Homeఅంతర్జాతీయంభారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణాలేంటి..?

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణాలేంటి..?

భారత్, చైనా సరిహద్దుల్లో వివాదాలకు .. ఇరువైపులా నిర్మిస్తోన్న నిర్మాణాలే కారణమా..? దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు..? ఈనేపథ్యంలో ఇరుదేశాల దూకుడు మరింత రచ్చకు కారణమవుతోందని అంచనాలు వినిపిస్తున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ లో .. చైనా చొరబాటు ప్రయత్నాల వెనుక .. పెద్ద కథే ఉందని విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు. దీనికి ఆజ్యం పోసింది.. ఎల్ఏసీ వెంబడి సాగుతోన్న నిర్మాణాలే .. వివాదాలకు కారణమని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని భారత్‌-చైనా సరిహద్దులో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు సరిహద్దులో నిర్మిస్తున్న నిర్మాణాలే కారణమా? అంటే.. ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన శాటిలైట్‌ చిత్రాలు అవునని నిరూపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి కొన్ని వందల మీటర్ల దూరంలోనే గత 12 నెలలుగా రెండు దేశాలు పలు డిఫెన్స్‌ అవుట్‌ పోస్టులను నిర్మిస్తున్నట్టు ఈ చిత్రాలు చూపుతున్నాయి.

గల్వాన్‌ లోయలో చోటుచేసుకొన్న ఘర్షణ నేపథ్యంలో సరిహద్దులపై భారత్‌, చైనా ఫోకస్‌ పెట్టాయని, అందులో భాగంగానే ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో నిర్మాణాలు ఎక్కువయ్యాయని పేర్కొంది. తవాంగ్‌ సరిహద్దులోని యాంగ్‌త్సే ప్రాంతంలో భారత సరిహద్దు వెంబడి భారత ఆర్మీ ఆరు ఫ్రంట్‌లైన్‌ అవుట్‌పోస్టులను నిర్మించింది. అందులో కొన్ని భవనాలు, రాళ్ల గోడలు ఉన్నాయి. వాస్తవాధీన రేఖకు 1.5 కిలోమీటర్‌ పరిధిలోనే ఫార్వర్డ్‌ బేస్‌ను కూడా ఏర్పాటు చేసింది. పలు రోడ్ల నిర్మాణాలు చేపట్టింది. శాటిలైట్‌ చిత్రాల నివేదిక ప్రకారం.. ఈ ప్రాంతంలో భారత్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

అయితే, చాలా వరకు రోడ్లు కొట్టుకుపోయి, కొండ చరియలు విరిగిపడిపోయి కనిపించాయి. మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కూడా భారీస్థాయిలో నిర్మాణాలు చేపట్టింది. భారత అవుట్‌పోస్టు నుంచి 150 మీటర్ల దూరంలోనే సరిహద్దు వెంబడి రోడ్డును నిర్మించింది. మౌలిక సదుపాయాల కోసం ఎక్కువ ఖర్చు చేసింది. ఈ రోడ్డు చివర ఒక చైనా ఆర్మీ పోస్ట్‌ కూడా ఉంది.

నేరుగా సైనికులను వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చేలా ప్రాజెక్టులు చేపట్టింది. ఈ రోడ్డు ద్వారా చైనా సైనికులు చొచ్చుకొచ్చి భారత సైనికులతో ఘర్షణకు దిగినట్టు తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకొని భవిష్యత్తులో మరోసారి చైనా వాస్తవాధీన రేఖను అతిక్రమించే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

సైనికుల మధ్య ఘర్షణల నేపథ్యంలో చైనాతో సరిహద్దు వెంబడి భారత్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చతుర్ముఖ దిగ్బంధ ప్రణాళికను అమలు చేస్తోంది. చైనాతో సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో కొత్త సొరంగ మార్గాల నిర్మాణం, రోడ్డు, రైలు మార్గాల పూర్తి, కొత్త ఫైటర్‌ జెట్ల మోహరింపుపై దృష్టి పెడుతోంది. తవాంగ్‌ ప్రాంతంలో ఆరు సొరంగ మార్గాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని భారత్‌ భావిస్తోంది.

బలిపర-చార్దువార్‌-తవాంగ్‌ ప్రాంతాలకు రోడ్డు కనెక్షన్‌లో భాగంగా సెలా పాస్‌ వద్ద సొరంగాన్ని నిర్మిస్తోంది. ఇవి అందుబాటులోకొస్తే స్వల్ప కాలంలోనే సైనిక సిబ్బందిని, యుద్ధ సామగ్రిని సరిహద్దుకు చేరవేయవచ్చు. ట్రాన్స్‌ అరుణాచల్‌ హైవే ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాయవ్య తవాంగ్‌ నుంచి తూర్పున ఉన్న కనబరి వరకు సుమారు 2 వేల కి.మీ. మేర రెండు లేన్ల రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది.

బెంగాల్‌ ఉత్తరకొనలో ఉన్న హసిమార వద్ద మరిన్ని రఫేల్‌ యుద్ధ విమానాలను మోహరించే ప్రణాళిక ఉంది. నాథులా కనుమ, డోక్లాం ప్రాంతాలకు సైన్యాన్ని వేగంగా తరలించేందుకు బెంగాల్‌, సిక్కిం మధ్య శివోక్‌-రంగ్‌పై రైల్వే లింక్‌ను నిర్మిస్తున్నారు. ఇక చైనా సైతం భారత సరిహద్దుల్లో పక్కాగా నిర్మాణాలను చేపడుతోంది. అయితే భారతదేశం వైపు ఉన్న మౌలిక సదుపాయాలు చాలా దయనీయంగా ఉన్నాయని, పశ్చిమ సియాంగ్ జిల్లాలోని అలో పట్టణానికి మెంచుకాను కలిపే ఒకే రహదారి ఉందని తెలుస్తోంది.

