మళ్లీ కొత్త సమస్యలు కొత్త ఆలోచనలు కొత్త ఆశయాలు మన ముందుకు రాబోతున్నాయి. రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ముందు గత సంవత్సరంలో ఏం జరిగింది అన్నది సింహావలోకనం చేసుకోవడం అవసరం..సింహావలోకనం అంటే మీకు తెలుసు..సింహం తను నడుస్తూన్నప్పుడు ఎప్పటికప్పుడు వెనక్కు చూసుకుంటుంది. ఇది మరే జంతువులోనూ కనిపించదు.
అంటే తాను అధిగమించిన దూరాన్ని ఒకసారి వెనక్కు చూసుకోవడం వల్ల సరైన విధంగా ముందుకు వెళ్లడం కోసమే అలా చేస్తుందని చెబుతుంటారు. అలాగే 2022లో జరిగిన కొన్ని సంఘటల్ని, ఘటనల్ని కొత్త సంవత్సరంలోకి ఎంటరయ్యే ముందు నెమరు వేసుకోవడం అవసరం. అలాంటి కొన్నింటిని మీ ముందుకు తెచ్చింది మీ ఇండెప్త్..నిజానికి ఊహించని ఎన్నో ఘట్టాలకు 2022 వేదికైంది.
చరిత్రాత్మకంగా నిలిచే రికార్డు స్థాయి జనాభా” నుంచి కోట్లాది సంవత్సరాల గతంలోకి ప్రయాణం వరకు కీలకమైన ఘట్టాలున్నాయి. వాటిలో మొదటిది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సాధించిన ఘన విజయం డార్ట్ ప్రయోగం. అంటే భూమిని ఢీ కొట్టే అవకాశం ఉన్న ఆస్టిరాయిడ్ ను బాంబుల ప్రయోగం ద్వారా దారి మళ్లించి ప్రమాదం నుంచి తప్పించుకోవడం అన్నమాట.
అన్నట్టుగానే రెండేళ్ల క్రితం నాసా ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ ద్వారా గ్రహశకలాన్ని విజయవంతంగా దారి మళ్లించింది నాసా.. సెప్టెంబరు 28న ఓ వ్యోమనౌకను ఆస్టిరాయిడ్ నేరుగా ఢీకొట్టించి దాని దిశను మార్చింది. ఆ మేరకు భవిశ్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు పరిష్కారం దొరికిపోయింది. నిజానికి భూమికి ఉండే అతి పెద్ద ప్రమాదాలు గ్రహశకలాల వల్లే ఏర్పడుతుంటాయి.
ఒకప్పుడు భూమిపైని డైనోసార్ లాంటి జీవజాలం మొత్తాన్ని సమూలగా తుడిచిపెట్టిన ఘటన వీటి వల్ల జరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. భూమిని ఢీకొట్టే ముప్పున్న గ్రహశకలాలను దారి మళ్లించేందుకు అభివృద్ధి చేసిన సాంకేతికతను ఈ ప్రయోగంలో తొలిసారి విజయవంతంగా పరీక్షించారు.
రక్తంలో మైక్రోప్లాస్టిక్స్ అన్నది ఎవరి ఊహకు కూడా అందని విషయం..
.నీటిలో లేదా వాటి వాడకం ద్వారా ప్లాస్టిక్ ముప్పు గురించి అందరికీ తెలుసు. పర్యావరణానికి ప్లాస్టిక్ చేటు చేస్తుందనే అందరం భావించాం..కానీ ఇప్పటికే సదరు మినీ మైక్రో ప్లాస్టిక్ మన శరీరంలోకి చొరబడినట్టు మాత్రం గుర్తించలేకపోయాం. అది ఈ సంవత్సరమే కనిపెట్టడం జరిగింది. మనుషుల రక్తంలో మైక్రోప్లాస్టిక్స్ కలిసి పోతున్నట్లు ద జర్నల్ ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది.
ఈ పరిశోధనలో పాల్గొన్న 80 శాతం మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్స్ కనిపించాయి. మైక్రోప్లాస్టిక్స్ అనేవి 5 మి.మీ. కంటే తక్కువ మందం గల చిన్న ప్లాస్టిక్ ముక్కలు. పెద్దపెద్ద ప్లాస్టిక్స్ మట్టి లేదా నీటిలో విచ్ఛిన్నం అయినప్పుడు లేదా కలుషిత పర్యావరణం వల్ల ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పటివరకు కచ్చితంగా తెలియదు.
