బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ను రెండో ప్రపంచ యుద్ద హీరోగా కొనియాడుతుంటారు.. అడాల్ఫ్ హిట్లర్ లాంటి నియంతలను ఓడించిన నాయకుడిగా చర్చిల్ కు బ్రిటన్‌లో గుర్తింపు ఉంది.. కానీ… చర్చిల్ పేరిట కొన్ని చీకటి అధ్యాయనాలు ఉన్నాయి..
- బెంగాల్ లో 1943లో లక్షలాది మంది ఆకలి చావులకు విన్ స్టన్ చర్చిలే కారణమా..?
- ఈ కరువులో 30 లక్షల మందికి పైగా ప్రజలు ఆకలితో చనిపోయినట్లు కొన్ని అంచనాలు చెబుతున్నాయి.. వాటిలో నిజం ఉందా..?
- చర్చిల్ విధానాల వల్లే బెంగాల్ లో తీవ్ర ఆహార సంక్షోభం చుట్టుముట్టిందా..?
మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ వర్ధంతిని పురస్కరించుకొని ఏటా జనవరి 24న బ్రిటన్ ఆయనకు నివాళులు అర్పిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ హీరోగా ఆయన్ను కొనియాడుతుంటారు. అడాల్ఫ్ హిట్లర్ లాంటి నియంతలను ఓడించిన నాయకుడిగా చర్చిల్ కు బ్రిటన్‌లో గుర్తింపు ఉంది.
బ్రిటన్‌లో చర్చిల్ ను శక్తిమంతమైన నాయకుడిగా చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, వలస పాలన చరిత్రలో ఆయన పేరిట కొన్ని చీకటి అధ్యాయాలు ఉన్నాయి. భారత్ లో వలస పాలన గురించి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. విన్ స్టన్ చర్చిల్ బ్రిటన్ లో హీరో కావచ్చు కానీ, భారత్‌లో ఆయన్ను విలన్‌గా చూస్తుంటారు.
ముఖ్యంగా బెంగాల్‌లో 1943లో లక్షలాది మంది ఆకలి చావులకు ఆయనే కారణమని భారత్ లోని చరిత్రకారులు భావిస్తారు. ఈ కరవులో 30 లక్షల మందికిపైగా ప్రజలు ఆకలితో చనిపోయినట్లు కొన్ని అంచనాలు చెబుతున్నాయి.
చర్చిల్ విధానాల వల్లే మరణాలు ఇంతలా పెరిగాయని, లేదంటే, వీటి సంఖ్య తక్కువగా ఉండేదని చాలా మంది చరిత్రకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ విషయంలో చరిత్రకారులతో పాటు కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ కూడా చాలాసార్లు విన్‌స్టన్ చర్చిల్ విధానాలను తప్పుపట్టారు.
బ్రిటన్‌లో ఒకసారి శశిథరూర్ మాట్లాడుతూ.. ‘‘చర్చిల్ గురించి మనం లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అతడి చేతులు కూడా హిట్లర్ చేతుల్లానే రక్తంతో తడిచాయి. ఆయన విధానాల వల్ల బెంగాల్‌లో తీవ్రమైన ఆహార సంక్షోభం చుట్టుముట్టింది. ఫలితంగా 1943-44లో దాదాపు 43 లక్షల మంది మరణించారు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘అయితే, విన్‌స్టన్ చర్చిల్‌ను ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకు దూతగా బ్రిటన్ చెబుతోంది. కానీ, నా దృష్టిలో ఆయన 20వ శతాబ్దపు అత్యంత వినాశకర పాలకుల్లో ఒకరు’’ అని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
బెంగాల్‌లో ఆనాటి కరవు అనంతర పరిణామాలపై హార్వర్డ్ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ సుగతా బోస్ అధ్యయనం చేపట్టారు. ‘‘బెంగాల్‌లో ఆ విధ్వంసకర కరవును ‘ఊచకోత’గా చెప్పుకోవాలి. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం, విన్‌స్టన్ చర్చిల్ బాధ్యులు’’అని అభిప్రాయపడ్డారు సుగతా బోస్.. ‘‘వలసవాద పాలనతో బ్రిటిష్ దోపిడీ వల్లే ఆ కరవు చుట్టుముట్టింది. అయితే, ఇక్కడ చర్చిల్ బాధ్యులని చెప్పడానికి రెండు కారణాలున్నాయి.
