భారత్, చైనాల మధ్య సరిహద్దు విషయంలో వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయి..? ఈ అంశంలో చారిత్రక వాస్తవాలు ఏం చెబుతున్నాయి..? ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు కారణాలేమిటి..?
ఆక్సాయ్ చిన్, డోక్లాం, నాథులా పాస్ .. ఎందుకు వివాదాస్పదంగా మారుతున్నాయి..? అసలు ఇరు దేశాల మధ్య సరిహద్దుల విషయంలో తలెత్తిన సమస్యలేమిటి..? దీనిపై ఇరు దేశాల వైఖరి ఏవిధంగా ఉంది..?
భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం మరోసారి రాజుకున్నట్లు కనిపిస్తోంది. 2022 డిసెంబరు 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో రెండు దేశాల సైన్యాలు ఘర్షణకు దిగాయి. రెండు వైపులా సైనికులూ గాయపడ్డారని, చైనా వైపు గాయపడిన వారు ఎక్కువగా ఉన్నారని భారత సైన్యం చెబుతోంది. 1975 తర్వాత రెండు దేశాల మధ్య 2020లో తూర్పు లద్దాఖ్‌లో గల్వాన్ లోయలో విధ్వంసకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిలో 20 మంది భారత సైనికులు మరణించారు.
ఆ తర్వాత తూర్పు లద్దాఖ్‌లోని ప్యాగ్యాంగ్ సో సరస్సు పరిసరాల్లో చైనా గస్తీని పెంచింది. ఈ ప్రాంతం లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ ఘర్షణలకు ముందు కూడా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి రెండు దేశాలూ తమ మోహరింపులు పెంచుతున్నట్లు వార్తలు వచ్చాయి. గల్వాన్ లోయలో చైనా సైన్యం కొన్ని తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భారత సైన్యం కూడా ఈ ప్రాంతంలో తమ శిబిరాల సంఖ్యను పెంచింది. అయితే, గల్వాన్ లోయలో భారత్ అక్రమ కట్టడాలను నిర్మిస్తోందని చైనా ఎప్పటికప్పుడే ఆరోపిస్తోంది.
ఇంతకీ రెండు దేశాల మధ్య ఇలాంటి వివాదాస్పద ప్రాంతాలు ఎన్ని ఉన్నాయన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
చైనాకు భారత్‌కు 3,488 కి.మీ. మేర పొడవైన సరిహద్దు ఉంది. జమ్మూకశ్మీర్‌తో మొదలుపెట్టి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింల మీదుగా అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ సరిహద్దు కొనసాగుతుంది. ఈ సరిహద్దును మూడు భాగాలుగా విభజించొచ్చు.
వీటిలో మొదటిది పశ్చిమ సెక్టార్.. దీనిలో జమ్మూకశ్మీర్ ఉంటుంది. ఆ తర్వాత మధ్య సెక్టార్.. దీనిలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉంటాయి. మూడోది తూర్పు సెక్టార్.. దీనిలో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఉంటాయి. అయితే, రెండు దేశాల మధ్య స్పష్టమైన సరిహద్దులు లేవు. ఈ అస్పష్టతే చాలా ప్రాంతాల్లో వివాదాలకు కారణం అవుతోంది. అక్సాయ్ చిన్‌ను తమ పశ్చిమ సెక్టార్‌లోని ప్రాంతంగా భారత్ చెబుతోంది. కానీ, ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది. 1962 యుద్ధ సమయంలో ఈ ప్రాంతాన్ని చైనా తమ నియంత్రణలోకి తీసుకుంది. ఇక తూర్పు సెక్టార్ విషయానికి వస్తే, అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని తమ భూభాగంగా చైనా చెబుతోంది. ఇది దక్షిణ టిబెట్‌లో భాగమని వివరిస్తోంది. మరోవైపు టిబెట్, అరుణాచల్ ప్రదేశ్‌ల మధ్యనుండే మెక్‌మోహన్ రేఖను చైనా గుర్తించదు. 1914లో బ్రిటిష్ ఇండియా, టిబెట్ మధ్య ఈ రేఖపై ఒప్పందం కుదిరింది. అయితే, అప్పట్లో తమను ఒప్పందంలో చేర్చుకోలేదని, అందుకే దాన్ని తాము గుర్తించేది లేదని చైనా చెబుతోంది.
1914లో టిబెట్‌కు స్వయం ప్రతిపత్తి ఉండేది. అయితే, 1950లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా చైనా తమ ఆధీనంలోకి తీసుకొంది. మొత్తంగా మెక్‌మోహన్ రేఖను చైనా అంగీకరించదు. అదే సమయంలో అక్సాయ్ చిన్ కూడా తమ భూభాగమని చైనా చెబుతోంది. ఈ వివాదాల మధ్య రెండు దేశాల మధ్య స్పష్టమైన సరిహద్దులు లేవు. దీంతో యాథాతథ స్థితిని కొనసాగించేందుకు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ని తీసుకొచ్చారు. నిజానికి ఎల్‌ఏసీ కూడా చాలాచోట్ల అస్పష్టంగా ఉంటుంది. రెండు దేశాలు ఈ సరిహద్దును ఒక్కోచోట ఒక్కోలా పేర్కొంటున్నాయి.