సరిహద్దులకు చేరుకోవడానికి చైనా నాలుగు లేన్‌ల రహదారిని పూర్తి చేయగా.. భారత సరిహద్దు రహదారి సంస్థ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఇదిలా వుంటే.. చైనా ఎందుకు ముందుకు వస్తోంది..? ఏ కారణాలతో భారతదేశాన్ని చికాకుపెట్టాలని చైనా చూస్తోందన్నదే చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే పనులు శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నాయి. ఇది భారతదేశంలో అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టులలో ఒకటి. దీని నిర్మాణం ఈశాన్య రాష్ట్రాలలో దాని పట్టును మరింత బలోపేతం చేస్తుంది. ఇది వ్యూహాత్మక ప్రాజెక్ట్ అని.. ఈ ప్రాజెక్ట్ కింద, LAC పూర్తిగా హైవేకి అనుసంధానించబడుతుంది. దాని తర్వాత చైనా తన నీచమైన, కుటిల కుయ్యుక్తులను కత్తెర పెట్టేందుకు ప్లాన్ మొదలు కానుంది.

ఈ ప్రాజెక్టు పూర్తైతే చైనాపై నిఘా ఉంచడం చాలా సులభం. ఈ ప్రొజెక్టుపై చైనా ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. మెక్‌మాన్ రేఖ వెంబడి ఉన్న అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే కింద 2,000 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ రహదారి భూటాన్‌కు ఆనుకుని ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని మాగో నుంచి ప్రారంభమై మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయ్ నగర్ వద్ద ఈ హైవే ముగుస్తుంది.

ఇది తవాంగ్, ఎగువ సుబంసిరి, టూటింగ్, మెచుకా, ఎగువ సియాంగ్, దేబాంగ్ వ్యాలీ, దేసాలి, చగల్‌గామ్, కిబితు, డాంగ్ మీదుగా వెళుతుంది. ఈ రోడ్డు నిర్మాణం తర్వాత ఎల్‌ఏసీ పూర్తిగా హైవేకి అనుసంధానం కానుంది. అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే భారత సైన్యానికి చాలా ముఖ్యమైనది.. సరిహద్దులో ఆయుధాలు, పరికరాలు, సైనికుల కదలిక చాలా ఈజీగా మారుతుంది.

అయితే చైనా.. సరిహద్దుకు ఆనుకొని ఉన్న రాష్ట్రాల్లో భారత అభివృద్ధి పనులను చూసి తట్టుకోలేక పోతోంది. కొంతకాలం క్రితం, లడఖ్‌లోని అక్సాయ్ చిన్‌లోని గాల్వన్ వ్యాలీలో ఒక ముఖ్యమైన రహదారి నిర్మాణంపై కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. గాల్వన్ ఘర్షణతో ఈ రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. తూర్పు లడఖ్‌లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను ఆపేది లేదని భారత్ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే, భారత సరిహద్దుల్లో చైనా ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలను ప్రోత్సహిస్తోందని భారత రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తవాంగ్‌కు ఉత్తరాన 25 కి.మీ దూరంలో 11-12 వేల అడుగుల ఎత్తున యాంగ్జే ఉంటుంది. ఇది ఒక పాత వివాదాస్పద ప్రాంతం. 1990వ దశకంలో భారత్, చైనా అధికారులు మధ్య చర్చలు ప్రారంభమైనప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని వివాదాస్పదంగానే భావించేవారు.

1999 జులై నెలలో కూడా చైనా ఈ ప్రాంతంలోకి చొరబడేందుకు ప్రయత్నించింది. భారత్ ఎదురుదాడితో వెనక్కి మళ్లింది. కానీ, ఇప్పుడు ఇరు దేశాల మధ్య దౌత్యస్థాయిలో, సైన్యాల స్థాయిలో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘర్షణ జరిగింది. దీన్నిబట్టి చూస్తే చైనా తన వైఖరిని మార్చుకోలేదని, సరిహద్దులో తన తెలివితేటల్ని చూపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికీ తమవేనని భావించే కొన్ని ప్రాంతాలని చైనా ఆక్రమించుకోవాలని అనుకుంటోంది.

అందుకే చైనా రాబోయే కాలంలో కూడా భారత్‌పై మరింత ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. చైనా నుంచి ఇలాంటి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. భారత్ వీటికి తగు విధంగా స్పందించాల్సి ఉంటుంది. భారత్-చైనాల మధ్య ఈ గొడవ అకస్మాత్తుగా జరగలేదని, దీని వెనుక చైనా వ్యూహం ఏదైనా ఉండవచ్చని భారతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సరిహద్దు వెంబడి భారత్ భద్రతా బలగాల సంఖ్యను పెంచింది.

భద్రతా మౌలిక సదుపాయాలను పటిష్టం చేసింది. నిఘాను కఠినతరం చేసింది. ఇప్పుడు సరిహద్దుల్లో పరిస్థితులు మారిపోయాయని, చైనా వ్యూహానికి భారత సైన్యం దీటైన బదులు ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత సైన్యం, రాజకీయ నాయకత్వం, పోరాడగల సామర్థ్యం ఇలా చాలా రంగాల్లో భారత్ ఇప్పుడు బలంగా తయారైంది.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు .. ఇరు దేశాలు చేపడుతోన్న నిర్మాణాలే కారణమైనా, ఇరు దేశాలు పట్టు బిగిస్తుండడం .. చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img