Homeతెలంగాణఅసలు బీజేపీ వ్యూహం ఏమిటి..?

అసలు బీజేపీ వ్యూహం ఏమిటి..?

  • ఏపీలో పొత్తుల టాక్ వేళ బీజేపీ దారెటు..?
  • పొత్తులపై సోము వీర్రాజు .. చెబుతోంది హైకమాండ్ నిర్ణయమేనా..?
  • దీనిపై సొంత పార్టీలోనే ఎందుకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..?
  • అసలు బీజేపీ వ్యూహం ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో ప్ర‌తిప‌క్షాల పొత్తులు ఓ కొలిక్కి వ‌చ్చేలా లేవు. భ‌విష్య‌త్తులో కుదిరేలా కూడా క‌నిపించ‌డంలేదు. కొంద‌రు ప్ర‌తిప‌క్షాల‌న్నింటితో క‌లిసి వెళ్లాల‌ని భావిస్తుంటే, మ‌రికొంద‌రు కొన్ని పార్టీలతోనే క‌లిసి వెళ్లాల‌ని భావిస్తున్నారు. దీంతో ఏపీలో పొత్తుల వ్య‌వ‌హారం అయోమ‌యంగా మారింది. ఎవ‌రు ఎవ‌రితో క‌లిసి వెళ్తారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఏపీలో పొత్తుల వ్య‌వ‌హారం పై బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మ‌రోసారి కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. టీడీపీ , వైసీపీతో పొత్తు పెట్టుకునే ప‌రిస్థితి లేద‌ని తేల్చిచెప్పారు. టీడీపీ, వైసీపీలు కుటుంబ పార్టీలుగా సోమువీర్రాజు అభివ‌ర్ణించారు.

ఇప్ప‌టికీ జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్నామ‌ని, క‌లిసొస్తే జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేస్తామ‌ని తెలిపారు. లేదంటే త‌మ పొత్తు ప్ర‌జ‌ల‌తోనే ఉంటుంద‌ని తెలిపారు. అయితే.. జ‌న‌సేన‌తో పొత్తు విష‌యం పై సోమువీర్రాజు వ్యాఖ్య‌లు కొంత అయోమ‌యానికి గురిచేస్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే పొత్తులో ఉన్నామ‌ని,క‌లిసొస్తే జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేస్తామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే పొత్తులో ఉంటే మ‌ళ్లీ క‌లిసి రావాల్సిన అవ‌స‌రం ఏముంది. జ‌న‌సేన‌తో పొత్తులోనే ఉన్నాం.. క‌లిసి పోటీ చేస్తాం అని చెప్ప‌వ‌చ్చు క‌దా అన్న అభిప్రాయం విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు.

సోము వీర్రాజు వ్యాఖ్య‌లు కొంత గంద‌ర‌గోళానికి గురిచేసేవిగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. జ‌న‌సేన కూడా త‌మ వైఖ‌రిపై స్ప‌ష్టంగా ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీతో క‌లిసి వెళ్లాల‌నేది .. జ‌న‌సేన వ్యూహంగా చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ప్ర‌తిప‌క్షాల ఓట్లు చీలితే అంతిమంగా అధికార పార్టీకి మేలు చేకూరుతుంది. దీనిని నివారించ‌డానికే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌తిప‌క్షాల పొత్తు పై దృష్టి కేంద్రీక‌రించారు.

గ‌తంలో బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గం స‌మావేశంలో సోము ఇవే వ్యాఖ్య‌లు చేశారు. ఆ స‌మ‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా స్పందించారు. కేంద్ర పెద్ద‌ల‌తో తాను మాట్లాడుతాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు. అయితే.. కేంద్ర పెద్ద‌ల నుంచి ఏ మేర‌కు స్పంద‌న వ‌చ్చిందో తెలియ‌దు. జ‌న‌సేనాని మాత్రం పొత్తుల విష‌యం పై స్ప‌ష్టంగా ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తిప‌క్షాలు ఒంటరిగా పోటీ చేయ‌డ‌మంటే.. వైసీపీకి అనుకూలంగా ప‌నిచేయ‌డ‌మే అని చెప్పొచ్చు. దీంతో జనసేనతో పొత్తు అంటూనే వైసీపీ, టీడీపీలకు దూరంగా ఉంటామని ఏపీ బీజేపీ చెప్పడంలో అంతరార్థం ఏమిటి..? అన్నదే చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ హైకమాండ్ ఆలోచన ఎలా ఉంది..? టీడీపీతో కలిసి వెళ్లే విషయంలో ఏపీ బీజేపీలో భిన్న స్వరాలు ఎందుకు వినిపిస్తున్నాయి..? జనసేన, టీడీపీ మాత్రమే పొత్తుతో ముందుకెళితే ఏమేర ప్రభావం ఉంటుంది..? జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికలకు సిద్ధమైతే వైసీపీ పరిస్థితి ఏంటి..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

  • ఆంధ్రప్రదేశ్‌‌లో రాజకీయ పార్టీల సమీకరణాలు తలలు పండిన రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుచిక్కడం లేదు..

