జల్లికట్టు .. ఈ పేరు వింటేనే, కొదమ సింహాల్లా పరిగెత్తే ఎద్దులు.. వాటి వెనుక ఉరకలెత్తే యువకులే కళ్లముందు కనిపిస్తారు.. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి జల్లికట్టు ఉంటుందో.. ఉండదో అన్నదే ఆసక్తికరంగా మారింది. మరి ఈ డౌట్ ఎందుకో.. చూద్దామా..
ఎద్దులతో ఏటా ఆడే జల్లికట్టుపై నిషేధం విధించాలంటూ పెటా సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయం కోసం .. జల్లికట్టు నిర్వాహకులే కాదు.. తమిళనాడు రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది..
సంక్రాంతి పండగ వస్తుంటే చాలు.. అందరికి ముందుగా గుర్తుకొచ్చేవి.. సంస్కృతి, సంప్రాదయాలు.. ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాలు, తమిళనాడులో జల్లి కట్టు.. కానీ ఈసారికి జల్లికట్టు నిర్వహణ ఉంటుందా? లేదా? అన్న సస్పెన్స్ నడుస్తోంది. తమిళనాట జల్లికట్టు ఒక సంప్రదాయ క్రీడ. తమనూ తమ సంప్రదాయాన్ని వేరు చేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదంటారు తమిళులు. జల్లికట్టే లేకుంటే ఎద్దుల్లో ఒక జాతి మొత్తం అంతరిస్తుందని చెప్పుకొస్తారు. అంతే కాదు జల్లికట్టు ఎద్దులను నిర్వాహకులు తమ కన్నబిడ్డల్లా చూసుకుంటారని చెబుతోంది తమిళనాడు ప్రభుత్వం. అయితే ఈ వాదనలతో ఏకీభవించరు.. జంతు ప్రేమికులు. జల్లికట్టులో ఎద్దులను అత్యంత దారుణంగా హింసిస్తారని, ఇది నేరమని అంటుంది పెటా.
2014లో జల్లికట్టు, బండ్ల పోటీల్లో ఎద్దులను ఉపయోగించరాదని తీర్పునిచ్చింది సుప్రీం. ఈ తీర్పును తిరిగి అమలు చేయాలని వాదిస్తోంది పెటా. అందులో
భాగంగా ఏడేళ్ల క్రితంనాటి పిటిషన్ కి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. మాములుగా అయితే ఈ సరికే ఇక్కడ జల్లికట్టు పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలై పోతాయి. జనవరి మొదటి వారం నుంచి మార్చి చివరి వరకూ దక్షిణ తమిళనాడులో ఎటు చూసినా జల్లికట్టు సందడే. ఈ సారికి సుప్రీం వాదనలు కొనసాగుతుండటంతో.. ఎక్కడి ఏర్పాట్లు అక్కడే స్థంభించిపోయాయి.
తమిళనాడు ప్రభుత్వం తో పాటు జల్లికట్టు నిర్వహణ కమిటీ కూడా కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ పోటీలు పూర్తి భద్రతా ప్రమాణాలతో జరుగుతాయనీ. ఎద్దులకు, వీరులకు పూర్తి వైద్య పరీక్షలు చేసిన తర్వాతే.. పోటీలు నిర్వహిస్తామనీ అంటారు. అంతే కాదు కోర్టు చేసే సూచనలు సైతం తాము పాటించడానికి సిద్ధమని
అంటున్నారు.
ఇప్పటికే తాము కోర్టు నిబంధనల ప్రకారం.. పోటీలను నిర్వహిస్తున్నామనీ.. మీరింకేదైనా సలహా సూచనలిస్తే వాటిని కూడా అమలు చేస్తామని అంటున్నారు
పోటీలకు సమయం దగ్గర పడుతోంది కాబట్టి.. నిషేధం విధించకుండా అనుమతించాలని తమ వాదనలు వినిపిస్తోంది స్టాలిన్ సర్కార్. ఈ పోటీల నిర్వహణ పై సుప్రీం ధర్మాసనం ఏం తీర్పునిస్తుందన్న ఉత్కంఠ చెలరేగుతోంది. ఇదిలా ఉంటే, తమిళనాట జరిగే జల్లికట్టుకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఏటా జనవరిలో సంక్రాంతి తర్వాత తమిళనాడులో పలుచోట్ల జల్లికట్టు పోటీలు జరుగుతుంటాయి.
తమిళ తంబీలు దీనిని కేవలం ఓ క్రీడగానే కాకుండా సంప్రదాయ వేడుకగా భావిస్తుంటారు. 2016లో జల్లికట్టు నిషేధాజ్ఞలపై మెరీనా బీచ్ ఉద్యమం జరగ్గా..
1960నాటి జంతు హింస- నిరోధక చట్టం సవరించి అత్యవసర చట్టం చేయాల్సి వచ్చింది నాటి పన్నీర్ సెల్వం ప్రభుత్వం. 2017లో సుప్రీంకోర్టు
జల్లికట్టుపై నిషేధం విధించినప్పుడు తమిళనాడు అంతటా భారీ ఉద్యమం జరిగింది. రాజకీయ, సినీ ప్రముఖులు జల్లికట్టు కు మద్దతుగా నిరసనలో
పాల్గొన్నారు. చివరకు ప్రభుత్వం దిగివచ్చింది. ఒక ప్రత్యేక ఆర్డినెన్సు తీసుకువచ్చి సుప్రీం తీర్పును నిలుపుదల చేశారు. 2017 నుంచీ దక్షిణ
తమిళనాడు జిల్లాలైన మధురై, దిండిగల్, పుదుకోట్టై, శివగంగై, తిరుచ్చి లో జల్లికట్టు పోటీలు యధేచ్చగా సాగుతున్నాయి. అయితే కోవిడ్ ప్రభావం
వల్ల జల్లికట్టుకు అనుమతిపై తమిళనాడు సర్కారు ఊగిసలాడినా, చివరకు పళని సర్కార్ అనుమతి ఇచ్చింది.