అయితే, ఇవి మానవ కణాలను దెబ్బతీసే అవకాశముందని మాత్రం పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఇంకా లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది అటుంచితే ప్రపంచంలో చూస్తుండగానే సంపన్న దేశంగా ఎదిగిన చిన్న దేశం ఖతార్ లో పెద్దదైన ఫీఫా వరల్డ్ కప్ 2022 అట్టహాసంగా జరిగింది. కొన్ని కీలకమైన ఘట్టాలకు ఫిఫా వరల్డ్ కప్ వేదికైంది. ఫిఫాకు ఒక ముస్లిం దేశమైన ఖతార్ లాంటి అరబ్ దేశం ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
దీనికోసం సంవత్సరాలుగా ఖతార్ నిర్మాణాలు పూర్తిచేసింది. ఈ టోర్నమెంటులో అడుగడుగునా ఇస్లాం మత ప్రచారం చాలా ఎక్కువగా జరిగనట్టు సమాచారం. మరోవైపు తొలిసారి ఫ్రాన్స్‌కు చెందిన స్టెఫనీ ఫ్రెప్పార్ట్ మహిళా లీడ్ రిఫరీగా చరిత్ర సృష్టించారు. జర్మనీ, కోస్టారికా మ్యాచ్‌కు ఆమె రిఫరీగా పనిచేశారు. ఆ మ్యాచ్‌లో బ్రెజిల్‌కు చెందిన న్యూ బ్యాక్, మెక్సికోకు చెందిన కరీనా మెడీనా కూడా ఆమెతోపాటు పనిచేశారు.
ఫీఫా టోర్నమెంటులో మరో కీలక ఘట్టం..!
ఏమిటంటే, మొరాకో సెమీఫైనల్స్‌కు చేరుకోవడం. ఒక ఆఫ్రికా, అరబ్ దేశం ఈ స్థాయిలో ప్రతిభ చూపడం ఇదే తొలిసారి. అపై ఐదుసార్లు తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ తొలిసారి ఈ కప్‌ను సాధించారు. తరువాతి అంశానికొస్తే.. 2022 నవంబరు 15.. ఈ తేదీ ప్రపంచానికి ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ రోజు తొలిసారి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
జనాభా గడియారం 800 కోట్లకు చేరుకున్న స్క్రీన్ షాట్లను అందరూ సేవ్ చేసుకున్నారు. ”ప్రజారోగ్యం, పోషక విలువలు, వ్యక్తిగత పరిశుభ్రత, వైద్యంలో పురోగతి వల్ల మనుషుల జీవిత కాలం పెరగడంతో రికార్డు స్థాయిలో జనాభా 800 కోట్లకు చేరుకుంది”అని ఐరాస ఒక ప్రకటన విడుదల చేసింది. 700 కోట్ల నుంచి 800 కోట్లకు జనాభా పెరగడానికి 12 ఏళ్ల సమయం పట్టింది.
అయితే, ఆ తర్వాత వంద కోట్లకు పెరగడానికి మాత్రం 15 ఏళ్లకుపైనే సమయం పట్టొచ్చని ఐరాస అంచనా వేస్తోంది. అయితే ప్రపంచం ముందు ఈ జనాభా పెరుగదల ఓ సవాల్ ను విసిరింది. అదేమిటంటే..ప్రపంచానికి సరిపడా ఆహారం ఉత్పత్తి కావడంలేదు..ఒక వేళ ఉత్పత్తి అయినా సప్లై చైన్ దెబ్బ తినడం వల్ల యుధ్దాల వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల పేద దేశాలకు అందడం లేదు. రాబోయే కాలంలో ఆహార కరువు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆ తరువాత వచ్చేది మనందరికీ తెలిసిన మలేరియా గురించి..ప్రపంచానిని ఒకప్పుడు వణికించిన మలేరియాకు శక్తిమంతమైన వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సెప్టెంబరు మాసంలోనే ప్రకటించారు. దీన్ని వచ్చే ఏడాది ప్రజలకు ఇవ్వడం మొదలుపెట్టనున్నారు. ఇది ప్రపంచానికి ఓ శుభవార్త లాంటిదిగా చెప్పుకోవచ్చు. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ టీకా 80 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని రుజువైంది. ఇప్పటికీ ఏటా మలేరియాతో 4 లక్షల మంది మరణిస్తున్నారు.