పొత్తులపై ఓటర్లను గందరగోళంలోకి నెట్టేసేలా ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రకటనలే ఇందుకు కారణం. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలిపోకుండా చేస్తానని పవన్ కల్యాణ్ ఇప్పటికే పదేపదే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. పొత్తులపై మాత్రం జనసేనాని పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వడం లేదు. ఏపీలో ప్రస్తుతానికి జనసేన పార్టీకి బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే వెళ్తాం.. కాదంటే ఒంటరిగానైనా వెళ్తాం.. లేదా కొత్త పొత్తులు కలిస్తే వారితో కలిసి వెళ్తామని కొండగట్టు అంజన్న సాక్షిగా ఏపీలో పొత్తులపై జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలివి.

ఈ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే ఒక విషయం మాత్రం స్పష్టమైంది. పొత్తులకు సంబంధించి పవన్ గతంలో చేసిన మూడు ఆప్షన్ల ఫార్ములాకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. బీజేపీతో కలిసి, బీజేపీ-టీడీపీతో కలిసి.. చివరి ఆప్షన్ ఒంటరిగా పోటీ చేయడమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక.. ఏపీ బీజేపీ విషయానికొస్తే పవన్ మూడు ఆప్షన్లు ప్రకటించిన సందర్భంలో.. మొదటి ఆప్షన్‌నే తీసుకుంటామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ ఫార్ములాపై స్పందించిన విషయం విదితమే. భీమవరంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కూడా ఇదే విషయం మరోసారి తేటతెల్లమైంది.

వైసీపీ, టీడీపీలకు ప్రత్నామ్నాయంగా బీజేపీని నిలిపి.. ఎన్నికలకు వెళ్తామని, కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని కార్యవర్గ సమావేశాల్లో ఏపీ బీజేపీ తీర్మానించింది. టీడీపీ, వైసీపీలతో కాకుండా భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి రాష్ట్రంలో ముందుకెళతామని కూడా ఏపీ బీజేపీ తీర్మానించింది. ఈ తీర్మానం ద్వారా జనసేనతో కలిసి వెళ్లేందుకు సిద్ధమే కానీ.. టీడీపీతో పొత్తుకు మాత్రం ఏపీ బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టమైంది.

అయితే ఏపీలో టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేమని ఏపీ బీజేపీ చేసిన ప్రకటన బీజేపీ హైకమాండ్ నిర్ణయమేనని కచ్చితంగా చెప్పలేని పరిస్థితిపైనా సర్వత్రా చర్చలు సాగుతున్నాయి. మరోవైపు సోము వీర్రాజు నాయకత్వంపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. కన్నా లక్ష్మీనారాయణతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా కార్యవర్గ సమావేశాలకు గైర్హాజరవడం కమల శిబిరంలో చర్చనీయాంశంగా మారింది.

పార్టీ సిద్ధాంతాలు, నియమావళితో సంబంధం లేకుండా ఎప్పుడు ఎవరిని వద్దనుకుంటే వారిని సస్పెండ్‌ చేయడం, తనకు నచ్చనివారిని పదవి నంచి తప్పించడం మొదలుపెట్టిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు… పార్టీ పదవుల్లో నియమించే వారి గురించి కనీస సమాచారం కోర్‌ కమిటీకి కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. సోము వీర్రాజు నాయకత్వంపైనే కాదు పొత్తుల విషయంలో కూడా ఏపీ బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. జనసేన, టీడీపీతో కలిసి వెళితేనే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని ఏపీ బీజేపీలోని ఓ వర్గం బలంగా వాదిస్తోంది.

అందువల్ల.. పొత్తులపై కార్యవర్గ సమావేశాల్లో చేసిన తీర్మానాన్నే ఫైనల్ అని భావించలేమని ఈ పరిణామాలను గమనించిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి యువనేత లోకేష్ పాదయాత్రపైనే టీడీపీ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. మొత్తంగా చూసుకుంటే.. ఏపీలోని ప్రధాన పార్టీలకు, మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీకి పొత్తుల విషయంలో ఇప్పటికైతే స్పష్టమైన వైఖరి లేదని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో బీజేపీ వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ముందస్తు సంకేతాల క్రమంలో ఎన్నికల వేడి ముందే మొదలైంది. పార్టీలన్నీ ఇప్పటినుంచే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటినుంచే ఎన్నికల వ్యూహలకు మరింత పదునుపెడుతున్నాయి. పాదయాత్రలు, బస్సు యాత్రలు, బహిరంగ సభలతో మరింత వేగం పెంచనున్నాయి. బీజేపీ వైఖరిని బట్టి రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, టీడీపీ పొత్తులపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.

కానీ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తు ప్రశ్నే లేదని చెబుతూ ఉంటారు. రెండు, మూడు రోజులకోసారి ఓ నేత వచ్చి..తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అసలు అలాంటి చాన్సే లేదని బీజేపీ చెబుతున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ నేతలెవరూ బీజేపీతో పొత్తుల గురించి బహిరంగంగా మాట్లాడటం లేదు. కానీ బీజేపీ నేతలు మాత్రమే అత్యుత్సాహం చూపించి టీడీపీతో పొత్తు ఉండదనే ప్రకటనలు చేస్తున్నారు.

మరి బీజేపీ హైకమాండ్ అడుగులు ఎటువైపు అన్నదే చర్చనీయాంశంగా మారుతోంది..

Must Read

spot_img