Homeఅంతర్జాతీయంమండే ఎండలు..మరిన్ని సమస్యల్ని తెచ్చిపెట్టనున్నాయా..?

మండే ఎండలు..మరిన్ని సమస్యల్ని తెచ్చిపెట్టనున్నాయా..?

మండే ఎండలు..మరిన్ని సమస్యల్ని తెచ్చిపెట్టనున్నాయి. వడగాల్పులు, విద్యుత్ సంక్షోభం, నీటి ఎద్దడి వంటి ఇక్కట్లను తేనున్నాయి. ఇక ఫిబ్రవరిలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండడంతో, మార్చినెలలో మాడి మసైపోవడమేనా అన్న అభిప్రాయం సర్వత్రా వెల్లువెత్తుతోంది. మండే ఎండలతో ఇతరత్రా సమస్యలు సైతం వస్తాయన్న నిపుణుల హెచ్చరికలు సామాన్యులను మరింత టెన్షన్ పెడుతున్నాయి.

ఎండాకాలంలో వేడి విపరీతంగా పెరగనుందని, దీనివల్ల పేదలకు పెను ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల విద్యుత్, ఆహార ఉత్పత్తిపై గణనీయ ప్రభావం కనిపించనుందని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రానున్న కాలం గడ్డుకాలమేనని, అప్రమత్తంగా ఉండాలని కూడా వీరంతా సూచిస్తున్నారు. అయితే..ఇప్పటికే వడగాల్పులు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మార్చిలోనే సూరీడు మండిపోతున్నారు. ఈ ఏడాది వేసవి భగభగలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండే ఎండలకు తోడు ఎన్నో సమస్యలు ఎదురు కానున్నాయి. వడగాడ్పులు, విద్యుత్ సంక్షోభం, నీటి ఎద్దడి బాధించనున్నా యి. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కింది. సగటు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ కు దాటాయని భారత వాతా వరణ శాఖ వెల్లడించింది. కొంకణ్, కచ్ ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే వేడిగాడ్పులపై ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి నుంచి మే వరకు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని అంచనాలున్నాయి.

ఈ నేపథ్యంలో వేసవి గండాన్ని ఎలా ఎదుర్కొంటామన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6న ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి వేసవిని ఎదుర్కోవడానికి కావాల్సిన సన్నద్థతలపై కీలక సూచనలు చేశారు. వైద్య నిపుణులు, స్థానిక అధకారులు, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి వేసవి కాలాన్ని ఎదుర్కోవడానికి ఏమేం చర్యలు చేపట్టాలన్న దానిపై చర్చించారు. ఏయే ప్రాంతాల్లో వడగాల్పులు ఉండబోతున్నాయి అన్నదానిపై భారత వాతావరణ శాఖ దృష్టి సారించింది.

మార్చి నుంచి మే వరకు దేశంలో ఉక్కబోత భరించలేనంతగా ఉంటుందని అంచనా వేసింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది. మధ్య భారతం, వాయువ్య రాష్ట్రాల్లో నూ అత్యధిక ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశముంది. ఉత్తరాదితో పోల్చి చూస్తే, దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణొగ్రతలు స్వల్పంగా నమోదు అవుతాయి. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ అంచనాల ప్రకారం వడగాల్పులు తరచుగా వీస్తాయి.

ఈ ఏడాది మండుటెండల భయం ఇప్పటినుంచే పేద వర్గాలను వెంటాడుతోంది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఖగోళ శాస్త్రజ్ఞుల హెచ్చరికల నేపథ్యంలో మండుటెండలపై ప్రజలు ఇప్పటి నుంచే భయాందోళన చెందుతున్నారు. పచ్చదనం ఉట్టిపడే కేరళలో కూడా ఈ ఏడాది వేసవి ప్రారంభం కాకముందే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశమంతా ఈ ఏడాది ఎండల విపత్తు తప్పదని వాతావరణ శాఖ ముందస్తు అంచనాలతో హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో నిత్యం కూలీ పనులకు వెళ్ళేవారు, భవన నిర్మాణరంగ కార్మికులు, ఉపాధి కూలీలకు గడ్డుకాలమేనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఎండల తీవ్రత కారణంగా గోవాలో పాఠశాలలను ఈ నెల ప్రారంభం నుంచే ఒంటిపూట నిర్వహిస్తున్నారు. గోవాలో గత రెండు రోజులుగా ఎండ వేడి పెరిగింది. వేసవిలో ఎండ 45 డిగ్రీలు దాటితేనే జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతారు. రాబోయే రోజుల్లో వేడి గాలులు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో మార్చిలోనే 50 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది. కేరళలో ఎండల తీవ్రత అధికంగా ఉంది.

తిరువనంతపురం, కొల్లం, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్‌, కన్నూర్‌లోని ప్రధాన ప్రాంతాలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ ప్రాంతాల్లో వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎన్నడూ 40 నుంచి 45 డిగ్రీలకు మించవు. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని, ఎండ నుంచి రక్షించుకోవడంతో పాటు ఎక్కువ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో 2022 జనవరి1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు 273 రోజుల్లో 241 రోజులు తీవ్రమైన వాతావరణ ఉత్పాతాలు సంభవించాయి.

  • వచ్చే వేసవిలో ఎండలకు మండిపోవడమే కాక..ఆహార లేమి కూడా తీవ్రంగా బాధించనుందని..

