Homeఅంతర్జాతీయంబాల్య వివాహాలపై యుద్ధం..?

బాల్య వివాహాలపై యుద్ధం..?

ప్రపంచంలోని పలు దేశాలలో పలు రకాలైన యుధ్దాలు జరుగుతున్నాయి. ఒక చోట ప్రత్యక్ష యుధ్దం ప్రపంచ ఆర్థిక మూలలను దెబ్బతీస్తోంది. మరో చోట విపరీతంగా బలం పెంచుకున్న ఉగ్రవాదులతో యుధ్దం జరుగుతోంది. అలాగే మన దేశంలోనూ ఓ యుధ్దం జరుగుతోంది. అయితే మనదేశంలో జరుగుతున్న యుధ్దం రెండు వర్గాలు రెండు ప్రాంతాల మధ్య కాదు..ఓ అనాచారంపై యుధ్దం జరుగుతోంది. అదో సామాజిక యుధ్దం అని చెప్పుకోవచ్చు.

  • అస్సాంలో వేళ్లూనుకుని పాతుకుపోయిన బాల్యవివాహాలపై ప్రభుత్వానికి చాందసవాదులకు మధ్య జరుగుతున్న యుద్దం..

ఈ యుధ్దంలో ప్రభుత్వం తన లక్ష్యం చెదరకుండా వెనుతిరగని పోరాటం చేస్తోంది. అయితే కొన్ని దశల్లో ఈ సంపూర్ణ యుద్ధం’ వికటిస్తుందా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయంటారు విశ్లేషకులు. నిజానికి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా బడి ఈడు పిల్లలను పెళ్లి పీటలెక్కించే సామాజిక దురాచారం దేశంలో పెద్దగా తగ్గలేదని నివేదికలు చెబుతున్నాయి. బాల్యవివాహాలపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం సరిగ్గా వారం క్రితం ప్రకటించిన ‘సంపూర్ణ యుద్ధం’ ఈ సమస్యను మరోసారి ఎజెండాలోకి తెచ్చింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దీనిపై ప్రకటన చేసిందే తడవుగా ఆ రాష్ట్రంలో పోలీసులు విరుచుకుపడటం మొదలెట్టారు. ఇంతవరకూ దాదాపు నాలుగు వేలమందిని అరెస్టు చేశారంటున్నారు. వీరిలో పెళ్లిళ్లు జరిపించిన పురోహితులు, ఖాజీలు కూడా ఉన్నారు. అరెస్టయినవారిలో అత్యధికులపై భారతీయ శిక్షాస్మృతి కింద వేర్వేరు సెక్షన్లపై కేసులు నమోదు చేయటంతోపాటు పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టాన్ని కూడా ప్రయోగించారు. వాస్తవానికి దాదాపు పదివేలమందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా వారిలో చాలామంది పరారయ్యారు. ఈ పోలీసు చర్యకు ప్రభుత్వం చెబుతున్న కారణాలను గమనించాల్సిన అవసరం ఉంది.

2019-20 మధ్య జరిపిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు చూస్తే కళ్లు తిరిగిపోయే నిజాలు వెలుగు చూసాయి. ఆ నివేదికలో ఏం ఉందంటే.. అస్సాంలో 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న వివాహితుల్లో 31.8 శాతంమంది చట్టవిరుద్ధంగా 18 ఏళ్ల వయసులోపు పెళ్లిళ్లు చేసు కున్నవారే ఉన్నారు. జాతీయ స్థాయిలో సగటున 23.3 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువేనని చెప్పుకోవచ్చు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్‌లో అస్సాంలోని ఏయే జిల్లాల్లో ఈ బాల్యవివాహాల దురాచారం ఎక్కువుందో, దానివల్ల ఆ ప్రాంతాల్లో చిన్న వయసులోనే గర్భిణులవుతున్నవారి శాతం ఎంతో వివరించారు.

