Homeఅంతర్జాతీయంఏమిటీ కేంద్రక సంలీనం…?

ఏమిటీ కేంద్రక సంలీనం…?

మహా మహా శాస్త్రవేత్తల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది… దశాబ్దాలుగా అలుపెరగకుండా చేస్తూ వచ్చిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది.. నియంత్రిత వాతావరణంలో కేంద్రక సంలీన ప్రక్రియను జరపడంలో సైంటిస్టులు తొలిసారిగా విజయవంతమయ్యారు.

ఏమిటీ కేంద్రక సంలీనం…? సూర్యుడు, తారత అనంత శక్తికి మూలం కేంద్రక సంలీనమా..? ఈ పరీక్ష విజయవంతంతో స్వచ్ఛ విద్యుదుత్పత్తిపై సరికొత్త ఆశలు చిగురించాయా..? శాస్త్ర, సాంకేతిక పరిశోధన రంగంలో నభూతో అనదగ్గ అతి కీలక ముందడుగుగా నిలవనుందా..?

ఎంతో మంది శాస్త్రవేత్తలు అనేక దశాబ్ధాలుగా కేంద్రక సంలీన చర్య కోసం ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాలుగా అలుపెరగకుండా చేస్తూ వస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. నియంత్రిత వాతావరణంలో కేంద్రక సంలీన ప్రక్రియను జరపడంలో సైంటిస్టులు తొలిసారిగా విజయవంతమయ్యారు. చారిత్రాత్మక న్యూక్లియర్ ప్యూజన్ బ్రేక్ త్రూని ప్రకటించారు శాస్త్రవేత్తలు. యూఎస్ఏ కాలిఫోర్నియాలోని లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లాబొరేటరీ… ఈ నెలలో నిర్వహించిన ఒక ప్రయోగంలో కేంద్రక సంలీన చర్యను నడిపించేందుకు అవసరం అయిన లేజర్ శక్తి కన్నా ఎక్కువ శక్తి ఉత్పత్తి అయిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

దీన్ని మైల్ స్టోన్ విక్టరీగా యూఎస్ పరిశోధకులు ప్రకటించారు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్యూజన్ ఇగ్నిషన్ ను అతిముఖ్యమైన శాస్త్రీయ పురోగతిగా
అభివర్ణించింది. ఇది దేశ రక్షణలో పురోగతికి, భవిష్యత్తులో స్వచ్ఛమైన శక్తికి దారి తీస్తుందని అన్నారు. అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ సవాళ్లలో ఒకటని దీన్ని అభివర్ణించింది.

అమెరికా ఇంధన మంత్రి జెన్నిఫర్‌ గ్రాన్‌హోం కేంద్రక సంలీన’ పరీక్ష విజయవంతం అయిందని అధికారికంగా ప్రకటన చేశారు.

”శాస్త్ర, సాంకేతిక పరిశోధనల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయమిదని అన్నారు వైట్‌హౌస్‌ శాస్త్ర సలహాదారు ఆర్తీ ప్రభాకర్. మా పరిశోధకుల బృందం తమ కెరీర్లతో పాటు జీవితాలను కూడా అంకితం చేసి పాటుపడి ఎట్టకేలకు సాధించింది.

ఇంతకాలంగా మనమందరం కలలుగన్న కేంద్రక సంలీన ప్రక్రియను నిజం చేసి చూపించింది. ఇది ఈ రంగంలో మరిన్ని గొప్ప ఆవిష్కరణలకు తెర తీయనుంది” అని తెలిపారు.. ఈ పరిశోధన రక్షణ రంగంలో కనీవినీ ఎరగనంతటి విప్లవాత్మక మార్పులకు తెర తీయడమే గాక… విద్యుచ్ఛక్తితో సహా భవిష్యత్తులో మానవాళి మొత్తానికీ సరిపడా స్వచ్ఛ ఇంధనాన్ని సునాయాసంగా తయారు చేసుకునేందుకు కూడా వీలు కల్పించగలదని అమెరికా ఇంధన శాఖ ఒక ప్రకటనలో ఆశాభావం వెలిబుచ్చింది. ఎంతకాలమైనా సహనం కోల్పోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే… ఎంతటి అద్భుతాలైనా సాధ్యమేననేందుకు ఈ ఫలితమే ఉదాహరణ అని ఆర్తీ అన్నారు.

సంలీన ప్రక్రియలో అత్యంత కీలకమైన, పరిశోధకులంతా ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్న ‘నికర శక్తి లాభం’ సాధించి చూపించారు.

సంలీన ప్రక్రియను ప్రారంభించేందుకు వెచ్చించాల్సిన శక్తి కంటే, ప్రక్రియ ద్వారా పుట్టుకొచ్చే శక్తి పరిమాణం ఎక్కువగా ఉండటాన్ని నికర శక్తి లాభంగా పిలుస్తారు. కేంద్రక సంలీనం అంటే రెండు చిన్న పరమాణువుల కేంద్రకాలు కలిసిపోయి, అంటే సంలీనం చెంది ఒకే పెద్ద కేంద్రకంగా ఏర్పడటం. అలా ఏర్పడ్డ సదరు కేంద్రకం తాలూకు ద్రవ్యరాశి ఆ రెండు పరమాణువుల కేంద్రక ద్రవ్య రాశి కంటే తక్కువగా ఉంటుంది. ఆ మిగులు ద్రవ్యరాశి అపార శక్తి రూపంలో విడుదల అవుతుంది. దీంతో పాటు తక్కువ స్థాయిలో రేడియేషన్ విడుదల అవుతుంది ఇది జరగాలంటే అపారమైన శక్తిని వినియోగించాల్సి ఉంటుంది.

