Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో జనసేనాని వ్యాఖ్యలు మరో రచ్చకు కారణం కానున్నాయా..?

ఏపీలో జనసేనాని వ్యాఖ్యలు మరో రచ్చకు కారణం కానున్నాయా..?

  • ఇంతకీ .. పవన్ ఏమని వ్యాఖ్యానించారు..?
  • దీని వెనుక రాజకీయ వ్యూహముందా..? దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు..?

జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో అన్ని పార్టీలకు స్థలాలు ఇస్తున్నారు జనసేన పార్టీ కార్యాలయం కోసం కూడా అమరావతిలో స్థలం తీసుకుంటే బాగుంటుంది అని తనకు ప్రతిపాదించారని.. కానీ దానికి తాను అంగీకరించలేదన్నారు. సొంత పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాల్సిన సొమ్ముతో జనసేన పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నామని చెప్పారు.

అన్యాయానికి గురవుతున్నవారికి జనసేన పార్టీ కార్యాలయం ఎప్పుడు అండ‌గా, అందుబాటులో ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు. అసలు వారాహి వాహనం ఆంధ్రప్రదేశ్‌లో ఎలా తిరుగుతుందో చూస్తామని కొందరు అన్నారని.. వారంతా ఇప్పుడు ఏమైపోయారని పవన్ ఎద్దేవా చేశారు.

తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినే గాని బాబాయిని హత్య చేయడం, కోడి కత్తితో పొడిపించుకోవడం లాంటి పనులు చేసే వ్యక్తిని కాదన్నారు. వేల కోట్లు దోచుకొని, వేల ఎకరాలను కబ్జా చేసిన మీకే అంత ధైర్యం ఉంటే.. ఏ తప్పు చేయని మాకు ఎంత ధైర్యం ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు.

వైసిపి వాళ్లకు దమ్ముంటే తనతో గొడవ పెట్టుకోవాలని, అలా గొడవ పెట్టుకుంటే అప్పుడు తానేంటో చూపిస్తానన్నారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతలకు ఇంకా మద‌మెక్కాలని, అప్పుడు వారాహి దండయాత్ర మొదలవుతుందని అన్నారు. బ్రిటిష్ వాళ్లు మన దేశం విడిచి వెళ్లిపోయినా.. ఇప్పటికీ ఈ వైసీపీ నాయకులకి బ్రిటిష్ వాళ్ళ తరహాలో అహంకారం ఉందన్నారు.

దావోస్ ఎందుకు వెళ్లలేదు అంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అని వెర్రిగొర్రె మాటలు మాట్లాడడం మానుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తను పూజా కార్యక్రమాలు చేస్తే కొందరు కూర్చోబెట్టి నువ్వు పూర్తిగా మారిపోయావు అంటూ మాట్లాడారని .. ఇదే మాట ఒక ముస్లిం వ్యక్తితోనో.. లేక ఒక క్రైస్తవుడితోనే అనగలరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

సనాతన ధర్మాన్ని నేను పాటిస్తుంటే దాన్ని విమర్శించే, ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. భవిష్యత్తులో భారతదేశంలో కల్చర్ మీద పోరాటాలు జరిగే అవకాశం ఉందన్నారు. నాస్తికులు ఎవరైనా సరే లౌకికవాదం ముసుగులో సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూడవద్దని సూచించారు. దేవుళ్లను దూషిస్తే అది కేవలం బ్రాహ్మణ సమాజానికి బాధ కలిగిస్తుందని అనుకోవద్దని.. హిందూ మతాన్ని ఆచరించే ప్రతి వ్యక్తికి బాధ కలుగుతుందని గుర్తుంచుకోవాలన్నారు.

  • ప్రవక్తను అనాలంటే భయమేస్తుంది.. ఏసుక్రీస్తును అనాలంటే భయమేస్తుంది మరి హిందూ దేవుళ్లను దూషించే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందని పవన్ ప్రశ్నించారు..

నేరమయం కానీ ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్నది తన ఆకాంక్ష అని పవన్ చెప్పారు. రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో అమాయకంగా జగన్మోహన్ రెడ్డిని చాలా మంది నమ్మారని వాళ్లంతా ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు. తనతో సహా ఏ నాయకుడి మీద గుడ్డి అభిమానం పెంచుకోవద్దని, మితిమీరి వ్యక్తిగత ఆరాధన చేయవద్దని సూచించారు.

ఆంధ్ర ప్రజలకు కులం మీదున్నంత పిచ్చి.. తెలుగు జాతి మీద లేకపోవడమే తనకు బాధ కలిగిస్తుందని అన్నారు. రాజమండ్రిలో ఒక వైసీపీ నాయకురాలు
పాలించాలన్న మేమే.. పాలించేది మేమే అంటూ మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలు ఇతర కులస్తులకు ఎంత బాధ కలిగిస్తాయో వారికి తెలియదా అని ప్రశ్నించారు. రాజమండ్రి వైసీపీ మహిళా నాయకురాలు చేసిన ఈ వ్యాఖ్యలకు వైసీపీ నాయకత్వం క్షమాపణలు చెప్పించాలని, అలా చేయనిపక్షంలో వైసీపీ పెద్దలు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారని అనుకోవాల్సి ఉంటుందన్నారు.

