ఏపీలో బీజేపీ వరుస కార్యక్రమాలు చూస్తుంటే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా 13 వేల గ్రామాల్లో బీజేపీ నేతలు పాదయాత్ర చేస్తామని ప్రకటించడంతో అధికార వైసీపీలో కలవరం రేపుతోంది. ఉన్నపలంగా ఢిల్లీ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో రాష్ట్ర బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటనకు సంబంధించి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
బీజేపీ కార్యక్రమాలపై వైసీపీ ముద్ర ఉండకుండా చూడాలని ప్రత్యేక ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను వైసీపీ హైజాక్ చేస్తూ వస్తోంది. అందుకే ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నా… దానిని వైసీపీ నేతలు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న ప్రధాని విశాఖ పర్యటనను తమ సొంత పార్టీ కార్యక్రమంలా వైసీపీ నేతలు మార్చేశారు.అటు రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మించి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా అవి జగన్ పై అభిమానంతో చేస్తున్నవేనన్న ప్రచారం ఉంది.
దీనికి బీజేపీలోని వర్గాలే కారణం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అచేతనం చేయాలన్న ఉద్దేశ్యంతో కొందరు సొంత పార్టీ నాయకులే ఈ ప్రచారానికి తెగబడ్డారు. తెర వెనుక ఉండి రాజకీయ డ్రామాను ఆడిస్తున్నారు. దీనిపై హైకమాండ్ కు నివేదికలు వెళ్లడంతో ఢిల్లీ పెద్దలు ఏపీ బీజేపీపై సీరియస్ గా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అందుకే ఒక లైన్ ఇచ్చి జగన్ సర్కారుపై పోరాటం చేయాలని ఆదేశాలిచ్చారని టాక్వి నిపిస్తోంది. గత ఎన్నికల తరువాత తొలిసారిగా అమిత్ షా ఏపీలో రాజకీయ పర్యటన చేస్తున్నారు. అంతకంటే ముందుగానే ఏపీ బీజేపీ నేతలను అలెర్ట్ చేశారు.
దీంతో 13 వేల గ్రామాల్లో బీజేపీ నేతలు పాదయాత్ర చేసేందుకు డిసైడ్ అయ్యారు. పాదయాత్రల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను హైలెట్ చేసుకొని జగన్ సర్కారుపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు. అమిత్ షా పర్యటన సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు పూర్తి చేయాలన్నకృతనిశ్చయంతో బీజేపీ నేతలు ఉన్నారు. అయితే బీజేపీ తాజా వ్యూహంతో వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. ఇప్పటివరకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఎన్నికల వేళ రూటు మార్చడం .. అధికార పార్టీకి కష్టమేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీ సర్కారుపై పతాక స్థాయిలో పోరాటం చేసే సమయంలో అటు జగన్ నీరుగార్చుతూ వస్తున్నారు. తరచూ ఢిల్లీ పెద్దలను కలిసి తమంతా ఒక్కటేనన్న సంకేతాలిస్తున్నారు. ఇది ఏపీ బీజేపీ నేతలకు ప్రతిబంధకంగా మారింది. కేంద్ర పెద్దలతో సన్నిహితంగా మెలుగుతున్నట్టు జగన్ లీకులిచ్చి మరీ ఏపీలో బీజేపీ ప్రయత్నాలపై నీరు పోస్తున్నారు. అటు ఏపీలో బీజేపీ నేతలు సైతం వర్గాలుగా విడిపోయారు.
కొందరు వైసీపీకి అనుకూలంగా.. మరికొందరు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పనులు చక్కబెట్టుకుంటున్న వారు వైసీపీకి ఫేవర్ చేస్తున్నారని, టీడీపీ నుంచి అవసరాల కోసం వచ్చేవారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా నడుచుకుంటున్నారన్న ప్రచారం ఉంది. ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నవారు మాత్రం హైకమాండ్ ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో వైసీపీ సర్కారుపై పోరాటానికి భారీగానే ప్లాన్ చేశారు. బీజేపీ నేతలు గ్రామ, గ్రామానికి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్ర బీజేపీ నుంచి వస్తున్న సూచనల మేరకు పాదయాత్రలకు రెడీ అవుతున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రతీ గ్రామంలోనూ భారతీయ జనతా పార్టీ ఉనికిని చాటినట్లవుతుంది. బీజేపీపై అభిమానం ఉన్నప్పటికీ .. సంస్థాగతంగా లేని నిర్మాణం వల్ల కొంత మంది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితిని పాదయాత్ర ద్వారా అధిగమించి గ్రామాల్లోని బీజేపీ అభిమానులను ఏకతాటిపైకి తెచ్చేందుకు వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటం చేయడం ద్వారా.. ప్రత్యామ్నాయం తామేనన్న భావన ప్రజలకు కల్పించేలా బీజేపీ పోరాటం ఉండనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బీజేపీ వినూత్నంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదారు వేల సభలను నిర్వహించింది. భారీ బహిరంగసభ జోలికి వెళ్లకుండా కాలనీలు.. గ్రామాల్లో ఈ సభలను నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధాన పార్టీతో పోలిస్తే.. పార్టీ క్యాడర్ తక్కువే ఉన్నప్పటికీ.. ఉన్న క్రియాశీల కార్యకర్తలు, నేతలతోనే విస్తృతంగా నిర్వహించిన ఈ
సమావేశాలపై మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.