సూర్యునిలోనూ, ఇతర నక్షత్రాల్లోనూ ఉత్పన్నమయ్యే అనంత శక్తికి ఈ కేంద్రక సంలీనమే మూలం.

వాటిలోని అపార ఉష్ణోగ్రతలు ఇందుకు వీలు కల్పిస్తాయి. హైడ్రోజన్‌ బాంబు తయారీ సూత్రం కూడా ఇదే. భూమిపై కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో హైడ్రోజన్ ను అధిక ఉష్ణోగ్రతకు గురిచేయడం వల్ల కేంద్రక సంలీనం సాధ్యం అవుతుంది. అదే అణు బాంబు తయారీలో దీనికి సరిగ్గా వ్యతిరేకంగా ఉండే కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను అనుసరిస్తారు. అందులో ఒకే అణువు తాలూకు కేంద్రకం చిన్న భాగాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో విపరీతమైన శక్తి పుట్టుకొస్తుంది.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని నూక్లియర్ పవర్ ప్లాంట్లలో న్యూక్లియర్ ఫిజన్ చర్యను ఉపయోగిస్తున్నారు. కేంద్రక విచ్చత్తిలో విడుదలయ్యే శక్తి చాలా తక్కువ. పైగా కేంద్రక విచ్ఛత్తిలో రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది.

తాజా ఆవిష్కరణ ప్రత్యేకత ఏమిటంటే… సూర్యుడు, ఇతర తారల్లోనూ హైడ్రోజన్‌ బాంబు తయారీలోనూ కేంద్రక సంలీన చర్య అనియంత్రిత పద్ధతిలో జరుగుతుంది. ఈ చర్యలో రెండు హైడ్రోజన్‌ పరమాణువులు కలిసి ఒక హీలియం అణువుగా మారుతూ ఉంటాయి. దీన్ని గనక నియంత్రిత వాతావరణంలో జరపగలిగితే అపారమైన శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా భూమిపై మానవాళి మొత్తానికీ సరిపడా విద్యుత్తును నిరంతరంగా సరఫరా చేయొచ్చు..

అది కూడా అతి చౌకగా, ఎలాంటి రేడియో ధార్మిక తదితర కాలుష్యానికీ తావు లేకుండా.. తాజాగా అమెరికా సైంటిస్టులు స్వల్ప పరిమాణంలోనే
అయినా సరిగ్గా దాన్నే సాధించి చూపించారు. హైడ్రోజన్‌ ఐసోటోప్‌లైన డ్యుటీరియం, ట్రిటియంలను సంలీనం చెందించారు. ”ఇతర సంలీనాలతో పోలిస్తే వీటి సంలీనానికి తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుంది. పైగా చాలా ఎక్కువ శక్తి విడుదలవుతుంది” అని యూఎస్‌ ఇంధన శాఖ పేర్కొంది.

కేంద్రక సంలీన ప్రక్రియను శాస్త్రవేత్తలు ఏనాడో అవగాహన చేసుకున్నారు. భూమిపై దీన్ని చేసి చూసేందుకు 1930ల నుంచే తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. వీటిపై పలు దేశాలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. ”ఇంధనపరంగా చూస్తే కేంద్రక సంలీనం తాలూకు ప్రయోజనాలు అనంతమనే చెప్పాలి. న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల భవిష్యత్తులో అపరిమిత, స్వచ్ఛమైన శక్తికి ఇది ముందడుగు కానుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఏర్పడింది. ఎందుకంటే అణు విద్యుదుత్పత్తికి అనుసరించే కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ ద్వారా విడులయ్యే రేడియోధార్మిక వ్యర్థాలకు సంలీనంలో అవకాశమే ఉండదు.

కాబట్టి మానవాళి మొత్తానికీ అవసరమయ్యే స్వచ్ఛ ఇంధనాన్ని అపరిమితంగా, కారుచౌకగా అందించడం సాధ్యపడుతుంది” అని కాలిఫోర్నియా వర్సటీ ఇంధన విభాగ ప్రొఫెసర్‌ డేనియల్‌ కామెన్‌ వివరించారు. అయితే ఇది సాకారమయ్యేందుకు ఇంకా చాలా ఏళ్లు పట్టొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు దశాబ్ధాలుగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. డిసెంబర్ 5న లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లాబొరేటరీ మొదటిసారిగా నియంత్రిత ఫ్యూజన్ ప్రయోగాన్ని నిర్వహించింది. దీంట్లో ”సైంటిఫిక్ ఎనర్జీ బ్రేక్ ఈవెన్” సాధించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఎంతో మంది శాస్త్రవేత్తలు.. కొన్ని దశాబ్దాలుగా అలుపెరగని ప్రయోగాలు చేస్తూ వచ్చిన కేంద్రక సంలీన ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతం అయింది.. శాస్త్ర సాంకేతిక రంగంలో ఓ కొత్త చరిత్రకు నాంది పలికారు అమెరికా సైంటిస్టులు.. మానవాళి మొత్తానికీ అవసరమయ్యే స్వచ్ఛ ఇంధనాన్ని అపరిమితంగా, కారుచౌకగా అందించడం సాధ్యం కానుంది.. ……………………………..

Must Read

spot_img