HomePoliticsఏపీ బీజేపీ కుమ్ములాటల్లో ఎవరిది పైచేయి..!

ఏపీ బీజేపీ కుమ్ములాటల్లో ఎవరిది పైచేయి..!

ఏపీ బీజేపీలో ముసలం మొదలైందా..? సోము వర్సెస్ కన్నా గా .. రాజకీయాలు సాగుతున్నాయా..? ఈ కుమ్ములాటల్లో .. ఎవరిది పైచేయి .. మరి దీనిపై అధిష్టానం ఏం చేయనుంది .. అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఏపీలోనూ బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో బలహీనపడుతోంది. అసలు ఏపీలో ఉనికే లేని ఈపార్టీలో వర్గ పోరు ఎక్కువైంది. సోము వర్సెస్‌ కన్నా మధ్య ఏర్పడిన విభేదాలు పార్టీ పరువుని రోజురోజుకి దిగజార్చుతోంది. సోము ఏకపక్ష నిర్ణయాలే పార్టీకి నష్టం తెస్తున్నాయని మొన్నా మధ్య మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ఆరోపించారు. ఇప్పుడు కన్నాపై ఉన్న కసిని బయటపెడుతూ ఆపార్టీ పదాధికారుల సమావేశంలో సోము వీర్రాజు వీరావేశం చూపించారట.

పార్టీ నుంచి ఎప్పుడైనా వెళ్లిపోయే వారు అంటూ కన్నాపై విమర్శలు చేశారట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ మాటలు ఆ పార్టీలో నిప్పురాజేస్తున్నాయి. ఓ వైపు పవన్‌ కల్యాణ్‌ తో కలిసి పోటీ చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా మల్చుకోవాలని అధిష్టానం ఆదేశాలు ఇస్తుంటే దాన్ని సీరియస్‌ గా తీసుకోకుండా పదవి కోసం కన్నా, సోము కోట్లాడుకుంటున్నారన్న టాక్‌ ఉంది. ఏపీలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్న కాషాయానికి బలమైన నేతలు లేకపోవడం ఓ మైనస్‌ అయితే ఉన్న నలుగురిలోనూ సఖ్యత లేకపోవడం మరో మైనస్‌.

ఇలా అయితే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కదు కదా ఉన్న పార్టీ కూడా కాంగ్రెస్‌ లా కనుమరుగవడం ఖాయమని రాజకీయవిశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుపై క‌మ‌ల‌నాథులు క‌న్నెర్ర జేస్తున్నారు. ఇన్నాళ్లూ ఆయ‌న నియంతృత్వ పోక‌డల‌ను అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌లో లేవ‌నెత్తిన నేత‌లంతా ఒక్క‌సారిగా బ‌ర‌స్ట్ అవుతున్నారు. కోర్ క‌మిటీలో చ‌ర్చించ‌కుండా ఆరు జిల్లాల బీజేపీ అధ్యక్షులను మార్చేయ‌డంతో అస‌మ్మ‌తివ‌ర్గం భ‌గ్గుమంటోంది.

తొల‌గించిన వారు మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ విధేయులు. కొత్త‌గా ఆ ప‌ద‌వులు పొందిన వారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి వీర విధేయులు. ఈ అధ్య‌క్షుల‌ను సోము వీర్రాజు ప్ర‌క‌టించిన వెంట‌నే కృష్ణా జిల్లా ప్రధాన‌కార్యదర్శి పదవికి నాదెండ్ల‌ మోహన్, సీనియర్ నేతలు తుమ్మల ఆంజనేయులు, చిగురుపాటి కుమారస్వామిలు త‌మ పార్టీ పదవులకి రాజీనామా చేశారు.

పార్టీ కార్యదర్శి పదవికి సేవన ఉమామహేశ్వరి కూడా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జిల్లా అధ్యక్షుల మార్పుపై కనీసం తమను సంప్రదించలేదని రాజీనామా చేసిన నేత‌లు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్ కమిటీలో చర్చించకుండా ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం బీజేపీ సంప్ర‌దాయం కాద‌ని వారంటున్నారు.

కోర్ కమిటీలో చర్చ లేకుండానే, ఏక‌ప‌క్షంగా తీసుకున్న నిర్ణ‌యం..!

మ‌రోవైపు సోము వీర్రాజు తీరుపై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. కోర్ కమిటీలో చర్చ లేకుండానే, ఏక‌ప‌క్షంగా తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు జిల్లా అధ్యక్షులను మార్చార‌ని ఆరోపించారు. సోమూ వీర్రాజు అధ్యక్షుడయ్యాక కన్నా కు ప్రాధాన్యత తగ్గింది. కార్యక్ర‌మాల్లో ఆయనను ఇన్వాల్వ్ చేయడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై కోపంగా ఉన్న ‘కన్నా’ కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

పవన్ కళ్యాణ్ కు దగ్గరవుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. జనసేన లో నెంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తో సమావేశం కూడా అయ్యారు. పైగా సమయం దొరికినప్పుడల్లా సోమూ వీర్రాజుమీద సెటైర్ లు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల మార్పు నిర్ణయం కన్నాకు పుండు మీద కారంలా మారింది. వీర్రాజు తొలగించిన‌ మెజార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ అధ్యక్షుడుగా ఉండగా నియమించిన వారే.

