Homeతెలంగాణకేసీఆర్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు..?

కేసీఆర్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు..?

 • గవర్నర్ పై ప్రతీకార రాజకీయం కేసీఆర్ కే దెబ్బకొట్టిందా..?
 • అందుకే ఇప్పటివరకు తగ్గేదేలే .. అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్ .. ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారా..
 • అసలు కేసీఆర్ .. వ్యూహం ఎందుకు తప్పిందన్నదే హాట్ టాపిక్ గా మారింది.

రాజకీయం అంటే హుందాగా ఉండాలి.. మాటలు తక్కువ.. చేతలు ఎక్కువగా కనిపించాలి. బలం ఉంది కదా అని డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లు.. ఎవరిని పడితే వారిని ఇష్టానుసారం మాట్లాడితే వచ్చే కిరీటం ఏమీ ఉండదు.. పైగా చూసేవారికే రోత పడుతుంది. అసహ్యం పెరుగుతుంది. ఎందుకురా ఇలాంటి వాడిని ఎన్నుకున్నామన్న భావన కలుగుతుంది. కానీ, ప్రజాస్వామ్యంలో మళ్లీ ఎన్నికలు వస్తాయి.. అప్పుడు ఫలితం అనుభవించక తప్పదు.

ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఇప్పటికే ఆనేకమార్లు రుజువైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీరు కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంటేం రాజకీయ చాణక్యుడని పేరు. ఆయన రాజకీయాల్ని రాజకీయంగా చేస్తారు. ఎక్కడ ఆవేశ పడాలో ఎక్కడ సైలెంట్‌ గా ఉండాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెబుతూంటారు.

కానీ తెలంగాణ గవర్నర్‌ విషయంలో ఆయన ఆవేశంతో చేసిన రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా ఆయన తనదే తప్పని ఒప్పుకోవాల్సిన పరిస్థితికి తెచ్చాయి. అవమానాలను ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చిన గవర్నర్‌తమిళిపై ఒక్క దెబ్బతో కేసీఆర్‌ను కాళ్ల బేరానికి తెచ్చినంత పనిచేసింది. ఇన్నాళ్లూ గవర్నర్‌ సర్కార్‌ను ఇబ్బంది పెట్టినా.. ఇప్పుడు ఒక్క పనితో కేసీఆర్‌ తానే తప్పు చేసినట్లు కోర్టులో అంగీకరించాల్సిన పరిస్థితి చేజేతులా తెచ్చుకున్నారు.

తనను ఇబ్బంది పెడుతున్న గవర్నర్‌ను ఇబ్బంది పెట్టాలన్న కేసీఆర్‌ ఆలోచన సమస్యకు కారణమైంది. గవర్నర్‌ కు ప్రోటోకాల్‌ ఇవ్వడం లేదు. చివరికి ఆమెను ఇబ్బంది పెట్టడానికే అన్నట్లుగా రిపబ్లిక్‌ డే వేడుకల్ని నిర్వహించలేదు. కానీ ఇక్కడ చూడాల్సింది గవర్నర్‌ తమిళిసై ను కాదు..దేశాన్ని. కానీ కేసీఆర్‌ అలా కూడా చూడలేకపోయారు. చివరికి బడ్జెట్‌ ప్రసంగాన్ని కూడా లేకుండా చేశారు. గవర్నర్‌పై కోపంతో ఇలా చేశారు.

బడ్జెట్‌కు గవర్నర్‌ ఆమోదం అవసరం లేకపోతే.. కేసీఆర్‌ తాను అనుకున్నట్లుగా చేసేవారు. ఇన్నాళ్లూ తెలంగాణ సర్కార్‌ అవమానాలను, మంత్రుల విమర్శలు, నేతల చులకన మాటలను మౌనంగా భరిస్తూ వచ్చిన గవర్నర్‌ తమిళిసై ఇప్పుడు అదును చూసి దెబ్బకొట్టారు. తాను ఏం చేయగలనో ప్రభుత్వానికి చూపించారు. ఈ విషయంలో గవర్నర్‌కు ప్రజల మద్దతు లభించడం కేసీఆర్‌కు మింగుడు పడని అంశంగా మారిందని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

  • కేసీఆర్‌కు ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతలే..

  తమ చర్యల ద్వారా ప్రభుత్వ పెద్దలే అలాంటి పరిస్థితి కల్పించారు. గవర్నర్‌ను విమర్శిస్తే సీఎం సంతోషపడతారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి లాంటి వారు చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. చివరికి ప్రభుత్వం తప్పు చేసినట్లుగా తలొంచుకుని గవర్నర్‌ అధికారాల్ని అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు సగౌరవంగా వెళ్లి ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి గవర్నర్‌కు ఆహ్వానం ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో దోషిగా ప్రభుత్వం నిలబడింది. అధికారం ఉందని, ప్రజలు గెలిపించారని విర్రవీగుతున్న కేసీఆర్‌ ఆవేశం కారణంగా తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ఆయన తల దించుకునేలా చేశాయి. గవర్నర్ తెలంగాణ సర్కార్ ను ఇబ్బంది పెడుతున్నారు. అందులో డౌట్ లేదు. కానీ పోటీగా తాను గవర్నర్ ను ఇబ్బంది పెట్టాలని సీఎం కేసీఆర్ అనుకోవడంతోనే సమస్య వచ్చినట్లుగా కనిపిస్తోంది. గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు.

