Homeఆంధ్ర ప్రదేశ్మైలవరం వైసీపీలో ఏం జరుగుతోంది..?

మైలవరం వైసీపీలో ఏం జరుగుతోంది..?

  • మైలవరం వైసీపీలో ఏం జరుగుతోంది.. వసంత పార్టీ మారతారన్న టాక్ వాస్తవమేనా..?
  • ఈ విషయంలో జగన్ ఎంట్రీ .. ప్లస్సా .. మైనస్సా అన్నదే హాట్ టాపిక్ గా మారిందట.

మొన్నటివరకూ క్రమశిక్షణ కలిగిన పార్టీ వైసీపీలో అనూహ్యంగా ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. అసంతృప్త రాగాలు బయటపడుతున్నాయి. హైకమాండ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 175 నియోజకవర్గాలకు 175 గెలుస్తామన్న ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఎపిసోడ్ తరువాత మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆ జాబితాలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తో పాటు ఆయన తండ్రి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో ఆగమేఘాల మీద తాడేపల్లి ప్యాలెస్ ను పిలిపించుకుని మరీ జగన్ చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2018 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వసంతకృష్ణ ప్రసాద్ కు మైలవరం టిక్కెట్ ఇచ్చారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమాపై కృష్ణప్రసాద్ గెలుపు సాధించారు. పార్టీ అన్నా.. అధినేత అన్నా వీర విధేయతతో ఉండే కృష్ణప్రసాద్ మూడున్నరేళ్ల తరువాత తన మనసు మార్చుకున్నారు. తన సెగ్మెంట్లో మంత్రి జోగి రమేష్ కలుగజేసుకుంటుండడంతో కలత చెందారు. అందుకే అసమ్మతి గళాన్ని వినిపించడం ప్రారంభించారు.

గుంటూరు తొక్కిసలాట ఘటనపై పార్టీ లైన్ ధిక్కరించి, కామెంట్స్ చేశారు. కార్యక్రమ నిర్వాహకుడిపై కేసు, అరెస్ట్ ల పర్వాన్ని తప్పుపట్టారు. అదే సమయంలో తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు వసంత కృష్ణప్రసాద్ తండ్రి, మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు టీడీపీ ఎంపి కేశినేని నానితో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి విడుదల సమయంలో వసంత కృష్ణప్రసాద్ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఆయన తండ్రి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వైసీపీలో కమ్మలకు ప్రాధాన్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అటు కృష్ణప్రసాద్ సైతం కొద్దిరోజులుగా సైలెంట్ అవ్వడంతో ఆయన టీడీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది. వసంత కృష్ణ ప్రసాద్ కు లైన్ క్లీయర్ చేసేందుకు దేవినేని ఉమాను వేరే నియోజకవర్గానికి పంపిస్తారన్న టాక్ కూడా నడిచింది. ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ అలెర్ట్ అయ్యింది. ఎమ్మెల్యేతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసింది.

తన నియోజకవర్గంలో జోగి రమేష్ పెత్తనం చెలాయించడంపై కృష్ణప్రసాద్ గట్టిగానే తన వాదనలు వినిపించారు. దీంతో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం గలాటగా మారింది. ఈ నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వసంత కృష్ణప్రసాద్ కు సమాచారం వచ్చింది. దీంతో ఆయన తాడేపల్లి వెళ్లి జగన్ తో చర్చించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి జోగి రమేష్ మితిమీరిన జోక్యం, తన కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారం తదితర పరిణామాలను జగన్ కు వసంతకృష్ణప్రసాద్ వివరించినట్టు తెలుస్తోంది. అవన్నీ తాను చూసుకుంటానని, మీ పని మీరు చేసుకోండని జగన్ భరోసా ఇచ్చినట్టు సమాచారం.

దీంతో సమావేశం నుంచి బయటకు వచ్చిన వసంత కృష్ణప్రసాద్ తాను చివరి వరకూ జగన్ వెంటే ఉంటానని, వైఎస్ కుటుంబానికి వీర విధేయుడినని ప్రకటించారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ ను కలిసినప్పుడు ఇటువంటి మాటలే చెప్పారని.. ఇప్పుడు కృష్ణప్రసాద్ కూడా అదే బాటలో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. అంతేగాక వసంత వైసీపీ కి గుడ్ బై చెప్పడం ఖాయమని.. టీడీపీలో చేరిక నిర్ణయం కూడా జరిగిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు తన్నులాటకు దిగటంతో క్యాడర్ లో గందరగోళం ఏర్పడింది.