టీనేజ్‌ తల్లుల, గర్భిణుల జాతీయ స్థాయి సగటు 6.8 శాతం ఉంటే, అస్సాంలో అది 11.7 శాతంగా ఉంది. ఇది ఆందోళనకరమైన విషయమేనని చెబుతున్నారు నిపుణులు. అందుకే ప్రభుత్వం ఈ విషయంపై సానుభూతి దయ చూపించాలని అనుకోలేదు. నేరుగా ఇందుకు కారకులైనవారిపై ఉక్కుపాదం మోపింది. వెంటనే చర్యలకు పూనుకుంది. దీంతో ఎడాపెడా సాగుతున్న ఈ అరెస్టుల వల్ల తాత్కాలికంగా అలాంటి పెళ్లిళ్లకు బ్రేక్‌ పడింది. చిన్న వయసులో పెళ్లిల్లు చేయడం అంటే అక్కడి పురోహితులకు ఖాజీల గుండెలు దడదడలాడుతున్నాయి.

అయితే ఈ అనాచారానికి మూలాలు కూడా చూడాలని అంటున్నారు ఇక్కడి మేధావులు. ఈ బాల్యవివాహాలకు దారితీస్తున్న మూలకారణాలను పరిష్కరించనంత వరకూ అవి పూర్తిగా సమసిపోవటం సాధ్యం కాదని వారు వాదిస్తున్నారు. పైగా నేరుగా ఈ తరంపై విరుచుకుపడుతున్న పాలకులు వారిని ఆ దిశగా నడిపించిన మూలాలను గుర్తించటం అవసరం అని అంటున్నారు. చదువు సంద్యలు ఏమాత్రం అందని మారుమూల పల్లెలు అస్సాంలో లెక్కకు మించి ఉన్నాయి. నిరక్షరాస్యత అక్కడి వారికి శాపంగా మారింది. పైగా అక్కడ అభివ్రుద్ది అన్నది దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే ..కనుచూపు మేరలో కనిపించదు.

  • ఆడపిల్లలకు చిన్నవయసులో పెళ్లి చేస్తే అది వారికి రక్షణగా ఉంటుందని భావించే కుటుంబాలకు కొదవలేదు..

పైగా తొందరగా ఆడపిల్ల పెళ్లి చేస్తే బాధ్యత పూర్తవుతుందని భావించే తల్లిదండ్రులు అస్సాంలోనే ఎక్కువగా కనిపిస్తారు. నామమాత్రంగానైనా పాఠశాలలున్నచోట చదువుకునే బాలికల శాతం చాలా తక్కువ. ఆ ప్రాంతంపై దశాబ్దాల నిర్లక్ష్యం పుణ్యమా చదువు కున్నవారి సంఖ్య చాలా స్వల్పం. గ్రామీణ అస్సాంలో 74 శాతంమంది మహిళలు పట్టుమని పదేళ్లు కూడా బడి చదువులకు పోవడం లేదు.

ఆడపిల్లకు చదువు చెప్పిస్తే ఆమెకు ఉజ్వల భవిష్యత్తుంటుందన్న అవగాహన అక్కడి వారిలో కాగడా పట్టుకుని వెతికినా కనిపించదంటే అతిశయోక్తి కాదు.. నిరక్షరాస్యతతో పాటు పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, బాలికల రక్షణ, భద్రతలపై ఉండే దిగులు, ఇతర సామాజిక దురాచారాలు బాల్యవివాహాలకు కారణమవుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు..బాల్యవివాహాల పట్ల ఉక్కుపాదం మోపే ఉత్సాహం చూపిస్తున్న ప్రభుత్వం మనం ఇప్పటిదాకా చెప్పుకున్న సమస్యల్లో ఏ ఒక్కదాన్నీ పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. కేవలం పోలీసుల సాయంతో బాల్య వివాహాలను అరికట్టాలనుకుంటోంది.

