ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేయడం .. చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఈ కేసులో .. నెక్ట్స్ అరెస్ట్ ఎవరిది అన్నదే హాట్ టాపిక్ గా మారింది. అయితే .. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అన్నదే ఇప్పుడు .. తెలంగాణవ్యాప్తంగా కాక రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ వేగంగా అడుగులు వేస్తోంది. అక్రమాలను తవ్వుతూనే అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది.
ఇప్పటికే మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ నాయర్ వంటి వారిని కటకటాల పాలు చేసిన సీబీఐ.. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. దీంతో దేశ రాజకీయాల్లో మళ్లీ సంచలనం మొదలయింది. మొన్నటి దాకా మనిష్ సిసోడియాను టచ్ చేయరు అనుకున్న క్రమంలో అకస్మాత్తుగా సీబీఐ గేర్ మార్చింది. మనిష్ సిసోడియా అరెస్ట్ తర్వాత ఇప్పుడు వేళ్లు మొత్తం తెలంగాణ వైపు చూపిస్తున్నాయి. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో కవితను అరెస్ట్ చేయబోని అప్పట్లో టాక్ వినిపించింది. కానీ వాటంన్నిటికీ భిన్నంగా సీబీఐ అడుగులు వేస్తోంది.
- సీబీఐ ఇప్పటి వరకూ అరెస్ట్ చేసిన వారంతా అప్రూవర్లుగా మారారు. సౌత్ గ్రూప్‌ను ఎవరెఎవరు ఏర్పాటు చేశారు?
- ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఎన్ని సార్లు కలిశారు?
- ఆ వంద కోట్ల ముడుపులు ఎక్కడివి? ఇందులో ఎవరి వాటా ఎంత?
గత నిబంధనలను ఎందుకు ఎత్తేశారు అనే కోణాల్లో సీబీఐ ప్రశ్నలు అడగగా, అరెస్ట్ అయిన వారంతా పూసగుచ్చినట్టు సమాధానాలు చెప్పినట్టు సమాచారం. వారు చెప్పిన ఆధారాల ప్రకారమే సీబీఐ ఈ కేసులో మరింత లోతుగా వెళ్తోంది అని తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకూ సీబీఐ దాఖలు చేసిన ప్రతీ చార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు ఉంది. కవిత సౌత్ గ్రూప్‌లో కీలకంగా వ్యవహరించారని,సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఏకంగా 8 ఐ ఫోన్లను పగలగొట్టారని సీబీఐ తాను దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పేర్కొంది.
అంతే కాదు కవిత పలుమార్లు వ్యక్తిగత సహాయకులు లేకుండా ఢిల్లీ వెళ్లారని, ఇందులో ఎటువంటి అక్రమ కోణం లేకుంటే అలా ఎందుకు వెళ్లారని సీబీఐ తాను దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంతే కాదు అభిషేక్ నాయర్‌తో కవితకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, మాగుంట రాఘవతో పలు మార్లు సంభాషణలు కూడా జరిపిందని తెలుస్తోంది. ఇక మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వేళ్లన్నీ తెలంగాణ వైపే చూపిస్తున్నాయి.
సీబీఐ తరఫున లాయర్ల వాదనతో ఏకిభవిస్తున్న కోర్టు బెయిల్ ఇవ్వడం లేదు. ఇక మనిష్ సిసోడియా అరెస్ట్‌తో ఎంత పెద్దవారయినా చట్టం ముందు అందరూ సమానమనే సంకేతాన్ని సీబీఐ ఇస్తోంది. కాగా ఇటీవల ఎమ్మెల్సీ కవిత మహారాష్ట్ర వెళ్లారు. అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులర్పించారు. అంతే కాదు మోదీ ప్రజాస్వామ్నాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. అంటే తనను కూడా అరెస్ట్ చేస్తారని కవితకు తెలిసిపోయిందా? మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో త్వరలో కవిత అరెస్ట్ అవుతారంటూ జోస్యం చెప్పారు.
