ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలోనే ఎంతో సంపన్నమైంది.. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 25 శాతం భారత్ నుంచి కొనసాగేదంటే.. భారత ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.. మరి.. అలాంటి భారత్.. ఆ తర్వాత కొన్నేళ్లలోనే పేదరికం గల దేశంగా ఎలా మారింది..? భారత్ కు ఆ దుస్థితి ఎందుకు వచ్చింది…? 16వ శతాబ్దం చివరలో భారత్ ను బంగారు పిచ్చుకగా వర్ణించేవారు.. భారత్ ను పాలిస్తోన్న అక్భర్ ప్రపంచంలోని అత్యంత సంపన్న చక్రవర్తులలో ఒకరిగా ఉండేవారు..
- భారత్ లో ఈస్ట్ ఇండియా కంపెనీకి బీజం పడటమే భారత్ పేదరికానికి కారణమా..?
- ఇంతకూ భారత్ ను ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా ఆక్రమించుకుంది..?
అది 16వ శతాబ్దం ముగుస్తున్న కాలం. ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ పాలన కొనసాగుతోంది.. నాడు ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో నాలుగో వంతు వస్తువులు భారత్‌లో తయారవుతుండేవి. దాంతో, భారత దేశాన్ని ‘బంగారు పిచ్చుక’గా వర్ణించేవారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న చక్రవర్తుల్లో అక్బర్ ఒకరు. అయితే అదే సమయంలో అంతర్యుద్ధాలతో బ్రిటన్ అట్టుడుకుతోంది.
ఆ దేశ ఆర్థికవ్యవస్థ పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడింది. ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో అక్కడ 3 శాతం మాత్రమే జరిగేది. ఆ సమయంలో బ్రిటన్ లో మహారాణి ఎలిజెబెత్-1 పాలన కొనసాగుతోంది. యూరప్‌లో పోర్చుగల్, స్పెయిన్ వాణిజ్యంలో బ్రిటన్ ను దాటి వెళ్లిపోయాయి. దీంతో బ్రిటన్ సముద్ర దొంగలు వ్యాపారుల్లా పోర్చుగీసు, స్పెయిన్ వాణిజ్య నౌకలను దోచుకునేవారు.
అదే సమయంలో యాత్రికుడు, బ్రిటన్ వ్యాపారి రాల్ఫ్ ఫించ్ హిందూ మహాసముద్రం, మెసపటోమియా, పర్షియన్ గల్ఫ్, ఆగ్నేయాసియా వ్యాపార యాత్రలు చేస్తున్న సమయంలో భారత ఎంత సంపన్న దేశమో తెలిసింది.. సుదీర్ఘంగా సాగిన ఆయన యాత్ర ముగించుకుని బ్రిటన్ వెళ్లే లోపు రాల్ఫ్ చనిపోయాడనుకుని ఆయన వీలునామాను కూడా అమలు చేశారు.
భారత్ గురించి రాల్ఫ్ ఫించ్ ఇచ్చిన సమాచారంతో సర్ జేమ్స్ లాంక్‌స్టర్‌తో పాటూ 200 మందికిపైగా బలమైన బ్రిటన్ పారిశ్రామికవేత్తలు భారత్ దిశగా ముందుకెళ్లాలని ఆలోచించారు. ఆ కంపెకి చాలా పేర్లున్నాయి. కానీ అది ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో పాపులర్ అయ్యింది. మొదట్లో మిగతా ప్రాంతాల నుంచి యాత్రలు చేసిన కెప్టెన్ విలియమ్ హాకిన్స్… 1608 ఆగస్టు తర్వాత భారత్ లోని సూరత్ రేవులో తన నౌక ‘హెక్టెర్’కు లంగరు వేశారు. వాణిజ్యం కోసం ఈస్టిండియా కంపెనీ వచ్చినట్లు ప్రకటించారు.
బ్రిటన్ వాణిజ్య ప్రత్యర్థులు డచ్, పోర్చుగీసు నౌకలు అప్పటికే, హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. కానీ, ఈ కంపెనీ, దానికంటే 20 రెట్లు పెద్దది, ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన భారతదేశంలో ప్రజలపై నేరుగా రాజ్యం చేయబోతోందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అప్పటికి అక్బర్ చక్రవర్తి చనిపోయాడు. ఆ కాలంలో సంపద విషయానికి వస్తే, అక్బర్‌కు సమానంగా చైనా మింగ్ రాజవంశం మాత్రమే ఉండేది. ఖాఫీఖాన్ ‘నిజాముల్-ముల్క్ ముంత్‌ఖబుల్-బాబ్’ పుస్తకంలో అక్బర్ సంపద వివరాలు రాశారు.