దాని వల్ల అసలు సమస్య పక్కకు పోయి మరిన్ని సమస్యలకు కారణమవుతోంది. ముఖ్యంగా బాలికల విద్యకు ప్రోత్సాహాలనందిస్తే బడికొచ్చే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది. అలాగే పాఠశాలల్లో మరుగుదొడ్లు మొదలుకొని ఉపాధ్యాయుల నియామకం వరకూ శ్రద్ధ తీసుకుంటే నాణ్యమైన విద్య అందటంతోపాటు ఆడపిల్లలు సురక్షితంగా చదువుకోవటం వీలవుతుందన్న భరోసా కుటుంబాలకు కలుగు తుంది. కానీ నీతి ఆయోగ్‌ ‘హేతుబద్ధీకరణ’ సూచనతో గత సంవత్సరం సెప్టెంబర్‌లో అస్సాంలో 1700 స్కూళ్లు మూసివేయటమో, సమీప పాఠశాలలతో విలీనం చేయటమో చేశారు.

ఈ స్థితిలో ఆడపిల్లలను ఎక్కడో దూరంలో ఉన్న బడికి పంపటానికి తల్లిదండ్రులు సిద్ధపడటం లేదు. ఇక ఉన్నత పాఠశాలల విషయానికొస్తే అస్సాంలో మారుమూల ప్రాంతాల్లో అవి చాలా తక్కువేనని చెప్పుకోవాలి..ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్తే తప్ప చదువుకోవటం సాధ్యంకాని పరిస్థితులు అస్సాంలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లకు ప్రమాదం ఎదురుకావొచ్చన్న భయంతో సహజంగానే కుటుంబాలు ఇక వారి చదువుకు స్వస్తిచెబుతాయి.

ఇలా బడి మానేసిన పిల్లలకు పెళ్లే ప్రత్యామ్నాయంగా మారుతోంది. చిన్న వయసులో పెళ్లిళ్లయి గర్భం దాల్చిన కారణంగా ఆడపిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. గర్భస్రావాలు తప్పడం లేదు. గర్భం నిలబడినా తక్కువ బరువుతో జన్మించటం, మృత శిశు జననాలు, పుట్టిన శిశువులు కొన్ని వారాలలోపే మరణించటం వంటివి అధికంగా ఉంటున్నాయి. ఇరవైయ్యేళ్ల వయసు తర్వాత పెళ్లయ్యే బాలికలకు జన్మించే శిశువులకంటే, అంతకన్నా తక్కువ వయసు వారికి పుట్టిన శిశువుల్లో మరణాలు 50 శాతం ఎక్కువని యునిసెఫ్‌ నివేదిక చెబుతోంది.

బాల్యవివాహాలను తక్షణం అరికట్టవలసిన సామాజిక సమస్యగా గుర్తించటం బాగానే ఉంది. కానీ ఆ సమస్యకు మూలకారణానికి మందు వేయకుండా అస్సాం ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఏమాత్రం సమర్థనీయం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందువల్ల ఆ సమస్య మరింత జటిలమవుతుందే తప్ప తగ్గదని వారు అంటున్నారు. ఇప్పుడు వేలాదిమంది అరెస్టయిన పర్యవసానంగా మగదిక్కులేక, రోజు గడవటం ఎలాగో, తిండితిప్పలకు ఏంచేయాలో తెలియక మహిళలు అవస్థలు పడుతున్నారు. బాల్యవివాహాలను అరికట్టడానికి ఆల్‌ అస్సాం మైనారిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ వంటివి చాన్నాళ్లుగా కృషి చేస్తున్నాయి.

ఈ క్రమంలో దాడులు జరుగుతున్నా వెనక్కి తగ్గటంలేదు. అలాంటి సంస్థలకు చేయూత అందించటం… పేదిరిక నిర్మూలనకూ, విద్యారంగం పటిష్టతకూ అవసరమైన పథకాలు అమలు చేయటం ముఖ్యమని అస్సాం ప్రభుత్వం గుర్తించాలని అంటున్నారు. ఒక సామాజిక సమస్యను నేరపూరితం చేయటం వల్ల జైళ్లు నిండుతాయి తప్ప ఫలితం శూన్యం. సమస్యకు అసలు పరిష్కారం ఇది కాదనే అంటున్నారు విశ్లేషకులు..

Must Read

spot_img