Homeఆంధ్ర ప్రదేశ్పొత్తులపై జనసేన..వ్యూహం ఏమిటన్నదే..?

పొత్తులపై జనసేన..వ్యూహం ఏమిటన్నదే..?

  • జనసేన ఆవిర్భావ దినోత్సవ వేళ..చేరికలు..ఆ పార్టీకి జోష్ ఇస్తున్నాయా..?
  • ఇంతకీ పార్టీలోకి వస్తోన్న నేతలంతా..టీడీపీ మాజీలే కావడం చర్చనీయాంశంగా మారుతోందా..?
  • చేరికల వేళ పొత్తులపై జనసేన..వ్యూహం ఏమిటన్నదే హాట్ టాపిక్ గా మారిందా..?

జనసేన పదో ఆవిర్భావ వేడుకలకు ముందు ఆ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. వైసీపీతో పాటు ఇతర పార్టీల వారు కూడా జనసేన గూటికి చేరుతున్నారు. పవన్ కల్యాణ్ మక్షంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన పలువురు నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుతో పాటు భీమిలి వైసీపీ నేతలు శ్రీచంద్ర రావు, దివాకర్‌ తదితరులకు పార్టీలో చేరారు.

వాళ్లందరికీ పవన్‌ కల్యాణ్ కండువా కప్పి.. సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. పార్టీపై అసంతృప్తితో పార్టీని వీడి.. వైసీపీలో చేరారు. ఐతే వైసీపీలో కూడా తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారు టీవీ రావు. ఈ క్రమంలోనే ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు.

2019 ఎన్నికల్లో కొవ్వూరులో పార్టీ అభ్యర్థి తానేటి వనితను గెలిపిస్తే ఆశించిన పదవి ఇస్తానని సీఎం జగన్‌ అప్పట్లో హామీ ఇచ్చారని, ఇప్పుడామె హోమంత్రిగా ఉన్నారని టీవీ రావు అన్నారు. కానీ ఇప్పటికీ తన హామీని జగన్ నెరవేర్చుకోలేదని, కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. వైసీపీలో కేవలం కొందరికే పదవులను కట్టబెడుతున్నారని వైసీపీ హైకమాండ్‌పై మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టు కాకపోయినా.. కనీసం పార్టీ పదవి అయినా ఇవ్వాలని కోరినా… వైఎస్ జగన్ పట్టించుకోలేదని వాపోయారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోవడం ఎంతో బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు టీవీ రావు. అందుకే వైసీపీకి గుడ్‌బై చెప్పి.. జనసేన పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు.

ఇక జనసేనలో చేరిన మరో మాజీ ఎమ్మెల్యే…ఈదర హరిబాబు 1994లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో జడ్పీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈదర హరిబాబు.. ఇప్పుడు జనసేనలో చేరిపోయారు. కాగా, ఏపీలో జనసేన పార్టీ ఆవిర్బవించి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. మార్చి 14న… పదో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న బందరులో భారీ ఎత్తున బహిరంగసభ నిర్వహించి. ఆ వేదికగానే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. పొత్తులపైనా పవన్ తేల్చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేనలో చేరతారని భావించిన వారు టీ డీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీలో మాజీలు జనసేన బాట పడుతున్నారు. దీంతో..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.

పార్టీ ఆవిర్భావ సదస్సులో జనసేనాని కీలక ప్రకటనలకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరకలను ప్రోత్సహిస్తున్నారు. బీసీ రౌండ్ టేబుల్ నిర్వహించిన పవన్ కల్యాణ్.. ఈ రోజు కాపు ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటనకు జనసేన సిద్దం అవుతోంది. 1994లో హరిబాబు టీడీపీ ఎమ్మెల్యేగా పని చేసారు. ఆ తరువాత ఆయనకు అవకాశం దక్కలేదు. 2014లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. తరువాత బీజేపీలో చేరారు. ఇప్పుడు జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. హరిబాబు చేరికతో నియోజకవర్గంలో జనసేనకు మంచిరోజులు వచ్చినట్లేనని.. పార్టీ మరింత బలోపేతం అవుతుందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

టీడీపీ – జనసేన మధ్య రానున్న ఎన్నికల్లో పొత్తు ఖాయమని అందరూ భావిస్తున్నారు. కానీ, చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం అనేక రకాల చర్చలకు కారణమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వేళ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని జనసేన పిలుపునిచ్చింది. కానీ, ఎవరికి వేయాలనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అటు బీజేపీ.. ఇటు టీడీపీ రెండు పార్టీల అభ్యర్ధులు బరిలో ఉన్నారు. బీజేపీ ఇప్పటికీ పవన్ తమతోనే ఉన్నారని చెబుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతు తీసుకుంటోంది. ఎక్కడా జనసేన ప్రస్తావన లేదు.

