Homeఅంతర్జాతీయండ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకు వాటి కోసం కొందరు పిచ్చెక్కిపోతారు?

డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకు వాటి కోసం కొందరు పిచ్చెక్కిపోతారు?

దాదాపు మూడేళ్లుగా కరోనా ముప్పు ప్రపంచాన్ని వణకించింది. మనదేశాన్ని వణికించింది..ఇప్పుడు తాజాగా మన తెలుగు రాష్ట్రాలతో సహా దేశం మొత్తానికి మరో మహా ముప్పు దాపురించింది. ఇప్పటికే ఇది కూడా వైరస్ లా చాపకింది నీరులా విస్తరించుకుపోయింది. ఈ ముప్పు బయటకు కనిపించని ముప్పు..మద్యం,మాదకద్రవ్యాల మహా ముప్పు..గతంలో డ్రగ్స్ అంటే అందరికీ పంజాబ్, ముంబై పేర్లే గుర్తుకు వస్తాయి.. కానీ ఇప్పుడది ఆ ఒక్క నగరానికి ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశమంతా విస్తరించింది. తవ్విన కొద్దీ వాటి మూలాలు మన తెలుగు రాష్ట్రాలలోనూ బయటపడుతున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి కొందరు తెలుగు సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రెండేళ్లుగా విచారిస్తోంది. తాజాగా కొందరిని మళ్లీ పిలిపించుకుని గంటలపాటు విచారించింది.

దాని సంగతి అలా ఉంచితే..దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం నానాటికీ పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. యువతను నిర్వీర్యం చేసే మద్యం, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికి భారత్‌ ప్రధాన కేంద్రమని మూడేళ్ల కిందట అంతర్జాతీయ మాదకద్రవ్య నియంత్రణ మండలి కుండ బద్దలు కొట్టింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో ఆరు శాతం..అంటే దాదాపు 300 టన్నులు..ఇంకా చెప్పాలంటే ముప్పై లారీల డ్రగ్స్.. ఒక్క ఇండియాలోనే బయటపడింది. 2017 నాటికి అది 20 శాతం పెరిగి 353 టన్నులకు పెరిగిపోయింది.

హెరాయిన్‌ సరఫరాకు హైదరాబాద్‌ కీలకంగా మారింది. ఇటీవల నెల రోజుల వ్యవధిలో హైదరాబాదు విమానాశ్రయంలో 121 కోట్ల విలువైన హెరాయిన్‌పట్టుబడింది. ఈ ఏడాది జులై మొదటి వారంలో ముంబయి పోర్టులో 1,800 కోట్ల విలువైన 300 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అస్సాంలోనూ 163కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసింది. గుజరాత్ పోర్టులో అయితే లెక్కలేనంత స్థాయిలో డ్రగ్స్‌ గంజాయి..పట్టుబడింది. కొంతకాలంగా పత్రికల్లో వీటికి సంబంధించిన వార్తల్లేని రోజు ఉండటం లేదు. ఆ వార్తల్లో మనకు కన్పిస్తున్నది కేవలం సెలెబ్రిటీలు మాత్రమే..కాకపోతే అప్పుడప్పుడు పోలీసులు అరెస్టు చేసిన స్మగ్లర్లు కనిపిస్తుంటారు.

కానీ వీరే కాకుండా బయటకు కనిపించని మరో వర్గమూ ఉంది. కేవలం సెలెబ్రిటీలే వాడితే డ్రగ్స్‌ ఇంత పెద్ద స్థాయి వ్యాపారం కానే కాదు. మనదేశంలో సెలబ్రిటీలు వేళ్ల మీద లెక్కబెట్టే సంఖ్యలో ఉంటారు కానీ కొన్ని కోట్లమంది మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ఆ కోట్లలో పిల్లలే ఎక్కువగా ఉంటున్నారన్నది ఆందోళన కలిగిస్తున్న విషయం. డ్రగ్స్‌ ఇప్పుడు గల్లీల్లోకి, సామాన్యుల ఇళ్లలోనూ వచ్చేస్తున్నాయి.