తెలంగాణ ఖజానాను కేసీఆర్ దోచుకుంటున్నారని, తెలంగాణలో దోచుకున్న డబ్బులతోనే దేశమంతా తిరుగుతున్నారని ఆరోపణలు చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తరహాలోనే కవిత అరెస్ట్ అవుతారని వ్యాఖ్యానించారు. త్వరలో కవిత అరెస్ట్ అవుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోన్నాయి. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అవుతారంటూ ఎప్పటినుంచో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచిన క్రమంలో మరోసారి కవిత అరెస్ట్ అవుతారంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్‌లోకి తీసుకుంది. ఆయనను గత కొద్దిరోజులుగా సీబీఐ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఐదు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ.. అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. వైద్య పరీక్ష అనంతరం నేడు ఆయనను కోర్టులో సీబీఐ ప్రవేశపెట్టింది. సిసోడియా అరెస్ట్‌తో నెక్ట్స్ టార్గెట్ కవితనే అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కవితను సీబీఐ ప్రశ్నించింది. నిందితుల రిమాండ్ రిపోర్టులు, ఛార్జిషీట్లలో కవిత పాత్రను ప్రస్తావించారు. దీంతో కవిత అరెస్ట్ కూడా ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
పంజాబ్, గుజరాత్ ఎన్నికల్లో నగదు అవసరమని కేజ్రివాల్ తో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్న కవిత .. 150 కోట్ల రూపాయలు ఆప్ గవర్నమెంట్‌కు ఇచ్చారని ఆరోపించారు. త్వరలోనే సుసోడియా ఎలాగైతే జైలుకి వెళ్లారో.. కవిత కూడా జైలుకు వెళ్లక తప్పదని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌ను ఢిల్లీ, పంజాబ్‌లో కూడా చేయాలనే కాకుండా దేశం అంతా చేయాలని అనుకున్నారని విమర్శించారు. కేంద్రం ఈ లిక్కర్ స్కామ్‌లో ఎక్కువ మందిని అరెస్టు చేసే పరిస్ధితులు ఉన్నాయని వివేక్ ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మద్యం వ్యాపారులు, వారికి సహకరించిన వారూ అరెస్టు అయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ అధికారులు, చార్జిషీట్లలో ఇప్పటి వరకూ 15 మంది పేర్లను పేర్కొంటే..వారిలో మెజారిటీ నిందితులూ అరెస్ట్ అయ్యారు తాజాగా, మద్యం స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్టు చేశారు. మనీష్ పేరు చార్జిషీట్లలో ఎక్కడా లేకపోవడం..అయినా.. విచారణ పేరిట పిలిచిన సీబీఐ.. తమకు సహకరించడం లేదంటూ అరెస్టు చేసింది. మరి, కేంద్ర దర్యాప్తు సంస్థల తదుపరి టార్గెట్ ఎవరు? ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న ఇది.
అయితే, ఎవరిపై చార్జిషీటు దాఖలు చేసినా అందులో తప్పనిసరిగా సౌత్ గ్రూప్ తరఫున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో, వాటి తదుపరి టార్గెట్ ఆమెనా? అంటే ఇందుకు ఔననే అంటున్నాయి దర్యాప్తు వర్గాలు. లిక్కర్ స్కాం లో రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేశారు. ఆయనకు, కవిత కుటుంబంతో బంధుత్వం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌కే చెందిన, రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్ర పిళ్ళయిని అరెస్టు చేశారు.
సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఆయన ద్వారానే కవిత పెట్టుబడులు పెట్టారంటూ చార్జిషీట్‌లోనూ పేర్కొన్నారు. కవిత వద్ద గతంలో ఆడిటర్‌గా పని చేసిన బుచ్చిబాబును ఇటీవలే అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాలకే చెందిన అరబిందో ఫార్మా కంపెనీ ఎండీ శరత్‌చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, ముత్తా గౌతమ్ తదితరులనూ అరెస్టు చేశారు. ఆ సందర్భంగా దాఖలు చేసిన చార్జిషీట్లలోనూ కవిత పేరును ప్రస్తావించారు. మాగుంట రాఘవరెడ్డితో కలిసి కవిత ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసినట్లు ఈడీ పేర్కొంది.
సౌత్ గ్రూప్ సహా వీరందరినీ ఇప్పటికే సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి. తాజాగా, చార్జిషీట్లలో ఎక్కడా పేరు లేని సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరుస అరెస్టుల నేపథ్యంలో కవిత అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో సాక్షిగా కవితకు 160 సీఆర్‌పీసీ కింద గత డిసెంబరులో సీబీఐ అధికారులు నోటీసులిచ్చి.. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే 7 గంటలకుపైగా విచారించారు. అవసరమైతే మరోసారి విచారిస్తామని అప్పట్లోనే చెప్పారు. కానీ, ఇప్పటి వరకు కవితను మళ్లీ ప్రశ్నించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే మరోసారి నోటీసులిచ్చే అవకాశాలు ఉన్నాయి. విచారణ అనంతరం సీబీఐ అధికారులు అవసరమైతే కవితను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని వివరిస్తున్నాయి.
మరి నెక్ట్స్ అరెస్ట్ ఎవరిదన్నదే ఆసక్తికరంగా మారింది..