Homeఅంతర్జాతీయంఇంతకూ అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా వాదనేంటి…?

ఇంతకూ అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా వాదనేంటి…?

భారత సరిహద్దుల వద్ద చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం, ఆ భూభాగం తమదేనని వాదించడం కొత్తేమి కాదు.. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని 90 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని 11 ప్రదేశాలకు పెట్టిన కొత్త పేర్లను చైనా సివిల్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది..

ఇంతకూ అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా వాదనేంటి…? మెక్‌మోహన్ రేఖను చైనా ఎందుకు లెక్కచేయడం లేదు…?
అరుణాచల్ ప్రదేశ్ భూభాగాలపై చైనాతో భారత్ కు వివాదం ఎప్పుడు మొదలైంది..?
అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను చైనీస్, టిబెటన్, పిన్‌యున్ భాషల్లో చైనా సివిల్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించడం వెనక ఉద్దేశ్యం ఏంటి…?

చైనా, భారత్ సరిహద్దు భూభాగాల్లో వివాదం కొనసాగుతూనే ఉంది.. డ్రాగన్ కంట్రీ పొరుగు దేశమైన భారత్ తో కవ్వింపు చర్యలకు పాల్పడటం కొత్తేమీ కాదు.. తాజాగా చైనా చేసిన పని భారత్ కు ఆగ్రహం కలిగించింది.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 11 ప్రదేశాలకు పెట్టిన కొత్త పేర్లను చైనా సివిల్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించింది. ఆ ప్రాంతాలను ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో భాగంగా భారత్
పరిగణిస్తోంది. అటు చైనా కూడా అవి తమ భూభాగంలోని ప్రాంతాలేనని చెబుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 90 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది. ఆక్సాయ్ చిన్‌ పశ్చిమ ప్రాంతంలోని 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించిందని ఇండియా చెబుతోంది.

చైనా అధికారిక వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం, అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను చైనీస్, టిబెటన్, పిన్‌యున్ భాషల్లో చైనా సివిల్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించింది.

చైనా కేబినెట్ స్టేట్ కౌన్సిల్ నిబంధనల మేరకు ఆయా ప్రాంతాల పేర్లు మార్చినట్టు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. సౌత్ వెస్టర్న్ చైనాలోని షిజాంగ్ అటానమస్ రీజియన్‌లో ఈ ప్రాంతాలు ఉన్నట్లు ప్రచురించింది.
ఇటీవల అరుణాచల్‌లో భారత్ నిర్వహించిన జీ20 సమావేశానికి హాజరుకాకూడదని చైనా నిర్ణయించుకున్న తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌పై తన వాదనను పునరుద్ఘాటించే చర్యగా ఆ రాష్ట్రంలోని 11 ప్రదేశాల పేర్లను ప్రామాణికం చేసిన చైనా.. దీనిని ‘టిబెట్ దక్షిణ భాగం జాంగ్నాన్’ అని పిలుస్తుంది. చైనా సివిల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పేర్ల జాబితాలను విడుదల
చేసింది. ఇది స్టేట్ కౌన్సిల్, చైనా క్యాబినెట్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది..

అయితే.. చైనా చర్యలను భారత్ ఖండించింది. ఆ నివేదికలు చూశాం. ఇలాంటి ప్రయత్నాలు చైనాకు ఇదే తొలిసారి కాదు. వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించాం. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమే. అది భారత్‌లో భాగం.. ఎప్పటికీ ఇండియాలో ఒక ముఖ్యమైన ప్రాంతంగా ఉంటుంది. పేరు మార్చేందుకు చేసే ప్రయత్నాలు నిజాన్ని మార్చలేవు ” అని భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార
ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.. ఆ ప్రాంతాలకు పేర్లు పెట్టడం ద్వారా వాటిని చట్టబద్ధం చేసే ప్రయత్నం చైనా చేసిందని చైనీస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారని గ్లోబల్ టైమ్స్ తెలిపింది.

ఆయా ప్రాంతాల గురించి కచ్చితమైన భౌగోళిక సమాచారం ఇచ్చేందుకు ఈ పేర్ల మార్పు సహకరిస్తుందని చైనా మినిస్ట్రీ ప్రకటించింది.వాటిలో రెండు నివాస ప్రాంతాలు, ఐదు పర్వత ప్రాంతాలు, రెండు నదులు, మరో రెండు ఇతర ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ చైనా పేర్లు మార్చడం కొత్తేమీ కాదు.

