Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో బీజేపీకి మరో షాక్ తగలనుందా..?

ఏపీలో బీజేపీకి మరో షాక్ తగలనుందా..?

  • కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో నేత పయనించనున్నారా..?
  • దీంతో చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న నానుడి వినిపిస్తోందా..?
  • ఇంతకీ ఎవరా నేత…? ఏమా కథ ..?

ఏపీ బీజేపీలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్టైలే వేరు. ఆయన భౌతికంగా కాషాయదళంలో ఉన్నా.. మనసు మాత్రం పసుపు పార్టీ వైపే ఉంటుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అప్పటి సీఎం చంద్రబాబును ఇంద్రుడు, చంద్రుడు అంటూ వర్ణించేవారు. సినిమా హీరో శోభన్ బాబుతో పోల్చి బాబు అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేసేవారు. 2014 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. కానీ ఇతర బీజేపీ నాయకులకంటే భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారు వైసీపీ, టీడీపీలను విమర్శిస్తే, రాజుగారు మాత్రం వైసీపీని, జగన్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో కాపాయ ముసుగు తీసే పనిలో పడ్డారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటే సైకిలెక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీలో టీడీపీకి అనుకూలమైన టీమ్ ఒకటుంది.

అందులో విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండాలనుకున్న బలమైన నాయకుల్లో ఈయన ఒకరు. అలా అయితే మరోసారి ఎన్నికల్లో గెలుపొంది ఎంచక్కా మంత్రి కావాలన్నది రాజుగారి అభిమతం. కానీ పరిస్థితులు అంత అనుకూలం కనిపించడం లేదు. అందుకే హైకమాండ్ కు షాకివ్వాలని చూస్తున్నారని టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న కన్నా లక్ష్మీనారాయణను గుంటూరు వెళ్లి మరీ కలిసొచ్చారు. పనిలో పనిగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బాగాలేదని చెప్పుకొచ్చారు.

కేంద్ర పెద్దలకు రాష్ట్ర బీజేపీ నేతలతో మాట్లాడేందుకు తీరుబాటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన మాటలను మిగతా రాష్ట్ర బీజేపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. రాజుగారి మనసు తెలుసు కనుక ఆ వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలని బీజేపీ పెద్ద ఆశలే పెట్టుకుంది. అయితే ఆ పార్టీ ఆశలు ఆదిలోనే ఆవిరైపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం కొద్దిరోజులుగా ఆ పార్టీలో సాగుతోన్న పరిస్థితులే కారణమన్నది వీరి వాదన. మరోవైపు అధిష్టానం సైతం చూసీచూడనట్లు వ్యవహరించడం కూడా కారణమన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలి నచ్చకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని కన్నా లక్ష్మీనారాయణ కుండబద్దలు కొట్టారు. ఇక ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో బీజేపీ నేత ఉన్నారని టాక్ నడుస్తోంది. 2014లో విశాఖ ఉత్తరం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన విష్ణుకుమార్ రాజు బీజేపీకి గుడ్ బై కొడతారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విష్ణుకుమార్ రాజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

ఆయన క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశాక విష్ణుకుమార్ రాజు గుంటూరు వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కన్నా లక్ష్మీనారాయణ బాటలోనే విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీకి రాజీనామా చేస్తారని.. టీడీపీలో చేరతారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అందులోనూ విష్ణుకుమార్ రాజు కూడా ఏపీ బీజేపీలో నెలకొన్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది పార్టీ అధిష్టానానికి కూడా తెలియకుండా చేస్తున్నారని పరోక్షంగా సోము వీర్రాజుపై విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఆయన బీజేపీకి రాజీనామా చేయడం ఖాయమేనని అంటున్నారు. మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తనతోపాటు భారీ స్థాయిలో నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలిపారు. ఇప్పుడు కన్నా బాటలోనే విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీకి రాజీనామా చేస్తే ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందే ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ అవి రూమర్స్గ్ గానే మిగిలిపోయాయి.

