ఎన్నికల పోటీలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఫలితాలు వచ్చేదాకా తెలియదు. గెలిచిన వ్యక్తిని ప్రత్యర్థి అంగీకరించాలి. కానీ ఇజ్రాయెల్ లో అలా జరగడం లేదు. మొన్నటికి మొన్న జనం మద్దతుతో గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వాన్ని ఓడిపోయిన యాయైర్ లాపిడ్ మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ ను అల్లకల్లోలం చేస్తున్నారు..

ఇజ్రాయెల్‌లో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రనిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రవాద పార్టీల సహాయంతో అధికారంలోకి వచ్చిన నెతన్యాహు కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు శనివారం వీధుల్లోకి వచ్చారు. యాయైర్ లాపిడ్ మద్దతుదారులు పార్లమెంటు, సుప్రీంకోర్టు , అధ్యక్ష భవనంపై దాడి చేశారు. ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’, ‘ఫాసిజం, వర్ణవివక్షకు వ్యతిరేకంగా కలిసి నిలబడండి’ అనే నినాదాలతో నిరసన చేపట్టారు.
నిరసనకారులు ఇజ్రాయెల్ జాతీయ జెండా, ఇంద్రధనస్సు జెండాలతో వీధుల్లోకి వచ్చారు. ‘క్రెమ్ మినిస్టర్’ అంటూ నెతన్యాహుకు వ్యతిరేకంగా బ్యానర్లను నిరసనకారులు ప్రదర్శించారు. నవంబర్ 2022 ఎన్నికలలో నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు.
డిసెంబర్ చివరిలో అధికారం చేపట్టారు. తీవ్ర మితవాద పార్టీలు, సంప్రదాయవాద జ్యూయిష్ పార్టీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన నెతన్యాహు క్యాబినెట్‌లో వారికి ముఖ్యమైన పదవులు కట్టబెట్టారు. ఇదే నిరసనలకు దారి తీసింది. పన్ను ఎగవేతకు పాల్పడిన వారికి, పాలస్తీనా విశ్వాసులను ఊచకోత కోసిన ఉగ్రవాదిని ఆరాధించిన వారికి నెతన్యాహు మంత్రివర్గంలో చోటు దక్కింది.
ఇజ్రాయెల్‌లో సుదీర్ఘకాలం పాలించిన నెతన్యాహు కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ ప్రజాస్వామ్యం అంతరించిపోతోందని నిరసనకారులు ఆరోపించారు. ఉగ్రవాదులు తమ ఆలోచనలను దేశంపై రుద్దుతున్నారని, ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మితవాద పార్టీల నిర్ణయాలు దేశంలోని మెజారిటీ ప్రజల నిర్ణయాలు కాదని వారు ఆరోపించారు.
డెబ్బయి మూడేళ్ల బెంజమిన్ నెతన్యాహూ 2021లో మితవాద, ఉదారవాద, అరబ్ పార్టీల సంకీరణ కూటమి చేతిలోఓడిపోయారు. ఏడాది తర్వాత తిరిగి మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇజ్రాయోల్ ప్రస్తుత ప్రధాని యాయైర్ లాపిడ్ తన ఓటమిని అంగీకరించారు. లాపిడ్ నెతన్యాహుకు ఫోన్ చేసి విజయంపై అభినందనలు తెలిపారు. కాగా బెంజమిన్ నెతన్యాహు అధికారంలోకి రాగానే దేశంలో అల్లర్లు మొదలయ్యాయి.
తన గెలుపును వైరిపక్షం అంగీకరించడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఓ సంఘటన ఇజ్రాయెల్ తో మిడిల్ ఈస్టు దేశాల సంబంధాలను చెడిపోయేలా చేసింది. మొదటి నుంచి అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ అంటే పడదు. ఇప్పుడిప్పుడే సౌదీ యూఏఈ ఇజ్రాయెల్ తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరచుకుంటున్నాయి.
ఈలోగా ఇజ్రాయెల్ కు చెందిన గిల్ తమ్రి అనే ఓ జర్నలిస్టు తాను పనిచేస్తున్న చానెల్13 కోసం ఓ ప్రత్యేక ఆర్టికల్ తయారు చేసేందుకు మక్కాలోకి ప్రవేశించాడు. మక్కాను ముస్లింలు అత్యంత పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ముస్లిమేతరులు ఇక్కడికి రావడం నిషేధం. అందుకే ఇజ్రాయెల్ జర్నలిస్ట్, మక్కాలోకి ప్రవేశించడం కేవలం సౌదీ అరేబియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది.
మక్కాలోకి ప్రవేశించిన వ్యక్తి ఇజ్రాయెల్‌కు చెందిన జర్నలిస్ట్ కావడం విశేషం. అయితే యాత్ర తర్వాత గిల్ తమ్రి క్షమాపణ చెప్పారు. ”మత సహనాన్ని పెంపొందించడానికి మక్కా, ఇస్లాం సౌందర్యాన్ని ప్రపంచానికి చూపించాలి అనుకున్నాను” అని ఆయన చెప్పారు.సామాజిక మాధ్యమాల్లో కూడా దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
”నా ప్రియమైన ఇజ్రాయెల్ మిత్రులారా… మీ జర్నలిస్టుల్లో ఒకరు, ఇస్లాం పవిత్ర నగరంలోకి ప్రవేశించారు. సిగ్గు లేకుండా అక్కడి వీడియో తీశారు. ఇస్లాంను చానెల్ 13 అవమానించింది” అని సౌదీ అరేబియాకు చెందిన ఒక సామాజిక కార్యకర్త, సోషల్ మీడియాలో రాశారు. వీడియో విడుదల అయ్యాక, గిల్ తమ్రితో పాటు చానెల్ 13.. ప్రపంచం నలుమూలల నుంచి విపరీతంగా విమర్శలు ఎదుర్కొంది.
ఈ విషయం ఇజ్రాయెల్ ప్రభుత్వం వరకు వెళ్లింది. ”దీనికి నేను క్షమాపణ కోరుతున్నా. ఇది ఒక పిచ్చి నిర్ణయం. రేటింగ్ కోసం అలాంటి వార్తలు ప్రసారం చేయడం ప్రమాదకరమైన, బాధ్యత లేని చర్య” అని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.అయితే అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు మెరుగయ్యే సంకేతాలు కనబడుతున్నాయి.