Homeఅంతర్జాతీయంజీ 20 సదస్సులో శాంతి మంత్రం కీలకంగా మారనుందా..?

జీ 20 సదస్సులో శాంతి మంత్రం కీలకంగా మారనుందా..?

రష్యా ఉక్రెయిన్ యుద్ధం వేళ .. జెలెన్ స్కీ ఫోన్ కాల్ .. చర్చనీయాంశమవుతోందా..? భారత్ తటస్థ వైఖరి వేళ జెలెన్ స్కీ .. సూచనలు ఎంతమేరకు చర్చకు తావివ్వనున్నాయన్నదే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

యుద్ధం కన్నా దౌత్య విధానంలోనే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ సూచిస్తోంది. ఈ తరుణంలో జెలెన్ స్కీ శాంతి ఫార్ములా .. జీ20 వేదికపై చర్చనీయాంశంగా మారుతుందా .. లేదా అన్నదే కీలకంగా మారింది.

జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. దీనికి సంబంధించిన కోలాహలం దేశంలో నెలకొంది. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఈ సమ్మిట్‌ను నిర్వహించనుంది భారత్. ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యాన్ని ఇవ్వనున్న నేపథ్యంలో దీనికి ఉద్దేశించిన సన్నాహాక సమావేశాలు ఇప్పటికే మొదలయ్యాయి.

బెంగళూరు, ముంబై, జైపూర్‌లల్లో సన్నాహక సదస్సులు ముగిశాయి. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, జిన్‌పింగ్ హాజరు కానున్నారు.

వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి.

పరిణామాల మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ .. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు.

వచ్చే సంవత్సరం నిర్వహించే ఈ సదస్సులో ప్రతిపాదించాల్సిన అంశాల గురించి చర్చించారు. ప్రపంచ శాంతి అంశాన్ని జీ20 శిఖరాగ్ర సదస్సులో పొందుపర్చాలని, దీన్ని ప్రధాన అంశంగా తీసుకోవాలని ప్రధాని మోదీకి ఈ సందర్భంగా జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ శాంతి అంశంపై ప్రధాని మోదీ ఈ సదస్సులో చర్చిస్తారని తాను ఆశిస్తున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా దాడుల్లో ఛిన్నాభిన్నమైన తమ దేశానికి మానవతా దృక్పథంతో సహాయాన్ని ప్రకటించడం, ఐరాసలో తమకు అండగా నిలవడం పట్ల మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి అంతు ఉండట్లేదు..

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆరంభమైన యుద్ధం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నాయి ఈ రెండు దేశాలు. ఈ పోరులో ఉక్రెయిన్‌లో పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు.

ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనికి ధీటుగా ఉక్రెయిన్ సైన్యం బదులిస్తోంది. కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది.

ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో సంభాషించినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ట్వీట్ లో వెల్లడించారు. తమ శాంతికాముక విధానం అమలులో భారత్ భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని తెలిపారు. జీ20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలంటూ మోదీకి శుభాకాంక్షలు తెలిపినట్టు వివరించారు.

గతంలో తాను ఇదే జీ20 వేదికపై తమ శాంతి కార్యాచరణను ప్రకటించామని, ఇప్పుడు దాన్ని అమలు చేయడంలో భారత్ తన వంతు పాత్రను పోషిస్తుందని భావిస్తున్నామని జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలతో పలుమార్లు మాట్లాడారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని ఇరుదేశాల అధినేతలకు సూచించారు.

యుద్ధానికి ముగింపు పలికే మార్గాలను కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే, ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యా తక్షణమే ముగింపు పలకాలని జీ20 సమావేశం నిర్ణయించడంలో భారత్ కీలక పాత్ర పోషిచిందని అమెరికా వెల్లడించింది. G20 సమ్మిట్ డిక్లరేషన్‌పై చర్చలు జరపడంలో ప్రధాని మోడీ ముఖ్య పాత్ర పోషించిందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియరీ తెలిపారు. ఈ యుగం యుద్ధాలు చేసుకునే యుగంగా ఉండకూడదని మోడీ కోరుకున్నట్లు చెప్పారు.

ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలే.. జీ20 సదస్సు ముగింపులో అన్ని దేశాల సంయుక్త ప్రకటనగా విడుదలైందని అన్నారు. జీ20 దేశాలైన భారత్, అమెరికా ఆహారం, ఇంధన సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం అమెరికా ఆహార, ఇంధన భద్రత, స్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించే ప్రయత్నాల్లో ఉందన్నారు. తమ ప్రయత్నానికి ప్రధాని మోడీ సహకారం కీలకమని చెప్పారు.

2023లో జీ20 అధ్యక్షపదవి భారత్కు దక్కిందని, ప్రధాని మోడీకి మద్దతు ఇవ్వడానికి అమెరికా ఎదురుచూస్తోందని అన్నారు. ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల G20 సమ్మిట్లో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, భారత ప్రధాని మోడీ, యూకే ప్రధాని రిషి సునక్తో సహా అగ్రశ్రేణి ప్రపంచ నాయకులు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. ప్రపంచ దేశాలపై యుద్ధం ప్రభావం ఎక్కువగా చర్చించారు.

శాంతి స్థాపన, కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే జీ–20 దేశాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో అరాచకాలకు, యుద్ధానికి తెరపడాలని జీ20 దేశాలు నినదించాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగితే ఆహార, ఇంధన భద్రతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని జీ20 దేశాలు పేర్కొన్నాయి. జీ20 సమ్మిట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే మార్గాలను కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని నాశనం చేసిందని, ఆ తర్వాత ప్రపంచం శాంతి బాట పట్టేందుకే అప్పటి దేశాధినేతలు తీవ్రంగా ప్రయత్నాలు
చేశారని కొనియాడారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మరోసారి జీ20 దేశాలు అలాంటి ప్రయత్నాలు చేయాలని అభిప్రాయపడ్డారు. అటు ఉక్రెయిన్పై రష్యా దాడిని దృష్టిలో పెట్టుకుని ఆ దేశ చమురు, గ్యాస్​ సేకరణకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు పిలుపునిచ్చాయి.

అయితే ఈ నేపథ్యంలో ఇంధన సరఫరాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని జీ20 సభ్య దేశాలను ప్రధాని మోడీ కోరారు. స్వచ్ఛమైన ఇంధనంతో పాటు పర్యావరణానికి భారత్​ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సభ్య దేశాల సహాయ సహకారాలతో ప్రపంచ సంక్షేమానికి 2023 జీ 20 సదస్సును వేదికగా మారుస్తామని మోడీ అన్నారు. ఇక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో యుక్రెయిన్, రష్యా ఉద్రిక్తతలపై భారత్, తన వైఖరిని వెల్లడించింది.

యుక్రెయిన్ తూర్పు సరిహద్దుల్లోని పరిణామాలను, రష్యా ప్రకటనలను భారత్ గమనిస్తూనే ఉంది. రష్యా, యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడం చాలా ఆందోళనకర పరిణామం. ఆ ప్రాంతంలోని శాంతి భద్రతలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అన్ని దేశాల భద్రతా ప్రయోజనాల కోసం, ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత్వాన్ని నెలకొల్పడం కోసం ఉద్రిక్తతలను తగ్గించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని తిరుమూర్తి అన్నారు.

ఒకవైపు పాశ్చాత్య దేశాలు పుతిన్‌పై విరుచుకుపడుతుండగా భారత్ మాత్రం ‘రష్యా చర్యను ఖండించలేదు. యుక్రెయిన్ సార్వభౌమత్వం గురించి మాట్లాడలేదు. దీంతో భారత్ వైఖరి చర్చనీయాంశం అయింది. అయితే భారత్ మాత్రం ఉద్రిక్త పరిస్థితులను తక్షణమే తగ్గించి, దౌత్యపరమైన చర్చలకు ఇరు దేశాలు ముందడుగు వేయాలని, ఇందుకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామనిస్పష్టం చేస్తోంది.

ప్రపంచంలో శాంతి స్థాపనే ధ్యేయమని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధ వేళ భారత్ తేల్చి చెప్పింది. దీనిపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా, తన విధానాన్ని వీడేది లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీ సూచన .. ఆమోదప్రాయమైనదేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Must Read

spot_img