మళ్లీ జనతా పరివార్ ఏకం కానుందా..? ఢిల్లీలో చక్రం తిప్పేందుకు .. జేడీయూ నేత నితీష్ .. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా..? వచ్చే
ఎన్నికల్లో సీఎం పీఠానికి గుడ్ బై చెబుతాననడం .. వెనుక కథేంటన్నదే హాట్ టాపిక్ గా మారిందా..?
జేడీయూ, ఆర్జేడీ విలీనం .. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. దీనికి మద్ధతిచ్చేలా నితీష్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ..
ఇరు పార్టీల నేతలు మాత్రం అటువంటిదేమీ లేదని చెబుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో అసలు కథ ఏమిటన్న చర్చ సర్వత్రా
వెల్లువెత్తుతోంది.
జనతా పరివారంలో కొత్త పరిణామం సంభవించనుందా..? గతంలో బద్ధవిరోధులుగా ఉండి.. ప్రస్తుతం చెట్టపట్టాలు వేసుకుని బిహార్‌లో
రాజ్యమేలుతున్న జనతాదళ్ (యు), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) విలీనం కానున్నాయా..? ఈ ప్రశ్నలకు తాజా రాజకీయ పరిణామాలు అవుననే
సమాధానమిస్తున్నాయి. ఇటీవలి కాలంలో విలీనం గురించిన చర్చ రెండు పార్టీల్లోనూ సాగుతోంది. ఆ పార్టీల నేతలు పైకి ఖండిస్తున్నా.. అంతర్గతంగా
మాత్రం ఆ దిశగానే సంకేతాలు వదులుతున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా బిహార్ సీఎంగా కొనసాగుతున్న జేడీయూ అధినేత నితీశ్‌కుమార్..
ఇప్పుడు జాతీయ రాజకీయాలపై కన్నేశారు. విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చి ప్రధాని పదవి చేపట్టాలని అభిలషిస్తున్నారని ప్రచారం
జరుగుతోంది.
2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ వారసుడు, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సారథ్యం వహిస్తారని నితీశ్ ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అధిక సీట్లు సాధించి ప్రధాని పదవికి గట్టి పోటీదారుగా నిలవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అయితే వేర్వేరు పార్టీలుగా పోటీ చేసేకంటే, జేడీయూ, ఆర్‌జేడీ విలీనమైపోతే రాష్ట్రంలో అతి పెద్ద శక్తిగా అవతరించవచ్చని.. కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలిపితే బీజేపీని చావుదెబ్బ తీయొచ్చని నితీశ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. గత అక్టోబరులో జరిగిన ఆర్‌జేడీ కార్యవర్గ సమావేశంలో.. పార్టీ పేరు, ఎన్నికల గుర్తును మార్చే అధికారాన్ని అధినేత లాలూకు అప్పగిస్తూ తీర్మానించడం వెనుక వ్యూహమిదేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రెండు పార్టీలూ కలిసిపోవడం ద్వారా ఆవిర్భవించే కొత్త పార్టీకినితీశ్ సారథ్యం వహిస్తారని ఆర్‌జేడీలోని కొందరు నేతలు అంటున్నారు.
తాను ఢిల్లీ వెళ్తే తేజస్వి బిహార్ ప్రభుత్వాన్ని నడుపుతారని నితీశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయం ఆవిర్భవించాలంటే ప్రతిపక్షాల నడుమ విస్తృత ఏకాభిప్రాయం అవసరమని ఆయన పదే పదే చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీహార్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి చెక్ పెట్టే లక్ష్యంతో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.
అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ భారతీయ జనతాపార్టీని గద్దె దించడమే లక్ష్యమని ఇప్పటికే అనేక వేదికలపై నితీశ్ స్పష్టంచేశారు.
పైగా 2025 ఎన్నికల్లో కూటమికి ఆర్జేడీ చీఫ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సారథ్యంవహిస్తారని చెప్పడం ద్వారా కొత్త చర్చకు తెరలేపారు. జేడీయూ, ఆర్జేడీ విలీనం గురించి తరచూ జరుగుతున్న చర్చకు ఈ వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. దీంతో ఈరెండు పార్టీల విలీనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బీజేపీతో బంధాన్ని తెంచేసుకుని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్ దూకుడు పెంచారు. జాతీయ స్థాయిలోనూ మోడీని గద్దె దించేందుకు విపక్షాలను ఏకంచేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ విలీనం దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో న్యూఢిల్లిలో ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ భేటీలో పార్టీ పేరు, గుర్తు మార్చే అధికారం లాలూకు, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు కట్టబెడుతూ తీర్మానం చేశారు. లాలూ విశ్వసనీయ సహాయకుడు భోలా యాదవ్ ప్రతిపాదించిన తీర్మానం అప్పట్లోనే విలీన ఊహాగానాలకు బీజం వేసింది. నవంబర్‌లో బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీ కూడా జేడీయు-ఆర్జేడీ విలీనం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ పరిణామ క్రమాలన్నిటినీ విశ్లేషిస్తే, తెరవెనుక భారీ వ్యూహానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, ఇది రెండు పార్టీల విలీనానికి దారితీయొచ్చనే బలమైన సంకేతాలన ఇస్తున్నది. ఇప్పుడు జేడీయూ-ఆర్జేడీ విలీనం జరిగితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు నితీశ్ కుమార్ దాని నాయకుడిగా ఎదగవచ్చు. బీహార్‌లో తేజస్వీ యాదవ్ ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం ఉంది. సీఎం నితీశ్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాలతోపాటు, ఆయన సొంతపార్టీ అయిన జేడీయూలోనూ ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఆర్జేడీలో జేడీయూ విలీనాన్ని నితీశ్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అలాంటిదేమీ లేదంటున్నారు. ఇదంతా మీడియా ప్రచారమేనని, బీజేపీ కుట్రలో భాగమేనని ఆరోపిస్తున్నారు. జేడీయూ
నాయకుడు ఉపేంద్ర కుష్వాహా .. ఆర్జేడీతో విలీనానికి ఎంతమాత్రం అవకాశం లేదని తేల్చిచెప్పారు. రెండు పార్టీలను విలీనం చేయడం ఆత్మహత్య సదృశమే అవుతుందని నొక్కిచెప్పారు.
