Homeబిజినెస్గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజాలు ఉద్యోగాలు తీస్తుంటే.. యాపిల్‌ ఎందుకు అలా చేయలేదు!

గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజాలు ఉద్యోగాలు తీస్తుంటే.. యాపిల్‌ ఎందుకు అలా చేయలేదు!

గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజాలు ఉద్యోగాలు తీస్తుంటే.. యాపిల్‌ మాత్రం అలా చేయలేదు. ఇన్నాళ్లూ తమ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలిపిన తమ ఉద్యోగులను ఒక్కసారిగా రోడ్డున పడేయడానికి ఇష్టపడలేదు. నిజానికి ఆపిల్ కన్నా దిగ్గజ కంపెనీలు సైతం రాత్రికి రాత్రి వేలాదిగా ఉద్యోగులకు పింక్ స్లిప్పులు పంపించాయి.

ఒక్క ఈ మెయిల్ తో ఇకపై మీకూ మాకు ఏ సంబంధమూ ఉండదని తేల్చిపడేశాయి. అలా ఉద్యోగాలు ఊడిపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భవిష్యత్‌ ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా అన్ని కంపెనీలలోని ఉద్యోగుల మెడలపై కాస్ట్ కటింగ్ కత్తి వేలాడుతోంది. ఎప్పుడు ఎవరిని తొలగిస్తారో తెలియని పరిస్థితి. సింపుల్ గా ఒక మెయిల్ పెట్టేసి మిమ్మల్ని తొలగిస్తున్నాం అంటూ చెప్పేస్తున్నారు. అది ఫ్రెషర్స్‌ నుంచి 15 ఏళ్ల అనుభవం కలిగిన ఉద్యోగులను సైతం తొలగిస్తున్నారు. చిన్నా చితక కంపెనీలు, స్టార్టప్‌ లు మాత్రమే కాదు.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజాలు సైతం లేఆఫ్స్‌ కి వెళ్లారు. గూగుల్ అయితే రాబోయే అనర్థాలను ఆపడానికే ఇలా చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇన్నాళ్లూ తమకు లక్షల కోట్ల డాలర్ల లాభం చేకూర్చిన విషయం మరచిపోతోంది.

ఒక్కో కంపెనీ కొన్ని వేల మంది ఉద్యోగులను తొలగించింది. కానీ, యాపిల్ కంపెనీ మాత్రం అలాంటి పని చేయలేదు. దాని వెనుక 3 బలమైన కారణాలు ఉన్నాయి.. అవేంటో ఈ రోజటి ఇండెప్త్ మొదటి స్టోరీలో చూద్దాం. లేఆఫ్స్‌.. ప్రస్తుతం సాఫ్ట్ వేర్‌ సంస్థల్లో ఈ పదం బాగా వైరల్ అవుతోంది. ఇది వింటే చాలు ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతుంది. అర్ధరాత్రి మెలకువ వస్తే సదరు ఉద్యోగులకు మళ్లీ నిద్రపట్టదు. తెల్లవారితే ఏం వినాల్సి వస్తుందోనన్న దిగులు వారిని లోలోపలే క్రుంగిపోయేలా చేస్తోంది. ఎప్పుడు ఎవరిని ఇంటికి పంపిస్తారో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్నారు. ఆర్థికమాంద్యం, భవిష్యత్‌ పై భయాలు నెలకొనడంతోనే టెక్ కంపెనీలు లేఆఫ్స్‌ కి వెళ్తున్నాయి.

ఇందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలు కూడా అతీతులేమీ కాదు. కానీ, ఒక్క యాపిల్ కంపెనీ మాత్రమే ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగిని కూడా తీసేయలేదు. ఏ ఒక్క ఎంప్లాయిని లే ఆఫ్స్‌ పేరిట తొలగించలేదు. అయితే యాపిల్ కంపెనీ మిగిలిన కంపెనీల్లా కాకుండా అలా ఎలా వ్యవహరిస్తోంది..? అందుకు మూడు కారణాలను ఫాలో అవ్వడం వల్లే వారు ఉద్యోగాలను కాపాడగలిగారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంది. అదేంటంటే.. ఉద్యోగులను తొలగించే బదులుగా టిమ్ కుక్ తన జీతాన్ని తగ్గించుకున్నారు. అవును సీఈవోగా తనకు అందే జీతంలో 50 శాతం కోత విధించుకున్నారు. దీని వల్ల మిగిలిన ఉద్యోగులకు జీతాలను చెల్లించేందుకు వీలవుతుందని భావించారు.

2022లో టిమ్ కుక్‌ 99.4 మిలియన్ డాలర్లు..అంటే…821 కోట్ల రూ.లకుపైనే ప్యాకేజీ అందుకుంటున్నారు. దానిలో ఇప్పుడు 50 శాతం కోత విధించుకుని..మిగలిన 49 మిలియన్ డాలర్లు..అంటే మన కరెన్సీలో 405 కోట్ల రూ.లకు పైనే ఉండే మొత్తాన్ని మాత్రమే జీతంగా తీసుకుంటానని ప్రకటించారు. టిమ్ తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీకి ఎంతో ఖర్చను తగ్గించింది. దాని వల్ల ఉద్యోగులను తొలగించే అవసరం రాలేదని చెబుతున్నారు విశ్లేషకులు. కరోనా సమయంలో టెక్ దిగ్గజ కంపెనీలు అన్నీ దాదాపుగా 30 నుంచి 50 శాతం వరకు ఉద్యోగులను విచ్చలవిడిగా హైర్ చేసుకున్నాయి. అవకాశం వచ్చిందే తడవుగా సదరు ఉద్యోగులతో పనిచేయించుకుని వేలాది కోట్ల డాలర్ల పంట పండించుకున్నాయి. వాటితో పోలిస్తే యాపిల్ కంపెనీ ఆ సమయంలో చాలా తక్కువ మందికే ఉద్యోగాలు ఇచ్చింది.