ఈ వివాదాస్పద ప్రాంతంలో చైనా పేర్లు మార్చడం ఇది మూడోసారి. 2017లో చైనా తొలిసారి ఆరు ప్రాంతాల పేర్లు మార్చింది. ఆ తర్వాత 2021లో మరో 21 ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లో కొంత భాగం తమదేనని చైనా వాదిస్తోంది. ఈ పేర్లు మార్చడాన్ని చైనా తన వాదనకు మరింత బలం చేకూర్చే ప్రయత్నంగా భావిస్తున్నారు.

చైనా చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌ భారత్‌లో భాగమని, ఎప్పటికీ ఇండియాలో అంతర్భాగంగానే ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. గతంలో చైనా పలు ప్రాంతాల పేర్లు మార్చినప్పుడు భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది.

2021 డిసెంబరులో చైనా పలు ప్రాంతాల పేర్లు మార్చినప్పుడు భారత్ స్పందించింది. ”అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చాలనే ప్రయత్నం చైనాకు ఇదే మొదటిసారి కాదు. అరుణాచల్ ప్రదేశ్ఎప్పటికీ భారత్‌లో భాగమే. అది భారత్‌లో భాగం. ఎప్పటికీ ఇండియాలో ఒక ముఖ్యమైన ప్రాంతంగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాల పేర్ల మార్పు ఈ నిజాన్ని మార్చలేదు ” అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు..

అరుణాచల్ ప్రదేశ్ భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఈ రాష్ట్రం భూటాన్, చైనా, మయన్మార్ సరిహద్దుల్లో ఉంది. భారత దేశ రక్షణ, భద్రత విషయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. బ్రిటిష్ అధికారులు నియంతృత్వంతో గీసిన రేఖతోపాటు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన సరిహద్దులు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి.
అయితే 1949లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివాదం ప్రారంభమైంది. అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను ఈ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తుంగలో తొక్కింది. అసమానతలతో కూడిన ఒప్పందాలను తమపై రుద్దారని ఆరోపిస్తూ, భారత దేశంతో అన్ని సరిహద్దులను మళ్లీ చర్చించి, నిర్ణయించాలని డిమాండ్ చేస్తోంది. ఈస్టర్న్ సెక్టర్‌లో మెక్‌మెహన్ రేఖను 1914లో
బ్రిటిష్ ఇండియా-టిబెట్ మధ్య సరిహద్దుగా నిర్ణయించారు. చైనా, టిబెట్, గ్రేట్ బ్రిటన్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో ఈ నిర్ణయం జరిగింది.

భారత్‌తో 1962లో జరిగిన యుద్ధంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని సగానికి పైగా భూభాగాన్ని చైనా ఆక్రమించింది.

ఆ తర్వాత చైనా కాల్పుల విరమణ ప్రకటించింది. తన సైన్యాన్ని మెక్‌మోహన్ రేఖ నుంచి వెనక్కు రప్పించింది.

అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్ ప్రాంతంగా చైనా చెబుతోంది. టిబెట్‌కు చెందిన మతగురువు దలైలామా నుంచి భారత ప్రధాని వరకూ అరుణాచల్‌ను సందర్శించడంపై భ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.2009లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలపై చైనా అభ్యంతరం తెలిపింది. భారత్, టిబెట్ మధ్య 1914కి ముందు నిర్దేశిత సరిహద్దు ఉండేది కాదు.ఆ సమయంలో భారత్ బ్రిటిష్ పాలనలో ఉంది.

ఆ తర్వాత భారత్, టిబెట్ ప్రభుత్వాల మధ్య షిమ్లాలో ఒక ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్ ఏలుబడిలో టిబెట్ ప్రభుత్వ
ప్రతినిధిగా ఉన్న హెన్రీ మెక్‌మోహన్ 1938లో ఆ ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తర్వాత 1954లో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆవిర్భవించింది. ఆ ఒప్పందం ద్వారా భారత్‌లోని తవాంగ్‌తో సహా నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రీజియన్, టిబెట్ మధ్య సరిహద్దు అమల్లోకి వచ్చింది.

