HomePoliticsతెలంగాణలో అధికారులకు కేంద్రం షాకివ్వనుందా..?

తెలంగాణలో అధికారులకు కేంద్రం షాకివ్వనుందా..?

  • కేసీఆర్ దూకుడుకు బ్రేక్ వేయాలని యోచిస్తోందా..?
  • సీఎస్ సోమేష్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పట్టుమని పది నెలలు కూడా లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌కు అధికార పార్టీ అనే అడ్వాంటేజ్‌ లేకుండా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఏర్పడిన పరిస్థితి ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు ఏర్పడుతోంది.

ఎన్నికల నోటిఫికేషన్‌ రాకుండానే ఎన్నికల సంఘం చేతికి అధికారం పోకుండా చీఫ్‌ సెక్రటరీని గెంటివేసినంత పనిచేశారు. అదీ కూడా ఇతర ఐఏఎస్‌లు టెన్షన్‌ పడే రేంజ్‌లో ఈ పరిణామం చోటు చేసుకుంది. స్వయంగా పోలీస్‌ బాస్‌ అంజనీకుమార్‌ కూడా ఏపీ క్యాడర్‌ అధికారి. ఆయనతోపాటు దాదాపుగా పది మంది వరకూ ఏపీకి కేటాయించినప్పటికీ ఇంకా తెలంగాణలోనే కొనసాగుతున్నారు. క్యాట్‌కు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుని ఉంటున్నారు.

ఇలాంటి వారు కీలక పొజిషన్లలో ఉన్నారు. ఇప్పుడు సోమేశ్‌కుమార్‌ వ్యవహారంతో వారంతా టెన్షన్‌ పడక తప్పదు. సీనియర్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారులు ప్రభుత్వానికి, అధికార పార్టాకి మద్దతుగా ఉంటున్నారని.. కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో సోమేశ్‌పై వేటు వేయడం ద్వారా.. ఇతర అధికారులకు స్పష్టమైన సందేశాన్ని బీజేపీ పంపినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులు సీబీఐ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు డీజీపీ కూడా ఏపీ క్యాడర్‌ వివాదంలో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అసలు ఎన్నికలకు ఇంకా పది నెలల వరకూ సమయం ఉండగానే.. అధికార యంత్రాంగానికి బీజేపీ డైరక్ట్‌ హెచ్చరికలు పంపినట్లయింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తర్వాత వేటు సింగరేణి సీఎండీ శ్రీధర్‌పై పడే అవకాశం కనిపిస్తోంది.

ఆయన కేంద్ర క్యాడర్‌లో ఉన్నారు. కేంద్రం అనుమతితో సింగరేణి సీఎండీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఆయన పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. గత డిసెంబర్‌ 31తో పదవీకాలం ముగిసింది. పొడగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకుంటే కనుక కేంద్రం మళ్లీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఎన్నికల ఏడాదిలో కేంద్రం రాష్ట్రంలో అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారుల భరతం పట్టే పని చేపట్టినట్లు సీఎస్‌ సోమేశ్‌పై చర్యద్వారా స్పష్టమైన సంకేతాలు పంపింది.

  • తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి…!

కేంద్రంపై కోసంతో ఇటీవలే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పార్టీ ప్రకటించారు. అట్టహాసంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈనెల 18న ఖమ్మంలో పార్టీ ఆవిర్భావసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇంతలోగా పార్టీని విస్తరించాలని కసరత్తు చేస్తున్నారు. ఏపీ అధ్యక్షుడిని ప్రకటించిన కేసీఆర్, మహారాష్ట్ర, కర్ణాటకలో పార్టీ విస్తరణపై దృష్టిపెట్టారు.

కానీ, ఆయనకు వరుసగా తగులుతున్న షాక్‌లు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనీయకుండా చేస్తున్నాయి. మొన్న లిక్కర్ స్కాం, నిన్న సిట్‌ రద్దు షాక్‌ ఇవ్వగా.. నేడు కేసీఆర్‌ ముఖ్య అనుచరుడు, నమ్మినబంటు సీఎస్‌ సోమేష్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందే అని హైకోర్టు తీర్పు ఇవ్వడం అతిపెద్ద షాక్ గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు‌. దాదాపు ఏడాదిన్నరగా సాగుతున్న ఈ వివాదంపై ఎట్టకేలకు తీర్పు వచ్చింది.

