చాలా రోజులుగా… దాదాపు పది నెలలుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుధ్దం ఇంకా తీవ్రంగా కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఈ యుద్ధం ముగుస్తుందా? ముగిస్తే ఎన్నడు ముగుస్తుంది అన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. ఊహలకు కూడా అందడం లేదు.
మొన్నటికి మొన్న రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నోట ‘వార్’ అన్నమాట వినిపించింది. ఇది మొట్టమొదటిసారిగా ఆయన నోట వినిపించింది. అసలు యుధ్దం ముగుస్తుందా..అన్నిది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. విషయానికొస్తే రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నోట ‘వార్’ అన్నమాట వినిపించడం ఇదే ప్రథమం. ఉక్రెయిన్‌లో జరుగుతున్నదానిని ఆయన ‘స్పెషల్ మిలటరీ ఆపరేషన్’ వంటి వేర్వేరు పదాలతో ఇంతకాలమూ ప్రస్తావించారు కానీ, ఇప్పుడు ఆయన నేరుగా పాశ్చాత్యదేశాల పదజాలాన్నే ప్రయోగించి ఇంటా బయటా చిక్కుల్లో పడ్డారు.
ప్రత్యేకచట్టాలతో ‘యుద్ధం’, ‘చొరబాటు’ అన్నపదాలు నిషేధించి, అలా పేర్కొన్నవారిని శిక్షార్హులను చేస్తూ, ‘ప్రత్యేక సైనికచర్య’ పేరిట భారీగా పన్నులూ సెస్సులూ వసూలు చేసిన పుతిన్ ఇప్పుడు తానే దానిని యుద్ధం అని తేల్చారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల దగ్గర విషయాన్ని దాచిపెట్టి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఆయనపై న్యాయవిచారణ జరపాలంటూ రష్యాలో ఒక నాయకుడు కేసు కూడా పెట్టారు.
‘వార్’ అని అంటూనే రష్యా అధ్యక్షుడు దానిని త్వరలోనే ముగిస్తామని కూడా ప్రకటించారు. సంక్షోభాన్ని ముగించడమే తన లక్ష్యమనీ, ప్రతీ సంక్షోభం చర్చలతోనే ముగుస్తుందన్న పుతిన్ వ్యాఖ్యలో అంతర్లీనమైన సందేశం ఉన్నదని కొందరు నమ్ముతున్నారు. యుద్ధాన్ని త్వరితంగా ముగించాలన్నదే తన లక్ష్యమని అంటూనే, అది మెరుగైన ఫలితాలతో జరుగుతుందని పుతిన్ వ్యాఖ్యానించడం ఆయనలో ఏ మాత్రం మార్పు రాలేదనడానికి నిదర్శనమని కూడా చాలామంది అంటున్నారు.
యుద్ధం ఆరంభించినప్పుడు, కొనసాగిస్తున్నప్పుడు కూడా పుతిన్ దాదాపుగా ఇటువంటి మంచి మాటలే చెబుతూ వచ్చారు. తాను ఘర్షణకు స్వస్తి చెప్పాలని అనుకుంటున్నప్పటికీ, ఉక్రెయిన్ అధ్యక్షుడే కయ్యానికి కాలుదువ్వుతున్నాడని చాలా మార్లు అన్నారు. ఇక, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయిన తరువాత, యుద్ధం ముగించడం గురించి పుతిన్ మాట్లాడటంతో పాశ్చాత్యదేశాల మీడియా తెగ సంబరపడిపోతోంది.
రష్యా దండయాత్ర ఆరంభమైన పదినెలల తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు తొలిసారిగా దేశం వీడి, పోలెండ్ మీదుగా అమెరికా చేరుకొని బైడెన్‌తో భేటీ అయ్యారు, అమెరికా పార్లమెంటులో ప్రసంగించారు. ప్రయాణానికి ముందే, అమెరికా నుంచి ఆయన రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందుకున్నారు. పేట్రియాట్ మిసైళ్లు, క్షిపణి రక్షణ వ్యవస్థల సరఫరాలతో పాటు, యుద్ధం కొనసాగినంత కాలం అమెరికా అండగా ఉంటుందన్న హామీని కూడా జోబైడెన్ నుంచి పొందారు.
యుద్ధాన్ని సత్వరంగా ముగించడం గురించి రష్యా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు ఎంత విలువ ఉన్నదన్న విషయాన్ని అటుంచితే, రష్యా వెనక్కుతగ్గే సూచనలేవీ ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. ఒకవైపు ఈ ప్రకటన చేసినప్పటికీ నిత్యం ఆ శిధిలాలపై రాకెట్లు వచ్చిపడుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ నగరాలు శిధిలాల కుప్పలుగా మిగిలిపోయాయి. సిరియాలో జరిగిన విద్వంసం కన్నా ఎక్కువే ఇక్కడ కనిపిస్తోంది. ఉక్రెయిన్‌లో ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్న తూర్పు నగరం బాఖ్ముత్ చుట్టు పక్కల గల స్థావరాలపై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో జరిగిన దాడుల్లో కనీసం నలుగురు పౌరులు మరణించి ఉంటారని, 30 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
బాఖ్ముత్, దాని సమీపంలోని దోనెట్స్క్ రాష్ట్ర నగరం సోలెడార్‌ల్లో పరిస్థితిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సోమవారం రాత్రి పొద్దుపోయాక మాట్లాడుతూ.. ”అంతా సర్వ నాశనమైంది. అక్కడ దాదాపు ఒక్క జీవి లేదు. సోలెడార్ సమీప ప్రాంతంలోని భూమి అంతా ఆక్రమణదారుల శవాలు, దాడుల గుర్తులతో నిండిపోయింది. పిచ్చితనం అంటే ఇదే” అని ఆవేదన వ్యక్తం చేసారు. గత నవంబరులో ఉక్రెయిన్ సేనలు దక్షిణ ప్రాంత నగరం ఖేర్సన్‌ను రష్యా బలగాల అధీనం నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడంతో బాఖ్ముత్ చుట్టుపక్కల యుద్ధం మరింత ఉగ్రరూపం దాల్చింది.