ఈ విషయంపై జాగ్రత్త పడాల్సింది తల్లిదండ్రులే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పిల్లల వ్యవహారాలు నేరుగా తెలిసేది కేవలం తల్లిదండ్రులకే.. వారి ప్రవర్తనలో మార్పులు కనిపించే అవకాశం కేవలం వారికే ఉంటుంది. చిన్నపిల్లలకు సైతం చాక్లెట్ల రూపంలోనూ స్మగ్లర్లు గంజాయి అలవాటు చేస్తున్నారు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.

దేశవ్యాప్తంగా 186 జిల్లాల్లో నాలుగు లక్షల మందికి పైగా మత్తుమందుల వినియోగదారులపై సర్వే జరిపారు. ఎక్కువ మంది అలవాటుపడిన మాదక ద్రవ్యాల్లో గంజాయి, నల్లమందు..అంటే ఓపియం, కొకైన్‌, ఏటీఎస్‌ వంటివి ఉన్నాయి. వీటిలోనూ నల్లమందు వినియోగం ఆందోళనకర స్థాయిలో ఉంది. దేశ జనాభాలో 3.1 కోట్ల మంది దీని కబంధ హస్తాల్లో బందీ అయ్యారు. అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరం రాష్ట్రాల్లో పదిశాతం జనాభా నల్లమందు గుప్పిట్లో చిక్కుకొంది. గంజాయికి సైతం చాలామంది అలవాటు పడుతున్నారు.

ఆయుర్వేద మందు ముసుగులో దీన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నారు. గంజాయిని పొడిగా, ద్రవంగా మార్చి మరీ విక్రయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య 2.2 కోట్లు ఉంటుందని అంచనా. మరో కోటి మంది అదనంగా దీన్ని వినియోగిస్తూ ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీలలో గంజాయి వినియోగం అధికంగా ఉంది.

నల్లమందును హుక్కా రూపంలోనూ యధేఛ్చగా వాడుతున్నారు. దీన్నే ఆయా ప్రాంతాలలో దోడా, పుక్కీ అనీ పిలుస్తున్నారు. హెరాయిన్‌ వినియోగమూ భారత్‌లో ఎక్కువగానే ఉంది. మత్తుకు అలవాటుపడిన వారిలో ఫార్మా పరిశ్రమల నుంచి వచ్చే మందులను 0.96శాతం వినియోగిస్తుండగా, హెరాయిన్‌ తీసుకుంటున్న వారు 1.14శాతంగా ఉన్నారు. మాదక ద్రవ్యాలను వివిధ రూపాల్లో అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లు తొలి అయిదు స్థానాల్లో నిలుస్తున్నాయి. అయితే మెడిసినరీ డ్రగ్స్ పూర్తిగా వైద్యపరమైన అవసరాలకే వాడాలి. కానీ సదరు మత్తుమందులు ఓపెన్ మార్కెట్ లో యథేచ్ఛగా లభ్యమవుతూ యువత ఆరోగ్యానికి హరిస్తున్నాయి.

హైదరాబాద్‌ వంటి నగరాల్లో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరికీ మాదక ద్రవ్యాలు సులభంగా దొరుకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఆవరణల్లో మత్తు మందు వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఔషధ పరిశ్రమలు విస్తరించడం వల్ల మత్తుపదార్థాల ముడిసరుకు బహిరంగ మార్కెట్లో విరివిగా దొరుకుతోంది. వాటిని పర్యవేక్షించాల్సిన సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య బాగా పెరిగిపోయింది.

