HomePoliticsఅసలు జగన్ న్యూ స్ట్రాటజీ ఏంటి...?

అసలు జగన్ న్యూ స్ట్రాటజీ ఏంటి…?

మొన్న పార్టీలోకి వాలంటీర్ల వ్యవస్థ అన్న జగన్ .. ఇప్పుడు మరో వ్యూహాన్ని తెరపైకి తెచ్చారన్న టాక్ హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో
ఎంపీల్లో కొందరిని ఎమ్మెల్యేలుగా పోటీకి దింపాలని జగన్ యోచిస్తున్నారు. మరి ఇదేమేరకు కలిసి వస్తుందన్నదే చర్చనీయాంశమవుతోంది.

175 కి 175 సీట్లు సాధించడమే తన లక్ష్యం అంటున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆ దిశగా నేతలను, కేడర్ ను సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తూ.. గెలుపు గుర్రాలను రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న కొందరు ఎంపీలకు స్థాన చలనం తప్పదా? MPలలో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుగా బరిలో దిగుతారా? మరికొందరికి ఉద్వాసన తప్పదా? సీట్లు కదులుతున్నాయా? అసలు జగన్ న్యూ స్ట్రాటజీ ఏంటి.. అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు వైసీపీ ఎంపీల విషయంలో సరికొత్త ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్టంలోని 25 లోక్‌సభ సీట్లలో గత ఎన్నికల్లో వైసీపీ 22 గెలుచుకుంది. శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ సీట్లను మాత్రమే టీడీపీ సొంతం చేసుకుంది.

అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం.. వైసీపీ లోక్‌సభ సభ్యుల్లో సగం మందికి వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంపీ టికెట్స్‌ రావన్నది ప్రస్తుత సమాచారం. వాస్తవానికి ఒకసారి ఎంపీ అయినవాళ్లు.. మళ్లీ మళ్లీ అదే సీటు నుంచి పోటీ చేసి సుదీర్ఘకాలం లోక్‌సభ సభ్యులుగా కాలం వెళ్లదీస్తారనే వాదన ఉండేది. వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా వెళ్తోంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఎంపీ అభ్యర్ధి పనితీరు.. సమర్థత అసెంబ్లీ సీట్లపై ప్రభావం చూపుతుంది. ఆ లెక్కలు కూడా మార్పులు చేర్పులకు ఆస్కారం ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఎంపీలకు ఉద్వాసన పలికితే.. మరికొందరికి స్థాన చలనం ఉంటుందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోచోటు నుంచి లోక్‌సభకు పోటీ చేయవచ్చని.. లేదా ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉంటారని టాక్‌ వినిపిస్తోంది. అందుకే జగన్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా లెక్కలు దగ్గర పెట్టుకుని ప్లస్సులు.. మైనస్సులు వేస్తున్నారట. గత రెండున్నికల్లో వైసీపీ ఖాతాలో పడని నియోజకవర్గాలపై గట్టిగా ఫోకస్‌ పెట్టినట్టు చెబుతున్నారు.

ఈ మార్పులు చేర్పులు గురించి తెలిసిన తర్వాత ఏ ఎంపీ ఎక్కడికి వెళ్తారు? మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారా లేదా?

ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేయాలంటే వారికి అనువైన సెగ్మెంట్‌ ఏంటి? అని ఆరాలు తీస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎంపీలకు వైసీపీ అధిష్ఠానం నుంచి సంకేతాలు వెళ్లాయని.. ఆ మేరకు నిర్దేశించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారు పనులు చేసుకుంటున్నారని సమాచారం.

అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీల్లోని కొందరు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు
తమంతట తాముగా అసెంబ్లీకి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరికొందరికి జగన్మోహన్ రెడ్డే చెబుతున్నట్లుగా పార్టీలో టాక్
నడుస్తోంది. వీరిలో రాయలసీమలో ఇద్దరు, ఉత్తరాంధ్రలో ఒకరు, కోస్తా, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఎంపీలున్నారట. ఇంతకీ ఆ ఎనిమిది
మంది ఎంపీలెవరంటే ఎంవీవీ సత్యనారాయణ, చింతా అనూరాధ, వంగా గీత, మార్గాని భరత్, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆదాల ప్రభాకరరెడ్డి, గోరంట్ల
మాధవ్, తలారి రంగయ్యలుగా తెలుస్తోంది. దీని ప్రకారం విశాఖ తూర్పులో టీడీపీ నుంచి హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబుపై
వచ్చే ఎన్నికల్లో MVV వైసీపీ నుంచి పోటీ చేస్తారని టాక్‌ వినిపిస్తోంది. MVV అయితే బలమైన ప్రత్యర్థిగా మారతారని భావిస్తోందట. అందుకేv తూర్పుపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాలని ఎంపీకి చెప్పేశారట. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచిన వంగా గీతను సైతం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని చెబుతున్నారు.

