భూకంపంతో అతి తీవ్ర నష్టానికి గురైన తుర్కియే ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తోంది. అయితే ఇంత జననష్టానికి ప్రాణనష్టానికి ప్రభుత్వమే కారణమని జనం ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇక్కడ భూకంపం కారణంగా జరిగిన భారీ నష్టంలో అత్యధిక భాగం మానవ తప్పిదాలు, నిర్లక్ష్యాలతోనే చోటు చేసుకొంది.
తుర్కియే సిరియాల్లో సంభవించిన భూభూకంపపు కేంద్రం తుర్కియోకు సమీపంలోనే ఉంది. ఉపరితలానికి చేరువలో ఉన్నందువల్లే నష్టం ఎక్కువగా జరిగింది. ఇక్కడ భూకంపం కారణంగా జరిగిన భారీ నష్టంలో అత్యధిక భాగం మానవ తప్పిదాలు, నిర్లక్ష్యాల కారణంగానే జరిగింది. చిన్నా, పెద్దా తప్పులు కలిసి ఓ మహా విపత్తును సృష్టించాయి. ఇప్పుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ ప్రభుత్వం తాపీగా దర్యాప్తు చేపట్టింది. భూకంప నష్టాలను ఎదుర్కోవడానికి అక్కడ చాలా ఏళ్ల ముందే చట్టాలు, నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఎర్దోగాన్ ప్రభుత్వం వీటిని గాలికొదిలేయడంతో.. ఇప్పుడు భూకంపంలో ఒక్క తుర్కియే లోనే 31 వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో అక్కడ ప్రజాగ్రహం ఒక్కసారిగా వెల్లువెత్తింది. చాలా చోట్ల బాధితులు ఎర్దోగాన్‌ను నేరుగానే నిలదీశారు.
తుర్కియేలో ఎన్నికలు మరికొన్ని నెలల్లోనే ఉన్నాయి. ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వం భవన నిర్మాణ లోపాలకు సంబంధించి 163 మందిపై వెంటనే దర్యాప్తు మొదలుపెట్టినట్లు చెబుతోంది. వీరిలో 8మందిని అరెస్టు కూడా చేసినట్లు తుర్కియే అధికారిక మీడియా అనడోలు రిపోర్ట్ చేసింది. తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతంలో దాదాపు 1లక్షా 70 వేల భవనాలు ఉన్నాయని అంచనా వేస్తే అధికారిక లెక్కల ప్రకారం వాటిల్లో 24వేల 921 భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆ దేశ మంత్రి మురాత్ ఖుర్రం వెల్లడించారు. దాదాపు ఆరింట ఒక భవనం కూలడమో, దెబ్బతినడమో జరిగిందని అధికారులు చెబుతున్నారు. 30 ఏళ్ల క్రితం నిర్మించినవి, 20 ఏళ్ల క్రితం నిర్మించినవి, ఇటీవల నిర్మించినవి కూడా భూకంపం కారణంగా కూలిపోయాయి.
కుప్పలు తెప్పలుగా పడి ఉన్న భవనాల శిధిలాలను చూస్తే అక్కడి నిర్మాణాలు ఎంత నాసిరకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు నిపుణులు. .
1999లో తుర్కియేలో భారీ భూకంపం వచ్చింది. దీంతో అక్కడ నిర్మాణాలను పటిష్ఠపర్చేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. కానీ భవన నిర్మాతలు వీటిని తప్పించుకొని నిర్మాణలు చేపట్టారు. అక్కడ రాజకీయ నాయకులు, స్థానిక అధికారులు అవినీతికి పాల్పడి కళ్లు మూసుకొన్నారు. 2012-22 వరకు తుర్కియేలో నిర్మాణ రంగం మూడు పువ్వులు.. ఆరుకాయలు అన్న చందంగా సాగింది. కానీ, ఈ సీజన్‌లో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్స్ అవినీతి సూచీలో తుర్కియేర్యాంక్ మొత్తం 174 దేశాల్లో 54 నుంచి 101కి దిగజారిపోయింది. ఇది ఎర్దోగాన్ పాలనకు అద్దం పట్టింది.
తుర్కియేలో 98 శాతం భూభాగానికి ప్రకంపనల ముప్పు ఉంది. తుర్కియే అనతోలియన్ భూఫలకంపై ఉంది. దీనికి ఉత్తరాన యురేషియా, దక్షిణాన ఆఫ్రికా ఫలకాలు ఉన్నాయి. తూర్పున చిన్నదైన అరేబియన్ ఫలకం ఉంది. అంటే.. భౌగోళికంగా కీలక కూడలిలో తుర్కియే ఉందన్నమాట. ఇక్కడ భూ అంతర్భాగంలో లోపాలు ఎక్కువ. భూమి పైపొరలో 15 ఫలకాలు ఉంటాయి.. వాటినే టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు. వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు. ప్రధాన నగరమైన ఇస్తాంబుల్ సహా మూడోవంతు భాగానికి ఆ ప్రమాదం చాలా ఎక్కువగా నమోదైంది.. 2020లోనే అక్కడ 33వేల ప్రకంపనలు నమోదయ్యాయి. అందులో 4.0 తీవ్రతను మించినవి 322 ఉన్నాయి. 1999లో వచ్చిన భారీ భూకంపంతో అక్కడ అధికారిక పార్టీపై వ్యతిరేకత పెరిగిపోయింది.
ఈ సమయంలో ఎర్దోగాన్ నేతృత్వంలోని ‘ఏకే పార్టీ’ గత పాలకుల అవినీతి నుంచి విముక్తి కల్పించి స్వచ్ఛమైన పాలన అందిస్తామనే హమీతో 2002లో అధికారం చేపట్టింది. నాటి నుంచి ఎయిర్ పోర్టులు, పోర్టులు, రోడ్లు, రైల్వేలు వంటి భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులు చేపట్టింది. దీంతో తుర్కియే నిర్మాణ రంగం దేశ ఆర్థిక మూల స్తంభాల్లో ఒకటిగా మారిపోయింది. నిర్మాణ రంగంలో తుర్కియే అధికార పార్టీ వర్గాలు ఎక్కువగా ఉన్నట్లు కన్సల్టెన్సీ సంస్థ టెనియో డైరెక్టర్ వోల్ఫ్‌గాంగో పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులు కూడా వచ్చాయి. కానీ, ఈ క్రమంలోనే వ్యయ నియంత్రణ కోసం నిబంధనలు గాలికొదిలేయడం మొదలుపెట్టారు. మరోవైపు తుర్కియే అధికార పార్టీ సన్నిహితులకే ప్రభుత్వ రంగ నిర్మాణ కాంట్రాక్టులు దక్కాయి. దీనిని అక్కడి ప్రతిపక్షాలు ‘రెంటియర్ సిస్టమ్’ అంటూ ఎద్దేవా చేశాయి.