ఆ సమయంలో అక్బర్ తన వారసుల కోసం ఐదు వేల ఏనుగులు, 12 వేల గుర్రాలు, వెయ్యి చిరుతలు, పది కోట్ల రూపాయలు, వంద తులాల నుంచి 500 తులాల వరకూ పెద్ద పెద్ద బంగారు నాణేలు. 272 మణుగుల ముడి బంగారం, 370 మణుగుల అంటే 4 వేల కిలోలకు పైగా వెండి, అప్పట్లో 3 కోట్ల రూపాయల విలువ చేసే ఒక మణుగు ఆభరణాలు వదిలి వెళ్లారు.
నూరుద్దీన్, జహంగీర్ బిరుదులతో అక్బర్ కొడుకు సలీమ్ మొఘల్ సింహాసనంపై కూర్చున్నాడు. రకరకాల సంస్కరణలు అమలు చేసిన సలీమ్.. ముక్కు, చెవులు కోయడం, చేతులు నరకడం లాంటి శిక్షలు రద్దు చేశాడు. మద్యం, మిగతా మత్తు పదార్థాలు ఉపయోగించడం, ప్రత్యేక రోజుల్లో పశువులను వధించడాన్ని నిషేధించాడు. అక్రమ పన్నులు కూడా తొలగించాడు. రోడ్లు, బావులు, ధర్మశాలలు నిర్మించిన
జహంగీర్ వారసత్వ చట్టాలు కఠినంగా అమలయ్యేలా చూశాడు.
40 లక్షల సైనికులున్న మొఘల్ సైన్యంతో అప్పట్లో యూరప్‌లో చేసిన విధంగా యుద్ధాలు చేయలేమనే విషయం సూరత్ రేవులో దిగిన హాకిన్స్‌కు త్వరలోనే తెలిసొచ్చింది. కానీ, అతడికి వ్యాపారం చేయాలంటే మొఘల్ చక్రవర్తి అనుమతితో పాటూ, ఆయన సహకారం కూడా అవసరం. హాకిన్స్ ఏడాదిలోనే మొఘల్‌ల రాజధాని ఆగ్రా చేరుకున్నారు. పెద్దగా చదువుకోని హాకిన్స్… జహంగీర్ నుంచి వాణిజ్య అనుమతులు సాధించలేకపోయారు.
ఆ తర్వాత బ్రిటన్ సభలో సభ్యుడు, రాయబారి అయిన సర్ థామస్ రోను రాయబారిగా భారత్ పంపించారు. ఆయన 1615లో ఆగ్రా చేరుకున్నారు. చక్రవర్తికి విలువైన కానుకలు బహుమతిగా ఇచ్చారు. వాటిలో వేటకుక్కలు, జహంగీర్‌కు ఇష్టమైన మద్యం కూడా ఉంది.
అయినా బ్రిటన్‌తో సంబంధాలకు జహంగీర్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మూడేళ్లు ఆయనకు విధేయతలు చూపించాక, థామస్‌రో వాణిజ్య అనుమతులు దక్కించుకోగలిగారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఈస్టిండియా కంపెనీతో ఒక వ్యాపార ఒప్పందంపై సంతకం చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం భారత ఉపఖండంలోని అన్ని రేవుల్లో క్రయవిక్రయాల కోసం కొన్ని ప్రాంతాలు ఉపయోగించుకోడానికి ఈస్టిండియా కంపెనీకి చెందిన బ్రిటన్ వ్యాపారులకు అనుమతి లభించింది. బదులుగా యూరప్ ఉత్పత్తులను భారత్‌లో విక్రయించాలని వారిని కోరారు. కంపెనీ తమ నౌకల్లో రాజమహలు కోసం తీసుకువచ్చే అన్ని వస్తువులు, బహుమతులను సంతోషంగా స్వీకరించాలని చక్రవర్తి నిర్ణయించారు. మొఘులుల అంగీకారంతో కంపెనీ భారత్ నుంచి పత్తి, నల్లమందు, పొటాషియం నైట్రేట్, తేయాకు కొనుగోలు చేసి వాటిని విదేశాల్లో ఎక్కువ ధరలకు అమ్మేది.
