రష్యాలో ఫ్లూ జ్వరాలు వేగంగా ప్రబలుతున్నాయి. క్రెమ్లిన్ లో ఫ్లూ భయం మరింత ఎక్కువగా ఉండటంతో అధ్యక్షుడు పుతిన్ బంకర్ లోకి వెళ్లిపోయారు. మొత్తానికి రష్యావాసులకు ఫ్లూ భయం పట్టుకుంది. అధ్యక్ష భవనంలోని అధికారులకు కూడా ఈ అంటువ్యాధి సోకడంతో అధ్యక్షుడు బంకర్ లోనికి వెళ్లక తప్పలేదు. ఈ కారణంగా రోజువారీ సమావేశాలన్నింటినీ రద్దు చేసారు. ఓ రిపోర్ట్..

క్రెమ్లిన్‌ను ‘ఫ్లూ’ భయం పట్టుకుంది. ఏకంగా అధ్యక్షభవనంలోనూ విస్తరించడం మొదలుపెట్టింది. ఇది వేగంగా విస్తరించే అంటువ్యాధి అవడంతో చూస్తుండగానే అధికారులందరూ మంచం పట్టారు. దీంతో గత్యంతరం లేక అధ్యక్షుడు వ్లదిమిర్ పుటిన్ బంకర్ బాట పట్టారు. రష్యాకు మరోసారి ఫ్లూ భయం పట్టుకుంది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. అటు అధ్యక్ష భవనంలోని అధికారులకు ఈ అంటువ్యాధి సోకింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను బంకర్‌లో ఐసోలేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఈ కారణంగానే ఆనవాయితీగా నిర్వహించాల్సిన వార్షిక మీడియా సమావేశం నిర్వహించడం లేదని అధికారులు ప్రకటించిన కొద్ది సేపటికే ఈ వార్త వెలువడింది.
మరోవైపు పుతిన్ ఆరోగ్యంపై మరోసారి భిన్న కథనాలు వెలువడుతోన్న వేళ.. క్రెమ్లిన్‌లో ఫ్లూ వ్యాప్తిపై వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల రష్యాలో ఫ్లూ వ్యాప్తి ఎక్కువైనట్లు ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో చాలా మంది అధికారులు ఫ్లూ బారినపడటంతో పార్లమెంటు ఎగువసభలోనూ ప్రసంగానికి పుతిన్ దూరంగా ఉండనున్నారని క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. ఇలా అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ఈ అంటువ్యాధి విజృంభణ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్‌ను పౌరులకు దూరంగా ఉంచేందుకు అధికారులు ఆయన్ను బంకర్‌లోకి తరలించక తప్పలేదని సమాచారం. కొత్త సంవత్సర వేడుకలనూ పుతిన్ అక్కడే జరపుకోనున్నారని మరో వార్త సంస్థ వెల్లడించింది.
దేశంలో భారీ స్థాయిలో ఫ్లూ కేసులు నమోదయ్యే అవకాశాలు..

ఉరల్ పర్వతాల్లోని తూర్పు భాగంలో ఉన్న ఓ బంకర్‌లో పుతిన్ గడుపుతున్నట్లు తెలిపింది సదరు మీడియా సంస్థ. మరోవైపు దేశంలో భారీ స్థాయిలో ఫ్లూ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు రష్యా ప్రజారోగ్య నిపుణులు హెచ్చరించారు. ‘ఈ ఏడాది ఫ్లూ వ్యాప్తి భారీగా ఉండనుంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ వేరియంట్ ఫ్లూ రకానికి చెందినదే. 2009లో మహమ్మారిగా అవతరించిన ఫ్లూ A H1N1రకానికి చెందిందని రష్యా నిపుణురాలు అన్నా పొపోవా వెల్లడించారు.
ఇటువంటి తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. లక్షణాలు కనిపించిన వెంటనే ఇంటికే పరిమితం కావాలని స్పష్టం చేశారు. వీటితోపాటు మాస్కులు ధరించడంతోపాటు ముఖం, చేతులు, శ్వాసకోశ భాగాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
రష్యాలో వార్షిక మీడియా సమావేశాన్ని నిర్వహించకపోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి’ అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అయితే, ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన చెప్పలేదు. ఉక్రెయిన్ పై తాము యుధ్ధం చేయడం లేదనీ, కేవలం ప్రత్యేక సైనిక చర్యగా చెబుతుండే పుతిన్‌పై ప్రతికూల ప్రశ్నలను ఎదుర్కోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పుతిన్ పాలనను ప్రపంచానికి చాటి చెప్పడంలో భాగంగా ఏటా మాస్కోలో వార్షిక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. సుమారు నాలుగున్నర గంటలపాటు సాగే ఈ కార్యక్రమంలో దేశ, విదేశీ విధానాలపై అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించడంతోపాటు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిస్తారు.
సుదీర్ఘ సమయంపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలనూ వెల్లడిస్తారు. గత కొంత కాలంగా అక్కడ ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. పుతిన్ ఆరోగ్యం, ఉక్రెయిన్‌లో పుతిన్ సేనల వైఫల్యాలపై వార్తలు వస్తోన్న తరుణంలో ఈ ఏడాది కీలక సమావేశానికి పుతిన్ దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
ఇదే సమయంలో ఫ్లూ వ్యాప్తి కారణంతో అధ్యక్షుడు పుతిన్‌ను ప్రత్యేక బంకర్‌లోకి తరలించారనే వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో లాగానే ఆయన అనారోగ్యం గురించిన వివరాలు అబద్దాలని తేలుతున్నాయి. ఇప్పుడు ఫ్లూ భయానికి బంకరులోకి వెళ్లడం కూడా అలాంటి వార్తేనని ప్రభుత్వం తేల్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు విశ్లేషకులు.