నేను సీఎం అయితే ఏంటి కాకుంటే ఏంటి? మీరు అనుకుంటే నేను సీఎం అవుతానని పవన్ అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఏమైపోతుంది. తెలంగాణ ప్రజల్లో ఉన్న చైతన్యం ఇక్కడ ఉంటే బాగుండేది. ఏపీని మరోసారి విడగొడతామంటే తోలు తీస్తాం. మీకు మరో రాష్ట్రం కావాలా. వేర్పాటు ధోరణితో ఉంటే నా అంతటి తీవ్రవాదిని చూడరు. రాష్ట్రాలు, ప్రజలను విడగొట్టింది ఇక చాలు ఆపేయండి అంటూ పవన్ హెచ్చరించారు.

రాష్ట్రాన్ని విడగొడతామంటే మేము ఊరుకుంటామా. పిచ్చి నాయకులు, ముసలి నాయకుల మాటలు పట్టించుకోకండి. కోడి కత్తులు గీసుకుంటే ఏపీ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదంటారు. రాష్ట్రాన్ని విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. మా నేల కాదా ఇది. మా దేశం కాదా. రాయలసీమ అభివృద్ధి అని అంటారు. ఇంతకు రాయలసీమ అభివృద్ధికి మీరు ఏం చేశారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ కోసం గుంటూరులో ప్రాణ త్యాగం చేశారు.

మీ సొంత లాభం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. ప్రజలు కూడా రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి అని పవన్ సూచించారు.

  • పవన్ కళ్యాణ్ ఇలా వ్యాఖ్యలు చేశారో లేదో వైసీపీ నాయకులూ కౌంటర్లు ఇస్తున్నారు..

పవన్ వ్యాఖ్యలపై సజ్జల మండిపడ్డారు. నాపై కావాలనే విష ప్రచారం చేస్తున్నారు. నిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయి అని అంటున్నారు. మీ దగ్గర ఆధారాలున్నాయా అని సజ్జల పవన్ ను ప్రశ్నించారు. రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర వాదం.. ఉత్తరాంధ్రలో ప్రత్యేక ఉత్తరాంధ్ర వాదం వినిపిస్తున్న నాయకులకు పవన్ కల్యాణ్ తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని హెచ్చరించారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో విసిగిపోయామన్నారు. మీ బతుకులకేం తెలుసు? కాన్‌స్టిట్యూషన్‌ అసెంబ్లీ డిబేట్స్‌ చదివారా? అవినీతిలో మునిగిపోయిన.. పబ్లిక్‌ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా? అని
మండిపడ్డారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్య చేసిన సమయ, సందర్భాలు వేరు కావచ్చును.

కానీ, ఎవరైనా వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని అయన చేసిన వ్యాఖ్యలు, ఇక దేహి అంటే కుదరదని ఎస్సీ, ఎస్టీ లకు చేసిన హిత బోధ, అదే విధంగా వ్యక్తి ఆరాధన గురిచి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయనలో ఎక్కడో అక్కడ రగులుతున్న రాజకీయ ఆకాంక్షలకు అద్దం పడుతున్నట్లు
ఉన్నాయి. నిజానికి, నిన్నమొన్న జరిగిన జనసేన తెలంగాణ కార్యకర్తలు, కార్య నిర్వాహకుల సభలోనే, పవన్ కళ్యాణ్ కొత్త ఆలోచనలకు ముసుగు తీశారు.

పొత్తుల విషయంలో స్పష్టత ఇస్తూనే, రాజకీయ కొత్త కోణాన్ని అవిష్కరించారు. ఎక్కడా ఎక్కాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలనే నానుడి తిరగేసి, ఎక్కడ తగ్గాలోనే కాదు, ఎక్కడ ఎక్కాలో కూడా తెలియాలనే అర్థం వచ్చే విధంగా మాటల గారడీ చేశారు. పొత్తుల విషయంలో ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంత దూరం అనే సంకేతాలు ఇచ్చారు.

ముఖ్యంగా ఏపీలో బీజేపీ పొత్తు వుంది, ఉంటుంది అంటూనే, అవసరం అయితే కొత్త పొత్తులు ఉంటాయని అన్నారు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారని.. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని పేర్కొన్నారు. సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాదు.. సమగ్రంగా చూడాలని అన్నారు. జనాభాకు తగ్గట్టు బడ్జెట్‌లో కేటాయింపులు జరగాలని అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ ఎస్సీ,ఎస్టీలను దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు కానీ, అందులో రాజకీయ ధ్వనులున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ధ్వనించిన రాజకీయ వ్యాఖ్యానం… పవన్ కళ్యాణ్ లో మరో కోణాన్ని అవిష్కరించిందని, సినిమా భాషలో చెప్పాలంటే, మరో నటుడిని రాజకీయ తెరకు పరిచయం చేసిందని అంటున్నారు.

మరి పవన్ వ్యాఖ్యలపై ఎంత రచ్చ జరగనుందన్నదే ఆసక్తికరంగా మారింది..

Must Read

spot_img