- యుద్ధానికి సిద్ధం..
1670లో ఈస్ట్ ఇండియా కంపెనీ విదేశాల్లో యుద్ధం చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి బ్రిటిష్ చక్రవర్తి చార్లెస్-2 అనుమతులు ఇచ్చాడు. బ్రిటిష్ సైన్యం సాయుధ బలగాలు భారత్‌లో మొదట పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ వారిని ఎదుర్కొంది. చాలా యుద్ధాలు గెలిచింది. మెల్లమెల్లగా బెంగాల్ లో తీర ప్రాంతాన్ని తన అదుపులోకి తెచ్చుకుంది. మొఘలులతో వారు 17వ శతాబ్దంలో ఒకే ఒక్కసారి మాత్రమే
తలపడ్డారు. 1681లో బెంగాల్‌లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలంగీర్ మేనల్లుడు నవాబ్ షాయిస్తా ఖాన్ అనుచరులు పన్నులు, ఇతర విషయాల్లో కంపెనీ సిబ్బందిని వేధించారు. దాంతో, ఆ సిబ్బంది నవాబ్‌రై తమ డైరెక్టర్ సర్ చైల్డ్‌కు ఫిర్యాదు చేశారు.
అతడిపై యుద్ధం చేయడానికి తమ సైన్యానికి సాయం కావాలని సర్ చైల్డ్ బ్రిటన్ చక్రవర్తికి లేఖ రాశారు. తర్వాత, 1686లో బ్రిటన్ నుంచి 19 యుద్ధనౌకలు, 600 మంది సైనికులతో ఒక నావికా దళం బెంగాల్ వైపు ప్రయాణించింది. మొఘల్ చక్రవర్తి కూడా కూడా దానికి సిద్ధంగా ఉండడంతో ఆ యుద్ధంలో వారే గెలిచారు. దీనికి ప్రతీకారంగా 1695లో బ్రిటన్ సముద్రపు దొంగ హెన్రీ యెవెరీ ఔరంగజేబు నౌకలు ‘ఫతే ముహమ్మద్’, ‘గులామ్ సవాయీ’లను దోచుకున్నాడు. అప్పట్లో ఆ ఖజానా విలువ దాదాపు ఆరేడు లక్షల బ్రిటిష్ పౌండ్లు.
మొఘల్ సైన్యం ఆ యుద్ధంలో బ్రిటన్ సైనికులను ఎదుర్కొంది.. బెంగాల్ లో కంపెనీకి చెందిన ఐదు పరిశ్రమలను ధ్వంసం చేసింది. ఆంగ్లేయులను బెంగాల్ నుంచి తరిమికొట్టింది. సూరత్‌తో కూడా కంపెనీ పరిశ్రమలను మూసేశారు. బొంబాయిలో కూడా ఆంగ్లేయులకు అదే పరిస్థితి ఎదురైంది. కంపెనీ సిబ్బందికి సంకెళ్లు వేసిన సైన్యం నగరమంతా వారిని తిప్పింది. నేరస్థుల్లా అవమానించింది. దాంతో, తమ పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు కంపెనీ సిబ్బంది దర్బారులో చక్రవర్తికి క్షమించమని వేడుకోవాల్సి వచ్చింది.
హెన్రీ యెవరీపై చర్యలు తీసుకున్న బ్రిటన్ చక్రవర్తి కూడా మొఘల్ చక్రవర్తిని అధికారికంగా క్షమాపణ అడిగాడు. ఔరంగజేబు ఈస్టిండియా కంపెనీని క్షమించాడు. 17వ శతాబ్దం ద్వితీయార్థంలో ఈస్టిండియా కంపెనీ చైనా నుంచి పట్టు, పింగాణీ పాత్రలు కొనుగోలు చేసేది. చైనాకు అవసరమైన ఉత్పత్తులేవీ కంపెనీ దగ్గర ఉండేవి కావు. చివరికి కంపెనీ దానికొక ఒక పరిష్కారం వెతికింది. బెంగాల్‌లో గసగసాలు సాగుచేసింది. బిహార్‌లో నల్లమందు తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసింది. ఆ నల్లమందును దొంగచాటుగా చైనాలోకి చేర్చేవారు.