రాష్ట్ర విభజన సందర్భంగా సోమేష్‌కుమార్‌ను ఏపీకి కేటాయించింది కేంద్రం. అయితే తనను ఏపీకీ కేటాయించడంపై సోమేష్‌కుమార్‌ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. క్యాట్‌ ఆదేశాలతో సోమేష్‌ కుమార్‌ తెలంగాణలో కొనసాగుతున్నారు. తెలంగాణ సీఎస్‌తోపాటు మరో 15 మంది ఆలిండియా సర్వీసెస్‌ అధికారులు కూడా క్యాట్‌ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు.

క్యాట్‌ నిర్ణయాలను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలో క్యాట్‌లో జరిగిన విచారణలో సిబ్బంది కేటాయింపు అధికారం కేంద్రానిదేనని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిన సంగతి గుర్తు చేశారు. సోమేశ్‌కుమార్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మనసు మార్చుకుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన 2014, జూన్ కు ముందు రోజు పీకే.మహంతి రిటైర్‌ అయ్యారని, ఆయన పేరును విభజన జాబితాలో చేర్చి ఉంటే తాను తెలంగాణ క్యాడర్‌లో ఉండేవాడినని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వాదించారు.

అయితే ఆయన వాదనల్ని కేంద్రం తోసిపుచ్చింది. సర్వీసు పూర్తయిన వ్యక్తిని కేటాయింపు జాబితాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. పీకే.మహంతి కుమార్తె, అల్లుడు కోసం తనపై వివక్ష చూపారన్న వాదన్నలి కేంద్రం తిరస్కరించింది. అధికారుల విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీలో పీకే.మహంతి ఎక్స్‌ అఫిషియో సభ్యుడు మాత్రమేనని, మిగతా సభ్యులుండగా వివక్షకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.

  • అధికారుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించే వరకు మహంతి పాత్ర పరిమితమని డీవోపీటీ స్పష్టం చేసింది.

అధికారుల కేటాయింపులో ఎవరు ఏ రాష్ట్రానికి వెళ్తారనే విషయం సభ్యులకు తెలిసే అవకాశం లేదని స్పష్టంచేశారు. తెలంగాణకు వెళ్లేందుకు తనకు స్వాపింగ్‌ అవకాశం ఇవ్వలేదన్న వాదనలు డీవోపీటీ తిరస్కరించింది. సోమేష్‌కుమార్‌ వ్యవహారంలో బ్యాచ్‌ స్వాపింగ్‌ అనుమతించామని గుర్తు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం సోమేశ్‌ ఆంధ్రాకు వెళ్లాల్సిందే అని తీర్పు ఇచ్చింది.

ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సోమేశ్‌కుమార్‌ కొనసాగారు. తెలంగాణ ఏర్పడ్డాక 2017లో ఏపీకి అలాట్‌ అయ్యారు. కానీ, ఆ తర్వాత తెలంగాణకు బదిలీ అయ్యారు. సీఎం కేసీఆర్‌ చొరవతో ఇక్కడే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీఎస్‌ సోమేష్‌కుమార్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. పరిపాలన విధానంలో తోటి ఐఏఎస్‌ అధికారులను లెక్క చేయరనే వాదనలున్నాయి.

సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ పనితీరుపై వివాదాలు తలెత్తుతున్న తరుణంలో ప్రభుత్వమే ఆయన్ని తప్పించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సోషల్‌ మీడియాలో గుప్పుమన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బీహార్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారులకు ప్రయార్టీ ఇస్తున్నారనే దానిపై కూడా సీనియర్‌ ఐఏఎస్‌
అధికారులు సైతం గుర్రుగా ఉన్నారు. ఈ అసంతృప్తి, ఆరోపణలు కూడా ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఆయన్ని కలిసేందుకు ప్రయత్నిస్తే.. కనీసం వారికి అపాయింట్మెంట్‌ కూడా ఇవ్వడం లేదని ప్రజాప్రతినిధులు వాపోయేవారు. తాజాగా హైకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలకు ఊరట లభించగా, కేసీఆర్‌కు మాత్రం షాక్‌ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంతో అన్నీ తానై నడిపించిన సీఎస్‌ సోమేష్‌కుమార్‌ కోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో సోమేష్ కుమార్ తో రాజీనామా చేయించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి.. తద్వారా.. వెంటనే రాజకీయాల్లోకి ఆయనను తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని తెలంగాణ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు బీఆర్ ఎస్ కండువా కప్పి.. అటు జాతీయ రాజకీయాల్లోనో.. ఇటు ప్రాంతీయ రాజకీయాల్లోనో దింపే అవకాశం ఉందని తెలంగాణ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మరి సోమేష్ నెక్ట్స్ స్టెప్ రాజకీయాలేనని టాక్ వినిపిస్తోంది.

Must Read

spot_img