ఢిల్లీ వర్గాల నుంచి ఏపీ బీజేపీ నాయకులకు ప్రత్యేక ఆదేశాలు వచ్చాయా? ఇక పోరాటమే శరణ్యంగా భావిస్తున్నారా?
జాతీయ రాజకీయాలు లేదా ఇతర కారణాలు ఏమైతేనేం ఇంత కాలం … బీజేపీ హైకమాండ్ పెద్దగా ఏపీలో బీజేపీ బలోపేతంపై పట్టించుకోలేదు. కానీ ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీ నేతలకు వరుసగా టాస్క్‌లు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు వరుసగా ఏపీకి వస్తున్నారు. అమిత్ షా కూడా వస్తున్నారంటే.. ఖచ్చితంగా ఏపీపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టిందని నమ్ముతున్నారు.
ఇంత కాలం హైకమాండ్ పెద్దగా పట్టించుకోకపోవటంతో ఏపీ బీజేపీ నేతలకూ దిశానిర్దేశం లేకుండా పోయింది. ఇక ముందు అలాంటి పరిస్థితి ఉండదని, తెలంగాణ తరహాలో పార్టీ ముందుకెళ్తుందనే విశ్వాసంతో ఆ పార్టీ నేతలు ఉన్నారని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో బీజేపీ డబుల్ గేమ్ కాదు త్రిబుల్ గేమ్
ఆడుతోంది. ఒక వైపు జనసేన మిత్రపక్షమని చెబుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్న సంకేతాలు ఇస్తోంది. అంతే కాకుండా అధికార వైసీపీకి కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది.
ఈ రకమైన తీరుతో బీజేపీ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటోంది, ఏం సాధించాలనుకుంటోంది అన్నది పక్కన పెడితే.. రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణకు రోడ్ మ్యాప్ ప్రకటించేసింది. జనవరి 26 తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత పాదయాత్రలకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించి సన్నాహకంగా జనవరి 8న కర్నూలులో, హిందూపురంలో బహిరంగ సభలు నిర్వహించనుంది. అయితే రాష్ట్రంలో బీజేపీ ఏం చేసినా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న జగన్అనూకూల వైఖరి, కొందరు బీజేపీ రాష్ట్ర నేతల తీరు కారణంగా ఆ పార్టీని జనం విశ్వసించడం లేదు. దీంతో జనవరి 26 తరువాత నుంచి బీజేపీ రాష్ట్రంలో చేపట్టనున్న సంపర్క పాదయాత్రలలో రాష్ట్రంలో బీజేపీ ఏం చేసినా, ఏ మాట్లాడినా జగన్ కు ప్రయోజనం చేకూర్చేందుకేనని అత్యధికులు
విశ్వసిస్తున్నారు.
దీంతో ఇప్పుడు బీజేపీ రూటు మార్చి సంపర్క యాత్రలలో వైసీపీ సర్కార్ వైఫల్యాలనే టార్గెట్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే సంపర్క్ యాత్రలలో కూడా అధికార పార్టీపై పైపై విమర్శలకు మాత్రమే బీజేపీ పరిమితమౌతుందనే అంతా భావిస్తున్నారు. దీనికి భిన్నంగా ఏపీ బీజేపీ వ్యవహరిస్తుందో లేదోనన్నదే చర్చనీయాంశంగా మారింది. అయితే అందుకు అగ్రనేతలు, స్థానిక నేతలు ఎంతమేరకు మద్ధతు పలుకుతారన్నదే తేలాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరి సంపర్క్ యాత్రలతో ఏపీలో బీజేపీ బలపడుతుందో లేదో వేచి చూడాల్సిందే.