అప్పట్లో చైనాలో నల్లమందు వినియోగం చాలా తక్కువ. దాంతో, ఈస్టిండియా కంపెనీ చైనా ఏజెంట్ల ద్వారా ఆ నల్లమందును ప్రజల్లోకి చేర్చేది. నల్లమందు ఇచ్చి వారి నుంచి పట్టు, పింగాణీ పాత్రలు కొనుగోలు చేసి భారీ లాభాలు సంపాదించింది. చైనా పాలకులు ఈ నల్లమందు వాణిజ్యం అడ్డుకోవాలని ప్రయత్నించారు. దేశంలోకి తీసుకొచ్చే నల్లమందును ధ్వంసం చేశారు. దాంతో చైనా, బ్రిటన్ మధ్య చాలా యుద్ధాలు జరిగాయి. వీటిలో చైనా ఓటమిపాలైంది. తర్వాత, బ్రిటన్ అవమానకరమైన రీతిలో చైనాతో ఎన్నో ఒప్పందాలపై సంతకాలు చేయించింది.
చైనా పాలకులు ధ్వంసం చేసిన నల్లమందుకు బ్రిటన్ పరిహారం కూడా వసూలు చేసింది. ఆ దేశంలో రేవులన్నీ ఆక్రమించింది. హాంకాంగ్‌పై బ్రిటన్ ఆధిపత్యం కూడా అదే సమయంలో జరిగింది. ఈస్టిండియా కంపెనీ ఆగడాలపై చైనా పాలకులు బ్రిటన్ మహారాణి విక్టోరియాకు ఒక ఒక లేఖ రాశారు. నల్లమందు వాణిజ్యాన్ని అడ్డుకోవడానికి సాయం చేయాలని కోరారు. కానీ, రాణి ఆ లేఖకు ఎలాంటి
సమాధానం ఇవ్వలేదు.
1707లో ఔరంగజేబు మరణం తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాజ్యాల పాలకుల మధ్య వైరం మొదలైంది. ఆ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్న కంపెనీ లక్షలాది స్థానికులను తమ సైన్యంలో చేర్చుకుంది. యూరప్‌లో పారిశ్రామిక విప్లవం రావడంతో యుద్ధ సాంకేతికతలో కంపెనీ నైపుణ్యం కూడా సాధించింది. బలగాలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, బలమైన ఈస్టిండియా సైన్యం పాత పద్ధతుల్లో యుద్ధం చేసే మొఘలులు, మరాఠాలు, సిక్కులు, స్థానిక నవాబుల సైన్యాలను ఒక్కొక్కటిగా ఓడిస్తూ ముందుకెళ్లింది.
1756లో నవాబ్ సిరాజుద్దౌలా భారత్‌లోనే అత్యంత సంపన్న ఆర్థికవ్యవస్థ ఉన్న బెంగాల్ రాజ్యానికి పాలకుడు అయ్యారు. మొఘలుల ఆదాయంలో 50 శాతం ఇక్కడి నుంచే వచ్చేది. బెంగాల్ భారత్‌లోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఒక ప్రముఖ వస్త్ర, నౌకానిర్మాణ కేంద్రంగా ఉండేది. బెంగాల్ ప్రజలుపట్టు, పత్తి, ఇనుము, పొటాషియం నైట్రేట్‌తోపాటూ వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు తయారు చేసి, బాగా సంపాదించేవారు. ఇటు ఈస్టిండియా కంపెనీ కలకత్తాలోతమ కోటలను విస్తరించి, సైనికుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లింది.
దీంతో, కంపెనీ ఇక తమ పరిధిని విస్తరించకూడదని బెంగాల్ నవాబ్ ఆదేశించారు. కంపెనీ ఆ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆయన సైన్యం కలకత్తా మీద దాడి చేసింది. బ్రిటిష్ కోటలను స్వాధీనం చేసుకుంది. యుద్ధంలో పట్టుబడిన వారిని ఫోర్ట్ విలియం నేలమాళిగలో బంధించింది. కానీ, పాలకుడు కావాలనే కోరిక ఉన్న నవాబ్ సేనాధిపతి మీర్ జాఫర్‌ను ఈస్టిండియా కంపెనీ తమవైపు తిప్పుకుంది.
- 1757, జూన్ 23న ప్లాసీలో ఈస్టిండియా కంపెనీ, నవాబ్ సైన్యం మధ్య మరోసారి యుద్ధం జరిగింది..