  కానీ ఇంత చేస్తున్న ప్రభుత్వానికి తాను ఏం చేయగలనో నిరూపించాలని గవర్నర్ అనుకున్నారు. ఈ విషయంలో గవర్నర్ కు కూడా కొంత ప్రజల మద్దతు లభిస్తుంది. తమ చర్యల ద్వారా ప్రభుత్వ పెద్దలే అలాంటి పరిస్థితి కల్పించారు. దీనికి కారణం కేసీఆర్ అధికారంతో వచ్చిన ఆవేశం కారణంగా తీసుకున్న నిర్ణయాలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు. దేశ రాజకీయాల్లో తెలంగాణ ప్రత్యేకంగా నిలుస్తుంది.

  అందుకు ఇక్కడ కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలే కారణం అన్న చర్చ సాగుతోంది. రాజకీయ చదరంగంలో కేసీఆర్ వేసే పావు చివరి వరకు సస్పెన్స్ గానే ఉంటుంది. అంతేకాకుండా రాజకీయంగా ఆయన వేసే స్కెచ్ ఎప్పుడూ సక్సెస్ అవుతాయని అంటుంటారు. కానీ ఇటీవల ఆయన పరిమితి దాటి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రాజకీయంలో ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతకైనా ముందుకు వెళ్లే ఆయన గవర్నర్ విషయంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్న విషయాన్ని మరిచిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

  వ్యక్తిగతంగా గవర్నర్ అంటే కేసీఆర్ కు కోపం కావచ్చు. కానీ కొన్ని విషయాల్లో రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని ఆయనకు తెలియంది కాదు. కానీ వాటిపై నిర్లక్ష్యంగా ఉండడంతో తాను ఇంత కాలం తప్పు చేస్తున్నానని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వంలో గవర్నర్ అంతర్భాగం.

  కానీ గవర్నర్ పేరుతోనే ప్రభుత్వం నడుస్తుంది. రెండు వ్యవస్థలు సమన్వయంగా ఉంటేనే ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే ఆందోళన వాతావరణం ఏర్పడుతుంది. రాజకీయాలకు అతీతంగా గవర్నర్ నడుచుకోవాలి. అలాగే రాజకీయ నాయకులు గవర్నర్ వ్యవస్థను గౌరవించాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు రావని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  కానీ కేసీఆర్ గవర్నర్ విషయంలో తన రాజకీయ మార్క్ చూపించాలనుకున్నాడు. గవర్నర్ వ్యవస్థ అవసరం లేకుండానే ప్రభుత్వం సాగుతుందని నిరూపించాలనుకున్నాడు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంతో ఫైట్ మొదలుపెట్టిన కేసీఆర్ ఆ కోపాన్ని గవర్నర్ పై చూపించారు. కరోనా పేరుతో రిపబ్లిక్ వేడుకలను పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించకుండా రాజ్ భవన్ లోనే నిర్వహించేలా చేశారు.

  అందుకు బీజేపీకి చెందిన గవర్నర్ కావడమే. గవర్నర్ విషయంలో ప్రతీకారం తీర్చుకుంటే కేంద్రం దారిలోకి వస్తుందని కేసీఆర్ అనుకున్నారు. కానీ కేసీఆర్ అవమానించేది గవర్నర్ ను కాదని, వ్యవస్థనని ఇప్పుడు తెలుసుకున్నారు. ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేస్తే కేసీఆర్ దానికి సమాధానం చెప్పగలగాలి. కానీ కేసీఆర్ విమర్శలకు బదులు తనకున్న అధికారంతో ప్రతీకారంతీర్చుకోవాలనుకున్నారని అంటున్నారు. గవర్నర్ రాష్ట్ర పర్యటన చేసినప్పుడు ఒక మహిళగా తనకు భద్రతను ప్రభుత్వం కల్పించాలి.

  అలాగే ప్రొటోకాల్ ప్రకారం అధికారప్రజాప్రతినిధులు ఆహ్వానించేలా ఏర్పాటు చేయాలి. కానీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మేడారం భద్రాచలం వెళ్లిన గవర్నర్ కు కనీసం ఆహ్వానం లేకపోవడం గవర్నర్ వ్యవస్థను చిన్నచూపు చూసినట్లు కాదా..? అని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ రబ్బర్ స్టాంప్ అని అంటూంటారు. కానీ ప్రతి బిల్లుపై గవర్నర్ సంతకం లేకుండా ముందుకు వెళ్లదు. ప్రభుత్వం గవర్నర్ ల మధ్య సయోధ్య వాతావరణం ఉంటే కొన్ని బిల్లులను పూర్తిగా పరిశీలించకుండా ఓకే చెప్పవచ్చు.

  కానీ ఇక్కడ తమిళ సై ప్రతీ బిల్లును పరిశీలించారు. దీంతో కొన్నింటిని పెండింగులో పెట్టారు. అయితే గవర్నర్ రాజకీయ కోణంలోనే ఈ బిల్లులను ఆపారని కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లు వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఒక మహిళగానే కాకుండా గవర్నర్ వ్యవస్థకు ప్రజల నుంచి మరింత మద్దతు పెరిగినట్లయింది. ఇవన్నీ కేసీఆర్ కేంద్రంపై చేసే పోరులో భాగమే అని సామాన్యులకు తెలుసు.

  కానీ రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలను అవమానిస్తే ఇలా వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరికొద్దికాలంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. కానీ ఇలా గవర్నర్ విషయంలో ఆయన వెనుకడుగు వేశారనే అపవాదును దేశంలో ఎలా నెగ్గుకొస్తారు..? అనే ప్రశ్న ఎదురవుతోందని చర్చించుకుంటున్నారు.

  మరి కేసీఆర్ ఎందుకు వెనుకడుగు వేశారన్నదే చర్చనీయాంశంగా మారింది..

  Must Read

  spot_img