గూగుల్ సీఈవో లేఆఫ్స్ సమయంలో చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. ‘కరోనా సమయంలో అవసరాన్ని బట్టి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు వారిని తొలగించక తప్పడం లేదు’ అని చెప్పుకొచ్చారు. అయితే యాపిల్ ఎక్కువ మందిని తీసుకోలేదు..అందుకే ఉద్యోగాలు తొలగించాల్సిన అవసరం పడలేదు. ఈ విషయంలో యాపిల్ కంపెనీ ముందు చూపుని అంతా మెచ్చుకుంటున్నారు.

చాలా టెక్ కంపెనీలలో ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉచిత కాఫిటేరియా సదుపాయం, ఉచితంగా భోజనాలు పెట్టడం చేస్తుంటాయి. ముఖ్యంగా గూగుల్, మెటా సంస్థలు వారి ఉద్యోగులకు ఎన్నో ఉచిత సౌకర్యాలు కల్పిస్తుంటాయి. అయితే అలా చేయడం వల్ల కంపెనీపై ఆర్థికభారం తప్పకుండా పడుతుంది. అది కూడా ఇప్పుడు లేఆఫ్స్‌ కారణంగా నిపుణులు చెబుతున్నారు. కానీ, యాపిల్ అలా ఉచిత భోజనాలు వంటివి మొదటి నుంచీ ప్రొవైడ్ చేయలేదు. యాపిల్ కంపెనీకి అలాంటి అదనపు భారాలు లేకపోవడం కూడా ఇప్పుడు లేఆఫ్స్‌ కి వెళ్లకుండా ఉండేందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సమయంలో యాపిల్ సంస్థ ఉద్యోగాలు కాపాడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

ఈ మూడు కారణాల వల్ల యాపిల్ కంపెనీ అనవసరంగా ఉద్యోగులను హైర్ చేసుకోలేదు..ఇప్పుడు ఆర్థిక మాంద్యం సాకుతో ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం కూడ పడలేదు. ఆ ముందు జాగ్రత్తలే ఉద్యోగుల పాలిట వరంగా మారింది. అంతే కాదు ఉద్యోగాలను తొలగించకపోవడమే కాదు..వారికి జీతాలలో కోత విధించాలని కూడా అనుకోలేదు. నేరుగా సీఈఓనే తన జీతాన్ని సగానికి సగం తగ్గించుకుని దానిని ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు వీలు కల్పించారు. ఇటీవలి కాలంలో పరిస్థితులు ఎంతలా క్షీణించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆర్థిక మందగమనం ముంగిట.. చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునేందుకు పెద్ద ప్రణాళికల్నే సృష్టించుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగులను వరుసగా తీసేస్తూ వచ్చిన కంపెనీలన్నో. ఇంకా కొత్తగా నియామకాలను కూడా పెద్ద ఎత్తున తగ్గించేశాయి. అందులో ముఖ్యంగా ఐటీ రంగం ఎక్కువగా ప్రభావితమైంది. 2022 సంవత్సరంలో దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో అంతా కష్టకాలం నడుస్తోంది. పెరుగుతున్న ఖర్చులను భరించలేక వాటికి వేరే దారి కనిపించడం లేదు.

వీటిని బయటపడే మార్గంగానో, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యేందుకో ఏమో.. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఇది ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. టెలికాం, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ మానుఫ్యాక్చరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్.. ఇలా ఏదైనా కానివ్వండి.. అందులో కామన్‌గా ఉన్నది మాత్రం జాబ్ కట్స్. ముఖ్యంగా రానున్న 6 నెలల నుంచి సంవత్సరంలోగా ఆర్థిక మందగమనం తలెత్తుతుందని ఆర్థిక నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. కంపెనీలకు కూడా ఆ విషయం తెలిసిపోయింది. ఆర్థిక సంక్షోభం వస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయి.

ఇక కొత్త నియామకాల సంగతి దేవుడెరుగు. ఇప్పటికే ఈ ఏడాది గత 6 నెలలుగా ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించుకుంటూ వస్తున్నాయి. నిజానికి ఆర్థిక మాంద్యంతో వెంటనే సదరు కంపెనీలకు సమస్యలు రాబోవడం లేదు. రేపు మాంద్యం మొదలైతే ఎలా అన్న ఆలోచన నేపథ్యంలో ముందస్థుగా ఈ చర్యలు చేపట్టారు. కాస్ట్ కటింగ్ పేరుతో జాబ్ కట్స్ సౌకర్యాలు కట్ చేయడం ద్వారా రేపటి రోజున రాబోయే నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా..ఇదే ఆర్థిక మాంద్యం వేళ అమెరికాలో ఉద్యోగాల జాతర మొదలైంది. కేవలం ఒక్కనెలలోనే 5 లక్షల జాబ్స్​ అందుబాటులోకి వచ్చాయి.

అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలన్నీ ఓవైపు కొలువు కోతలు విధిస్తోంటే అగ్రరాజ్యంలో మాత్రం రికార్డుస్థాయిలో ఉద్యోగ కల్పన జరుగుతోంది. ఒక్క జనవరిలోనే 5.17 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు ప్రభుత్వ నివేదిక తెలిపింది. దీంతో అక్కడ నిరుద్యోగం 50 ఏళ్ల కనిష్ఠానికి చేరినట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వారికి సులభంగా కొలువులు దొరుకుతాయని నిపుణులు చెబుతున్నారు.

Must Read

spot_img