మొదటిది ఆయన అప్పట్లో బ్రిటన్ ప్రధాని. రెండోది ఆయన చుట్టుపక్కల ఉండే కన్జర్వేటివ్ సలహాదారులు. నిజానికి చర్చిల్ కూడా ఒక జాత్యహంకారి.
భారతీయులను ఆయన చాలా తక్కువగా భావించేవారు. అందుకే బెంగాల్‌లో అంత మంది చనిపోతున్నా పట్టించుకోలేదు’’అని బోస్ వ్యాఖ్యానించారు.
చర్చిల్‌కు పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండేదని ప్రొఫెసర్ సుగతా బోస్ చెప్పారు.
‘‘బెంగాల్‌లో బ్రిటిష్ వలస పాలన విధానాలతో ఏం జరుగుతోందో ఆయనకు తెలుసు. ఆయనకు అక్కడి నుంచి నివేదికలు ఎప్పటికప్పుడు అందుతూ ఉండేవి. వీటిలో బెంగాల్‌లో పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించేవారు. అయినప్పటికీ ఆయన చూసీచూడనట్లు వ్యవహరించేవారు. అందుకే ఆయన జాత్యహంకారని భారత్‌లో భావిస్తుంటారు’’అని బోస్ వివరించారు.
- విన్స్టన్ చర్చిల్ అభిప్రాయాలు..
‘‘ఫస్ట్ లేడీ, ద లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ క్లెమెంటైన్ చర్చిల్’’ పేరుతో సోనియా పన్రేల్ ఒక పుస్తకం రాశారు. చర్చిల్ జీవిత చరిత్రల్లో రచయితలు ఆయన్ను హీరోతో పాటు విలన్ గా కూడా చెప్పేవారని ఆమె వివరించారు. ఒకవైపు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. మరోవైపు దేశంలో అత్యయిక పరిస్థితిని చక్కబెట్టాల్సి వచ్చింది. ఫలితంగా ఆయనపై బాధ్యతలు ఎక్కువయ్యాయి.
దీంతో బెంగాల్ వనరులను తమ దేశానికి ప్రయోజనం చేకూర్చి… పెట్టేందుకు ఆయన ఉపయోగించారు. ఫలితంగా ఇక్కడ కరవు మరింత తీవ్రమైంది’’అని సోనియా తెలిపారు.. అయితే, బెంగాల్‌లో కరవుపై చర్చిల్ కావాలని నిర్లక్ష్యం ప్రదర్శించలేదని బ్రిటన్‌లోని ఎక్సెటెర్ యూనివర్సిటీకి చెందిన చరిత్రకారుడు రిచర్డ్ టోయ్ వివరించారు.
‘‘ఆయన భారతీయులను ఊచకోత కోయాలని భావించలేదు. ఆయన బాధ్యతలు ఆయనకు ఉండేవి’’అని రిచర్డ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..
- రెండో ప్రపంచ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ఆ కరవుకు కారణమని చరిత్రకారిణి యాస్మిన్ ఖాన్ వివరించారు..
‘‘కానీ, ఆహార ధాన్యాల కొరత మాత్రం విధానాల వల్ల వచ్చినదే. దక్షిణ ఆసియా వాసుల కంటే తెల్లజాతీయులకు అక్కడ ప్రాధాన్యం ఇచ్చారు. ఇది పూర్తిగా వివక్షే’’ అని ఆమె తెలిపారు. అప్పట్లో గ్రామాలకు ఆహార ధాన్యాలు రాకపోవడంతో, చాలా మంది పట్టణాలకు తరలివెళ్లారు. అక్కడే ఆకలితో వారు మరణించారు. కలకత్తా వీధుల్లో రోజూ వేల మంది మృతదేహాలను తొలగించాల్సి వచ్చేదని చాలామంది రచయితలు, చరిత్రకారులు వెల్లడించారు.
‘‘అక్టోబరు మధ్య నాటికి రోజుకు దాదాపు 2,000 మంది మరణించేవారు. వారి మృతదేహాలను రాబందులు, కాకులు పీక్కుతినేవి’’అని ‘‘ఫర్‌గాటెన్ ఆర్మీస్: ద ఫాల్ ఆఫ్ బ్రిటిష్ ఆసియా, 1941-1945’’ పుస్తకంలో క్రిస్టోఫర్ బెయిలీ, టిమ్ హార్పర్ వివరించారు.అయితే, ఈ విషయాలన్నీ చర్చిల్ వరకు వెళ్లేవి. కానీ, ఆయనపై ఇవి ఎలాంటి ప్రభావాన్నీ చూపించేవి కాదు.