స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఉండగా, అదే నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేశ్ కూడా జోక్యం చేసుకుంటున్నారు. తన పాత నియోజకవర్గం కావటం, తన తండ్రి ఇతర కుటుంబ సభ్యులు సైతం అదే నియోజకవర్గంలో పార్టీ కోసం ఆవిర్భావం నుంచి కష్టపడటంతో జోగి రమేశ్ మైలవరం నియోజకవర్గం వైపు మనసు పెట్టారు. దీంతో అక్కడ జోగి రమేశ్ వర్గం ఒకటి ఏర్పడి, స్థానిక శాసన సభ్యుడిగా ఉన్న
వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టింది. ఇది వసంతకు ఇబ్బందిగా మారింది.

ఒకే పార్టీలో ఉండి కూడా స్థానిక శాసనసభ్యుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టటం, అదే సమయంలో జోగికి మంత్రి పదవి రావడంతో వసంత అవమానంగా భావించారు. అయితే వీరి వ్యవహరంపై పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయితీ కూడా చేశారు. అయినా ఇరువురు నేతలు తమ వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఈ వ్యవహరాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ గా ఉన్న మర్రి రాజశేఖర్ వద్దకు చేర్చారు. అయినా అక్కడ పంచాయితీ తెగలేదు. చివరకు ముఖ్యమంత్రి జగన్ నేరుగా జోక్యం చేసుకున్నారు. మైలవరంలో నీకేంటి పని అంటూ మంత్రి జోగి రమేశ్ ను జగన్ ను ప్రశ్నించారని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేయాలని తెగేసి చెప్పటంతో వ్యవహరం కొలిక్కి వచ్చిందని నేతలు అంటున్నారు.

  • ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టు కనిపిస్తోంది..

ఇక్కడ వైసీపీ, టీడీపీ.. రెండిట్లోనూ అంతర్గత పోరు తారస్థాయిలో నడుస్తోంది. ఎన్నికల నాటికి ఇది మరింత ముదిరి పాకాన పడేలా కనిపిస్తోంది. దీంతో రెండు పార్టీల్లో ఎవరు అభ్యర్థి అవుతారు.. ఎవరు గోడ దూకుతారు.. లాంటి అంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రెండు పార్టీల్లోని అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు ప్రయత్నిస్తున్నా.. అవి కొలిక్కి రావట్లేదు. తాత్కాలికంగా సద్దుమణగినట్లు కనిపిస్తున్నా..పరిస్థితులు ఎప్పటికప్పుడు చేజారిపోతున్నట్టు అర్థమవుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం చాలా కీలకమైన నియోజకవర్గం.

గతంలో టీడీపీ తరపున మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఇక్కడ వైసీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేశ్ మధ్య విభేదాలున్నాయి. జోగి రమేశ్ ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఈసారి మైలవరం నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మంత్రిగా ఉండడంతో అధికార యంత్రాంగం కూడా జోగి రమేశ్ కు సహకరిస్తోంది. ఇక్కడ అధికారులు ఎమ్మెల్యేను ఖాతరు చేయట్లేదు.

అదే సమయంలో జోగి రమేశ్ కూడా ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు.
దీంతో వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన తన ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా విభేదాలు కొలిక్కి వచ్చినట్లు కనిపించట్లేదు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇటీవల ఎంపీ కేశినేని నానితో వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వర రావు భేటీ కావడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

పైగా వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు ఆయన తండ్రి వసంత నాగేశ్వర రావు కూడా వైసీపీ ప్రభుత్వ విధానాలను ఇటీవల తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. మైలవరంలో దేవినేని ఉమను వ్యతిరేకిస్తున్న కేశినేని నానితో వసంత ఫ్యామిలీ సన్నిహితంగా మెలుగుతూ ఉండడంతో ఎన్నికల నాటికి ఏదైనా జరగవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజా పరిణామాలతో ఇంత కాలం పట్టించుకోని సీఎం జగన్ .. కేబినెట్ భేటీలో జోగి రమేష్ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో జగన్ .. అసంతృప్త ఎమ్మెల్యేల్ని వీలైనంత వరకూ బుజ్జగించాలని నిర్ణయించుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

మరి జగన్ వ్యూహం కలిసివస్తుందో లేదో వేచి చూడాల్సిందే..

Must Read

spot_img