సార్వత్రికంలోనూ గెలుపుకు మోడీ షా ద్వయం ఇప్పటినుంచే పావులు కదుపుతోందా..? అందుకే మోడీ మేజిక్ చేస్తారన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయా..?
మినీ సార్వత్రికంలో .. మోడీ లీడర్ గా సాధించిన గెలుపు.. వచ్చే ఎన్నికల్లోనూ రిపీట్ కానుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2024 ఎన్నికలే టార్గెట్ గా హ్యాట్రిక్ సాధించేందుకు మోడీ పావులు కదుపుతున్నారన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
2022లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను ‘మినీ సార్వత్రికం’గా అభివర్ణించారు రాజకీయ విశ్లేషకులు. అది ముమ్మాటికి నిజమే. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ దఫా జరిగిన పోలింగ్ అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకమే. ఇక బీజేపీకి ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారింది. ‘2024లో మోదీని మళ్లీ చూడలని అనుకుంటే ఇప్పుడు బీజేపీని గెలిపించండి’ అంటూ కమలదళ నేతలు విస్తృతంగా ప్రచారాలు చేశారు. తాజా ఫలితాలను చూస్తుంటే వారు అనుకున్నది సాధించినట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా.. ఉత్తర్ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖరారైపోయింది.
మిగిలిన రాష్ట్రాల్లోనూ దూసుకెళుతోంది. అయితే బీజేపీ ఇంతలా రాణించడానికి కారణాల్లో ఒకటి.. అతి ముఖ్యమైనది ‘నరేంద్ర మోదీ- అమిత్ షా’ ద్వయం. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీకి ఎన్నో క్లిష్టపరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఎన్నికల విషయానికొచ్చే సరికి అంతా బీజేపీ హవానే. అడపాదడపా ఎన్నికలను పక్కనబెడితే.. కీలక రాష్ట్రాలన్నీ ఇప్పుడు కమలదళం గుప్పిట్లోనే ఉన్నాయి. ప్రతిచోటా.. ‘మోదీ మంత్ర’మే కనిపిస్తోంది. ఉత్తర్ప్రదేశ్ ఇందుకు భిన్నమేమీ కాదు. యూపీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ముఖచిత్రంగా ఉన్నా.. మోదీ మాయాజాలం లేనిదే ఈ స్థాయిలో పార్టీ దూసుకెళ్లడం కష్టమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాస్తవానికి.. 2014 తర్వాత బీజేపీ ‘ఎన్నికల’ వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి.
అమిత్ షాతో కలిసి మోదీ.. ఒక్కో రాష్ట్రాన్ని బీజేపీలోకి చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆర్ఎస్ఎస్లో ఎన్నో దశాబ్దాల పాటు భాగంగా ఉన్న వీరు.. బీజేపీని బలోపేతం చేసేందుకు ఎన్నో మార్పులు చేశారు. అవి మంచి ఫలితాలనే ఇస్తున్నాయని ఎన్నికల ద్వారా స్పష్టమవుతోంది.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని ఇప్పుడు బీజేపీ తన రెక్కలను విస్తరించుకుంది. కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ప్రచారాలు చేస్తున్నారు. సంప్రదాయ మీడియనే కాకుండా.. ఈ రకంగానూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక ఎన్నికల విషయానికొస్తే.. కచ్చితంగా గెలిచి తీరాలన్న సంకల్పాన్ని నేతలు, కార్యకర్తల్లోకి తీసుకెళ్లింది ఈ ద్వయం. ప్రతి చిన్న విషయాన్ని సైతం చెక్కుతూ, చిన్న సమస్యను కూడా పరిష్కరించుకుంటూ బీజేపీ ముందుకెళుతోందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ‘పంచాయతీ టు పార్లమెంట్’ ఫార్ములాను షా తీసుకొచ్చారు.
అంటే ప్రతి ఎన్నికలోనూ.. గెలుపు కోసమే బరిలో దిగుతున్నాం. రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా అని, అవి ఆయా ప్రాంతాలకే పరిమితం అని అనుకోవద్దని షా చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తాయని, తీవ్రంగా పరిగణించాలని పిలుపునిచ్చారు. ఓటమికి అవకాశమే లేకుండా చూసుకోవాలన్నదే బీజేపీ గెలుపుకు కీలకంగా మారింది. నిరంకుశత్వంతో పార్టీని నడుపుతున్నారని విమర్శలు వచ్చినా.. గెలుపు కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు అమిత్ షా సిద్ధమని ఇప్పటికే అనేకమార్లు స్పష్టమైంది.
బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. షా తీసుకొచ్చిన సంస్కరణలతో.. గ్రామాల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమలదళం బలపడింది. వీటిని చూసిన విపక్షాలు కూడా తమ వ్యవస్థలను తిరిగి సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేతలతో సమావేశమైతే, అందరి కన్నా భిన్నంగా పార్టీకి సామాజిక, రాజకీయ అంజెడాలు ఉండాలని మోదీ చెప్పారు. యువత, మహిళలు, బలహిన వర్గాలు, వృద్ధులను దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందించాలన్నారు. నవ భారతం కోసం ఆయన సలహాలు ఇస్తారు, మేము పాటిస్తామని బీజేపీ నేతలు సైతం చెబుతున్నారు.
