Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో మళ్లీ ముందస్తు నగారా మ్రోగనుందా..

ఏపీలో మళ్లీ ముందస్తు నగారా మ్రోగనుందా..

ఏపీలో మళ్లీ ముందస్తు నగారా మ్రోగనుందా.. ఆ అంశమే ఏజెండాగా జగన్ ఢిల్లీ టూర్ సాగిందా..? అసలు జగన్ టూర్ పై విశ్లేషకులు
ఏమంటున్నారు..?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం క్లైమాక్స్ కు వచ్చినట్లే కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో కీలక
పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పైకి ఏమీ కనిపించకపోయినా అంతర్గతంగా మాత్రం అంతా గుట్టుగా జరిగిపోతోంది. సీఎం జగన్ ఢిల్లీ టూర్
సందర్బంగా దీనిపై ఊహాగానాలు వచ్చాయి. అయితే ఢిల్లీలో అవి నిజమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కీలక పరిణామాలు
జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే ముందస్తుపై మరింత స్పష్టత రానుంది. ఏపీలో ముందస్తు ఎన్నికలపై గత ఏడాదిగా ప్రచారం
జరుగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాటి జోరు మరింత పెరిగింది. ఎన్నికలకు ఏడాదిన్నర
ముందే వైసీపీ గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించి జనంలోకి వెళ్లడాన్ని గమనించిన విపక్షాలు.. ఆరు నెలల తర్వాత ముందస్తు
ప్రకటన ఖాయమని ఊహిస్తున్నాయి.

ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. దీనికి తగినట్లుగానే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇక మిగిలింది అధికారిక ప్రకటనే అనేలా ఈ పరిణామాలున్నాయి. సీఎం జగన్ తాజాగా ఢిల్లీ టూర్ కు వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీ, హోంమంత్రి
అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రుల్ని కలిశారు. ఈ టూర్ లో ముందుగా మోడీతో భేటీ అయిన జగన్.. ముందస్తు ఎన్నికలపై చర్చించినట్లు
తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలోనూ దీనికి అనుబంధంగా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటితో జగన్ ఢిల్లీ టూర్ లో ముందస్తుకు
అనుమతి తెచ్చుకోనున్నారనే చర్చ జోరుగా సాగింది. రెండు రోజుల టూర్ ముగించుకుని జగన్ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. అయితే
జగన్ ఢిల్లీలో ఉండగానే ముందస్తుపై రాష్ట్రానికి కీలక సంకేతాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ ఢిల్లీ టూర్ లో ఉన్న సమయంలోనే
రాష్ట్రంలో నిఘా వర్గాలకు ముందస్తుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం ముందస్తు ఎన్నికలకు
తగినట్లుగా క్షేత్రస్ధాయిలో నిఘా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.

ఇందుకోసం సిబ్బంది నియామకం, మార్పులు, చేర్పులు, మోహరింపులు ఉండాలని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో నిఘా వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. అలాగే నిఘా వర్గాలకు ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవి సాధారణంగా జరిగే డ్రిల్ కాదని, ముందస్తు ఎన్నికల కోసమే ఈ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తుపై చర్చ మరింత పెరిగింది.

అలాగే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి వైసీపీలో కీలక నేతలు అంతర్గతంగా సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి వైసీపీలో కీలక నేతలు అంతర్గతంగా సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. బయటికి మాత్రం ముందస్తు ఎన్నికల సమస్యే లేదని ప్రకటనలు గుప్పిస్తున్న నేతలు.. అంతర్గతంగా మాత్రం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం మార్చిలో ముగుస్తుంది. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని చెప్తున్నారు. అందుకు తగినట్లుగానే ప్రభుత్వం ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నట్లు అర్ధమవుతోంది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలపై అధికారిక ప్రకటన చేయొచ్చని
తెలుస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సరికి మార్చి గడిచిపోతుంది.

ఏప్రిల్ లో ముందస్తు ఎన్నికలపై ప్రకటన వచ్చేలా చూసుకుంటే మరో మూడు లేదా నాలుగు నెలల్లో ఎన్నికలకు వెళ్లొచ్చనే భావనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సంకేతాలను గమనిస్తే విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన నేతలు కూడా ఇదే అంశాన్ని గత కొంతకాలంగా అంతర్గతంగా అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రబాబు నిత్యం జనంలోనే ఉంటున్నారు. లోకేష్ పాదయాత్ర కూడా ప్రారంభమైతే ఒకేసారి తండ్రీ కొడుకులు జనంలోనే ఉండేందుకు వీలవుతుంది. అదే సమయంలోపవన్ కూడా వారాహితో యాత్ర మొదలుపెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ ముందస్తుకు సూచనలుగానే భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.

