సూర్యుడి చుట్టూ తిరిగే భూమి తన చుట్టు తాను తిరుగుతుంటుంది. అలా తనచుట్టు తాను తిరిగే భూమిలోపల కేంద్రకం కూడా అందుకు వ్యతిరేకంగా తిరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూకేంద్రం గురించి నిజానికి ఎవరికీ అంత స్పష్టత మాత్రం లేదు. కానీ కేంద్రకం.. రగరగ మండే ద్రవంలో తిరుగుతుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడా తిరగడం ఆగిపోయిందని అంటున్నారు..మరి దానివల్ల నష్టమేమైనా ఉంటుందా..
భూమి మధ్యలోని కోర్ భాగం తిరగడం మానేస్తే భూమికి ఏం జరుగుతుంది. ఇదీ ఇప్పుడు శాస్త్రవేత్తలను వేదిస్తున్న ప్రశ్న. భూమి మధ్యలో ఉన్న పదార్థాన్ని అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అని అంటారు. ఇందులో ఇన్నర్ కోర్ పూర్తిగా సలసల కాగే ఐరన్‌తో కూడిన బంతిలా ఉంటుందని అంచనా. ఇది అంతరిక్షంలోని ప్లూటో గ్రమం అంత పెద్దగా ఉంటుందనీ.. ఇది భూమిలా తిరగడం మానేసిందనే అంచనా వేస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు.
ఇంకా చెప్పాలంటే.. ఇది రివర్సులో తిరుగుతుందనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అలా తిరగడం వల్ల భూమికి సంబంధించి ఓ భారీ మార్పు వచ్చేలా కనిపిస్తోంది. భూమి మధ్యలో అత్యంత గట్టిగా ఉండే.. లోహ పదార్థం తిరగడం ఆగిపోయి ఉంటుందంటే దాని అర్థం ఏంటి?
- భూమి పై పొరను క్రస్ట్ అని పిలుస్తారు..
దాని కింద ఉండే పొరను మాంటిల్ అంటారు. క్రస్ట్ దాదాపు 70 కిలోమీటర్ల లోతు వరకూ ఉంటుంది. ఆ తర్వాత మాంటిల్ మొదలవుతుంది. అది చాల సుదీర్ఘంగా 2 వేల 880 కిలోమీటర్ల మందంగా ఉంటుంది. మాంటిల్ తర్వాత ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ లు ఉంటాయి. ఔటర్ కోర్ 2 వేల 092 కిలోమీటర్ల మందం కలిగివుంటుంది. ఇన్నర్ కోర్ 2వేల 414 కిలోమీటర్ల మందం కలిగివుంటుంది. ఇన్నర్ కోర్‌పై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది.
అందువల్ల ఇది అత్యంత వేడిగా ఉన్నప్పటికీ.. చాలా గట్టిగా ఉంటుంది. ఈ ఇన్నర్ కోర్ అనేది.. చిన్నగా ఏమీ ఉండదు. దాదాపు మరుగుజ్జు గ్రహమైన ప్లూటో అంత పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే.. ఈ ఇన్నర్ కోర్.. అంతుబట్టని విధంగా, విచిత్రంగా ప్రవర్తిస్తోందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. భూమి లోపల నిజంగా ఏం జరుగుతోంది అనే అశంపై రకరకాల సిద్ధాంతాలు తెరపైకి వస్తున్నాయి. ఇన్నర్ కోర్‌కి సంబంధించి తొలి ఆధారం 1996లో లభించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వారు దీని గురించి ఏమంటున్నారంటే.. కొన్నేళ్లవరకూ భూమి కంటే వేగంగా.. ఇన్నర్ కోర్ తిరిగిందనీ.. తర్వాత అది క్రమంగా నెమ్మదిస్తూ… ఓ దశలో తిరగడం పూర్తిగా ఆగిపోయిందనీ.. ఇప్పుడు అది రివర్సులో తిరగడం మొదలుపెట్టిందని అంటున్నారు. భూకంపాలు వచ్చినప్పుడు వచ్చే సిస్మిక్ తరంగాలను ఆధారంగా చేసుకొని శాస్త్రవేత్తలు ఈ అంచనాలకు వస్తున్నారు. రివర్సులో ఎలా, ఎందుకు తిరుగుతుంది అనే ప్రశ్న రావచ్చు. అంటే..ఈ ఇన్నర్ కోర్ అనేది.. ద్రవరూపంలో ఉన్న ఔటర్ కోర్‌లో తేలుతూ ఉంటుందనీ.. అందువల్లే దాని తిరుగుడు లెక్క వేరుగా ఉండగలుగుతోందని అంటున్నారు.
- ఇన్నర్ కోర్ ఇష్టమొచ్చినట్లు తిరగడం అనేది ఇదే మొదటిసారి కాదనీ.. ఇదివరకు చాలాసార్లు ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు..
అయితే ఈ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలందరూ సమర్థించట్లేదు. దీన్ని వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. ఇలా ఇన్నర్ కోర్ ఇష్టమొచ్చినట్లు తిరగడం అనేది ఇదే మొదటిసారి కాదనీ.. ఇదివరకు చాలాసార్లు ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని వల్ల భూమిపై ఉండే జీవులకూ, మనుషులకూ ఎలాంటి సమస్యా రాదని చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం అలా తిరగడం వలన భూ అయస్కాంత శక్తిలో మార్పులు రావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పైగా ద్రువప్రాంతాలు మారిపోయే అవకాశం ఉందంటున్నారు. అలా జరిగితే మాత్రం ప్రపంచానికి తీరని నష్టం, ప్రక్రుతి వైపరీత్యాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నిజానికి భూమికి సంబంధించిన ఇంతటి లోతైన విషయాలను అంతరిక్షంలో తెలుసుకున్నంత తేలిక కాదు. ఇప్పటికీ సముద్రం అట్టడుగు ప్రాంతంతో ఉండే విషయాలను పూర్తిగా తెలుసుకోనే లేదు. అంత లోతులో ఉండే పీడనాన్ని తట్టుకునే యంత్రాలు లేదా అండర్ సీ క్రాఫ్టులను తయారు చేయడం జరగలేదు. కేవలం పది కి.మీల లోతు వరకు మొన్నీమధ్యే ఓ ఎక్స్ ప్లోరేషన్ చేయడం జరిగింది.
చిమ్మని చీకట్లు కమ్ముకున్నట్టుగా ఉండే ఆ ప్రాంతాలను విశ్లేషించడం మొదలైంది. అలాంటిది భూమిలోపల కొన్ని వందల కి.మీల లోతుల్లోకి వెళ్లడం అన్నది ఇప్పటికైతే కలలో మాటగానే ఉంటుంది. ఏమో ఓ శతాబ్దం తరువాత వచ్చే టెక్నాలజీలు అలా వెళ్లడానికి సహకరిస్తాయో లేదో గానీ ఇప్పట్లో అది సాధ్యపడదు. భూ అంతర్భాగంలో జరిగే మార్పులను గ్రహించడం ఊహించడం మాత్రమే ఇప్పుడు జరుగుతోంది. మరి భూమి కేంద్రం అలా రివర్స్ యాంగిల్ తిరగడం అన్నది రేపటి తరం మాత్రమే తెలుసుకోనుందంటే అతిశయోక్తి కాదు.