ఈ క్రమంలో ఆ సమీపంలోని 70 వేల మంది పౌరుల్లో 90 శాతం అక్కడ నుంచి పారిపోయారు. మరోపక్క ఉక్రెయిన్‌లోని మైనింగ్ పట్టణం ‘సోలెడార్’పై రష్యా పట్టుబిగించినట్లు బ్రిటన్ రక్షణశాఖ తెలిపింది. ఎట్టకేలకు ఈ ప్రాంతాన్ని పుతిన్ సేనలు నియంత్రించే అవకాశం ఉందని పేర్కొంది. వాగ్నర్ గ్రూప్ సాయంతో ఈ ప్రాంతంలో ముందుకెళ్తున్నట్లు వివరించింది. ఇంత విద్వంసం జరిగినా, ఈ యుద్ధానికి హద్దుపద్దు లేనంత బడ్జెట్ కేటాయింపులు జరపడం, రష్యా సైన్యం సంఖ్యను మరో ఐదులక్షల మేరకు పెంచుకోవడం దారుణమని అంటున్నారు విశ్లేషకులు.
పైగా రిక్రూట్ సైనికుల వయోపరిమితిని హెచ్చించి మరీ కాంట్రాక్టు సైనికులను సమీకరించుకోవడం, ఇటీవల నాటోలో చేరిన ఫిన్లాండ్, స్వీడన్‌లకు చెక్ పెట్టడానికి పశ్చిమరష్యాలో సైనికవ్యవస్థలను మరింత బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను రష్యా ఇప్పటికే ప్రకటించింది. ఉన్నవారికి తోడుగా ఇప్పుడు వేలాదిమంది సైనికులను అదనంగా యుద్ధరంగానికి తరలిస్తోంది. అందువల్ల,‘ప్రత్యేక సైనికచర్య’ బదులు, వార్ అని పుతిన్ వాడటం పొరపాటున కాక, దానిని కొనసాగించే లక్ష్యంతోనే ఉపయోగించినట్టుంది.
‘యుద్ధం’ అన్నప్పుడు అనేక విశేషాధికారాలు దఖలు పడటంతో పాటు, దానికి మరిన్ని నిధులు సమకూర్చుకోవడానికీ, సైనిక బలగాన్ని రెట్టింపు చేసుకోవడానికి వీలవుతుంది. పుతిన్ మాటలకు, కార్యక్షేత్రంలో జరుగుతున్నదానికీ పొంతన లేనందున యుద్ధం ముగియడం కాక, కొత్త సంవత్సరంలో మరింత బలంగా కొనసాగుతుందనడానికే అనేకంగా ఆధారాలున్నాయి.
అమెరికా క్రమంగా ఉక్రెయిన్ పక్షాన నిలబడుతూ ఇప్పటికే 54 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించింది. అమెరికా యుద్ధవిమానాలు, ట్యాంకులు, లాంగ్‌రేంజ్ మిసైల్స్ వంటివి కూడా కావాలని ఉక్రెయిన్ అడుగుతోంది. అత్యంత అధునాతన ఆయుధాలు ఉక్రెయిన్‌ను కాపాడవచ్చునేమో కానీ, రష్యా రెచ్చిపోతూ, యుద్ధం మరింత పెరిగి, వినాశనం అధికంగా జరుగుతుంది. ఇప్పటికైతే సమీపకాలంలో కూడా యుద్ధం నిలిచిపోతుందన్న సంకేతాలేమీ లేవు. ఉభయపక్షాలూ ప్రజల ప్రయోజనాలను, ప్రాణాలను పణంగా పెట్టి రక్తం ఓడుతూనే మొండిగా యుద్ధం కొనసాగిస్తున్నాయి.
అందువల్ల, చర్చలకు సంబంధించి ఉభయపక్షాలమీదా ఒత్తిడి పెంచడం ఒక్కటే మార్గం. ఆయుధాలు అందిస్తూనే, రష్యాతో సయోధ్యకు సంకేతాలు పంపాల్సిందిగా ఉక్రెయిన్‌మీద అమెరికా ఒత్తిడిపెంచడం ముఖ్యం. అటువంటి వాతావరణం కనిపిస్తే, భారత్, చైనాల మధ్యవర్తిత్వంతో రష్యా కూడా దిగివస్తుంది. ఆగ్రహంగా కలయబడుతున్న ఇద్దరిని విడదీయాల్సింది ఎప్పటికైనా చుట్టూవున్నవారే అని అంటున్నారు విశ్లేషకులు.
ఈ ప్రయత్నాలు ఇప్పటికే చాలా సార్లు జరిగాయి. కానీ రష్యా వాటిని వింటుందా అన్నదే ఇక్కడ పాయింటు..