భారీ సంఖ్యలో ఫిరంగులు, మీర్ జాఫర్ నమ్మకద్రోహంతో నవాబ్ ఆ యుద్ధంలో ఓడిపోయాడు. తర్వాత కంపెనీ మీర్ జాఫర్‌ను బెంగాల్ సింహాసనంపై కూర్చోపెట్టింది. అతడి నుంచి తమకు కావల్సినవన్నీ వసూలు చేసేది. భారత్ లో ఆంగ్లేయుల దోపిడీ యుగానికి అది ఆరంభం. అయితే ఖజానా ఖాళీ అవడంతో మీర్ జాఫర్ ఈస్టిండియా కంపెనీని వదిలించుకోడానికి డచ్ సైన్యం సాయం కోరాడు. 1759లో తర్వాత 1764లోవారితో జరిగిన యుద్ధాల్లో విజయం సాధించిన కంపెనీ బెంగాల్ పాలనా పగ్గాలను నేరుగా తన చేతుల్లోకే తీసుకుంది.
కొత్త కొత్త పన్నులు విధించిన కంపెనీ, బెంగాల్లో సరకులు చౌక ధరలకు కొనుగోలు చేసి వాటిని విదేశాల్లో ఎక్కువ ధరలకు అమ్మేది. 18వ శతాబ్దంలో ప్రథమార్థంలో బ్రిటన్ వ్యాపారుల వెండి నాణేలు చెల్లించి భారతీయుల నుంచి పత్తి, బియ్యం కొనుగోలు చేసేవారు. ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్టిండియా కంపెనీ తన ఫైనాన్స్, రెవెన్యూ వ్యవస్థ సహకారంతో భారత్‌తో వాణిజ్యంపై గుత్తాధిపత్యం సాధించింది.
భారతీయుల నుంచి లభించే ఆదాయంలో దాదాపు మూడో వంతు భారత ఉత్పత్తుల కొనుగోలుకే ఖర్చు చేయాలని ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. అలా భారతీయులు తాము అందించిన ఆదాయంలో మూడో వంతు కోసం తమ ఉత్పత్తులను వారికే బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చేది.
ప్రపంచంలో అన్ని దేశాలకు చెందిన వ్యాపారులు భారత్ తో వాణిజ్యం చేసేవారు. ఢాకా, ముర్షీదాబాద్ మల్‌మల్‌ను విదేశీయులు నాణ్యమైనది, శ్రేష్టమైనదిగాభావించేవారు. యూరప్ దేశాల్లో ఈ రెండు నగరాల మల్‌మల్ చాలా ఆదరణ పొందింది.
భారత్ లో మిగతా వ్యాపారాలతో పోలిస్తే, వస్త్ర వ్యాపారం చాలా ఉన్నత స్థితిలో స్థితిలో ఉండేది. భారత్ నుంచి నూలు, ఉన్ని వస్త్రాలు, శాలువాలు, మల్‌మల్, ఎంబ్రాయిడరీ వస్త్రాలను ఎగుమతి చేసేవారు. అహ్మదాబాద్‌లో తయారయ్యే పట్టు వస్త్రాలు, వాటిపై బంగారు, వెండి జరీ పనులు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. 18వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో ఈ వస్త్రాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం వాటిపై భారీగా పన్నులు విధించాల్సి వచ్చింది.
నేత వస్త్రాలతోపాటూ, లోహ వస్తువుల తయారీలో కూడా భారత్ పురోగతి సాధించింది. లోహంతో తయారైన వస్తువులను భారత్ నుంచి
విదేశాలకు ఎగుమతి చేసేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో ముల్తాన్‌లో నౌకల కోసం ఇనుప లంగర్లు కూడా తయారు చేసేవారు. అప్పటి భారత్ ఘనత గురించి వర్ణించిన ఒక ఆంగ్లేయుడు ‘మన పాలనకు ముందు భారతీయులు చాలా ఆహ్లాదకరమైన జీవితాన్ని గడిపేవారని, బ్రిటన్‌లో ఎవరికైనా చెప్పి ఒప్పించడం చాలా కష్టం.