చాలా చవక ధరకే ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు..
పిల్లల్లో మరణాల రేటు పెరగడానికి మలేరియా కూడా ఒక కారణం. దీనిపై పనిచేసే వ్యాక్సీన్ తయారుచేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది చాలా సంక్లిష్టమైన ఇన్ఫెక్షన్. ఇది శరీరంలోని భిన్న భాగాలకు వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక భాగాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాక్సీన్ తయారుచేయడం కాస్త కష్టం. అయినా ఈ కష్టసాధ్యమైన పనిని శాస్త్రజ్నులు విజయవంతంగా సాధించారు.
బీజింగ్‌లో నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి నాన్-బైనరీ వ్యక్తిగా అమెరికా స్కేటింగ్ దిగ్గజం టిమోతీ లేడక్ చరిత్ర సృష్టించారు. నిజానికి టిమోతీ పతకాన్ని సాధించలేదు. ఆష్లీ కెయిన్‌తో కలిసి టిమోతీ ఏడో స్థానంలో నిలిచారు. కానీ, నాన్-బైనరీ చాంపియన్‌గా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.
ప్రపంచ మానవాళి సాధించిన మరో ఘన విషయం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా చెబుతున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్..ఇది ఎంత అద్భుతమైన ఆవిశ్కారం అంటే దీనితో కోట్లాది సంవత్సరాల క్రితం విశ్వాంతరాలలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. గతంలోకి ప్రయాణాన్ని సాధ్యం చేసి ఓ టైం మెషిన్ అని పేరు తెచ్చుకుంది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.
2022లో కీలక ఘట్టాలలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. జులైలో ఈ టెలిస్కోప్ పని మొదలుపెట్టింది. సుదూరంలో ఉండే అద్భుతమైన అంతరిక్షాన్ని చిత్రాల రూపంలో భూమికి పంపిస్తోంది. 1300 కోట్ల ఏళ్ల క్రితం బిగ్‌బ్యాంగ్ తర్వాత రూపుదిద్దుకున్న ఓ గ్యాలక్సీకి సంబంధించిన ఫోటో జేఏడీఈఎస్-జీఎస్-జీ13-0ను గతంలోకి తొంగిచూసి జేమ్స్ వెబ్ మనకు అందించింది.
ఇప్పటివరకు మనం చూసిన అత్యంత సుదూరమైన గ్యాలక్సీ ఇదే. ఆపై వచ్చేది మనల్ని 200 ఏళ్లు పాలించిన బ్రిటన్‌కు తొలిసారిగా భారత సంతతికి చెందిన రిషీ సునాక్ ప్రధానిగా ఎంపికయ్యారు. ఇక చివరగా వచ్చేది మరింత అద్భుతమైన అంశం..మొదటిసారిగా మైక్రోస్కోప్ లేకుండా బ్యాక్టీరియా దర్శనం జరిగింది. నిజానికి బాక్టీరియా మైక్రోస్కోప్ లో చూస్తే తప్ప కనిపించదు.
కానీ అలాంటిది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియాను తాము గుర్తించినట్లు గత జూన్‌లో శాస్త్రవేత్తలు ప్రకటించారు. థియోమార్గరీటీ మ్యాగ్నిఫిషియాగా పిలిచే ఈ బ్యాక్టీరియా అంతా సంభ్రమంగా వీక్షించారు. ఇది మనుషుల కనుబొమ్మ ఆకారంలో ఒక సెంటీ మీటర్ పొడవున ఉంటుంది. ఇప్పటివరకు మనకు తెలిసిన అతిపెద్ద బ్యాక్టీరియా కంటే ఇది 50 రెట్లు పెద్దది. నేరుగా కంటికి కనిపించే తొలి బ్యాక్టీరియా ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.