‘‘హంగరీ బెంగాల్’’పేరుతో జర్నలిస్ట్ చిత్తప్రసాద్ భట్టాచార్య ఒక మ్యాగజైన్ నడిపించేవారు. 1943 బెంగాల్ కరవుపై పేదరికం కళ్లకు కట్టేలా ఆయన పెయింటింగ్, చిత్రాలను ప్రచురించేవారు. పరిస్థితి ఎంత తీవ్రంగా తన కథనాల్లో ఆయన వెల్లడించారు..ఆ మ్యాగజైన్ ఐదు వేల కాపీలను బ్రిటిష్ ప్రభుత్వం ధ్వంసం చేసింది. అంతేకాదు కరవుపై వార్తలు రాయకుండా బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షలు విధించేది.. అలాంటి పరిస్థితుల్లో చిత్తప్రసాద్ చాలా ధైర్యంతో వార్తలు రాసేవారు.
కొందరు బ్రిటిష్ జర్నలిస్టులు కూడా వీటిపై వార్తలు ప్రచురించేవారు.. మార్చి 1943 నుంచి అక్టోబరు 1943 వరకు కరవుపై వార్తలు ప్రచురించకుండా భారత్ లోని బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే, ఆ ఆంక్షలను ఎదురించి స్టేట్స్‌మ్యాన్ ఎడిటర్ ఇయాన్ స్టీఫెన్స్ వార్తలు ప్రచురించేవారు. దీనికి ఆరు నెలల తర్వాత బెంగాల్‌ను విధ్వంసకర కరవు పీడిస్తోందని బ్రిటిష్ పార్లమెంటు వేదికగా అక్కడి ప్రభుత్వం అంగీకరించింది..
- ఆగస్టు 1943లోనే ఇక్కడి పరిస్థితి గురించి చర్చిల్ కు తెలుసు. అయితే, బెంగాల్‌కు సహాయక సామగ్రి పంపేందుకు చర్చిల్ నిరాకరించారు..
అప్పటి వైస్రాయ్ వావెల్.. బెంగాల్‌లో కరవుపై చర్చిల్‌కు తరచూ సమాచారం ఇచ్చేవారు. దీనిపై తన డైరీలోని వావెల్ రాసుకొచ్చారు. ‘‘బ్రిటిష్ వలస పాలనలో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసిన విపత్తుల్లో బెంగాల్ కరవు కూడా ఒకటి. దీని వల్ల భారతీయులు, విదేశీయుల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది..
కరవు ప్రభావిత జిల్లాలకు మరిన్ని ఆహార ధాన్యాలను పంపించాలని వైస్రాయ్ వావెల్ డిమాండ్ చేసినప్పుడు, చర్చిల్ కావాలనే ఆ ఆహార ధాన్యాలను రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడుతున్న బ్రిటిష్ సైనికుల కోసం పంపించారు.
భారత్‌లో పండిన కొన్ని ఆహార ధాన్యాలను శ్రీలంకకు పంపించేవారు. ఆస్ట్రేలియా నుంచి నౌకల్లో వస్తున్న ధాన్యాలను భారత్‌కు కాకుండా పశ్చిమాసియాకు చర్చిల్ తరలించేవారు. మరోవైపు భారత్‌కు అమెరికా, కెనడా సాయం చేస్తామని ముందుకు వచ్చాయి. అయితే, వాటిని కూడా చర్చిల్ తిరస్కరించారు.
ఆహార ధాన్యాల అవసరం చాలా ఉందని వైస్రాయ్ టెలిగ్రామ్ పంపినప్పటికీ చర్చిల్ అసలు పట్టించుకోలేదు.బ్రిటన్‌లో హీరోగా చూసే చర్చిల్ చరిత్రలో ఒక వివాదాస్పద నాయకుడిగా మిగిలిపోతారు. భారత్‌లో ఆయన్ను ఇప్పటికీ లక్షల చావులకు బాధ్యుడిగానే చరిత్రకారులు చూస్తున్నారు.
విన్ స్టన్ చర్చిల్ విధానాల వల్ల బెంగాల్‌లో తీవ్రమైన ఆహార సంక్షోభం చుట్టుముట్టింది. ఫలితంగా 1943-44లో దాదాపు 43 లక్షల మంది మరణించారు.. 20వ శతాబ్దపు అత్యంత వినాశకర పాలకుల్లో ఒకరుగా చర్చిల్ పై విమర్శలు లేకపోలేదు..