కుక్క తోక వంకర సామెతను నిజం చేసిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తామే పోరాటం చేస్తున్నామంటూ బీరాలు పలికింది పాకిస్తాన్. నాలుగు సంవత్సరాల తరువాత ఫాటాఫ్ గ్రే లిస్టు నుంచి వైదొలిగి మూడు నెలలైనా కాకముందే మళ్లీ అవే కార్యక్రమాలు మొదలుపెట్టింది. అదేంటో ఇప్పడు చూద్దాం..
పాకిస్తాన్ అంతర్జాతీయ సంస్థలను తప్పుదోవ పట్టిస్తున్న విషయం తేటతెల్లమైంది. పాకిస్థాన్ లో హిజ్బుల్ కమాండర్ అంత్యక్రియల్లో హిజ్బుల్ చీఫ్ ప్రత్యక్షం అయ్యారు. అంతే కాదు..తనకు జెడ్ ప్లస్ క్యాటగిరీ మాదిరిగా సైన్యం రక్షణ వలయం ఏర్పాటు చేసింది. ఇంతకీ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ అయిన సయ్యద్ సలాహుద్దీన్ మరెవరో కాదు.. గ్లోబల్ టెర్రరిస్ట్ గా ఐరాస డిక్లేర్ చేయబడిన కరడుగట్టిన ఉగ్రవాది. అయితే పాకిస్తాన్‌లో హతమైన భారతదేశం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన బషీర్ అహ్మద్ పీర్ అంత్యక్రియలలో సలాహుద్దీన్ నాయకత్వం వహించినట్లు గుర్తించారు. బషీర్ అహ్మద్ పీర్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. అక్కడ సయ్యద్ సలాహుద్దీన్‌ను పాకిస్తాన్ సైనికులు చుట్టుముట్టి ఉన్నట్లు చూడవచ్చు.
నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని సురక్షిత ప్రదేశంలో ఈ అంత్యక్రియలు జరిగాయి. వైరల్ ఫుటేజీలో సలావుద్దీన్ భారతదేశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేయడం వినవచ్చు. అతని రక్షణ కోసం అనేక మంది పాకిస్తానీ సైనికులు నిలబడి ఉన్నారు. చుట్టూ ఉన్న జనం అతనిని ఉత్సాహపరిచారు. నాలుగు సంవత్సరాల తర్వాత ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF పాకిస్తాన్‌ను తన ‘గ్రే లిస్ట్’ నుండి తొలగించింది. అయితే తొలగింపుకు మూడు నెలలు పూర్తికాకముందే మళ్లీ ఉగ్రవాద నాయకుడి నిర్వాకపు షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. పొరుగు దేశం ఇప్పటికీ గ్లోబల్ టెర్రరిజం వాచ్‌డాగ్ స్కానర్‌లో ఉంది. ప్రపంచంలోని అత్యంత వాంటెడ్ టెర్రరిస్ట్ సయ్యద్ సలావుద్దీన్ తన గడ్డపై ఉండటం ఇప్పుడు పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టైంది.
అయితే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం విషయంలో ఫాటాఫ్ ఇచ్చిన 34 కార్యాచరణ ప్రణాళికల గురించి పాకిస్తాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌కు తప్పుడు సమాచారం అందించిందన్న విషయం రుజువైంది.
అయితే భారత్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో బషీర్ అహ్మద్ ఒకడు. పాకిస్థాన్ మీడియా నివేదికల ప్రకారం.. మోటార్ సైకిల్ పై వచ్చిన ముష్కరులు సోమవారం సాయంత్రం పాయింట్ బ్లాంక్ నుంచి పీర్ పై కాల్పులు జరిపారు. రావల్పిండిలోని ఓ దుకాణం బయట నిలబడి ఉండగా అతడిపై దాడి జరిగింది. నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లో హిజ్బుల్ లాంచింగ్ కమాండర్‌గా ఉన్న పీర్, చొరబాటుదారులను నియమించడంలో, కాశ్మీర్‌లోకి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పంపడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే రావల్పిండిలోని ఓ దుకాణం బయట హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ బషీర్ అహ్మద్ మ్రుతి చెందాడు.

ఉగ్రవాదులను పంపడంలో, జమ్మూ కాశ్మీర్‌లో చొరబాటుకు లాజిస్టిక్ మద్దతు అందించిన కేసులో ఉన్నాడు. ఆనాటి చొరబాటు ఘటనలో అతని పాత్రకు గత ఏడాది అక్టోబర్‌లో పీర్‌ను కేంద్రం ఉగ్రవాదిగా గుర్తించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని అలూసా గ్రామంలోని బాబాపోరా నివాసి, పీర్ హార్డ్‌కోర్ ఉగ్రవాద కమాండర్, అతను రెండు దశాబ్దాల క్రితం తన స్థావరాన్ని పాకిస్తాన్‌కు మార్చాడు. అతను హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌కు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ఉపా కింద అతన్ని ఉగ్రవాదిగా కేసులు ఎదుర్కుంటున్నారు. లక్షిత దాడిగా కనిపించే ఈ దాడిలో రావల్పిండిలో పీర్‌ని చంపడం హిజ్బుల్ ముజాహిదీన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు స్థానికులు. సయ్యద్ సలావుద్దీన్, పాకిస్తాన్‌లో ఉన్న ఇతర హిజ్బుల్ కమాండర్‌లకు ఇది సందేశం అని అంటున్నారు.
ఆకలి కేకలు ఒకవైపు.. క్షతగాత్రుల అర్తనాదాలు మరోవైపు.. పాకిస్తాన్ లో పరిస్థితులు నానాటికి దిగజారి పోతుంటే ఉగ్రవాదులు మాత్రం రెచ్చిపోతున్నారు. శత్రు దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఇస్లామాబాద్‌కు చెందిన థింక్-ట్యాంక్ పాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ ప్రకారం.. 2022లో 262 ఉగ్రవాద దాడుల్లో మొత్తం 419 మంది మరణించారు. వివిధ జాతీయవాద తిరుగుబాటుదారులు, మతపరమైన ప్రేరేపిత తీవ్రవాదులు, హింసాత్మక సెక్టారియన్ గ్రూపులు పాకిస్తాన్‌లో మొత్తం 262 తీవ్రవాద దాడులను నిర్వహించాయి. ఇందులో 14 ఆత్మాహుతి బాంబు దాడులు ఉన్నాయి. 2022లో పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల కారణంగా మరణించిన వారిలో దాదాపు సగం మంది భద్రతా బలగాలు, చట్ట అమలు సంస్థల సిబ్బందేనని తెలుస్తుంది.