జల్లికట్టుకు కరోనా వేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయని టాక్ వెల్లువెత్తింది. తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికల వేళ ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చర్చలు సాగాయి.
జల్లికట్టు విషయంలో ప్రతి ఏటా కోర్టులు ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిందే...
ఈ రాద్ధాంతం లేకుండా తాజాగా జల్లికట్టుని అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఆసక్తికర విచారణ జరిగింది. జల్లికట్టుని వినోదంగా చూడకూడదని, అది తమిళనాడు సంస్కృతి, సంప్రదాయంలో భాగమంటూ తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్సి బల్ వాదనలు వినిపించారు. జల్లికట్టు వల్ల స్థానిక ఎద్దుల జాతి పరిరక్షణ సాధ్యమవుతుందని కూడా ఆయన అన్నారు.
దీనిపై సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. వినోదంకోసం ఆడే క్రీడతో ఎద్దుల జాతి పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందని సూటిగా ప్రశ్నించింది. మానవుల వినోదం కోసం జంతువులను హింసించడం ఎలా సమర్థనీయమని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. వినోదం కాదు అని వాదించడం సరికాదని, జల్లికట్టు వినోదం కాకపోతే అంతమంది ప్రజలు ఎందుకు గుమికూడతారని, వారంతా ఎద్దులను అడ్డుకునేందుకు సాహసం చేసి ఎందుకు గాయాలపాలవుతున్నారని
ప్రశ్నించింది. జల్లికట్టు సమయంలో అరుపులు, కేకలతో జంతువులను హింసించడం సరికాదని చెప్పింది. ఎద్దుల జాతులకు ఉపయోగం
ఎలాగంటే..? తమిళనాడులో జల్లికట్టు ఆడేవారు ఎద్దులను ఎంతో ప్రేమగా పెంచుతారని, ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంటారని, వాటిని ప్రత్యేకంగా
అలంకరిస్తారని కోర్టుకి తెలిపారు న్యాయవాది కపిల్ సిబల్. ఎద్దుల బలం, సామర్థ్యం ఆధారంగా మార్కెట్ లో మంచి ధర లభిస్తుందని, దీనికి జల్లికట్టే
మంచి వేదిక అని చెప్పారు.
ఈ వాదనతో కోర్టు విభేదించింది. జంతువులను ఆట పరికరాలుగా చూసే జల్లికట్టుతో ఎద్దుల జాతుల పరిరక్షణ ఏవిధంగా సాధ్యమని ప్రశ్నించింది. తమిళనాడు సంస్కృతిలో జల్లికట్టు భాగమన్న ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది.
అయితే ప్రస్తుతం జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతుండడంతో, సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడులో జల్లికట్టును
అనుమతించడానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. జల్లికట్టు పేరుతో జంతువులను హింసిస్తున్నారని, ఆరుదైన ఎద్దుల
సంతతిని కాపాడేందుకు జల్లికట్టు క్రీడలు నిర్వహిస్తున్నట్లు చేస్తున్న వాదనలు సరైనవి కాదని పెటా సుప్రీంకోర్టులో పేర్కొంది.
అయితే, దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టులో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని, పోటీల్లో పాల్గొనే ఎద్దులను వాటి యజమానులు సొంత బిడ్డల కంటే ప్రేమగా చూసుకుంటున్నారని, అలాంటి తరుణంలో సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధం
విధించాలని కోరడం సమంజసం కాదని, ఆయా ప్రాంతాల్లో జరిగే జల్లికట్టుల్లో ఎక్కడైనా ఉల్లంఘనలు అతిక్రమిస్తే వాటిని సక్రమంగా అమలు
చేయాలని ఆదేశాలు ఇస్తే సరిపోతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
జల్లికట్టు క్రీడలను పూర్తిగా నిషేధించడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ క్రీడలు సుమారు వెయ్యి సంవత్సరాలుగా జరుగుతున్నాయని, సంప్రదాయానికి చిహ్నంగా నిర్వహించే ఈ సాహసక్రీడల్లో కాలానికి అనుగుణంగా మార్పులు జరుగుతున్నాయని, దానికి తగ్గట్టుగానే నిబంధనలు కూడా మారుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఇదిలా ఉంటే, జల్లికట్టు లేదా బండ్ల పోటీల్లో ఎద్దులను జంతువులుగా ఉపయోగించరాదని 2014లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా ఈ
ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించడాన్ని కోర్టు నిషేధించింది. పలు డిమాండ్ల తరువాత తమిళనాడు జంతు హింస నిరోధక చట్టం 1960 ను
కేంద్రం చట్టాన్ని సవరించి రాష్ట్రంలో ‘జల్లికట్టు’ను అనుమతించింది. తాజా విచారణతో జల్లికట్టు నిర్వహణపై సందిగ్థత నెలకొంది.
తమిళ నాట సాంప్రదాయంగా వస్తోన్న జల్లికట్టు భవితవ్యం ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు కీలకం
కావడంతో, తమిళ తంబీలందరూ సుప్రీం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..