బీజేపీకి స్థానిక నేతలు, సీఎం అభ్యర్థి ఉన్నా.. పార్టీ ముఖ చిత్రం మాత్రం మోదీయే. ఉత్తర్ప్రదేశ్లో యోగితో పాటు సీనియర్ నేతలు తీవ్రంగా ప్రచారాలు చేశారు. కానీ మోదీ అనేకమార్లు స్వయంగా రంగంలోకి దిగి ప్రజల్లోకి వెళ్లారు. ఓటర్లను ఆకట్టుకోవడంలో మోదీ చరిష్మా ఫలించింది అనడానికి నేటి ఫలితాలే ఉదాహరణ. ‘ఎన్నికలు ఏదైనా.. మోదీయే మా ముఖ చిత్రం’ అని కార్యకర్తలు, నేతలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. ఎన్నికల మేనిఫెస్టోల్లోనూ మోదీ మార్క్ కనిపిస్తుంది. మోదీని.. ప్రపంచంలోనే బలమైన శక్తిగా, ఆయన నేతృత్వంలో ప్రభుత్వం అవినీతి రహితంగా ఉందని కార్యకర్తలు మేనిఫెస్టోలతో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. చెప్పింది చేస్తామని.. సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. అందరికి ఇట్టే తెలిసిపోతోంది. ఇందుకు అనుగుణంగానే మోదీ- షా కొత్త ఫార్ములాను రచించారు. లోకల్ టు గ్లోబల్.. అన్ని అంశాల్లో బీజేపీ రాణించే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక జాతీయ భద్రత, దౌత్యం, దేశవ్యాప్త సమస్యలు.. రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపిస్తున్నాయి. వాటిని కూడా ఈ ద్వయం సమర్థవంతంగా ఎదుర్కొంది. రష్యా దండయాత్రతో ఉక్రెయిన్లో వేలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు.
‘మోదీ ప్రభుత్వం ఏం చేస్తోంది?’ అని విపక్షాలు ప్రశ్నించేందుకు కూడా బీజేపీ సమయం ఇవ్వలేదు. ఉక్రెయిన్పై ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్న మోదీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. పక్కా ప్రణాళికలతో విద్యార్థులను దేశానికి తీసుకొచ్చేశారు. వివిధ దేశాధినేతలతో మోదీ మాట్లాడిన వార్తలు సైతం ప్రజలు విన్నారు. ఉత్తర్ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ప్రజలకు బీజేపీపై మరింత నమ్మకం పెరిగింది.
సాగు చట్టాలపై వ్యతిరేకత, చమురు ధరల పెరుగుదల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇవి ఉపకరించాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే.. 2024లోనూ బీజేపీ గెలిచి, మోదీ మరోమారు ప్రధాని పీఠాన్ని అవరోధించడం ఖాయమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఎన్నికలకే షా ఇంతటి ప్రణాళికలు రచిస్తుంటే.. ఇక సార్వత్రికానికి ఏ స్థాయిలో సిద్ధంగా ఉంటారోనని అంటున్నారు.
మోదీ సారథ్యంలో అఖండ విజయాలను సాధించామని ఊదరగొడుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారానే రానున్న ఎన్నికల్లో విజయం సాధించగలమని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విజయాల ఆధారంగా దేశంలో అన్ని అసెంబ్లీలు గెలవాలని, లోక్‌సభ కోసం ఇప్పటి నుంచే క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చిన వేళ మోదీ మ్యాజిక్ కీలకంగా మారిందని అంచనాలు వినిపిస్తున్నాయి.2024 లో జరగనున్న ఎన్నికలలోనూ బీజేపీకి పట్టం కట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహం రచిస్తున్నారు.
ఇప్పటి నుండే ప్రజాక్షేత్రంలో ఒక సరికొత్త రూట్ మ్యాప్ తో వెళ్లాలని భావిస్తున్నారు. దేశంలో అనేక అంశాలపై కేంద్రం తీరుపై ప్రజల్లో అసహనం పెరుగుతున్న సమయంలో ప్రజల మద్దతు కూడగట్టడం కోసం ఇప్పటినుండి వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారు. 2024 ఎన్నికల టార్గెట్ గా ప్రధాని నరేంద్ర మోడీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రణ లేకపోవడం, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన, కరోనా సెకండ్ వేవ్ లో కేంద్రం ఫెయిల్ అయిందన్న భావన వెరసి మధ్యతరగతి ఓటర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని గుర్తించిన ఎన్డీఏ ప్రభుత్వం దిద్దుబాటుకు తగిన వ్యూహాలను రెడీ చేస్తోంది.
ప్రజల్లో రెండుసార్లు పాలన తీసుకువచ్చిన అసంతృప్తిని చెక్ పెట్టేలా మోడీ షా ద్వయం వ్యూహాలు రచిస్తోందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనాలు వేస్తున్నారు.