ఈ పరిణామంతో మండిపోయిన కన్నా ఈ రోజు ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సోమూ వీర్రాజుపై, ఎంపీ జీవీఎల్ పై విరుచుకుపడ్డారు. సోమూ వీర్రాజు వియ్యంకుడు వెళ్ళి బీఆరెస్ లో చేరితే సోమూ వీర్రాజు ఏం చేస్తున్నాడు ? అని ప్రశ్నించారు కన్నా. నేను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎంతో మందిని బీజేపీలో జాయిన్ చేశాను. ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలి. అధ్యక్షుల మార్పు నాతో చర్చించలేదు.

ఇప్పుడు తొలగించిన వాళ్లంతా నేను నియమించిన వాళ్లే. అసలు పార్టీలో కార్యకరమాల గురించి ఏ సమాచారం నాకు తెలియడం లేదు.” అని కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ఇక జీవీఎల్ ఆలోచన ఎప్పుడూ కార్యకర్తల అభిప్రాయాలకు విరుద్దంగానే ఉంటుందని, అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవీఎల్ వైఖరి అలాగే ఉందని కన్నా అన్నారు. చివరగా కన్నా లక్ష్మీ నారాయణ‌ , తాను పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడతానని ప్రకటించారు.

ఈ మాట బీజేపీ వర్గాల్లో అనేక చర్చలకు కారణమవుతోంది. దీన్నిబట్టి కన్నా బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాక సోమూ వీర్రాజు తీరుపై బీజేపీలోని పలువురు ఇతర నేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు లాంటి వాళ్లు వీర్రాజు తీరుతోనే పార్టీకి గుడ్‌బై చెప్పి బీఆరెస్ లో చేరారని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.

సోము ముందు నుంచి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ..సోము తీరుపై ముందు నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా సోముపై తిరుగుబాటు చేశారు.

పవన్‌కు అండగా కాపు నేతలు…!

తాజాగా సోము ఎవరిని సంప్రదించకుండా బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు. ఒన్ షాట్ టూ బర్డ్స్‌గా కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని, పవన్‌కు తామంతా అండగా ఉంటామని, కాపులపై ఈ మధ్య కాలంలో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. మొత్తానికి కన్నా..సోముని గట్టిగా టార్గెట్ చేశారు. అయితే టీడీపీతో బీజేపీ పొత్తు లేకపోతే..కన్నా బీజేపీని వీడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

సోము వీర్రాజుకు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య చాలాకాలంగా గ్యాప్ ఉంది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ చీఫ్ గా ఉన్న సమయంలో సోము వీర్రాజుకు తగిన ప్రాధాన్య ఇవ్వలేదన్న వాదన ఉంది. అది మనసులో పెట్టుకునే ఇప్పుడు సోము వీర్రాజు.. కన్నా సహనాన్ని పరీక్షిస్తున్నారని కమలం పార్టీ క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు. ఇక అధిష్టానం దగ్గర సోము వీర్రాజుకు, కన్నా లక్ష్మీనారాయణకు మంచి పలుకుబడి ఉంది.

ఇద్దరూ ఇద్దరే. గట్టి లాబీయింగ్ చేయగలరు. అయినప్పటికీ ఒకే ఒరలో రెండు కత్తులు అన్నట్లుగా ఒకరంటే ఒకరికి పడకపోవడం పార్టీ శ్రేణులకు కూడా ఇబ్బందిగా మారింది. ఒకరి దగ్గరికి వెళ్తే మరొకరికి కోపం. దీంతో బీజేపీ క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. ఇద్దరు నేతల మధ్య అంతర్యుద్ధంలో తాము నలిగిపోతున్నామని ఆవేదన చెందుతున్నారట. తాజాగా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కన్నా లక్ష్మీ నారాయణ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు.

పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. ఇదే సోము వీర్రాజుకు మింగుడుపడడం లేదన్న వాదన వినిపిస్తోంది. టికెట్ల కేటాయింపులో కన్నా ఎక్కడ కీరోల్ పోషిస్తారోనన్న అనుమానంతోనే కన్నాకు.. సోము బ్రేకులు వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సోము ఎంత బ్రేకులేస్తున్నా కన్నా మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. దొరికిన అవకాశాన్ని వదలకుండా సోమును టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

గుంటూరు బీజేపీ అధ్యక్షుడి మార్పును తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా సోము వీర్రాజును ఛాలెంజ్ చేసి, హైకమాండ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు సరంజామా సిద్ధం చేసుకుంటున్నారట. కన్నా, మరోవైపు సోము వీర్రాజు మధ్య డైలాగ్ వార్ తో బీజేపీ హైకమాండ్ కు తలనొప్పులు వస్తున్నాయట. ఎవరికి నచ్చజెప్పాలో, ఎవరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలో అని పార్టీ పెద్దలు మథనపడుతున్నారట.

ఓవైపు చూస్తే కన్నా సీనియర్. మరోవైపు చూస్తే సోము వీర్రాజు బీజేపీ చీఫ్. దీంతో ఇద్దరినీ నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇలాంటి గొడవలు మాని, సర్దుకుపోవాలని జీవీఎల్ లాంటి నేతలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారట.

మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో అన్నదే ఆసక్తికరంగా మారింది..

ఏపీలో ఎలక్షన్ హీట్..టీడీపీ మహా కూటమి ..!

Must Read

spot_img