Homeఅంతర్జాతీయంమాకు పెళ్లి వద్దు పిల్లలు వద్దు..

మాకు పెళ్లి వద్దు పిల్లలు వద్దు..

మాకు పెళ్లి పిల్లలు వద్దు..ఆ జంజాటాలేమీ పెట్టకోకుండా హాయిగా జీవితం గడచిపోతోందని అంటున్నారు చైనా యువతీ యువకులు. మారుతున్న కాలనికి తగ్గట్టుగా వివాహం, సంతానం కుటుంబాన్ని మెయింటెయిన్ చేయడం లేని తలనొప్పిని తెచ్చిపెట్టుకుంటున్నట్టుగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే చైనాలో జననాల రేటు దారుణంగా పడిపోతోంది. దాంతో భవిశ్యత్తులో వచ్చే సమస్యపై ప్రభుత్వం సీరియస్ గా ద్రుష్టి పెట్టింది..

ఏది చదవండి

చైనాలో పిల్లలను కనేందుకు మహిళలు నిరాకరిస్తున్నారు. మేము ఈ రోజుల్లో పిల్లలను పోషించలేమంటూ మూడు పదుల వయస్సులో ఉన్న వివాహిత మహిళలు తెగేసి చెబుతున్నారు. అందుకు కారణంగా నానాటికీ పెరుగుతున్న జీవన వ్యయమే కారణమని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఖర్చులేమిటన్న విషయానికొస్తే.. ఇతర ఖర్చులతో పాటుగా పిల్లలను పెంచడానికి నెలకు సుమారు 2400 డాలర్లు అవసరమౌతాయి.

అంటే మన కరెన్సీలో అయితే అది నెలకు 1 లక్షా 96 వేల 368 రూ.లతో సమానం. అది నిజంగానే భారీ ఖర్చు కిందే లెక్క అని అంటున్నారు అక్కడి మహిళలు. ఆహారం వంటి రోజూవారీ ఖర్చుల కోసం 436 డాలర్లు కావాలంటున్నారు. పిల్లలు పెరిగాక కిండర్‌గార్టెన్‌ స్కూలులో చేర్పించేందుకు 291 డాలర్లు..అంటే 23 వేల 809 రూ.లు, పార్ట్‌టైమ్ పిల్లల సంరక్షణకు 11వేల 863 రూ.లు కావాలంటున్నారు.

పాఠశాల చదువుల కోసమే 1456 డాలర్లు అవసరమౌతున్నాయి. అంటే మన కరెన్సీలో1లక్షా 19 వేల 130 రూ.లు ఖర్చవుతోంది. ఇకపోతే వారికి నెల నెలా వచ్చే ఆదాయం గురించి చూద్దాం. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సులోని ఒక ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న మహిళకు నెలంతా పనిచేస్తే 50 వేల రూ.లు వస్తుంది. అదే దేశంలోని ఈ ప్రాంతంలో ప్రైవేటు సెక్టారులో పనిచేసే వారి సగటు ఆదాయం నెలకు 71 వేల429 రూ.లు వస్తోంది..మరి తమకు వచ్చే ఈ మొత్తంతో పిల్లలను ఎలా సాకగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఖర్చులు పెరిగిపోవడం, ఆదాయం తగ్గపోవడం వల్లే పిల్లల జంజాటం వద్దే వద్దని అంటున్నారు. గతంలో చైనా అనుసరించిన వన్ చైల్డ్ పాలసీ కారణంగా పొదుపుగా జీవించడం అలవాటుగా చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు లేదా ముగ్గురిని కనమంటే ఏం చేయడం అని ప్రశ్నిస్తున్నారు.

  • సంతానోత్పత్తి రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది..

ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణతో పాటు, ఇంట్లోని వస్తువుల కోసం చేసిన అప్పుల వాయిదాల చెల్లింపుల కోసం డబ్బు ఆదా చేయడంపైనే అంతా దృష్టి పెడుతున్నారు. మరోవైపు సంతానోత్పత్తి రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఎందుకంటే చైనా ప్రస్తుతం జనాభా మార్పును ఎదుర్కొంటోంది. గత ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనా జనాభా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. చైనా మహిళల్లో ఎక్కువ మంది ఒకే బిడ్డను కోరుకుంటున్నారని, లేదా అసలే పిల్లలే వద్దని అనుకుంటున్నారని కొత్త డేటా ప్రకారం తెలుస్తోంది.

చైనా జనాభా, అభివృద్ధి పరిశోధన కేంద్రం ఇటీవల చేపట్టిన సర్వే ప్రకారం, చైనాలో సంతానం లేని మహిళల సంఖ్య 2015లో 6 శాతం ఉండగా, 2020 నాటికి 10 శాతానికి పెరిగినట్లు సమాచారం. ప్రసవానికి అనువైన వయస్సులో ఉన్న మహిళల్లో పిల్లలను కనాలనే ఉద్దేశం కూడా తగ్గిపోతున్నట్లుగా ఈ డేటా చూపించింది. చైనా మహిళల సంతానోత్పత్తి రేటు 2017లో 1.76 ఉండగా, 2021 నాటికి 1.64కి పడిపోయినట్లుగా తెలిసింది. సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర ఆసియా దేశాల్లో కూడా సంతానోత్పత్తి రేటు 2 కంటే తక్కువగానే ఉంది. కానీ, వారు తమకు ఇద్దరు పిల్లలు కావాలని కోరుకుంటున్నారు.

అదే చైనాలో చూస్తే మాత్రం ఈ పరిస్థితి లేదు. చైనాలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉండటమే కాదు, సంతానం కావాలనే కోరిక కూడా తక్కువగానే ఉంటోంది. చైనాలో జననాల రేటును పెంచడంపై మార్చి 4న జరిగిన రాజకీయ సమావేశంలో రాజకీయ సలహాదారులు వివిధ ప్రతిపాదనలను సమర్పించారు. అండాల సంరక్షణకు అవివాహిత స్త్రీలకు మద్దతు ఇవ్వడం అందులో ఒకటి.. అంతే కాదు..కిండర్‌గార్టెన్ నుంచి కాలేజీ వరకు పుస్తకాలు, ట్యూషన్ ఫీజులను మాఫీ చేయడం వంటి సూచనలు కూడా ఇచ్చారు.

పెళ్లికాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు కూడా సమాన హక్కులు కల్పించాలనే ఆలోచన కూడా చేశారు. చైనాలో అవివాహితులైన తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సంక్షేమానికి అవసరమైన అధికారిక రిజిస్ట్రేషన్ ‘హుకూ’ను పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా పిల్లల్ని కనాలనే నిర్ణయం విషయంలో చైనా మహిళలు వెనుకాడుతున్నారు. ఎందుకంటే చైనీస్ మహిళలు పిల్లలు వద్దనుకోవడానికి గల కారణాలలో పిల్లలను పెంచడానికి అయ్యే అధిక వ్యయం ప్రధానమైనదిగా తేలింది. పిల్లలు పుట్టడంతోనే వారికి అయ్యే ఖర్చులు చైనా జంటలను కలవరపెడుతున్నాయనడంలో సందేహం లేదు.

Must Read

spot_img