ఈ మహమ్మారి అలవాట్లు మొదట సిగరెట్‌తో మొదలవుతాయి. అభం శుభం తెలియిని యువత వ్యసనాలు ఒక్కటొక్కటిగా మొదలవుతున్నాయి. మొదట సిగరెట్లు, ఆపై విచ్చలవిడిగా దొరికే మద్యం, ఆ వెంటే మాదక ద్రవ్యాల వరకు వెళ్తోంది. గతంలో అంత సులభంగా దొరకని కొకైన్‌, హెరాయిన్‌ వంటివి అక్రమ రవాణా పెరగడంతో నేరుగా ఏజెంట్ల ద్వారా దొరికిపోతున్నాయి. ఈ-కామర్స్‌, కొరియర్‌ వ్యవస్థ పెరగడంతో మత్తు మందులు నేరుగా వినియోగదారులకు చేరిపోతున్నాయి. మాదక ద్రవ్యాల విక్రయాలు ఈ స్థాయికి చేరుకోవడం మేధావులను కలవరపాటుకు గురిచేస్తోంది.

పైగా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా బాగా పెరిగిపోయింది. ఒడిశా వంటి సరిహద్దు రాష్ట్రాల నుంచి ద్రవ రూపంలో, ఆయుర్వేద మందుల తరహా ప్యాకింగ్‌ చేసి గంజాయిని తరలిస్తున్నారు. ఇటువంటి ముఠాలు కొన్ని ఇటీవల పోలీసులకు పట్టుబడ్డాయి. విశాఖ మన్యం ప్రాంతాల్లో ఇప్పటికీ గంజాయి యధేచ్చగా సాగవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం పోలీసులకు సవాలుగా మారుతోంది. వివిధ దశల్లో చేతులు మారుతున్న గంజాయి… యువతకు సులువుగా దొరికిపోతోంది.

ఇవి కాకుండా సైకాలజికల్ డిజార్డర్స్ కోసం వాడే మందులు, మత్తు మందుల తయారీ ముడిపదార్థాల మళ్ళింపు కూడా పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. భారతనగరాల్లో మత్తు మందులు చాలా సులువుగా లభ్యమవుతున్నాయి. తమ పిల్లలు బుద్ధిమంతులనీ వారికి ఎలాంటి దురలవాట్లూ లేవనీ తల్లిదండ్రులు నమ్ముతారు. పిల్లల్ని నమ్మడం మంచిదే కానీ పరిస్థితులని నమ్మలేం కాబట్టి అప్రమత్తంగా ఉండడం అవసరం. ఎందుకంటే- మాదకద్రవ్యాల అలవాటు చాపకింద నీరులా నిశ్శబ్దంగా మన ఇళ్లలోకి వచ్చేసింది… సహజంగానే పిల్లలకు కుతూహలం ఎక్కువ. టీనేజర్లు తల్లిదండ్రుల కళ్లు కప్పి సిగరెట్‌ కాల్చాలని ప్రయత్నించడం, మద్యంతో ప్రయోగాలు చేయడం సహజం. ఇప్పుడు మరొకడుగు ముందుకేసి ఏకంగా మత్తుతోనే చెలగాటమాడుతున్నారు. చాలా రకాల పరిస్థితులు అందుకు దారితీస్తున్నాయంటున్నారు నిపుణులు. 

తల్లిదండ్రులు విడిపోవడం, గొడవపడడం, అతి క్రమశిక్షణ, హాస్టల్లో ఉండటం లాంటివి కొంతవరకు కారణమైతే, అంతా కలిసే ఉంటున్నా తల్లిదండ్రులు తమ ఉద్యోగవ్యాపారాల్లో బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవడం అన్నిటికన్నా పెద్ద కారణమని ఆధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలు డ్రగ్స్‌ తీసుకోవటానికి అలవాటు పడ్డాక, డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడడం మొదలెడితే అప్పుడు కానీ తల్లిదండ్రులకు తెలియడం లేదు. చాలావరకూ డ్రగ్స్‌ వ్యసనంలో మొదటి శత్రువులు స్నేహితులే. పిల్లలకు అలవాటు చేయడం తేలిక కాబట్టే వ్యాపారులు కూడా పిల్లలు మసలే పరిసరాల్లోనే డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతున్నారు. అందుకేతల్లిదండ్రులు తమ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ప్రజలు, ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేస్తేనే మాదకద్రవ్యాల పీడను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది.

Must Read

spot_img