చాలాచోట్ల హిమానీనదాలు, మంచు ఎడారులు, పర్వతాలు, నదులు వాస్తవాధీన రేఖపై కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో సరిహద్దులను నిర్ణయించడం మరింత కష్టంగా ఉంటుంది. ఫలితంగా రెండు దేశాల సైన్యాలు ఎదురెదురు పడుతుంటాయి. 134 కి.మీ. పొడవైన ప్యాంగ్యాంగ్ సో సరస్సు హిమాలయాల్లో 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ సరస్సులో 45 కి.మీ. భారత్ నియంత్రణలో ఉంది. మరో 90 కి.మీ. చైనా నియంత్రణలో ఉంటుంది. ఈ సరస్సు మధ్య గుండా వాస్తవాధీన రేఖ వెళ్తుంది.
ప్యాంగ్యాంగ్ సో సరస్సు పశ్చిమ సెక్టార్‌లో చాలా ప్రాంతాలను చైనా ఆక్రమించిందని భారత సైనిక వర్గాలు చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇక్కడ వివాదానికి ప్రధాన కారణం వాస్తవాధీన రేఖపై రెండు దేశాల మధ్య స్పష్టత లేకపోవడమే.
ఇక్కడ రెండు దేశాలు సరిహద్దును ఒక్కోలా పేర్కొంటున్నాయి. అందుకే ఇక్కడ రెండు దేశాల మధ్య విధ్వంసకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పొరుగు దేశం సైనికులు తమ భూభాగంలోకి ప్రవేశించారని రెండు దేశాల సైనిక ప్రతినిధులు ఆరోపిస్తూనే ఉంటారు.
ఈ సరస్సు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చుషుల్ లోయలోని ప్రాంతాలకు దీని గుండా వెళ్లొచ్చు. 1962 యుద్ధంలో ఈ మార్గం గుండానే వచ్చి భారత్‌పై చైనా దాడి చేసింది. ప్యాంగ్యాంగ్ సో సరస్సుకు తమవైపు చైనా భారీగా రోడ్లు నిర్మిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక్కడ మరో వివాదాస్పద ప్రాంతం గల్వాన్ లోయ. లద్దాఖ్, అక్సాయ్ చిన్‌ల మధ్య ఈ ప్రాంతం ఉంటుంది. భారత్ ప్రధాన భూభాగం, అక్సాయ్ చిన్ మధ్య వాస్తవాధీన రేఖ ఉంటుంది. చైనాలో షిన్‌జియాంగ్ ప్రాంతం దక్షిణ భాగంలో అక్సాయ్ చిన్ ఉంటుంది.
ఈ ప్రాంతాలు భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే లద్దాఖ్, పాకిస్తాన్ నియంత్రణలోని ప్రాంతాలతోపాటు చైనాలోని షిన్‌జియాంగ్‌కు ఇవి సమీపంలో ఉంటాయి. 1962 యుద్ధ సమయంలోనూ గల్వాన్ ప్రాంతంలో రెండు దేశాల సైనికులు తలపడ్డారని రక్షణ రంగ నిపుణులు చెబుతారు. గల్వాన్ లోయలో భారత్ నిర్మాణాలను అక్రమం అని చైనా చెబుతోంది. ఎందుకంటే వాస్తవాధీన రేఖ వెంబడి ఎలాంటి నిర్మాణాలు చేపట్టమని రెండు దేశాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. కానీ, అటు వైపు ఇప్పటికే చైనా భారీగా సైనిక నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడేమో యాథాతథ స్థితిని కొనసాగించాలని చెబుతోంది.
అది ఎలా సాధ్యమని వీరంతా ప్రశ్నిస్తున్నారు. 2017లో భారత్, చైనాల మధ్య డోక్లాంలో వివాదం రాజుకొంది. ఇది దాదాపు 70 నుంచి 80 రోజులపాటు కొనసాగింది. ఆ తర్వాత చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించింది. డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్ వ్యతిరేకించడంతో ఇక్కడ వివాదం మొదలైంది. నిజానికి ఇది చైనా, భూటాన్‌ల మధ్య వివాదం. అయితే, ఇది భారత్‌లోని సిక్కింకు సమీపంలో ఉంటుంది. దీన్ని మూడు దేశాల కూడలిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చైనా రోడ్డును నిర్మిస్తే, భారత్‌లో చికెన్స్ నెక్‌గా భావించే సన్నని మార్గానికి ముప్పు పొంచివుండే అవకాశముంది. చికిన్స్ నెక్ అనేది 20 కి.మీ. వెడల్పు ఉండే భారత్ మార్గం. ఇది ఈశాన్య భారత్‌ను, భారత్ ప్రధాన భూభాగంతో అనుసంధానిస్తుంది.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు సరిహద్దు రేఖ విషయంలో వస్తోన్న విబేధాలే కారణమన్నది విశ్లేషకుల వాదన. అయితే ఈ అంశంపై ఇరు దేశాలు .. చర్చలతో పరిష్కారం కనిపెట్టేందుకు ముందుకు రావాలని వీరంతా కోరుతున్నారు.