జనసేనలో చేరుతారని భావించిన కన్నా టీడీపీలో చేరారు. మరి కొందరు బీజేపీ నేతలు టీడీపీతో టచ్ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. జనసేన సొంతంగా ఎన్నికల హామీలు ఇస్తోంది. తాజాగా జరిగిన బీసీల సమావేశంలోనూ జనసేన అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డులో బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత పైన పవన్ ప్రకటన చేసారు. ఇప్పటి వరకు టీడీపీతో పొత్తుపై పవన్ సంకేతాలు ఇవ్వటం మినహా స్పష్టత ఇవ్వటం లేదు. అటు బీజేపీతో మైత్రి గురించి వారాహి పూజల సమయంలో కొండగట్టులో కీలక వ్యాఖ్యలు చేసారు. తాము ఇంకా బీజేపీతో పొత్తుతో ఉన్నామని చెప్పుకొచ్చారు.

  • జనసేన నుంచి టీడీపీ, బీజేపీపై కామెంట్స్ లేవు..

ఇప్పుడు బీజేపీ నేతలు పదే పదే అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. టీడీపీ నేతలు ఎక్కడా జనసేన గురించి ప్రస్తావన చేయటం లేదు. జనసేన నుంచి టీడీపీ, బీజేపీపై కామెంట్స్ లేవు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ టీడీపీ వరుసగా తమ అభ్యర్ధులను ఖరారు చేస్తోంది. జనసేన మాత్రం వేచి చూసే ధోరణితో ఉంది. అయితే ఆవిర్భావ సభతో పాటు జనసేన కండువాల పండగ కూడా జరగనుందని టాక్ వెల్లువెత్తుతోంది. మాజీ ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నేతలు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది పేర్లు ఖరారయ్యాయి.

మరికొంతమంది సడన్ ఎంట్రీ ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఈదర హరిబాబులకు టికెట్లకు సంబంధించిన హామీ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మరో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా జనసేనలోకి రానున్నారని టాక్ వినిపిస్తోంది.

2019లో టీడీపీ నుంచి మంగళగిరి టికెట్ ఆశించి భంగపడిన ఆమె, ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2024లో వైసీపీనుంచి కూడా ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు లేవని తేలిపోయింది. ఆ స్థానానికి వైసీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు గంజి చిరంజీవి పోటీ పడతారనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో వైసీపీలో ఉన్నా టికెట్ దక్కదనే ఉద్దేశంతో కాండ్రు కమల జనసేనలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద జనసేన ఆవిర్భావ సభలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతుండడం విశేషం. ఆ ముగ్గురు కూడా రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు. జనసేనకు ఇది అదనపు బలమనే చెప్పాలి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో జంపింగ్ జపాంగ్ లు ఊపందుకుంటున్నాయి. తాజాగా జనసేనలో చేరికల సంఖ్య పెరుగుతోంది. అయితే అవి టీడీపీ నుంచి కావడం గమనార్హం. టీడీపీ నుంచి గెలిచిన మాజీలు కొందరు జనసేనలో చేరేందుకు డిసైడ్ అయ్యారు.

దీంతో చేరికల వేళ పొత్తులపై నీలినీడలు కమ్ముకంటున్నాయి. అయితే ఈ పరిణామాలు మాత్రం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్లేందుకు మానసికంగా సిద్ధపడ్డాయన్న టాక్ నడిచింది. జనసేనలో చేరికలతో అటు వైసీపీ పెద్దలు.. ఇటు టీడీపీ పెద్దలు ఇలా జరిగిందేంటి..? అని ఆలోచనలో పడ్డారట. రానున్న రోజుల్లో టీడీపీ, వైసీపీ నుంచి టికెట్లు రావనుకునే సిట్టింగ్‌లు, మాజీలు కూడా తమ పార్టీలో చేరతారని అధిష్టానం ధీమాతో ఉందని తెలుస్తోంది. నాయకులు రావడం ఓకే.. కండువాలు కప్పడమూ ఓకే .. కానీ వారికి ఏ మాత్రం ప్రాధాన్యత ఉంటుంది..? టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా అనేదే చర్చనీయాంశంగా మారింది.

మరి ఎంతమందికి టిక్కెట్లు లభిస్తాయన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

Must Read

spot_img