- ఇప్పటివరకు టగ్ ఆఫ్ వార్ లా నడిచిన రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవనం .. రచ్చకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడిందా..?
- బడ్జెట్ ప్రసంగం వేళ .. కేసీఆర్, తమిళి సై తీరు .. చర్చనీయాంశంగా మారుతోందా..?
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అసెంబ్లీ ప్రసంగం భారత రాష్ట్ర సమితి నేతల్ని ఉత్కంఠకు గురి చేసింది. కొన్నాళ్లుగా ఆమె ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తాజా రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రభుత్వం ఆమోదించిన ప్రసంగం కాకుండా కేంద్రాన్ని కూడా పొగుడుతూ ప్రసంగించారు. ఈ వివాదాల నడుమ తెలంగాణ సర్కార్ అసలు గవర్నర్ ప్రసంగమే వద్దనుకుంది. కానీ కోర్టుకు మాత్రం గవర్నర్ ప్రసంగం పెడతామని చెప్పి ఆ మేరకు పెట్టింది. గవర్నర్‌కు ప్రసంగం ఇచ్చి.. రెండు, మూడు సార్లు అభిప్రాయాలు తెలుసుకుని మరీ కేబినెట్‌లో ఆమోదించారు. అయినా చివరి వరకూ బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ వీడలేదు. అయితే వీరు ఊహించిన దానికి రివర్స్ లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఎలాంటి వివాదాలు లేకుండా సాగిపోయింది.
చాలా కాలంగా ప్రభుత్వం గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి అలాంటి పరిస్థితి రానివ్వలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ తమిళిసైకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. శాసనసభ, మండలి సభ్యులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ గవర్నర్ ముందుకు కదిలారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను అనుసరించారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమకు కేటాయించిన సీట్లలో నుంచి లేచి గవర్నర్ కు, మరి వీరి రచ్చకు ఫుల్ స్టాప్ పడినట్లేనా అన్నదే తేలాల్సి ఉంది.ముఖ్యమంత్రికి అభివాదం చేశారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం.. గవర్నర్ ను పోడియం వద్దకు తీసుకెళ్లారు. అందరూ జాతీయగీతం పాడారు. ఆ తర్వాత గవర్నర్ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘జై తెలంగాణ’నినాదంతో గవర్నర్ స్పీచ్ ముగించారు. ప్రసంగం పూర్తైన తర్వాత సభ నుంచి వెళ్తున్న సమయంలో మండలి చైర్మన్, స్పీకర్, సీఎం కేసీఆర్, మంత్రి వేముల తమిళిసై వెంట నడిచారు.
గవర్నర్ తమిళిసై కూడా ప్రభుత్వం తనతో చర్చించి ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని యుధావిధిగా చదివారు. ప్రసంగంలోపూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఘనతలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఉన్న తమ ఘనతల్ని.. పాలనా విజయాల్ని గొప్పగా చెప్పుకుంటూ ప్రసంగం రూపొందిస్తుంది. అయితే గతంలో ఇలాంటి సందర్భాల్లో కేంద్ర ప్రస్తావన కూడా తమిళిసై ప్రసంగాల్లో తీసుకు వచ్చేవారు. కానీ ఈ సారి మాత్రం కేంద్ర ప్రస్తావన ఎక్కడా తీసుకు రాలేదు. దాంతో బీఆర్ఎస్ నేతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
గవర్నర్, ప్రభుత్వం మధ్య ఓ రకమైన వార్ చాలా కాలంగా జరుగుతోంది. ఓ వైపు ప్రభుత్వం ప్రోటోకాల్ కూడా కల్పించకపోవడం.. మరో వైపు తెలంగాణ గవర్నర్ బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టడం వంటివి చోటు చేసుకుంటూ వస్తున్నాయి. చివరికి రిపబ్లిక్ డేను కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించలేదు. అయితే ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో మొత్తం సెట్ అయినట్లే భావిస్తున్నారు. ముందు ముందు అటు గవర్నర్.. ఇటు ప్రభుత్వం ఇతర విషయాల్లో ఎలా స్పందిస్తారన్నదాన్ని బట్టి.. తదుపరి రాజకీయాలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహం మరోసారి సైలెంట్ గా మారిపోయింది. అంతకు ముందే గవర్నర్ విషంయలో తాడో పేడో అన్నట్లుగా సాగించిన పోరాటం కూడా రాజీతో ఆగిపోయింది. కేసీఆర్ ఒక్క సారిగా గవర్నర్ విషయంలో రాజీ పడిపోతారని ఎవరూ ఊహించలేదు. అందుకే..కేసీఆర్ రాజకీయ వ్యూహం మారిందా ? బీజేపీతో దూకుడు తగ్గించారా ? అన్న చర్చ వినిపించడానికి కారణం అవుతోంది. గవర్నర్ తమిళిసై పోరాటం అంటే బీజేపీపై యుద్ధం అనుకున్నట్లుగా పోరాడిన కేసీఆర్ చివరి క్షణంలో వెనక్కి తగ్గారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో గవర్నర్ ఏం చెప్పినా సరేనని ప్రభుత్వం అంగీకరిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పెట్టకూడదని కేసీఆర్ గత సమావేశాలకు పొడిగింపు అని ప్రకటించారు.