నిజానికి ఏపీ సీఎం ఢిల్లీ టూర్ వెనక చాలా విషయాలే ఉన్నాయని అంటున్నారు. నవంబర్ 11న విశాఖ వచ్చిన ప్రధాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ ఆయనతో ఏకాంత చర్చలు జరిపారు. ఇక చంద్రబాబుని జీ 20 సన్నాహక సదస్సుకు అహ్వానించారు. దానికి ముందు కూడా చంద్రబాబు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు సన్నాహక సదస్సుకు వెళ్ళారు. కేంద్రపెద్దలతో టీడీపీ టచ్ లో ఉంటోందన్న సంకేతాలు అయితే ఉన్నాయి. తెలంగాణలో బీజేపీకి ఉన్న రాజకీయ అవసరాల నేపధ్యంలో చంద్రబాబుని దువ్వుతున్నారు అని అంటున్నారు. బాబుకు ఏపీ రాజకీయ క్షేత్రం కావాలి. దాంతో పరస్పర అవగాహనతో రెండు పార్టీలు కలుస్తాయని ఒక ప్రచారం అయితే ఉంది. దాంతో మోడీ అమిత్ షాల మనసులో ఏముందో అన్న విషయం మీద క్లారిటీ కోసం జగన్ ఢిల్లీ టూర్ ఉందని అంటున్నారు.

అయితే మోడీ షాలు ఈ విషయంలో అంత సులువుగా బయటకు తేల్చరని అంటున్నారు. అయితే వీరిద్దరూ ఏపీ రాజకీయం తమకు
అనుకూలంగానే వాడుకుంటున్నారు. అలాగే కంటిన్యూ చేస్తారని అంటున్నారు. వచ్చే ఏడాది చివర్లో కానీ తెలంగాణ ఎన్నికలు జరగవు. అప్పటికి
ఏపీ ఎన్నికలు కూడా దగ్గరపడతాయి. దాంతో అపుడు బీజేపీ టీడీపీతో పొత్తు విషయం బాహాటం చేసినా వైసీపీతో వచ్చిన ఇబ్బందులు ఉండవు.
పైగా వైసీపీతో అవసరాలు కూడా తీరిపోతాయని అంటున్నారు. అపుడు ఏపీ రాజకీయ ముఖ చిత్రం కూడా మరింత స్పష్టంగా కనిపిస్తుందని దాంతో
బీజేపీ అపుడు ఆలోచనలు పూర్తిగా తాను కోరుకున్న తీరున చేసుకునేలా ఉంటాయని అంటున్నారు. ఇలా ఆప్షన్లు అన్నీ తన చేతిలో పెట్టుకుని
బీజేపీ మరో ఏడాది పాటు ఇలా వైసీపీ తెలుగుదేశంల మధ్య దగ్గరా దూరామా అన్నది చెప్పకుండా దాగుడు మూతల రాజకీయం ఆడుతూనే
ఉంటుందని అంటున్నారు.

ఇక జగన్ ఢిల్లీ టూర్ లో చూసుకుంటే ఏపీకి సంబంధించిన అన్ని విషయాలు కేంద్రం దృష్టిలో పెట్టినా మోడీ ప్రభుత్వం
వాటిలో ఎన్ని పరిష్కరిస్తుంది అన్నది కూడా సందేహమే అంటున్నారు. ఏపీ విషయంలో కేంద్ర పెద్దలకు ఎపుడూ ఉన్న అభిప్రాయమే ఉంటుంది
తప్ప మారేది ఉండదని అంటున్నారు. విన్నపాలు వినవలె అని ఇలాంటి భేటీలలో వాటిని వింటూనే ఉంటారు తప్ప ఆచరణకు మాత్రం అవకాశాలు
తక్కువగానే ఉంటాయని అంటున్నారు. నిజానికి కేంద్రం ఏపీకి మేలు చేయదలచుకుంటే పదే పదే జగన్ ఢిల్లీ వెళ్ళనవసరం లేకుండానే చాలా
విషయాలలో ఈపాటికే పరిష్కారం లభించేదని కూడా అంటున్నారు. పైగా విభజన హమీలు కానీ విభజన చట్టంలో ఉన్నవి కానీ కేంద్ర పెద్దలకు
తెలియదు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే అంటున్నారు.

ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. రాష్ట్రం ఆర్ధికంగా ఎంతటి సంక్షోభంలో ఉన్నదో కూడా కేంద్రానికి తెలుసు అని అంటున్నారు. కానీ బీజేపీ నుంచి అద్భుతాలు అయితే ఆశించలేమనే విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఇలా వెళ్లిన ప్రతిసారి కేంద్రం నుంచి సానుకూలత అన్న మాట మాత్రం బయటకు వస్తుంది. అన్నింటికంటే మించి ఈ నెల గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వం దయతలచాలి. సామాజిక పింఛన్లు కూడా ఇచ్చుకోలేని గడ్డు స్థితిలో ప్రభుత్వం ఉంది, అప్పుల పరిమితి దాటిపోయింది. కేంద్రం అనుగ్రహిస్తే కానీ అప్పుపుట్టదు. ప్రస్తుతం ఓడీలో ఉండగా.. దానిని తిరగేసి మరోసారి అప్పులు తెచ్చుకోవాలి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆస్పత్రిలో ఉన్నారు. అమిత్ షా అందుబాటులో లేరు. దీంతో తాను వచ్చిన పని జరగకపోవడంతో.. ఎవరికీ అంతుపట్టని రీతిలో జగన్ ఢిల్లీ పర్యటన మారింది.

మరి ఢిల్లీ టూర్ వేళ జగన్ వ్యూహం ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img