ఇప్పుడు ఆయన కన్నాతో భేటీ కావడంతో టీడీపీలో చేరుతారనే తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో.. విష్ణుకు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. దీంతో ఈయన కన్నాబాటలోనే పయనించనున్నారన్న టాక్ వెల్లువెత్తుతోంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే బీజేపీకి ఏపీకి కష్టకాలమేనని అంటున్నారు. వాస్తవానికి విష్ణుకుమార్ రాజు కామెంట్స్ ఎప్పుడూ వైసీపీని టార్గెట్ చేసేలా ఉంటాయి. టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యానిస్తుంటారు. అదే సమయంలో మిగతా బీజేపీ నాయకుల మాటలకు కౌంటర్ ఇచ్చేలా కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఏ నేతలను వదులుకోవడానికి బీజేపీ ఇష్టపడదు కనుక.. రాజుగారు స్వేచ్ఛగా మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కన్నాను కలిసిన తరువాత ఆయన సైకిలెక్కడం ఖాయమని తెలుస్తోంది.

  • విష్ణుకుమార్ రాజు దారెటు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్..

కానీ దీనిపై రాజు గారు క్లారిటీ ఇవ్వడం లేదు. చివరి వరకూ వేచిచూసి పొత్తు కుదిరతే బీజేపీ తరుపున.. లేకుంటే సైకిలెక్కి టీడీపీ తరుపున పోటీచేయాలని రాజుగారు భావిస్తున్నారుట. అందుకే కన్నాను కలిసి హైకమాండ్ ను కాస్తా కలవరపాటుకు గురిచేయాలని భావించారుట. కొద్దిరోజులు ఆగి పరిస్థితులు చూశాక రాజుగారు అడుగులు వేస్తారని టాక్ వినిపిస్తోంది. దీంతో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడిన తరువాత ఆ పార్టీలోని మరికొందరు అసంతృప్తులూ అదే బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు .. కన్నాతో ఉన్న వ్యక్తిగత అనుబంధం కారణంగా వచ్చి కలిసినట్లు ఆయన చెప్పారు. తాను పార్టీ మారడం లేదని అన్నారు. అయితే, విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల తీవ్రత చూసినవారంతా ఆయన పార్టీ మారడం ఖాయమంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పార్టీలో చురుగ్గానే ఉన్నప్పటికీ సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడైన తరువాత ఆయనకు ప్రాధాన్యం తగ్గింది. దీంతో ఆయన కూడా సైలెంటయ్యారు. ఇప్పుడు కన్నా బీజేపీని వీడడంతో విష్ణకుమార్ కూడా వీడుతారన్న ప్రచారం జరుగుతోంది.

కన్నా ఇచ్చిన షాక్ నుంచి కోలుకుంటున్న ఏపీ బీజేపీకి ఝలక్ ఇచ్చేందుకు మరికొందరు నేతలు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ అనుసరిస్తున్న వైఖరి కారణంగానే నేతలు ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఇలా ఉంటే..
ఇటీవల ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన కామెంట్స్‌కు పురంధేశ్వరి కౌంటర్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్‌ అయ్యింది. రంగా విషయంలో జీవీఎల్ కామెంట్స్ చేయగా.. ఎన్టీఆర్ , వైఎస్ఆర్ గురించి పురంధేశ్వరి ప్రస్తావించారు.

పురంధేశ్వరి ఈ రకంగా రియాక్ట్ కావడంతో.. ఆమె ఏ రకమైన ఆలోచనతో ఉన్నారనే దానిపై ఏపీ రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ నాయకత్వం.. ఏపీ బీజేపీలోని నేతల అభిప్రాయాలు తీసుకోకుండా ముందుకు సాగడం వల్ల ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి కన్నా తరువాత ఏపీ బీజేపీని వీడే వారి జాబితాలో విష్ణుకుమార్ రాజు, పురంధేశ్వరి కూడా ఉంటారా ? ఒకవేళ ఉంటే వాళ్లు ఏ పార్టీలో చేరతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరి విష్ణుకుమార్ రాజు దారెటు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

Must Read

spot_img