తర్వాత సీన్ మారిపోవడంతో గవర్నర్ తో అదే నోటిఫికేషన్ ఇప్పించారు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగించాలి కాబట్టి ప్రసంగ పాఠాన్ని ముందుగానే అధికారులు గవర్నర్ కు పంపారు. ఈ ప్రసంగంలో గవర్నర్ పలు మార్పులు సూచించారు. గవర్నర్ ప్రసంగం సహజంగా కేబినెట్ ఆమోదించినదే ఉండాలి. అయినప్పటికీ గవర్నర్ అడిగిన మార్పులు చేసేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. అయితే గవర్నర్ పై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బీఆర్ఎస్ చీఫ్ ఒక్క సారిగా ఇలా వెనక్కి తగ్గడం అనేక రకాల చర్చలకు కారణం అవుతోంది.
దీంతో అసలు కేసీఆర్ ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్స్‌గా మారింది. కేసీఆర్ రాజకీయ చాణక్యుడని ఎలాంటి అడుగు వేసినా.. తనదైన వ్యూహం ఉంటుందని పార్టీ క్యాడర్ నమ్మకంతో ఉన్నారు. అయితే గవర్నర్ విషయంలో ఆయన పూర్తిగా సరెండర్ అయిపోయిట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఏం చెబితే అది చేస్తున్నారు. చివరికి ప్రభుత్వం ఆమోదించిన గవర్నర్ ప్రసంగంలో మార్పులు చేయమన్నా చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయ వ్యూహంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం ప్రారంభమయింది.
- గత మూడేళ్లుగా తెలంగాణ గవర్నర్ తమిళిసైకి..కేసీఆర్ సర్కార్ కు మధ్య రగులుతున్న విభేదాలు..
దీంతో తెలంగాణ గవర్నర్ తమిళిసైకి.. కేసీఆర్ సర్కార్ కు మధ్య గత మూడేళ్లుగా రగులుతున్న విభేదాల మంట టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య ఉన్న అగాధం పూడిపోయింది. ఇంత కాలం ఉప్పు నిప్పులా, విమర్శలు, ప్రతి విమర్శలతో గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య ఉన్న విభేదాలు చల్లారిపోయాయి. ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రతిష్టను గవర్నర్ తమిళసై దిగజారిస్తే, గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించడం, రాజ్ బవన్ ను బీజేపీ కార్యాలయంగా చేశారని ఆరోపించడమే కాకుండా, గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రొటోకాల్ ను కూడా ఇవ్వకుండా అవమానించారు. ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.. మర్యాద గీత దాటేశాయి అనే అంతా అనుకున్నారు.
అలాంటిది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీన్ ఒక్క సారిగా మారిపోయింది. తెలంగాణ బడ్జెట్ కు అనుమతి విషయంలో గవర్నర్, ప్రభుత్వం మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న దశలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తన పిటిషన్ ఉపసంహరించుకుంది. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఇలా రాజీ కుదిరింది. దీంతో సీన్ మారిపోయింది. అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ తమిళసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదురేగి, గౌరవపూర్వకంగా నమస్కరించి ఆహ్వానం పలికారు. ఆ తరువాత గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రజాకవి కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ఆమె ప్రసంగం ప్రారంభించారు. తన ప్రభుత్వం అంటూ ప్రసంగం ఆరంభించిన గవర్నర్ తమిళిసై తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ అంటూ ప్రస్తుతించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజాప్రతినిథుల నిర్విరామ కృషితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ సర్కార్ ఎన్నో విజయాలు సాధించిందన్నారు. దేశానికే ధాన్యాగరంగా ఆదర్శంగా మారిందన్నారు. సంక్షేమం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. పెట్టుబడులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి సిద్ధం చేసి ఇచ్చిన ప్రతినే గవర్నర్ తమిళిసై చదివారు. ఎక్కడా తన సొంత అభిప్రాయాలను వెల్లడించలేదు.
దీంతో గవర్నర్ తన ప్రసంగంలో ఏం మాట్లాడుతారో అన్న టెన్షన్ తో ఉన్న ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో జరిగిన సంఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఎటువంటి ఇబ్బందీ లేకుండా గవర్నర్ ప్రసంగం ముగియడంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలకు పూర్తిగా తెరపడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరి వీరి రచ్చకు ఫుల్ స్టాప్ పడినట్లేనా అన్నదే తేలాల్సి ఉంది..