భారత్‌కు 1947లో స్వాతంత్య్రం వచ్చింది. అదే సమయంలో 1949లో రిపబ్లిక్ ఆఫ్ చైనా అవతరించింది. అయితే, షిమ్లా ఒప్పందాన్ని చైనా తిరస్కరిస్తోంది. టిబెట్‌పై తమకు హక్కు ఉందని, టిబెట్ ప్రభుత్వ ప్రతినిధిగా సంతకం చేసిన ఒప్పందాన్ని అంగీకరించేది లేదని చెబుతోంది. 1951లో టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడంతో భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల మధ్య తొలిసారి ఉద్రిక్తత నెలకొంది. టిబెట్‌కు స్వాత్రంత్య్రం ఇస్తామని చైనా చెబుతూ వచ్చింది. మరోవైపు, టిబెట్‌కు భారత్ ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇచ్చింది.

అప్పట్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కాలేదు. 1972కి ముందు అరుణాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీగా ఉండేది.

ఆ తర్వాత 1972 జనవరి 20న అరుణాచల్ ప్రదేశ్‌ పేరుతో కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటైంది. ఆ తర్వాత 1987లో అరుణాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా దక్కింది. తవాంగ్‌లోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన బౌద్ధపీఠాన్ని కూడా అరుణాచల్ ప్రదేశ్‌లో భాగంగా చూపించడం చైనా వాదనలకు ఒక కారణంగా చెప్పొచ్చు. అక్కడ బౌద్ధపీఠం స్థాపించడంతో భారత్, టిబెట్మధ్య సరిహద్దు గుర్తించే ప్రక్రియ మొదలైంది.

”లద్దాఖ్ ఘర్షణ తర్వాత, తవాంగ్‌లోని బౌద్ధపీఠాన్నిఆక్రమించుకుని బుద్ధిజాన్ని తన నియంత్రణలో ఉంచుకోవాలని చైనా భావిస్తోంది. తవాంగ్ పీఠానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. అంతేకాకుండా ఆరో దలై లామా కూడా 1683లో తవాంగ్‌లోనే జన్మించారని బలంగా నమ్ముతారు.

టిబెట్ మత గురువు దలై లామా ఈ ప్రాంతంలో పర్యటించడాన్ని కూడా చైనా వ్యతిరేకిస్తోంది. 2009లో దలైలామా టిబెట్‌లో పర్యటించిన సమయంలోనూ నిరసన తెలిపింది. భారత్-చైనా మధ్య దాదాపు మూడేళ్ల నుంచి తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. ఇరుదేశాల సైనికాధికారులు, దౌత్య సిబ్బంది మధ్య పలు దశల్లో చర్చలు జరిగినా పూర్తి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో బలగాల ఉపసంహరణలు మినహా మరే పురోగతి లేదు. అలాంటి సమయంలో టిబెట్ సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా దృష్టి సారించింది.

ఇఫ్పటికే అరుణాచల్ ప్రదేశ్‌ను తమ మ్యాప్‌లో చూపించుకుంటున్న చైనా.. ఆ ప్రాంతంలోని పేర్లను మార్చి అక్కడ ఉద్రిక్తతలకు తెరలేపుతోంది.

చైనా, భారత్ సైన్యాల మధ్య తీవ్రమైన ఘర్షణ 1975లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తులుంగ్ లా ప్రాంతంలో జరిగింది. ఈ ఘర్షణలో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. 2020లో గాల్వన్లో యలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, చైనా సైన్యం నలుగురిని కోల్పోయినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. కానీ 40 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. 2022 డిసెంబరులో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్, యాంగ్‌ట్సే వద్ద ఇరు దేశాల సైన్యాలు తలపడ్డాయి. భారత్-చైనా మధ్య సరిహద్దు పొడవు 3,488 కిలోమీటర్లు వరకు ఉంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వద్ద ఉన్న సరిహద్దును ఈస్టర్న్ సెక్టర్ అంటారు. లడఖ్‌ వద్ద ఉన్న సరిహద్దును వెస్టర్న్ సెక్టర్ అంటారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న సరిహద్దును మిడిల్ సెక్టర్అంటారు. అయితే ఎల్ఏసీ కేవలం 2,000 కిలోమీటర్లు మాత్రమేనని చైనా వాదిస్తోంది. ఈ సరిహద్దులను సక్రమంగా నిర్వచించకపోవడం వల్లే ఇరు దేశాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్‌పై తన వాదనను పునరుద్ఘాటించే చర్యగా ఆ రాష్ట్రంలోని 11 ప్రదేశాల పేర్లను ప్రామాణికం చేసింది చైనా.. డ్రాగన్ కంట్రీ చర్యకు ధీటుగా బదులిచ్చిన భారత్.. అరుణాచల్ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని… పేరు మార్చేందుకు చేసే ప్రయత్నాలు నిజాన్ని మార్చలేవంటూ మండిపడింది.

Must Read

spot_img