేది పెట్టుబడిదారీ విధాన లక్ష్యం కానేకాదు.

జెండర్, కులం, వర్గం మొదలైన అంశాలలో సమానత్వాన్ని పాటిస్తున్నామని మనం చెప్పుకోగలమా? మన సమాజంలో అసమానతలు ఎంతగా పెచ్చరిల్లి పోతున్నాయో ఇటీవల ఆక్స్‌ఫామ్ నివేదిక, ప్రపంచ అసమానతల నివేదిక స్పష్టంగా వెల్లడించాయి. మోదానీ నమూనా ఈ అసమానత్వాన్ని ఒక కొత్త తీరులో వ్యవస్థీకృతం చేసింది. పర్యావరణ పరిరక్షణ వ్యతిరేకతా వాదానికి రాజకీయ మద్దతునివ్వడం, అటువంటి ధోరణులను ప్రోత్సహించడం మోదానీ నమూనా నాలుగో లక్షణం. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా గత నాలుగు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు నిర్మించిన భద్రతలు అన్నిటినీ మోదీ సర్కార్ ఒక పద్ధతి ప్రకారం నిరర్థకం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ‘పర్యావరణ పరమైన నిరక్షరాస్యతా ప్రక్రియ’లను విరివిగా అమలుపరుస్తోందని ప్రముఖ పర్యావరణవేత్త
అశీష్ కొఠారీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విధానాలేవీ భారత రాజ్యవ్యవస్థను బలహీనపరచకపోవడం విశేషమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

దేశ రాజకీయాల్లో..మోదానీ..అనే పదం..ప్రకంపనలు సృష్టించకమానదన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ పదం రాజకీయాల్లో రాజకీయ, వ్యాపార వర్గాల మధ్య సంబంధాలను తేటతెల్లం చేయనుండడం గమనార్హం.

Must Read

spot_img