వ్యాపారులు, సాహసికుల కోసం అక్కడ ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉండేవి. ఆంగ్లేయులు రాకకు ముందు భారత వ్యాపారులు ఎంతో ప్రశాంత జీవితం గడిపేవారని నేను చాలా గట్టిగా చెప్పగలను’ అని పేర్కొన్నాడు. ఈస్టిండియా కంపెనీ ఒక వాణిజ్య కంపెనీ. కానీ, దానికి రెండున్నర లక్షల మంది సైనికులతో ఒక సైన్యం ఉండేది. వ్యాపారంలో ఎక్కడైనా లాభాలు రాకపోతే, అక్కడ సైన్యం రంగంలోకి దిగి
పరిస్థితులు కంపెనీకి అనుకూలంగా మార్చేది. తర్వాత 50 ఏళ్లలో ఈస్టిండియా కంపెనీ సైన్యం, భారత్‌లోని చాలా ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. కంపెనీకి పన్నులు చెల్లించి, ఆయా ప్రాంతాలను స్థానిక రాజులే పాలించేవారు.
ప్రత్యక్షంగా పాలన స్థానిక పాలకుల చేతుల్లో ఉన్నా, ఆ రాజ్యం ఆదాయంలో ఎక్కువ భాగం బ్రిటిష్ ఖజానాలోకి చేరేది. జనం తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని కష్టాలూ భరించేవారు. 1765 ఆగస్టులో ఈస్టిండియా కంపెనీ మొఘల్ చక్రవర్తి షా ఆలంను ఓడించింది. ఆయనకు ఏడాదికి 26 లక్షలు చెల్లించేలా ఒక ఒప్పందం చేసుకుని తూర్పుగా ఉన్న బెంగాల్, బిహార్, ఒడిషాలో ఆదాయం వసూలు చేసుకోడానికి, ప్రజలను నియంత్రించడానికి హక్కులు పొందింది. ఆ తర్వాత భారత్ మొత్తం కంపెనీ పాలనలోకి వచ్చింది.
18వ శతాబ్దంలో 1769 నుంచి 1773 వరకూ బిహార్ నుంచి బెంగాల్ వరకూ కరువుతో అల్లాడిపోయింది. ఈ కరువుతో లక్షల మంది చనిపోయారు. గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన వారిలో మూడో వంతు కడుపు నిండా తిండిలేక చనిపోయారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటూ గ్రామీణులు కంపెనీ భారీ పన్నులు చెల్లించలేకపోయారు.
మరోవైపు ఈస్ట్ ఇండియా కంపెనీ తన పరిధిని విస్తరిస్తూ వెళ్లింది. ప్రకృతి విపత్తులను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంది. అప్పట్లో రూపాయికి 120 కిలోల బియ్యం లభిస్తుండగా, బెంగాల్ కరువు సమయంలో రూపాయికి 6 కిలోల బియ్యమే వచ్చేది. ఒక జూనియర్ అధికారి ఇలాంటి అక్రమాలతో 60 వేల పౌండ్ల లాభాలు సంపాదించాడు. ఈస్టిండియా కంపెనీ మొత్తం 120 ఏళ్ల పాలనాకాలంలో 34 సార్లు ఇలాంటి తీవ్ర కరవు కాటకాలు వచ్చాయి. మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ ఒక్కడే ఫ్రెంచి వారి సాంకేతికత సాయంతో కంపెనీని ఎదుర్కొన్నాడు.
రెండు యుద్ధాల్లో ఓడించాడు కూడా. కానీ భారత మిగతా పాలకులను తమవైపు తిప్పుకున్న ఆంగ్లేయులు టిప్పు సుల్తాన్‌ను కూడా తమ అదుపులోకి తెచ్చుకున్నారు. కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లెస్లీకి 1799లో టిప్పూ సుల్తాన్ చనిపోయాడనే వార్త తెలీగానే, ఆయన తన గ్లాసును గాల్లోకి ఎత్తి ‘ఈ రోజు చావుకు మనం భారత్‌లో సంబరాలు చేసుకుందాం’ అన్నారు. ఇలా భారత్ దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. పారిశ్రామిక దేశాన్ని వ్యవసాయ దేశంగా మార్చేసింది.
మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ పాలనలో ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో నాలుగో వంతు వస్తువులు భారత్ లోనే తయారవుతుండేవి.. అప్పటి చక్రవర్తి అక్భర్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న చక్రవర్తిగా ఉన్నాడు.. ఎప్పుడైతే.. భారత్ లోకి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశించిందో.. అప్పటి నుంచి భారత్ ను పూర్తిగా దోచుకున్నారు బ్రిటీష్ పాలకులు..