ఇలాంటి ఊహాగానాలకు, తప్పుదోవ పట్టించే వార్తలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. కాగా, నితీశ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత సుశీల్ మోడీ మాట్లాడుతూ, జేడీయూ నేతలు ఆర్జేడీలోకి ఫిరాయిస్తారనే భయంతోనే విలీనాన్ని ముందుకు తెచ్చారని చెప్పారు. ముఖ్యంగా ఆర్జేడీతో తిరిగి పొత్తు పెట్టుకున్న తర్వాత, జేడీయూ ఎమ్మెల్యేలు తేజస్వీ చెంతకు చేరేందుకు వేచిచూస్తున్నారని పేర్కొన్నారు. బీహార్‌లో 2005 అసెంబ్లి ఎన్నికలు 15 ఏళ్ల లాలూ-రబ్రీ పాలనకు ముగింపు పలికాయి. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని, లాలూకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, 2013లో బీజేపీని పక్కనబెట్టిన నితీశ్ ఆర్జేడీతో చేతులు కలిపారు. 2017లో ఆర్జేడీని కాదనుకుని బీజేపీతో జతకట్టారు. మళ్లి 2022లో ఆర్జేడీతో చెట్టపట్టాల్ వేశారు.
నిజానికి ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల సమష్టి శక్తి అయిన జనతాదళ్‌కి చెందినవి. జనతాదళ్‌లో చీలికల తర్వాత యూపీలో
సమాజ్‌వాది పార్టీ ఆవిర్భవించింది.
హర్యానా, కర్ణాటక, ఒడిశాలలో జేడీయూ చీలిక వర్గాలు కొత్త పార్టీలుగా పురుడు పోసుకున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ 1997 నుంచి ఆర్జేడీకి ఒక రూపం ఇచ్చారు. అయితే, అక్టోబర్ 2003లో శరద్ యాదవ్‌కి చెందిన జనతాదళ్‌వర్గం, జార్జి ఫెర్నాండెజ్‌కి చెందిన సమతాపార్టీ విలీనంతో జేడీ(యు) ఏర్పాటైంది. ఇందులో నితీశ్ కూడా భాగమయ్యారు. ఆర్జేడీ, జేడీయూ విలీనం కాబోతున్నాయనే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్య.. తేజస్విని ముఖ్యమంత్రిని చేసి, తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తున్నారనే సంకేతాన్నిస్తున్నది. ఈ విషయాన్ని నితీశ్‌కుమార్ ఖండిస్తున్నప్పటికీ.. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఢీకొట్టగల అతి కొద్దిమంది కాంగ్రెసేతర నాయకుల్లో ఆయన ఒకడిగా ఉన్నారు. ఇదిలావుంటే బీహార్లో ఆర్జేడీకి యాదవ్, ముస్లిం సామాజిక వర్గాలు ప్రధాన ఓటు బ్యాంకు కాగా, ఇతర బీసీ సామాజిక వర్గాలన్నీ జేడీయూ ఓటు బ్యాంకుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లలన్ సింగ్ తన పోస్టర్‌లో సామాజిక న్యాయం అనే పదాన్ని వాడటం ఆ రెండు పార్టీలు విలీనం కాబోతున్నాయనడానికి మరో సంకేతంగా నిలుస్తోంది.
దీంతో ముందస్తు ఊహగానాల ప్రకారమే ముఖ్యమంత్రి కుర్చీ నుంచి నితీశ్ కుమార్తప్పుకోనున్నారు. ఆ కుర్చీలో తేజశ్వీ యాదవ్‌ను కూర్చోబెట్టనున్నారు. అయితే అది ఇప్పుడు కాదు, వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి వేసుకున్న ప్లాన్ గా తెలుస్తోంది. ఇది ప్రస్తుతం బీజేపీయేతర పక్షాలను ఏకం చేసి జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు పనిలో ఉన్న నితీశ్ కుమార్ఇక ఎంత మాత్రం బిహార్ రాజకీయాల్లో ఉండరని కొంత కాలంగా వస్తున్న వార్తలకు ఆయన అధికారికంగా నిర్ధారించినట్లైంది.
మోడీని ఓడించాలంటే, విపక్షాలన్నీ ఐక్యం కాక తప్పదన్నది .. అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే .. నితీష్ అడుగులు వేస్తున్నారన్న
వాదనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నితీష్ వ్యూహం ఏమేరకు కలిసివస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో
మళ్లీ కలుద్దాం..