వడగాల్పులు, శీతల గాలులు, తుఫానులు, మెరుపులు, భారీ వర్షాలు, కరువు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటివి అందులో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ అండ్‌ డౌన్‌ టు ఎర్త్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఇదే కాలంలో మధ్యప్రదేశ్‌లో ప్రతి రెండో రోజు ఒక ఘటన జరిగింది. తెలంగాణలో 41 నమోదైతే, ఏపీలో 45 ఉత్పాతాలు సంభవించాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అంచనాలు ఉన్నా, వాటిపై పూర్తిగా సర్వే చేయలేదు. తెలంగాణాలో అధిక వర్షాలతో వచ్చిన వరదలు గోదావరి ప్రాంతంలో కనీసం15 లక్షల ఎకరాల పంటను ముంచెత్తాయి.

తెలంగాణ ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాల మీద అధ్యయనం చేయలేదు. రైతులను పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం గురించి ప్రయత్నం కూడా చేయలేదు. ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు, ఏ రూపంలో, ఎంత తీవ్రతతో వచ్చి పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దేశంలో సంభవిస్తున్న వరుస ఉత్పాతాలు భూమిపై వాతావరణ మార్పునకు సూచికలు. ఇదివరకు వందేళ్లలో వచ్చిన మార్పుగా భావిస్తే, ఇప్పుడు ఇటు-వంటి తీవ్రమైన వాతావరణ ఉత్పాతాలు ఐదేళ్లలో ఒకటి లేదా అంతకంటే తక్కువ కాలంలోనే చూస్తున్నామని నిపుణులు చెబుతున్నారు.

క్రిస్టియన్‌ ఎయిడ్‌ అనే సంస్థ వాతావరణ సంక్షౌభంతో ప్రభావితమైన 2022లో ప్రపంచంలో10 భారీ నష్టం కలిగించిన తీవ్ర వాతావరణ ఉత్పాతాలను ఒక అధ్యయనంలో గుర్తించింది. ప్రతీది రూ.25 వేల కోట్లకు పైగా నష్టాన్ని కలిగించింది. ఈ నివేదిక పేద దేశాల్లో భారీ ప్రాణ, పర్యావరణ నష్టాన్ని కలిగించిన10 ఇతర తీవ్రమైన వాతావరణ ఉత్పాతాలను కూడా పరిశీలించింది. పాకిస్తాన్‌ లో మొన్న జూన్‌లో కొన్ని ప్రాంతాలను ముంచెత్తిన వరదలు 1700 మంది ప్రాణాలను తీసి, 70 లక్షల మందిని నిర్వాసితులను చేశాయి.

బొగ్గు, పెట్రోల్‌, డిజిల్‌ వంటి శిలాజ ఇంధనాల ఉపయోగం నుంచి వెలువడిన కాలుష్యం వల్ల ఈ ప్రకృతి విపత్తులు వేగంగా దూసుకొస్తున్నాయి. వాటి వాడకం తగ్గిస్తామని ప్రతి దేశం స్వతహాగా లక్ష్యాలు ప్రకటించాయి. అంతర్జాతీయ ఖగోళ, పర్యావరణ శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం ఈ లక్ష్యాలు సరిపోవు. 2015లో జరిగిన పారిస్‌ ఒప్పందం ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిలతో పోలిస్తే1.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా ఉంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఈజిప్టులో జరిగిన కాప్‌-27 వాతావరణ శిఖరాగ్ర సమావేశం నుంచి ఈ దిశగా చర్చ జరగలేదు.

అన్ని దేశాలు అత్యవసర చర్యలు తీస్కోవాల్సిన అవసరం 2022లో జరిగిన వరుస ఉత్పాతాలు గుర్తుచేస్తున్నా, దేశాధినేతలు కదలకపోవడం విస్మయం కలిగిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా అసాధారణమైన ఆర్థిక, సామాజిక నష్టాలు ఎదురవుతున్నాయి. సాధారణ ప్రజలు అనేక అనారోగ్య పరిస్థితులను నిత్య జీవనంలో ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునే స్థితిలో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాలు లేవు. అందుకు పాక్‌ ఒక ఉదాహరణ. గత ఏడాది వరదల బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు, ఆయా ప్రాంతాల్లో కోల్పోయిన మౌలిక సదుపాయాల నష్టానికి సంబంధించి పాకిస్తాన్‌ ప్రభుత్వం ఏమి
చేయలేని దుస్థితిలో ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చిన సాయం అరకొర మాత్రమే.

ఇప్పటికే ప్రపంచ ఆహార భద్రతను అనేక భౌగోళిక పరిస్థితులు బలహీనపరుస్తున్నాయి. కొవిడ్‌19, భౌగోళిక రాజకీయ, శక్తి, జీవన వ్యయ సంక్షౌభాలు ఆహార లేమిని తీవ్రతరం చేస్తున్నాయి. 1981- 2010 సగటుతో పోలిస్తే 2020లో 9.8 కోట్ల ప్రజలు మితమైన లేదా తీవ్రమైన ఆహార అభద్రతతో బాధపడుతున్నారని ఇటీవలి లాన్సెట్‌ కౌంట్‌ డౌన్‌ 2022 నివేదిక తెలిపింది.

వచ్చే వేసవిలో ఎండలకు మండిపోవడమే కాక .. ఆహార లేమి కూడా తీవ్రంగా బాధించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో జనాలకు నానా బాధలు తప్పవన్న అంచనాలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

Must Read

spot_img