గతంలో పీఆర్పీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో ఉంటారని తెలుస్తోంది. ఆమె కూడా అసెంబ్లీకి వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. ముద్రగడ పద్మనాభం జాయినింగ్‌ను బట్టి పిఠాపురం సీటుపై వైసీపీ మరింత క్లారిటీ ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. సర్వేలో దొరబాబుకు మార్కులు పడలేదో ఏమో.. వంగా గీత మాత్రం పిఠాపురంలో వేగంగానే పావులు కదుపుతున్నారట. అమలాపురం ఎంపీ చింతా అనురాధ సైతం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో ఉంటారట.

అమలాపురం లేదా పి.గన్నవరం నుంచి అనురాధను పోటీ చేయించొచ్చని తెలుస్తోంది. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఏర్పాటు తర్వాత అమలాపురంలో జరిగిన అల్లర్లు.. తర్వాత మారిన సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్‌ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టాక్‌. ఇప్పటికే రాజమండ్రి అర్బన్‌లో అనేక ప్రయోగాలు చేసింది వైసీపీ అధిష్ఠానం. అవేమీ వర్కవుట్ కాకపోవడంతో భరత్‌ను బరిలో దించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. నరసరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలకు వైసీపీ అధిష్ఠానం కొత్త సూచన చేసిందట.

వచ్చే ఎన్నికల్లో లావును గుంటూరు ఎంపీగా పోటీ చేయించే వీలుందట. అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ పెద్దలు MPకి చెప్పినట్టు సమాచారం.
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చర్చల్లో నలిగిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ సైతం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట. ఆయన
ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండపై ఫోకస్‌ పెట్టినట్టు చెబుతున్నారు. అక్కడ కురుబ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉంటడంతో.. అదే సామాజికవర్గానికి చెందిన మాధవ్‌కు కలిసి వస్తుందని అనుకుంటున్నారట. అలాగే అనంతపురం ఎంపీ తలారి రంగయ్య సైతం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారట. ఆయన కల్యాణదుర్గంపై కన్నేశారట. తన సామాజికవర్గానికి చెందిన బోయ కులస్తులు ఎక్కువగా ఉండటంతో కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నారు రంగయ్య. అయితే కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలిచిన ఉషాశ్రీచరణ్‌ ప్రస్తుతం మంత్రి. ఆమెను కాదని రంగయ్యకు సీటు ఇస్తారా అనేది ప్రశ్న. ఒకవేళ కల్యాణదుర్గం కాకపోతే గుంతకల్లు నుంచి రంగయ్య బరిలో ఉండొచ్చనే ప్రచారం ఉంది.

ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డిని రాజ్యసభ లేదా.. నెల్లూరు నగరం, కావలిలో ఒకచోట అసెంబ్లీ టికెట్‌ ఇవ్వొచ్చని చెబుతున్నారు. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నెల్లూరు లోక్ సభకు పోటీ చేసే అవ‌కాశం లేక‌పోలేదు. మిగతా ఎంపీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అయితే ఈ ఎంపీల స్థానంలో ఎవరు పోటీ చేయనున్నారన్న చర్చ పార్టీవర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తోంది. అదేసమయంలో .. ఈ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా హాట్ టాపిక్ గా మారింది. అంతేగాక ఈ సీట్లపై కన్నేసిన ఆశావహుల పరిస్థితి ఏమిటన్న చర్చ కేడర్ లో వినిపిస్తోంది. దీంతో జగన్ ఈ వ్యూహం బాగున్నా, ఫలితం ఏవిధంగా ఉండనుందన్నదే కీలకంగా మారింది. దీనివల్ల కొరుకుడు పడని సీట్లను
గెలుచుకోవచ్చని జగన్ ఆశిస్తుంటే, ఓవైపు ఆశావహులు, మరోవైపు వర్గపోరు .. వీరికి ప్రతిబంధకంగా మారనుందన్న టాక్ విశ్లేషకుల్లో వ్యక్తం అవుతోంది. దీంతో జగన్ వ్యూహం .. సక్సెస్ అవుతుందా.. కొత్త సమస్యల్ని సృష్టిస్తుందా అన్న చర్చ నేతల్లో వెల్లువెత్తుతోంది. అదేసమయంలో ఇప్పటికే ఆ స్థానాల్లో ఉన్నవారి పరిస్థితి ఏమిటన్నది .. ఆసక్తికరంగా మారింది. ఈ వ్యూహం స్థానిక నేతల ఆశలపై నీళ్లు చల్లిందన్న టాక్ సైతం వెల్లువెత్తుతోంది.

మరి జగన్ వ్యూహం ఏమేరకు కలిసివస్తుందో వేచి చూడాల్సిందే.

Must Read

spot_img